డోనాల్డ్ ట్రంప్, ఆయన పిల్లలపై చీటింగ్ కేసు: ఆస్తుల విలువ ‘వందల కోట్లు పెంచి’ తప్పుడు లెక్కలు చూపించారంటూ దావా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్న్డ్ డెబస్మాన్ జూనియర్, కైలా ఎప్స్టీన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
డోనాల్డ్ ట్రంప్, ఆయన ముగ్గురు పిల్లలపై మోసం, ఆస్తి తప్పుడు లెక్కల కేసు నమోదైంది. వారి కుటుంబ సంస్థ 'ది ట్రంప్ ఆర్గనైజేషన్'పై దర్యాప్తు తరువాత న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఈ దావా వేశారు.
రుణాలు పొందేందుకు, తక్కువ పన్ను చెల్లించేందుకు రియల్ ఎస్టేట్ విలువలను "వందల కోట్ల కొద్దీ పెంచి" తప్పుడు లెక్కలు చూపించారని ఆరోపించారు.
ట్రంప్ ఆర్గనైజేషన్ 2011-21 మధ్య అనేక మోసాలకు పాల్పడిందని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
అయితే, ట్రంప్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది మరొక రకమైన "వేధింపు" అని పేర్కొన్నారు.
ట్రంప్ పిల్లలు డోనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్ ట్రంప్ సహా, ట్రంప్ ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్న ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ అలెన్ వీసెల్‌బర్గ్, జెఫ్రీ మెక్‌కానీలను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.
ట్రంప్ ఆర్గనైజేషన్‌పై మూడేళ్ల పాటు దర్యాప్తు చేసిన తరువాత సీనియర్ న్యాయవాది, న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఈ దావా వేశారు.
అయితే, ఆమె కార్యాలయానికి క్రిమినల్ కేసులు దాఖలు చేసే అధికారం లేదు. కానీ, ఫెడరల్ ప్రాసిక్యూటర్‌లకు, అంతర్గత రెవెన్యూ సర్వీస్‌కు నేరాలను సూచించగలరు.
"తన పిల్లలు, ట్రంప్ ఆర్గనైజేషన్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సహాయంతో డోనాల్డ్ ట్రంప్ అన్యాయంగా నికర ఆస్తి విలువను కోట్ల కొద్దీ పెంచి, తప్పుడు లెక్కలు చూపించి వ్యవస్థను మోసం చేశారు" అని జేమ్స్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ట్రంప్ టవర్‌లో ఉన్న ట్రంప్ సొంత అపార్ట్మెంట్‌కు కూడా తప్పుడు విలువ కట్టి 327 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 2,625 కోట్లు) చూపించారని ఆమె తెలిపారు.
"న్యూయార్క్ నగరంలో ఏ అపార్ట్మెంట్ కూడా అంత ధరకు అమ్ముడుపోయిన దాఖలాలు లేవు" అని జేమ్స్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
దావాలో ఏముంది?
222 పేజీల దావాలో ప్రధానాంశాలు ఇవి..
- డోనాల్డ్ ట్రంప్, ఆయన ముగ్గురు పిల్లలు కలిసి తమ ఆస్తులు (హోటళ్లు, గోల్ఫ్ కోర్సులు, ఇతర ఆస్తులు) విలువను అన్యాయంగా పెంచి, తప్పుడు లెక్కలు చూపించారు. మెరుగైన రుణాలు, తక్కువ పన్నుల కోసం అబద్ధాలు ఆడారు.
- ఒక దశాబ్ద కాలంలో ట్రంప్, ఆయన కుటుంబం కలిసి ఆర్థిక ప్రత్రాల్లో 200లకు పైగా అబద్ధపు లెక్కలు, తప్పుదారి పట్టించే మూల్యాంకనాలను చూపించారు.
- ఆర్థిక పత్రాలన్నీ కచ్చితంగా ఉన్నట్టు చెబుతూ, ప్రతి డాక్యుమెంటును డోనాల్డ్ ట్రంప్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ లేదా ట్రంప్ ఆర్గనైజేషన్ మాజీ ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ అలెన్ వీసెల్‌బర్గ్ ధృవీకరించారు.
- తప్పుడు లెక్కల కారణంగా ట్రంప్ కుటుంబం 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,008 కోట్లు) లాభం పొందింది. ఆ సొమ్మంతటినీ వెనక్కు రప్పించేదుకు రాష్ట్రం ప్రయత్నాలు చేస్తోంది.
"వైట్ కాలర్ ఆర్థిక నేరం అంటే బాధితులు ఉండరని కాదు. పేరు, పరపతి ఉన్నవారు చట్టాన్ని అతిక్రమిస్తూ తమకు రావలసిన దాని కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే, సాధారణ ప్రజలకు, చిన్న వ్యాపారులకు, పన్ను చెల్లింపుదారులందరికీ న్యాయంగా దక్కాల్సిన వనరులను దూరం చేస్తున్నట్టే లెక్క" అని అటార్నీ జనరల్ అన్నారు.
న్యూయార్క్ నగరంలో వాణిజ్య వ్యాపారలలో డోనాల్డ్ ట్రంప్, ఆయన పిల్లలు అధికారులు లేదా డైరెక్టర్లుగా పనిచేయకుండా నిషేధించాలని జేమ్స్ కోర్టును కోరారు.
ట్రంప్ ఆర్గనైజేషన్ రియల్ ఎస్టేట్ లావాదేవీలను నెరపకుండా అయిదేళ్లపాటు నిషేధం విధించాలని కూడా ఆమె కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డెమోక్రాట్ పార్టీకి చెందిన అటార్నీ జనరల్ జేమ్స్ నవంబర్‌లో జరగే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ట్రంప్ కంపెనీ వ్యాపార విధానాలపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న విచారణను నిలిపివేయడానికి వచ్చిన కనీసం ఒక ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు.
కాగా, ట్రంప్ ఈ దావాను ఖండిస్తూ, నల్లజాతీయురాలైన జేమ్స్ రేసిస్ట్ అని, జాతి వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.
"రేసిస్ట్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ నుంచి ఎదురయిన మరొక వేధింపు ఇది. గవర్నర్‌గా ఆమె పోటీ చేసి ఓడిపోయారు. పబ్లిక్ నుంచి ఆమెకు సున్నా మద్దతు వచ్చింది" అంటూ ట్రంప్ 'ట్రూ సోషల్' సైట్‌లో ఆరోపించారు.
జేమ్స్ 2018లో అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యే ముందు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ఆమె రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ట్రంప్ కుటుంబం గతంలో ఆరోపించింది.
ట్రంప్ "చట్టవిరుద్ధమైన అధ్యక్షుడు" అని పేర్కొంటూ, ఆయనపై కచ్చితంగా దావా వేస్తానని జేమ్స్ గతంలో ప్రతిజ్ఞ చేశారు.
నవంబర్‌లో వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయట్లేదుగానీ. రిపబ్లికన్ పార్టీకి ఆయనే పెద్ద బలం. 2024లో ట్రంప్ మళ్లీ వైట్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.
ట్రంప్ యూనివర్శిటీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక కేసులో పనిచేసిన న్యాయవాది, మాజీ ప్రాసిక్యూటర్ ట్రిస్టన్ స్నెల్ మాట్లాడుతూ, ప్రస్తుత వ్యాజ్యం విచారణకు ఒక సంవత్సరం పట్టవచ్చని బీబీసీతో అన్నారు.
ఈ విచారణ న్యూయార్క్‌లో ట్రంప్ వాపారాలపై పెద్ద వేటు వేసే అవకాశం ఉందని, ట్రంప్ ఆర్గనైజేషన్‌కు కొత్త పెట్టుబడులు, రుణాలు పొందే అవకాశాలు చాలావరకు తగ్గిపోవచ్చని స్నెల్ అన్నారు.
"ఇది కచ్చితంగా ఆయన వ్యాపారానికి దెబ్బే" అని స్నెల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ ఆస్తులకు అబద్ధపు లెక్కలు చూపించారు?
ట్రంప్ ఆస్తులలో అత్యంత ప్రసిద్ధి పిందినవాటిని ఈ దావాలో పేర్కొన్నారు.
న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఆయన సొంత అపార్ట్మెంట్ విలువను అక్రమంగా 327 మిలియన్ డాలర్లకు పెంచి చూపించారని న్యాయవాదులు ఆరోపించారు. అపార్ట్మెంట్ పరిణామాన్ని మూడు రెట్లు పెంచి చూపించారని, ఒక చదరపు అడుగుకి "అసమంజసమైన" ధర చెప్పారని ఆరోపించారు.
ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో క్లబ్ విలువ 739 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,940 కోట్లు) . దాని వాస్తవ విలువ 75 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 602 కోట్లు) దగ్గరగా ఉందని, సంవత్సరానికి 25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 200 కోట్లు) కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జించిందని అటార్నీ జనరల్ కార్యాలయం చెబుతోంది.
జేమ్స్ తన దర్యాప్తులో కనుగొన్న విషయాలను చట్టాన్ని అమలు చేసే ఇతర సంస్థలకు పంపుతానని చెప్పడం ట్రంప్‌కు "అరిష్ట సంకేతం" అని బ్రూక్లిన్ లా స్కూల్ వైస్-డీన్ మిరియం బేర్ అభిప్రాయపడ్డారు.
"న్యూయార్క్ అటార్నీ జనరల్ ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి, ట్రంప్‌పై దావా వేయడమే కాకుండా, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నేర పరిశోధన చేయాలని కోరారు" అని మిరియం బేర్ బీబీసీతో అన్నారు.
ఇది కాకుండా, ట్రంప్‌పై ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయి.
ఆగస్టు 8న ఎఫ్‌బీఐ ట్రంప్ ఇంటిపై సోదాలు నిర్వహించింది. ట్రంప్ క్లాసిఫైడ్ రికార్డుల నిర్వహణపై దర్యాప్తులో భాగంగా మార్-ఎ-లాగోలోని ఆయన ఇంట్లో సోదాలు చేసింది.
2020 అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో జార్జియాలో ఆయనపై ఒక విచారణ జరుగుతోంది.
అయితే, ట్రంప్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు.
ఇవి కూడా చదవండి:
- OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
- రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, మైదానంలో ప్రవర్తన గురించి చర్చ ఎందుకు?
- కాకినాడ: ‘గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు’.. ప్రైవేటు ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- ఏడాదికి 12 వేల కోట్ల వ్యాపారం చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేసిన ‘శ్రీమంతుడు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













