డాక్టర్ చదువులు: కోటి రూపాయలు పెట్టి చదివినా వేతనం పాతిక వేలే - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నో వ్యయప్రయాసలతో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసినా.. బతుకుదెరువు సమస్యగా మారిందని.. డాక్టర్ అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప వేతనాలు కనీస స్థాయిలో కూడా లేవని ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఎంబీబీఎస్ కోసం కొందరు విద్యార్థులు రూ. 50-60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డొనేషన్ చెల్లించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇచ్చే రూ.25 వేలు.. ఇంటి అద్దె, తిండికి కూడా సరిపోవడం లేదని చెప్తున్నారు. దీంతో ఎందుకు వైద్యరంగాన్ని ఎంచుకున్నామా? అని అని ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు ప్రభుత్వ రంగంలో డిమాండ్‌కు సరిపడినన్ని ఉద్యోగాలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతుందంటున్నారు. మండలాలు, గ్రామాల్లో ప్రాక్టీస్ పెట్టినా స్థానికంగా ఉండే సమస్యలతో సతమతం అవుతున్నామని అంటున్నారు.
ఎంబీబీఎస్ చదువు కోసం, డొనేషన్లు కట్టేందుకు అనేకమంది తల్లిదండ్రులు వడ్డీలకు డబ్బులు తెచ్చారు. వాటిని తిరిగి వడ్డీలతో కలిపి చెల్లించేందుకు కూడా ఎంబీబీఎస్ చదువు పనికిరావడం లేదంటున్నారు. ఇక విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు అనేకమంది ఎంసీఐ అర్హత పరీక్ష పాసు కాకపోవడంతో వారికి ఇస్తున్న వేతనాలు రూ. 20 వేలకు కూడా మించడంలేదు. దీంతో వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది.
పీజీ, సూపర్ స్పెషాలిటీ చదవకుంటే మార్కెట్‌లో కనీస గుర్తింపు ఉండడంలేదు. కేవలం ఎంబీబీఎస్‌తో వృత్తిలో ఎదిగే పరిస్థితి లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రైవేటులో పీజీ చేయాలన్నా కోట్లలో డొనేషన్లు చెల్లించాల్సి వస్తుంది. పీజీలో సీటు రాక, ఎంబీబీఎస్ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రిలో తక్కువ వేతనాలకు పనిచేయక తప్పని దుస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు.
ప్రైవేటులో పరిస్థితి ఇలాగుంటే ప్రభుత్వ రంగంలో పనిచేద్దామంటే భర్తీలు లేవని ఎంబీబీఎస్ డాక్టర్లు అంటున్నారు. తెలంగాణలో 2017లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) 500 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం 5వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 1,150 పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు 6,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అటు పీజీ సీటు రాక, ఇటు ప్రభుత్వ ఉద్యోగం రాక తాము చేసేదేమీ లేదంటున్నారు.
''కేవలం ఎంబీబీఎస్‌తో బయట అవకాశాల్లేని మాట వాస్తవమే. పైగా పీజీ మెడికల్ సీట్లు కూడా ఎంబీబీఎస్‌తో సమానంగా ఉండవు. కాబట్టి ఉన్న ఎంబీబీఎస్‌తోనే ముందుకు సాగాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్కువ వేతనాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అందరూ హైదరాబాద్‌లోనే ఉండాలన్న భావనే. దీంతో డిమాండ్ తగ్గి తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తయినవారు గ్రామాలకు వెళ్లి ప్రాక్టీసు చేస్తే ప్రజల నుంచి ఆదరణ ఉంటుంది'' అని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్‌రెడ్డి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోడ్ కూయక ముందే.. ఓటర్లకు ముందస్తు తాయిలాలు
ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి రాకముందే.. ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు, ఆశావహులు పోటాపోటీగా తాయిలాల పంపిణీ కొనసాగిస్తున్నారని ‘ఈనాడు’ ఒక కథనంలో పేర్కొంది. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, వచ్చే ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు, ఆశావహులు ఈ రేసులో దూసుకుపోతున్నారని చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. ఈ కానుకలను కొన్నిచోట్ల అభ్యర్థులు నేరుగా ఇస్తుండగా, మరికొన్నిచోట్ల వాళ్ల కుటుంబసభ్యుల పేరుతో ఉన్న ఫౌండేషన్లు, స్వచ్ఛంద సంస్థల ద్వారా, మరొకొందరు అనుచరుల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
మహిళలను పెద్ద ఎత్తున తీసుకువచ్చి వారికి భోజనాలు పెట్టి మరీ చీరలు పంచుతున్నారు. తిరుపతి సమీపంలోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇద్దరూ పెద్దఎత్తున చీరలు పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇటీవల ఓ సామాజిక వర్గానికి చెందిన సుమారు 3-4 వేల మంది మహిళలకు భోజనాలు పెట్టి, చీరలు పంచారు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున డబ్బులు కూడా ఇచ్చారు. శాసనసభ్యుడికి పోటీగా అదే నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా ఉన్న నాయకుడు.. మహిళలను ఆహ్వానించి భోజనాలు పెట్టారు. ఆయన కూడా ఒక చీర, రూ.500 చొప్పున వారి ఇళ్లకే పంపించారు.
కృష్ణా జిల్లా మైలవరంలోనూ ఓ అభ్యర్థి పెద్దఎత్తున చీరలు పంచారు. అనంతపురం జిల్లాలో కీలక ఎమ్మెల్యే తనయుడికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 62వేల చీరలు పంచినట్లు సమాచారం. ఇదే జిల్లా మడకశిరలో టికెట్ ఆశిస్తున్న ఒక నేత ఏడాది నుంచి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో తిరుగుతూ మహిళలకు చీర, పార్టీ హామీల కరపత్రాన్ని కలిపి పంచుతున్నారు.
గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 33 వేల మందికి చంద్రన్న బీమా ప్రీమియం ఆయనే చెల్లించారు. కొంత మందికి ఆయనే డబ్బులు కట్టి ఆర్టీసీ వనిత కార్డులు ఇప్పించారు.

ఫొటో సోర్స్, TRs
కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఆశావహుల ప్రయత్నాలు
కేసీఆర్ దృష్టిలో పడేందుకు తెలంగాణలో ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..
తెలంగాణలో జరిగిన ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవగా.. సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు.
ఇంకా కేబినెట్‌లోకి 16 మందిని తీసుకునే వీలుంది. త్వరలో 16 వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
పెద్దఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. వీటి కోసం టీఆర్‌ఎ్‌సలోని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే వారిలో చాలా మంది సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను ప్రసన్నం చేసుకునేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రగతి భవన్‌కు రద్దీ పెరిగింది.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రధాని అయ్యేందుకు ఫేస్‌బుక్ సహకరించిందా?
- 'కల తీర్చుకుందామని అమెరికా వెళ్లా.. ఇలా జరుగుతుందనుకోలేదు.. అసలు కారణం తెలిస్తే అమ్మానాన్న తట్టుకోలేరు'
- ‘ఎయిర్ ఇండియా వన్’కు అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ విక్రయానికి అమెరికా ఆమోదం
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- #fallingstarschallenge: చైనా యువతీ, యువకులు ఎందుకిలా పడిపోతున్నారంటే..
- ఇన్‌స్టాగ్రామ్: నకిలీ కామెంట్లు, నకిలీ లైక్‌లు ఇక కుదరవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








