కింగ్ చార్లెస్ 3: దేశాధినేతగా రాజును ఆమోదించాలా? రిపబ్లిక్ దేశంగా మారాలా? - రిఫరెండం చేపడతామన్న ఆంటిగ్వా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాట్ మర్ఫీ
- హోదా, బీబీసీ న్యూస్
రిపబ్లిక్ దేశంగా మారాలా? వద్దా? అనే అంశంపై ఆంటిగ్వా మరియు బార్బుడా దేశం ఓటింగ్‌ను నిర్వహిస్తుందని ఆ దేశ ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌన్ చెప్పారు.
మూడేళ్లలో దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరుగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చార్లెస్ 3ను బ్రిటన్ కొత్త రాజుగా, కరీబియన్ దేశానికి అధిపతిగా ప్రకటించిన తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది ఒకవేళ మళ్లీ తాను ప్రధానిగా ఎన్నికైతే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని భావిస్తున్నట్లుగా బ్రౌన్ తెలిపారు.
'హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్'లోని 17 సీట్లలో గాస్టన్ బ్రౌన్ పార్టీకి 15 సీట్లు ఉన్నాయి. వచ్చే ఏడాది గెలుపుపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలోనూ చర్చ..
అయితే, రాబోయే నాలుగేళ్లలో ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ ఉండబోదని ఆస్ట్రేలియా పేర్కొంది.
క్వీన్ ఎలిజబెత్ 2 మరణం, ఆస్ట్రేలియాలో రాచరికంపై మరోసారి చర్చకు దారి తీసింది.
ఆస్ట్రేలియాకు నూతన ప్రధానిగా మే నెలలో ఎన్నికైన ఆంథోనీ ఆల్బనీస్ ఒక రిపబ్లికన్.
''మన రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు అడగాల్సినవి కావు. ఎందరో ఆస్ట్రేలియన్లు ఈ క్షణంలో అనుభవిస్తోన్న బాధను పంచుకోవాల్సిన తరుణం ఇది. ఆస్ట్రేలియాకు క్వీన్ అందించిన సహకారం పట్ల ప్రగాఢమైన గౌరవం, అభిమానాన్ని చూపెట్టాలి'' అని స్కై న్యూస్‌తో ఆంథోనీ అన్నారు.
యూకేతో పాటు మరో 14 దేశాలకు కూడా కింగ్ చార్లెస్ 3 అధిపతిగా ఉంటారు.
ఆంటిగ్వా అండ్ బార్బుడా, ఆస్ట్రేలియా, ద బహమాస్, బెలిజ్, కెనడా, గ్రెనెడా, జమైకా, న్యూజీలాండ్, పపువా న్యూ గినియా, సెయింట్ కీట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడెన్స్, సోలోమన్ ద్వీపాలు, తువాలు దేశాలకు ఆయనే అధిపతిగా వ్యవహరిస్తారు.
రాచరిక పాలన పాత్ర గురించి పలు దేశాలు పునఃసమీక్షిస్తున్నాయి.
గణతంత్ర రాజ్యంగా మారడం అంటే, ''నిజమైన సార్వభౌమాధికార దేశంగా మారడానికి స్వతంత్రం అనే వృత్తాన్ని పూర్తి చేయడంలో తుది దశ'' అని బ్రౌన్ చెప్పారు.
గతేడాది బార్బడోస్ గణతంత్ర దేశంగా మారింది. దేశాధిపతిగా క్వీన్ స్థానంలో తొలి అధ్యక్షురాలిని బార్బడోస్ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది.
72 ఏళ్ల సాండ్రా మేసన్ ఆ దేశానికి తొలి అధ్యక్షురాలు అయ్యారు.
జమైకాలోని అధికార లేబర్ పార్టీ కూడా గణతంత్ర రాజ్యంగా మారడానికి రిఫరెండాన్ని నిర్వహించడమే తమ లక్ష్యమని చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్రకటన.. తొలిసారి టీవీల్లో ప్రసారమైన చారిత్రక కార్యక్రమం
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: రాజు చార్లెస్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించే వారసులు ఎవరు?
- రాయల్ బ్రాండింగ్: రాణి మరణంతో బ్రిటన్ కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు, పాస్‌పోర్టుల్లో వచ్చే మార్పులేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








