పటగోనియా: ఏడాదికి 12 వేల కోట్ల వ్యాపారం చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేసిన ‘శ్రీమంతుడు’

ఫొటో సోర్స్, CAMPBELL BREWER
- రచయిత, డేనియల్ థామస్
- హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
ప్రముఖ అవుట్‌డోర్ ఫ్యాషన్ బ్రాండ్ పటగోనియా వ్యవస్థాపకుడు, బిలియనీర్ ఇవాన్ చౌనార్డ్ తన కంపెనీని ఒక చారిటబుల్ ట్రస్ట్‌కు దానం చేశారు.
వచ్చే ఏ లాభాన్నైనా బిజినెస్‌లో పెట్టకుండా వాతావరణ మార్పులపై పోరాటం కోసం కేటాయిస్తానని ఆయన చెప్పారు.
దుస్తులకు ఎక్కువ కాలం గ్యారంటీ ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే వాటిని రీపెయిర్ చేయడం వంటి చర్యల కారణంగా ఈ బ్రాండ్ చాలామంది ప్రజల ఆదరణను పొందింది.
'ఈ జాకెట్‌ను కొనకండి.. దీనికి అయ్యే ఖర్చును పర్యావరణం కోసం వినియోగించండి' అంటూ ఈ సంస్థ చేసిన ప్రచారం చాలా పాపులర్ అయింది.
ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్ మొదటి పేజీలో ఇప్పుడు 'మా ఏకైక వాటాదారు భూమి మాత్రమే' అనే వాక్యం కనిపిస్తుంది.
తానెప్పుడూ ఒక వ్యాపారవేత్తను కావాలని అనుకోలేదని ఇవాన్ చౌనార్డ్ ఎప్పుడూ చెబుతుంటారు.
రాక్ క్లైంబింగ్ అంటే విపరీతమైన ఇష్టమున్న ఇవాన్ మొదట తనకు, తన స్నేహితుల కోసం మెటల్ క్లైంబింగ్ స్పైక్స్‌ను తయారు చేసేవారు. ఆ తర్వాత వస్త్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. స్పోర్ట్స్‌వేర్ విభాగంలో అత్యంత విజయవంతమైన బ్రాండ్‌గా ఆయన సంస్థ ఎదిగింది.

ఫొటో సోర్స్, PATAGONIA
1973లో పటగోనియాను స్థాపించారు. ఈ ఏడాది పటగోనియా అమ్మకాల విలువ 1.5 బిలియన్ డాలర్లు (రూ. 11,963 కోట్లు)గా ఉండగా, ఇవాన్ చౌనార్డ్ నెట్ వర్త్ విలువ 1.2 బిలియన్ డాలర్లు (రూ. 9,570 కోట్లు)గా ఉంటుందని అంచనా.
కానీ, ఆయనెప్పుడూ 'సంపన్నుడు' అనే హోదాకు దూరంగా ఉంటారు.
'ఒక బిలియనీర్‌గా కనిపించడం చాలా భయంగా ఉంటుంది'' అని ఆయన న్యూయార్క్ టైమ్స్‌తో అన్నారు.
కంపెనీ పనితీరును బట్టి వాతావరణ మార్పులపై పోరాటానికి ప్రతీ ఏడాది దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ. 797 కోట్లు) విరాళంగా ఇస్తానని ఆయన చెప్పారు.
''భూమిపై ఉండే వనరులు అనంతమైనవి కావు. ఇప్పటికే మనం పరిమితికి మించి భూమి నుంచి వనరులను వాడుకున్నాం.
ప్రకృతిని వాడుకొని సంపదను సృష్టించడానికి బదులుగా మేం పటగోనియా సంపదను, ప్రకృతిని కాపాడటం కోసం ఉపయోగిస్తాం'' అని పేర్కొంటూ తన కంపెనీని వదులుకోవాలనే నిర్ణయం గురించి ఆయన ప్రకటించారు.
ప్రజలు, కేవలం తమకు అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలంటూ పటగోనియా కంపెనీ మార్కెటింగ్ ప్రచారం నిర్వహించేది.

ఫొటో సోర్స్, TOM FROST
అయితే, ఆ కంపెనీ దుస్తుల ధరలు మిగతా వాటి కంటే చాలా ఎక్కువగా ఉండేవి. పటగోనియా కంపెనీ ప్రజలతో ఎక్కువ ఖర్చు పెట్టిస్తోందని విమర్శకులు విమర్శించేవారు.
తమ వస్త్రాల నాణ్యతను వాటి ధరలు ప్రతిబింబిస్తామయని కంపెనీ వాదించేది.
కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే తమ సంస్థ సంవత్సరపు విక్రయాల్లో ఒక శాతాన్ని పర్యావరణ సుస్థిరత కోసం పాటుపడే కార్యకర్తలకు విరాళంగా అందిస్తోంది.
అయితే, అంతకు మించి ఇంకా ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు ఇవాన్, వినియోగదారులకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
పటగోనియా సంస్థను విక్రయించి, వచ్చిన సొమ్మును చారిటీకి విరాళంగా ఇవ్వాలని తొలుత అనుకున్నట్లు ఇవాన్ చెప్పారు.
కానీ, సంస్థను విక్రయించడమంటే దాని నియంత్రణను మరొకరికి అప్పగించడమే అని భావించి, కంపెనీని చారిటీకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
కంపెనీ యాజమాన్య హక్కులను చౌనార్డ్ కుటుంబం రెండు కొత్త సంస్థలకు బదిలీ చేసింది. 'పటగోనియా పర్పస్ ట్రస్ట్' ఇక నుంచి ఈ కంపెనీ యాజమాన్య బాధ్యతలు చూసుకుంటుందని చౌనార్డ్ చెప్పారు. ఈ ట్రస్ట్, ఇవాన్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తుంది.
ప్రతీ ఏడాది ఆర్జించే లాభాలను, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయం చేసేందుకు డివిడెండ్‌గా పంచుతామని ఇవాన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ కొత్త హోం మంత్రి, భారత సంతతికి చెందిన సువెల్లా బ్రేవర్మన్ ఎవరు?
- లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు... ఈ మైనర్లను రేప్ చేసి చంపారనే ఆరోపణలతో ఆరుగురి అరెస్ట్
- క్వీన్ ఎలిజబెత్ 2: వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు క్వీన్ శవపేటిక ఊరేగింపు
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












