INDvsAUS హైదరాబాద్ T20 మ్యాచ్: టికెట్ల కోసం తొక్కిసలాట... ఏడుగురు ఆసుపత్రిలో చేరిక

భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో కొందరు స్పృహ తప్పిపడిపోయారు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో కొందరు స్పృహ తప్పిపడిపోయారు

హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం తొక్కిసలాట జరిగింది. చాలా ఏళ్ల తరువాత హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ జరగడంతో టికెట్ల కోసం వేలాది మంది అభిమానులు గుమిగూడారు.

ఈ ఘటనలో ఏడుగురు అస్వస్థతకు గురికాగా వారిని యశోద ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు చికిత్స పొందుతున్నారు.

'మా ఆసుపత్రిలో ఎవరూ చనిపోలేదు. ఆ ఏడుగురికీ చికిత్స అందిస్తున్నాం. వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం' అని యశోద ఆసుపత్రి ప్రతినిధులు బీబీసీకి తెలిపారు.

‘టికెట్లు అయిపోయాయి..’

మ్యాచ్ టికెట్లు అన్ని అయిపోయాయి. జింఖానా మైదానం వద్ద ఉన్నవారిని పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.

ఆఫ్‌లైన్ టికెట్లు అయిపోయాయి, ఆన్‌లైన్‌లో కొన్ని లిమిటెడ్ కోటా టికెట్లు మాత్రమే విడుదల చేస్తామని హెచ్‌సీఏ ప్రతినిధి తెలిపారు. క్యూలో నిలబడి ఉన్న వారికి పోలీసులు నీరు, సమోసాలు ఇచ్చి పంపిస్తున్నారు.

సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఫొటో సోర్స్, Facebook/V Srinivas Goud

ఫొటో క్యాప్షన్, సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రభుత్వ సమీక్ష

టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట మీద తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర భారతిలో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌తోపాటు ఇతర అధికారులు, పోలీసులు హాజరయ్యారు.

‘టికెట్ల విక్రయానికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయడంలో హెచ్‌సీఏ పూర్తిగా విఫలమైంది. అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని తెలిస్తే పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం.

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం జరిగేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో కొందరు స్పృహ తప్పిపడిపోయారు

ఫొటో సోర్స్, UGC

ఏం జరిగింది?

ఈనెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) కొన్ని టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మగా ఇంకొన్ని సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానం వద్ద విక్రయించే ఏర్పాటు చేశారు.

టికెట్ల కోసం వేల మంది అభిమానులు భారీ స్థాయిలో జింఖానా వద్ద బారులు తీరారు. నిన్న రాత్రి నుంచే కొందరు అక్కడ టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు తెల్లవారు జాము నుంచే అభిమానులు రావడం మొదలైంది.

హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగి దాదాపు మూడేళ్లు అవుతోంది. కరోనా లాక్‌డౌన్ తరువాత జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు.

భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో కొందరు స్పృహ తప్పిపడిపోయారు

ఫొటో సోర్స్, UGC

తగిన ఏర్పాట్లు లేవు

కానీ ఇంత మంది వస్తారని ఊహించని హెచ్‌సీఏ టికెట్ల కోసం వచ్చే అభిమానుల కోసం తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఒక్కసారిగా జనం టికెట్ల కోసం ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు. కొందరు స్పృ తప్పిపోయారు. వీరిలో అమ్మాయిలూ, అబ్బాయిలూ ఉన్నారు.

అభిమానులతో పాటూ పలువురు పోలీస్ కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయి. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీలను ఉపయోగించాల్సి వచ్చింది. గాయపడ్డ వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఉన్నారు.

అయితే ఈ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ చనిపోలేదని హైదరాబాద్ నార్త్‌జోన్ అడిషనల్ డీసీపీ మీడియాకు తెలిపారు.హెచ్‌సీఏ ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయని విచారణలో తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

వీడియో క్యాప్షన్, Farmers Cricket Team: పంచె కట్టి... బ్యాట్ పట్టి.. పరుగులు కొల్లగొట్టి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)