Mahsa Amini: సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాల్లో మహిళలు ఏం చేయకూడదు, ఏమేం చేయొచ్చు?

మహసా అమీనీ

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, మహసా అమీనీ
    • రచయిత, విభురాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇరాన్‌లోని పోలీసుల కస్టడీలో ఓ యువతి మృతిపై వివాదం ముదురుతోంది. చుట్టుపక్కల దేశాల్లోనూ దీనిపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. మోరల్ పోలీసింగ్‌కు నిరసనగా మహిళలు వీధుల్లోకి వచ్చి హిజాబ్‌లను తగలబెడుతున్నారు.

22ఏళ్ల మహసా అమీనీ మృతిపై ఫ్రాన్స్ విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఘటనను సిగ్గుచేటుగా ఫ్రాన్స్ పేర్కొంది

అమీనీ మృతిపై ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ చేపట్టాలని ఫ్రాన్స్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్‌లో విదేశీ వ్యవహారాల విభాగం కూడా ఘటనపై గట్టిగానే స్పందించింది.

‘‘అమీనీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మేం సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఘటనలను అసలు సహించేది లేదు. ఈ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’’అని ఈయూ ప్రకటనలో డిమాండ్ చేసింది.

అమెరికా విదేశాంగ శాఖ కూడా అమీనీ మృతిని ఖండించింది. ఇరాన్‌లో మహిళల పరిస్థితిపై ప్రతినిధుల సభలోని విదేశీ వ్యవహారాల కమిటీ ప్రశ్నలు సంధిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు శ్వేతసౌధ అధికార ప్రతినిధి కూడా అమీనీ మృతిని ఖండించారు.

మహసా అమీనీ

ఫొటో సోర్స్, Getty Images

లైను

అసలేం జరిగింది?

లైను
  • ఇరాన్‌లోని ఖుర్దిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన 22ఏళ్ల మహసా అమీనీ.. పోలీసుల కస్టడీలో మరణించారు. రాజధాని టెహ్రాన్‌కు వచ్చినప్పుడు హిజాబ్ నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ ఆమెను గతవారం అదుపులోకి తీసుకున్నారు.
  • జుట్టును కప్పుకోకుండా బహిరంగ ప్రాంతాలకు రావడం, సరైన బట్టలు వేసుకోకపోవడం లాంటి చర్యలపై కొందరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు గత వారం టెహ్రాన్‌లోని మొరాలిటీ పోలీసులు చెప్పారు. అమీనీ కూడా వారిలో ఒకరని అన్నారు.
  • అమీనీ మృతి అనంతరం, పోలీసులపై కొందరు పిరికిపందల్లా ఆరోపణలు చేస్తున్నారని టెహ్రాన్ పోలీస్ కమాండర్ హుస్సేన్ రహీమీ వ్యాఖ్యానించారు. అమీనీని హత్య చేసినట్లు ఎలాంటి రుజువులూ లేవని, ఆమెను బతికించేందుకు చాలా ప్రయత్నించామని ఆయన చెప్పారు.
  • ‘‘ఇలా జరగడం దురదృష్టకరం. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా చూసుకుంటాం’’అని రహీమీ చెప్పారు. మరోవైపు వారు చెబుతున్న అంశాలకు బలం చేకూర్చేలా కొన్ని సీసీటీవీ వీడియో క్లిప్పులను కూడా పోలీసులు విడుదల చేశారు. అయితే, వీటిలో ఉన్న విషయాలు ధ్రువీకరించడానికి సాధ్యపడలేదు.
  • అయితే, అమీనీకి ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని, కానీ, ఆమె మృతదేహంపై కొట్టిన గాయాలున్నాయని ఆమె తండ్రి చెబుతున్నారు. పోలీసులే ఆమెను చంపేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
లైను
మహసా అమీనీ

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఖుర్దిస్తాన్ నుంచి టెహ్రాన్ వరకు నిరసనలు

అమీనీ మృతి తర్వాత ఇరాన్‌లోని ఖుర్దిస్తాన్ నుంచి టెహ్రాన్ వరకు నిరసనలు పెల్లుబికాయి. ఖుర్దిస్తాన్‌లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

తన సొంత ఊరు సాకేజ్‌లో శనివారం అమీనీకి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అంత్యక్రియలకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు. అక్కడకు వచ్చిన మహిళలు తమ బుర్ఖాలను తొలగించి నిరసనలు తెలిపారు.

సోమవారం నాటి ఘర్షణల్లో వందమందికి పైగా గాయపడ్డారు. మరోవైపు, ఈ నిరసనలు ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. అయితే, నిరసనలు అంత తీవ్రంగా లేవని, వీటి ప్రభావం కూడా ఏమీ ఉండదని ప్రభుత్వ మీడియా చెబుతోంది.

2021 మంచినీటి సంక్షోభం తర్వాత, మళ్లీ అదే స్థాయిలో నేడు ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

మహసా అమీనీ

ఫొటో సోర్స్, Google

మొరాలిటీ పోలీస్ అంటే?

సామాజిక కట్టుబాట్లు, నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు మొరాలిటీ పోలీస్‌ను ఇరాన్ ఏర్పాటుచేసింది.

అయితే, ఇరాన్‌లో ఇస్లామిక్ కోడ్‌ అమలయ్యేలా చూడటమే తమ విధి అని మొరాలిటీ పోలీసులు చెబుతున్నారు. వీరిరే గస్త్-ఎ-ఇర్షాద్ బలగాలుగా కూడా పిలుస్తారు.

2006లో గస్త్-ఎ-ఇర్షాద్‌ను ఏర్పాటుచేశారు. న్యాయ వ్యవస్థతోపాటు ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్స్‌తోనూ ఇది కలిసి పనిచేస్తుంది.

ఇస్లామిక్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్నారని చెబుతూ ఎవరైనా అదుపులోకి తీసుకునేందుకు, విచారించేందుకు ఈ సంస్థకు అధికారాలు ఉన్నాయి.

మహిళలంతా హిజాబ్ ధరించేలా చూసేందుకు గస్త్-ఎ-ఇర్షాద్‌తోపాటు ఇలాంటి మరో 26 సంస్థలు కూడా పనిచేస్తున్నాయి.

అమీనీ మృతి తర్వాత, పశ్చిమాసియాలో మహిళల స్థితిగతులపై మరోసారి చర్చ జరుగుతోంది. ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్.. ఇలా ఇక్కడి చాలా దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు లేవు.

వీడియో క్యాప్షన్, పరువు పేరుతో జరుగుతున్న హత్యల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరం అంటున్న హక్కుల సంఘాలు
లైను

ఇరాన్‌లో ఆంక్షలు

లైను

హిజాబ్ విషయాన్ని పక్కన పెడితే, ఇలాంటి ఆంక్షలు ఇక్కడ మహిళలపై చాలా ఉన్నాయి. ఉదాహరణకు బీచ్‌లలో ఇక్కడి మహిళలు స్విమ్‌సూట్లు వేసుకోకూడదు.

ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేందుకు మహిళలపై ఎలాంటి నిషేధం విధించలేదు. అయితే, స్టేడియంలోకి ప్రవేశించేందుకు మాత్రం వారిని అనుమతించరు. ఇరాన్ విప్లవానికి ముందు ఇలాంటి ఆంక్షలు ఉండేవి కాదు.

గత ఆగస్టు 25న తొలిసారి ఒక లీగ్ మ్యాచ్‌ను చేసేందుకు కొందరు మహిళలను అనుమతించారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లడం, విదేశీ పర్యటనలు, ఉద్యోగాలు, పాస్‌పోర్టుల జారీ లాంటి అంశాల్లో ఇక్కడ పురుషులతో పోలిస్తే, మహిళలకు కాస్త తక్కువ హక్కులు ఉంటాయి. మరోవైపు గృహ హింసను అడ్డుకునేందుకు కూడా ఇక్కడ ఎలాంటి నిబంధనలూ లేవు.

పెళ్లిళ్లు, విడాకులు, ఆస్తి హక్కులు, పిల్లల పెంపకం ఇలా చాలా అంశాల్లో ఇరాన్‌లో మహిళలపై వివక్ష ఉందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక నివేదిక విడుదల చేసింది.

లైను
సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, EVN

లైను

సౌదీ అరేబియా పరిస్థితి ఇది

లైను

2015లో సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. 2017 వరకు వారికి వాహనాలు నడిపే హక్కులు కూడా ఉండేవి కాదు.

అప్పట్లో డ్రైవింగ్ హక్కులు ఇచ్చేటప్పుడు, దేశంలోని సగం మంది జనాభాకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నామని ప్రభుత్వ వార్తా సంస్థలు చెప్పుకొచ్చాయి. ఆ తర్వాత మహిళలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే హక్కులు కూడా కల్పించారు.

అయితే, ఇప్పటికీ సౌదీలో మహిళలు చేయలేని పనులు చాలా ఉన్నాయి. వీటి గురించి చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది అవుతుంది.

ఉదాహరణకు ఇంట్లో మగవారి అనుమతి లేకుండా సౌదీ మహిళలు సొంతంగా పెళ్లిళ్లు చేసుకోలేరు.

సౌదీ మహిళల ద్వారా వారి పిల్లలకు పౌరసత్వం రాదు. తమ పిల్లల పెళ్లిళ్ల అధికారిక ప్రక్రియల్లోనూ వీరి ప్రమేయం ఉండదు.

లైను
ప్రిన్సెస్ లతీఫా
ఫొటో క్యాప్షన్, ప్రిన్సెస్ లతీఫా
లైను

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇలా

లైను

దుబాయ్ పాలకుడి కుమార్తె ప్రిన్సెస్ లతీఫా వివాదం తర్వాత యునైటెడ్ ఎమిరేట్స్‌లో మహిళల పరిస్థితిపై అంతర్జాతీయ మీడియాలో చాలా చర్చ జరిగింది. తనను తన తండ్రి బంధించారని లతీఫా ఆరోపించిన సంగతి తెలిసిందే.

అయితే, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ విడుదలచేసే ‘‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్-2020’’ ప్రకారం, పశ్చిమాసియాలో మహిళలు జీవించేందుకు అనువైన పరిస్థితులున్న దేశాల జాబితాలో యూఏఈ రెండో స్థానంలో ఉంది.

ఇక్కడ 2006లో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. ఇక్కడి మహిళలు డ్రైవింగ్, ఉద్యోగాలు చేయొచ్చు. వీరికి ఆస్తి హక్కులు కూడా ఉంటాయి.

వివక్ష లేకుండా చూసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే, ఆ వివక్షల జాబితాలో జెండర్ ఆధారిత వివక్ష అనే నిబంధన లేదు.

యుఏఈలోనూ మహిళలు తమ వ్యక్తిగత హక్కులను వినియోగించుకునేందుకు ఇంటిలోని పురుషుల అనుమతి అవసరం అవుతుంది.

కొన్ని పనులు చేసేందుకు ‘‘సంరక్షకుడి’’ అనుమతి అవసరం. ఆ సంరక్షకుడు భర్త లేదా ఎవరైనా కుటుంబ సభ్యుడు అయ్యుండొచ్చు. అయితే, ఇక్కడి నిబంధనలు మరీ సౌదీ అంత కఠినంగా ఉండవు.

అయితే, హక్కులకు భంగం కలిగితే, కోర్టులకు వెళ్లి సాధించుకోవడం అంత తేలిక కాదు.

లైను
ఖతర్

ఫొటో సోర్స్, ADRIAN HADDAD

లైను

ఖతార్‌లో మహిళలు

లైను

ప్రపంచ బ్యాంకు నివేదిక ‘‘విమెన్, బిజినెస్ అండ్ ద లా 2020’’ ప్రకారం, ఖతార్‌లో పురుషుల తరహాలో మహిళలు ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదు. విదేశాలకు కూడా వారు ఒంటరిగా వెళ్లలేరు.

పురుషులతో పోలిస్తే, ఇక్కడి మహిళలకు చాలా హక్కులు ఉండవు. పురుషుల్లా ఇక్కడి మహిళలు అన్ని ఉద్యోగాలు చేయలేరు.

వీడియో క్యాప్షన్, జైలులో అరాచకాలను వీడియోలతో సహా బయటపెట్టిన హ్యాకర్లు

ఉద్యోగాల్లో మహిళలపై వివక్షను అడ్డుకునేందుకు ఎలాంటి చట్టమూ లేదు. అలానే ఉద్యోగాల్లో లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు కూడా నిబంధనలు లేవు. విడాకుల తర్వాత పురుషుల్లా ఇక్కడి మహిళలు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిబంధనలు అనుమతించవు.

ఆస్తి హక్కులు కూడా కొడుకు, కూతురికి ఒకేలా ఉండవు. అయితే, పాస్‌పోర్టుకు మాత్రం పురుషుల్లానే దరఖాస్తు చేసుకోవచ్చు. రాత్రిపూట కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇంటి పెద్దగా కొన్ని దరఖాస్తుల్లో వీరు సంతకం చేసేందుకు అనుమతిస్తారు.

ఇక్కడి మహిళలు సొంతంగా వ్యాపారాలు చేయొచ్చు. బ్యాంకు ఖాతాలు కూడా తెరచుకోవచ్చు. మరోవైపు పురుషులు, మహిళల మధ్య పదవీ విరమణ వయసులోనూ తేడా లేదు.

లైను

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)