డిజిటల్ రేప్: 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు.. డిజిటల్ రేప్ అంటే ఏమిటి?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
మూడేళ్ల చిన్నారిపై 'డిజిటల్ రేప్'కు పాల్పడినందుకు 75 ఏళ్ల వృద్ధుడికి ఉత్తరప్రదేశ్‌లోని ఒక కోర్టు ఇటీవల యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. డిజిటల్ రేప్ కేసులో జీవిత ఖైదు విధించడం ఇదే తొలిసారి. ఈ కేసు 2019లో నమోదు కాగా, ఈ ఏడాది ఆగస్టు 30న తీర్పు వెలువడింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారిపై డిజిటల్ అత్యాచారానికి పాల్పడినందుకు అక్బర్ అలీ (75) అనే వృద్ధుడికి సెషన్సు కోర్టు జీవిత ఖైదు విధించింది.
మైనర్‌పై లైంగిక హింస కాబట్టి, నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం సెక్షన్ 5/6 కింద, భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 375, 376 కింద కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసు వివరాలు ఏమిటి?
చిన్నారిపై లైంగిక హింస జరిగిందని 2019 జనవరి 21న పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీతు బిష్ణోయి చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో తెలిపింది.
"ఆ రోజు 11 గంటలకు మా పాప మా ఇంటి బయట ఆడుకుంటుండగా, అక్బర్ అలీ పాపకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి తన ఇంటికి తీసుకెళ్లారు. మా పాప ఏడుస్తూ ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పింది" అని చిన్నారి తండ్రి తన ఫిర్యాదులో రాశారు.
చిన్నారి వాగ్మూలం, తల్లిదండ్రుల ఫిర్యాదుపై విచారణ జరిపిన సెషన్సు కోర్టు అక్బర్ అలీ డిజిటల్ అత్యాచారానికి పాల్పడినట్టు నిర్థరించి, పోక్సో చట్టం కింద జీవిత ఖైదు, రూ. 50,000 జరిమానా విధించింది.
డిజిటల్ రేప్ అంటే ఏమిటి?
డిజిటల్ అనే పదం వినగానే కంప్యూటర్ లేదా, ఆన్‌లైన్, టెక్నాలజీ సంబంధించినది అనుకుంటాం. కానీ, డిజిటల్ రేప్‌కు కంప్యూటర్ లేదా ఆన్‌లైన్ వ్యవహారాలకూ ఏ సంబంధం లేదు.
డిజిట్ నుంచి 'డిజిటల్ రేప్' అనే పదం పుట్టుకొచ్చింది. ఇంగ్లిష్‌లో డిజిట్ అంటే అంకె. అలాగే, చేతి వేలు, బొటన వేలు లేదా కాలి వేలు అనే అర్థం కూడా ఉంది.
డిజిటల్ రేప్ అంటే చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను బలవంతంగా మహిళల (లేదా పురుషుల) ప్రయివేటు భాగాల్లోకి చొప్పించి, లైంగిక హింసకు పాల్పడడం.

ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ రేప్ - ఐపీసీ
డిజిటల్ రేప్ అనే పదాన్ని 2013 నుంచి వాడటం ప్రారంభించారు. 2012 డిసెంబర్ వరకు భారతీయ శిక్షాస్మృతిలో ఈ రకమైన లైంగిక హింసను అత్యాచారం కింద పరిగణించలేదు. దాన్ని లైంగిక వేధింపుల కింద మాత్రమే గుర్తించేవారు.
దేశాన్ని కుదిపేసిన నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన తరువాత అత్యాచారాలకు సంబంధించిన కొత్త చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
'క్రిమినల్ లా (సవరణ) చట్టం 2013', దీన్నే నిర్భయ చట్టం లేదా యాంటీ రేప్ బిల్ అని కూడా అంటారు. ఈ చట్టాన్ని 2013 మార్చిలో పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. 2013 ఫిబ్రవరి 3 నుంచి ఇది అమలులోకొచ్చింది.
పై చట్టం కింద 'రేప్' నిర్వచనాన్ని పొడిగించారు. అందులో భాగంగా ఐపీసీ సెక్షన్ 375 (B) ఏం చెబుతుందంటే.. "శరీర భాగాలను (పురుషాంగం కాకుండా) లేక వస్తువులు, పరికరాలను మహిళల యోనిలోకి, మూత్రమార్గం లేదా మలద్వారంలోకి చొప్పించడం లేదా మహిళల చేత బలవంతంగా ఆ పని చేయించడాన్ని" రేప్ అంటారు. దీన్నే డిజిటల్ రేప్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదే కాకుండా, నిర్భయ చట్టం కింద యాసిడ్ దాడి (సెక్షన్ 326 A & B), వోయురిజం - ఇతరుల శృంగార కార్యకలాపాలను లేదా నగ్నత్వాన్ని చూసి ఆనందించే ధోరణి (సెక్షన్ 354C), వెంబడించడం (సెక్షన్ 354D), మహిళల దుస్తులను తొలగించే ప్రయత్నం చేయడం (సెక్షన్ 354B), లైంగిక వేధింపులు (సెక్షన్ 354A), లైంగిక హింస (సెక్షన్ 376A) లాంటి నేరాలను కూడా జతచేశారు. అలాగే, ఉనికిలో ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేశారు.
పోక్సో చట్టంలో డిజిటల్ రేప్ గురించి ఉందా?
2012లో ప్రవేశపెట్టిన పోక్సో చట్టంలో సెక్షన్ 3 కింద 'పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్'కు నిర్వచనం ఇచ్చారు. ఇది డిజిటల్ రేప్‌కు సమానమైనది. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు పోక్సో చట్టాన్ని తీసుకువచ్చారు.
పోక్సో చట్టంలో సెక్షన్ 3(B) నిర్వచనం ప్రకారం, "ఏదైనా వస్తువు, పరికరం లేదా పురుషాంగం కాకుండా శరీరలోని ఇతర భాగాలను (అవయవాలను) పిల్లల యోనిలోకి, మూత్రమార్గం లేదా మలద్వారంలోకి చొప్పించడం లేదా పిల్లలచేత ఆ పని చేయించడాన్ని" పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు.
పోక్సోలో సెక్షన్ 5లో 'అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్'ను నిర్వచించారు.
ఇందులో సెక్షన్ 5(M) ప్రకారం, "12 ఏళ్ల లోపు పిల్లలపై పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్‌కు పాల్పడితే వారిని అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కింద నిందితులు’’గా పరిగణిస్తారు.
సెక్షన్ 6లో అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్‌కు శిక్షలను పేర్కొన్నారు. నేరస్థులకు పదేళ్ల జైలుశిక్ష నుంచి జీవిత ఖైదు వరకు కఠినమైన శిక్షలు పడవచ్చు. అదనంగా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
"అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్‌కు పాల్పడినవారికి పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు కఠినమైన శిక్షలు విధించాలి. జరిమానా కూడా విధించాలి" అని సెక్షన్ 6 ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
తాజా కేసులో పోక్సో చట్టం అమలు
నోయిడా కేసులో మూడేళ్ల చిన్నారిపై లైంగిక హింసకు పాల్పడ్దారు కాబట్టి పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద అక్బర్ అలీకి జీవిత ఖైదు విధించారు.
అయితే, చిన్నారికి వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్ పుష్పలత, తన రిపోర్టులో "పాప ప్రయివేటు భాగాలలో ఎలాంటి గాయాలు లేవు... నా మెడికల్ రిపోర్టులో, అత్యాచారాలను వైద్య పరీక్షలతో నిర్థరించలేం. బాధితురాలికి శరీరం లోపలి భాగాల్లో జరిపిన పరీక్షలు సాధారణంగా ఉన్నాయి" అని పేర్కొన్నట్టు మీడియా కథనం.
బాధితురాలి కుటుంబానికి, తమకు మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయని, వాటి వల్లే తన తాతపై తప్పుడు కేసు మోపారని అక్బర్ అలీ మనుమరాలు ఆరోపించారు.
బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల వాగ్మూలం, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అక్బర్ అలీకి పోక్సో చట్టం కింద జీవిత ఖైదు, రూ. 50,000 జరిమానా విధించింది.
"ఘటన వల్ల కలిగిన గాయం, బాధకు పరిహారంగా సీఆర్‌పీసీలోని సెక్షన్ 357-A కింద జరిమానాలో 80 శాతాన్ని బాలికకు చెల్లించాలని" కోర్టు తీర్పునిచ్చింది.
ఇంతకు ముందు డిజిటల్ రేప్ కేసులు నమోదయ్యాయా?
మీడియా రిపోర్టుల ప్రకారం, కొద్ది రోజుల క్రితం, మనోజ్ లాలా అనే వ్యక్తిని ఏడు నెలల పసిపాపపై డిజిటల్ అత్యాచారానికి పాల్పడిన కేసులో నోయిడా ఫేజ్-3 పోలీసు స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది మేలో నోయిడాకే చెందిన 81 ఏళ్ల ఆర్టిస్టును డిజిటల్ రేప్ కేసులో అరెస్ట్ చేశారు. 17 ఏళ్ల విద్యార్థిపై ఏడేళ్లుగా డిజిటల్ అత్యాచారం జరుపుతున్నారన్న ఫిర్యాదుపై ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2022 జూన్‌లో అయిదేళ్ల తన కూతురిపై డిజిటల్ అత్యాచారం చేసినందుకు ఒక తండ్రిని అరెస్ట్ చేశారు. జననాంగంలో నొప్పిగా ఉందని పాప చెప్పడంతో, ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, AFP
చాలా కేసుల్లో నిందితులు, బాధితులకు పరిచయం ఉన్నవారే
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక ప్రకారం, 2021లో మొత్తం 65,025 రేప్ కేసులు నమోదు కాగా, వాటిల్లో 96.8 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసినవారే. బాధితుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.
2021 సంవత్సరంలో మైనర్లపై అత్యాచార ఘటనలు అమాంతం పెరిగాయని డాటా చెబుతోంది. 2021లో 18 ఏళ్లు పైబడిన మహిళలపై అత్యాచారాలకు సంబంధించి మొత్తం 28,644 కేసులు నమోదయ్యాయి. మైనర్లపై 36,069 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ 36,069 కేసుల్లో ఎక్కువ భాగం పోక్సో చట్టం కింద నమోదైనవే.
"దగ్గర బంధువులు లేదా సన్నిహితులు, తరచుగా సొంత కుటుంబాల నుంచి వ్యక్తులే పిల్లలపై అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు అధికంగా ఉన్నాయని చెప్పేందుకు కావలసినంత సమాచారం మా దగ్గర ఉంది" అని హక్ సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు భారతి అలీ ఇటీవల బీబీసీతో చెప్పారు.
'డిజిటల్ రేప్ గురించి అవగాహన పెరగాలి'
డిజిటల్ రేప్ గురించి మరింత అవగాహన పెరగాలని ప్రాసిక్యూటర్ బిష్ణోయి ఫస్ట్ పోస్ట్ న్యూస్ వెబ్‌సైటుకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
"నేను వ్యక్తిగతంగా గమనించిన విషయం ఏమిటంటే, డిజిటల్ రేప్‌కు పాల్పడిన వారిలో ఎక్కువమంది వృద్ధులే. బాధితులకు పరిచయం ఉన్నవారే. రిపోర్ట్ చేయని కేసులు ఇంకా చాలానే ఉంటాయని నేను కచ్చితంగా భావిస్తున్నాను" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జ్ఞాన్వాపి కేసు: ముస్లింల పిటిషన్ కొట్టేసిన కోర్టు.. పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న హిందువుల పిటిషన్ విచారణ కొనసాగించాలని ఆదేశం
- యుక్రెయిన్ యుద్ధం: రష్యా నుంచి విముక్తి పొందిన గ్రామాల్లో ఒక వైపు భయం, మరోవైపు ఆనందం
- కింగ్ చార్లెస్ 3: దేశాధినేతగా రాజును ఆమోదించాలా? రిపబ్లిక్ దేశంగా మారాలా? - రిఫరెండం చేపడతామన్న ఆంటిగ్వా
- బిహార్: ‘8 ఏళ్ల’ బాలుడు రిజ్వాన్ అరెస్ట్‌పై దుమారం? అసలు ఏం జరిగింది? అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారు?
- గత రెండేళ్లలో మనిషి సరాసరి ఆయుర్దాయం తగ్గింది, రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












