క్వీన్ ఎలిజబెత్-2: రాణికి రేసు గుర్రాలంటే ఎందుకంత ఇష్టం

2013లో తన గుర్రం ఎస్టిమేట్, గోల్డ్ కప్ గెలిచినప్పుడు ఆనందంతో రాణి

ఫొటో సోర్స్, UK press via Getty

ఫొటో క్యాప్షన్, 2013లో తన గుర్రం ఎస్టిమేట్, గోల్డ్ కప్ గెలిచినప్పుడు ఆనందంతో రాణి

బ్రిటన్ రాణి ఎలిజబెత్-II సేదతీరే ప్రాంతాల్లో శాండ్రింగ్‌హామ్ క్యాజిల్ ఒకటి. ఆ కోటలోకి అడుగు పెట్టగానే ముందుగా ఒక పెద్ద గుర్రం విగ్రహం కనిపిస్తుంది.

రాణి రేసు గుర్రమైన దాని పేరు ఎస్టిమేట్.

గుర్రపు పందేల మీద రాణికి ఉండే ఇష్టాన్ని ఎస్టిమేట్ విగ్రహం చూస్తే తెలుస్తుంది. రాణి వ్యక్తిత్వంలోని మరొక కోణాన్ని గుర్రపు పందెం పోటీలు చూపిస్తాయి.

2013లో రాయల్ ఆస్కట్‌లో జరిగిన గోల్డ్ కప్‌ను ఎస్టిమేట్ గెలిచింది. గత 207 సంవత్సరాలలో పాలన సాగిస్తున్న రాజు లేదా రాణికి చెందిన గుర్రం గోల్డ్ కప్ గెలవడం అదే తొలిసారి.

నాడు రాయల్ బాక్స్‌లో తన రేసింగ్ మేనేజర్ జాన్ వారెన్‌తో కలిసి కూర్చొని ఉన్న రాణి ఆనందానికి అవధులు కనిపించలేదు. రాణికి చెందిన పర్పుల్ కలర్ జాకీ సాధించిన 1800 విజయాల్లో ఎస్టిమేట్ సాధించినవి కూడా ఉన్నాయి.

రేసు గుర్రాలను పెంచడం, రేసుల్లో పాల్గొనడం ద్వారా గుర్రపు పోటీలకు చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ చాంపియన్స్ సిరీస్ హాల్ ఆఫ్ ఫేమ్-2021 జాబితాలో రాణికి చోటు దక్కింది.

2013లో రాయల్ ఆస్కట్ గోల్డ్ కప్ గెలిచిన తన గుర్రం 'ఎస్టిమేట్'తో రాణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2013లో రాయల్ ఆస్కట్ గోల్డ్ కప్ గెలిచిన తన గుర్రం ‘ఎస్టిమేట్’తో రాణి

దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాలతో తీరిక లేకుండా గడిపే రాణికి గుర్రపు పందేలు ఆట విడుపుగా ఉండేవి. 'రేసింగ్ పోస్ట్' పత్రిక ఎప్పుడూ రాణి దగ్గర ఉండేది. చిన్నతనం నుంచే రాణికి గుర్రాల మీద మక్కువ పెరిగింది. రాణి నాలుగో పుట్టిన రోజు సందర్భంగా 'షెట్‌ల్యాండ్ పోనీ' జాతికి చెందిన గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు ఆమె తాత జార్జ్-V. 'పెగ్గీ' అని పిలిచే ఆ గుర్రంతోనే రాణి స్వారీ నేర్చుకున్నారు.

రెండో ప్రపంచయుద్ధ సమయంలో గుర్రపు పందేల మీద రాణికి ఇష్టం పెరిగింది. నాడు రాచగుర్రాలకు శిక్షణ ఇచ్చే విల్ట్‌షీర్‌కు తండ్రితో కలిసి తరచూ రాణి వెళ్తూ ఉండేవారు. 'గుర్రపుశాలలో ఉండే గుర్రాలను నిమిరే దాన్ని. అంత సున్నితత్వాన్ని, మెత్తదనాన్ని నేను అంతకు ముందు ఎన్నడూ చూడలేదు' అని రాణి ఒకసారి చెప్పారు.

1945 మేలో అంటే యూరప్‌లో యుద్ధం ముగిసిన తరువాత తొలిసారి తల్లిదండ్రులతో కలిసి ఆస్కట్‌కు రాణి వచ్చారు. గుర్రపు పందేల పోటీల్లో ఆమె కనిపించడం అదే తొలిసారి.

రాయల్ ఆస్కట్‌లో జరిగే గుర్రపు పందేల వల్ల నలుగురిని కలిసి అవకాశం రాణికి వచ్చేది. అది ఆమెకు ఎంతో ఇష్టమైన వ్యాపకం. ఆ పోటీల్లో రాణి 24 సార్లు గెలిచారు.

ప్రతి ఏడాది విండ్సర్ క్యాజిల్ నుంచి రాణి వచ్చేటప్పుడు, ఆమె ధరించే టోపీ రంగు మీద పంటర్లు పందేలు కాసేవారు. రేసు గుర్రాల మీద పందేలు కాసే వారిని పంటర్లు అంటారు. బ్లూ కలర్ మీద ఎక్కువ బెట్ కడుతూ ఉండేవారు.

90వ పడిలోనూ గుర్రపు స్వారీ చేస్తున్న రాణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 90వ పడిలోనూ గుర్రపు స్వారీ చేస్తున్న రాణి

శాండ్రింగ్‌హామ్‌లోని రేసు గుర్రాలను పెంచే రాయల్ స్టాడ్ కేంద్రం, తండ్రి కింగ్ జార్జ్-VI నుంచి క్వీన్ ఎలిజబెత్-IIకి వారసత్వంగా వచ్చింది. అక్కడ పుట్టి పెరిగిన అనేక గుర్రాలు ఆమెకు విజయాలు సాధించి పెట్టాయి.

1949లో ఫంట్‌వెల్ పార్క్‌లో మోనవీన్ రాణికి తొలి విజయాన్ని సాధించి పెట్టింది. 1954, 1957లలో రెండు సార్లు బ్రిటన్‌లో జరిగిన గుర్రపు రేసుల్లో ఆమె గెలిచారు.

'చూడగానే తన గుర్రాలను రాణి గుర్తించేవారు. వాటి మానసిక, శారీరక ఆరోగ్యం మీద ఆమె చాలా శ్రద్ధ పెట్టేవారు. గుర్రాలను చూసుకునే వారితో ఆ విషయాల గురించి తరచూ మాట్లాడుతూ ఉండేవారు' అని జర్నలిస్ట్ క్లేర్ బాల్డింగ్ అన్నారు. ఆమె తాత, తండ్రి, సోదరుడు రాణి గుర్రాలకు శిక్షకులుగా పని చేశారు.

'ఆమె చిన్న విషయాలను కూడా ఎంతగా పట్టించుకుంటారనేదానికి ఒక ఉదాహరణ చెబుతాను. గుర్రాల దగ్గరకు వెళ్లేటప్పుడు రాణి ఎప్పుడూ సెంట్ కొట్టుకోరు. ఎందుకంటే వయసులో ఉండే గుర్రాల్లో టెస్టొస్టెరాన్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సెంట్ పరిమళం వల్ల అవి ఉత్తేజితమవుతాయి.

ప్రముఖ గుర్రాల శిక్షకుడు మాంటీ రాబర్ట్స్ అవలంబించే అనేక టెక్నిక్స్‌ను రాణి నేర్చుకున్నారు. చిన్న పెద్ద గుర్రాలను మచ్చిక చేసుకోవడంలో ఆ టెక్నిక్స్‌ను ఆమె వాడే వారు.

ఉదాహరణకు గుర్రాలకు నీళ్లు అంటే ఉండే భయం పోగొట్టేందుకు నీలి రంగు ప్లాస్టిక్ షీట్ల మీద వాటిని రాణి నడిపించేవారు. ఇలాంటి టెక్నిక్స్ వల్ల రేసు కోర్సులో గుర్రాలు బెదరకుండా ఉంటాయి' అని క్లేర్ తెలిపారు.

స్పష్టమైన సందేశం ఇచ్చేలా తన గుర్రాలకు 'డ్యూటీ బౌండ్', 'కాన్‌స్టిట్యూషన్', 'డిస్‌క్రెషన్' వంటి అర్థవంతమైన పేర్లను రాణి పెట్టేవారు.

గుర్రాన్ని అదుపు చేయడంలోనూ అద్భుతంగా స్వారీ చేయడంలోనూ రాణి ఆరితేరారు. 1981 కలర్ పరేడ్‌లో గుర్రాన్ని స్వారీ చేస్తున్న రాణి లక్ష్యంగా ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో బెదిరిన గుర్రాన్ని రాణి చాకచక్యంగా నియంత్రించారు.

తన రేసు గుర్రం, జాకీలతో రాణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తన రేసు గుర్రం, జాకీలతో రాణి

రాణితో పని చేయడం చాలా ఆనందంగా ఉండేదని రాచగుర్రాల శిక్షకుడు సర్ మైఖేల్ స్టౌట్ అన్నారు. 'గుర్రాల మీద రాణికి ఉన్న అవగాహన, వాటిని అర్థం చేసుకునే తీరు వల్ల ఆమెకు శిక్షణ అనేది చాలా సులభంగా ఉండేది.

ఆమె చాలా ముందు చూపుతో ఆలోచించేవారు. ఒక గుర్రాన్ని ఏం చేయాలి? శిక్షణ ఇవ్వాలనుకుంటే దాన్ని ఎలా తీర్చిదిద్దాలి? గుర్రం నడవడిక, వేగం, బలం ఎలా ఉండాలి? వంటి అనేక విషయాలను ఆమె చాలా లోతుగా ఆలోచించేవారు' అని సర్ మైఖేల్ స్టౌట్ వివరించారు.

అయిదు బ్రిటిష్ క్లాసిక్ రేసుల్లో నాలుగింటిని రాణి గెలుచుకున్నారు. 1977లో రాణి సిల్వర్ జూబ్లీ వేడుకలకు మూడు రోజుల ముందు డన్‌ఫెర్మిలైన్ అనే గుర్రం ఓక్స్ రేసుకోర్సులో విజయం సాధించింది. అంతకు ముందు 1958లో పాల్ మాల్, 1957లో కారోజా, 1974లో హైక్లీర్ పోటీలలో రాణి గుర్రాలు గెలిచాయి.

అంతకు ముందు 1953లో అంటే ఆమెకు రాణిగా పట్టాభిషేకం జరిగిన సంవత్సరంలో డెర్బీ పోటీల్లో కొద్ది పాటి తేడాతో ఓడిపోయారు. ఆ పోటీల్లో రాణి గుర్రం అవొరియల్ రెండో స్థానంలో నిలిచింది. 2013లో ఆస్కట్ రేసులో ఎస్టిమేట్ లక్ష 72వేల డాలర్లు ప్రైజ్ మనీ గెలిచింది.

గుర్రపు పందేల ద్వారా రాణి బాగానే డబ్బు సంపాందించినప్పటికీ అదంతా గుర్రాల శిక్షణ, ఇతర బాగోగులు చూసుకోవడానికే సరిపోయేది. రేసులో సాధించిన విజయాలన్నీ హార్థిక ఆనందాన్ని తప్ప పెద్దగా ఆర్థిక ప్రయోజనాలను ఇచ్చేవి కావు.

'రాణి కాకుండా ఉండి ఉంటే తప్పకుండా ఆమె గుర్రాలతోనే కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అది ఆమె డీఎన్‌ఏలోనే ఉంది' అని వారెన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)