Suella Braverman: బ్రిటన్ కొత్త హోం మంత్రి, భారత సంతతికి చెందిన సువెల్లా బ్రేవర్‌మన్ ఎవరు?

సువెల్లా బ్రేవర్‌మన్‌

ఫొటో సోర్స్, Victoria Jones PA Wire Media

ఫొటో క్యాప్షన్, సువెల్లా బ్రేవర్‌మన్‌
    • రచయిత, గగన్ సభర్వాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ ఇటీవలే తన క్యాబినెట్‌ను ప్రకటించారు. భారత సంతతికి చెందిన సువెల్లా బ్రేవర్‌మన్‌కు హోం మంత్రి పదవి ఇస్తున్నట్లు తెలిపారు. ఇదివరకటి బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలోనూ భారత సంతతి వ్యక్తే ఈ పదవి చేపట్టారు. అప్పట్లో ప్రీతీ పటేల్ ఈ పదవిలో కొనసాగారు.

బ్రిటన్‌లోని అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను ‘‘గ్రేట్ ఆఫీసెస్’’గా పిలుస్తారు. ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ, హోం శాఖ వీటిలో ఉంటాయి.

తెరెసా కైఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెరెసా కైఫ్

లిజ్ క్యాబినెట్‌లో భిన్నత్వం కనిపిస్తోంది. ఆమెకు అత్యంత సన్నిహితుడు క్వాజీ కార్టెంగ్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా, థెరెసా కైఫ్‌ను ఆరోగ్య మంత్రిగా, జేమ్స్ క్లెవెర్లీని విదేశాంగ మంత్రిగా నియమించారు.

జేమ్స్ క్లెవెర్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జేమ్స్ క్లెవెర్లీ

బ్రిటన్ ప్రభుత్వంలో తొలిసారి కీలక మంత్రి పదవుల్లో ఒక్క తెల్లజాతి పురుషుడు కూడా లేరు. 2001లో క్యాబినెట్‌ను పరిశీలిస్తే, దానిలో 91 శాతం మంత్రులు మగవారే. పైగా అందరూ శ్వేత జాతీయులే.

లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లిజ్ ట్రస్

గ్రేట్ ఆఫీస్‌కు సువెల్లా

గ్రేట్ ఆఫీసుల్లో ఒకటైన హోం శాఖ మంత్రిగా సువెల్లా బ్రేవర్‌మన్ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఆమె కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం కూడా పోటీపడ్డారు.

42ఏళ్ల సువెల్లా పూర్తి పేరు సు-ఎలెన్-కైసియానా బ్రేవర్‌మన్. ఆమె తండ్రి క్రిస్టీ ఫెర్నాండెస్‌. ఆయన కెన్యా నుంచి బ్రిటన్‌కు వచ్చారు. ఆయన మూలాలు భారత్‌లోని గోవాలో ఉన్నాయి. తల్లి ఉమా ఫెర్నాండెస్.. మారిషస్‌కు చెందిన తమిళ హిందువు. తల్లి మారిషస్ నుంచి, తండ్రి కెన్యా నుంచి 1960ల్లో బ్రిటన్‌కు వలస వచ్చారు.

లండన్‌లోని హ్యారోలో సువెల్లా జన్మించారు. వాయువ్య లండన్‌లోని వెంబ్లీలో ఆమె బాల్యం గడిచింది. తల్లిదండ్రులకు ఆమె ఒక్కరే సంతానం. ఆమె సమర్ధతపై వారికి బాగా గురి ఉండేది.

లండన్‌లోని ఓ హౌసింగ్ అసోసియేషన్‌లో సువెల్లా తండ్రి క్రిస్టీ పనిచేశారు. మరోవైపు నేషనల్ హెల్త్ సర్వీస్‌లో 45ఏళ్లపాటు తల్లి ఉమా నర్సుగా సేవలు అందించారు.

సువెల్లా తల్లిదండ్రులిద్దరూ 1980లలోనే కన్జర్వేటివ్ పార్టీలో చేరారు. వెంబ్లీలోని స్థానిక రాజకీయాల్లో వీరు చురుగ్గా ఉండేవారు. ఉమా కౌన్సెలర్‌గా 16ఏళ్లు పనిచేశారు. మరోవైపు క్రిస్టీ క్యాంపెయినర్‌గా పనిచేశారు.

సువెల్లా బ్రేవర్‌మన్‌

ఫొటో సోర్స్, Stefan Rousseau

తాజా ఎన్నికల సమయంలో ఐటీవీ నెట్‌వర్క్‌తో ఇంటర్వ్యూలో సువెల్లా మాట్లాడారు. ‘‘ఈ దేశం అంటే నాకు చాలా ఇష్టం. నా తల్లిదండ్రులు ఇక్కడకు ఖాళీ చేతులతో వచ్చారు. బ్రిటన్ వారికి జీవితం ప్రసాదించింది. ఈ దేశానికి నేను రుణపడి ఉంటాను. ప్రధానిగా పనిచేసే అవకాశమిస్తే, మెరుగ్గా సేవలందిస్తాను’’అని ఆమె చెప్పారు.

బ్రిటన్ ప్రభుత్వ పాఠశాలలో సువెల్లా చదువుకున్నారు. ఆ తర్వాత స్కాలర్‌షిప్ సంపాదించి, లండన్‌లోని హీథ్‌ఫీల్డ్ స్కూల్‌కు వెళ్లారు. ఆ తర్వాత క్వీన్స్ కేంబ్రిడ్జ్ కాలేజీలో చదువుకున్నారు. పారిస్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో అటార్నీగా పనిచేశారు.

పబ్లిక్ లా, జ్యుడీషియల్ రివ్యూలో సువెల్లా నిపుణురాలు. బ్రిటన్ హోం శాఖ కార్యాలయం కోసం ఆమె పనిచేశారు. ఫిబ్రవరి 2018లో రాయిల్ బ్రేవర్‌మెన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన మెర్సిడీజ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

మే 2015లో కన్జర్వేటివ్ పార్టీ టికెట్‌పై సువెల్లా గెలిచారు. తొలిసారి థెరెసా మే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. 2018 బ్రెగ్జిట్ మంత్రిగా సువెల్లా బాధ్యతలు తీసుకున్నారు. అయితే, అదే ఏడాది నవంబరులో మంత్రి పదవికి ఆమె రాజీనామా చేశారు.

ఫిబ్రవరి 2022లో మళ్లీ బోరిస్ జాన్సన్.. సువెల్లాకు క్వీన్స్ కౌన్సిల్‌లో పనిచేసే అవకాశం ఇచ్చారు.

క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతూ ప్రసూతి సెలవులపై వెళ్లిన తొలి బ్రిటన్ మహిళ సువెల్లా.

సువెల్లా బ్రేవర్‌మన్‌

ఫొటో సోర్స్, Getty Images

భిన్న అంశాలపై సువెల్లా ఏమంటారు?

బ్రెగ్జిట్‌కు సువెల్లా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌తో బ్రిటన్ సంబంధాలపై తనకు చాలా సందేహాలున్నాయని ఆమె ఇటీవల అన్నారు. శరణార్థులకు బ్రిటన్ ఆశ్రయమివ్వాలని ఈయూ కోర్టు చెప్పినప్పుడు ఆమె స్పందించారు.

ట్రాన్స్‌జెండర్ చిన్నారులు తమను సంబోధించే వాచకాల్లో మార్పులు చేయాలని పెట్టుకున్న అభ్యర్థనలను పాఠశాలలు తప్పనిసరిగా స్వీకరించాల్సిన అవసరంలేదని సువెల్లా అన్నారు. ఒక వైద్యుడు సూచిస్తేనే ఆ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

మరోవైపు హోం శాఖను అత్యంత క్లిష్టమైన కార్యాలయంగా అభివర్ణించినప్పుడు కూడా సువెల్లాపై విమర్శలు వెల్లువెత్తాయి.

వీడియో క్యాప్షన్, బ్రిటన్ రాణిగా 70 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎలిజబెత్-2, ఈ 70 ఏళ్ల ప్రయాణం 70 సెకన్లలో

ఆమెకు ఎదురయ్యే సవాళ్లు..

లైను

రువాండా

కెంట్ తీరానికి పెద్దయెత్తున వస్తున్న వలసదారులతో సువెల్లాకు సమస్యలు రావొచ్చు. సువెల్లాకు ముందు ఈ పదవి చేపట్టిన ప్రీతి పటేల్.. శరణార్థులను రువాండాకు పంపిస్తామని అన్నారు. అయితే, ఈ నిర్ణయం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అక్కడకు పంపిస్తే, బ్రిటన్‌కు వచ్చే శరణార్థుల సంఖ్య తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

శరణార్థులు

ప్రస్తుత శరణార్థుల వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విధానం వల్ల ఏటా 2 బిలియన్ పౌండ్లు (రూ.18,313 కోట్లు) ఖర్చు అవుతోంది. ప్రస్తుతం శరణార్థుల దరఖాస్తులు గత రెండు దశాబ్దాల్లో గరిష్ఠానికి చేరాయి. వీటి పరిష్కారంలో చాలా ఆలస్యం జరుగుతోంది.

మరోవైపు ప్రభుత్వ హోటళ్లలో వేల మంది శరణార్థులు ఉన్నారు. వీరిపై రోజుకు నాలుగు మిలియన్ పౌండ్లు (రూ.36.26 కోట్లు) ఖర్చు అవుతోంది. దీనిలో ఒక మిలియన్ పౌండ్లు (రూ.9.15 కోట్లు) అఫ్గాన్ శరణార్థులపైనా ఖర్చు అవుతోంది. అఫ్గాన్‌లో తాలిబాన్ల రాకతో వీరు బ్రిటన్‌కు వస్తున్నారు.

వీడియో క్యాప్షన్, బోరిస్ జాన్సన్: హీరో నుంచి జీరో ఎలా అయ్యారు

నేరాలు

మోసాలు, అత్యాచారాలు, హింసాత్మక దాడులు కూడా బాగా పెరిగాయి. వేల్స్, ఇంగ్లండ్‌లో ఈ కేసులు మరింత పెరిగాయి. ముఖ్యంగా మహిళల భద్రత, లైంగిక నేరాలపై ఆందోళనలు ఎక్కువయ్యాయి. అన్నీ ఖర్చులు పెరగడంతో నేరాల సంఖ్య కూడా పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి.

పోలీసులు

మార్చి 2023 కల్లా 20 వేలమంది కొత్త పోలీసు అధికారులను నియమిస్తామనే హామీని నెరవేర్చాలని సువెల్లాపై ఒత్తిడి ఉండొచ్చు. అయితే, ఈ విషయంలో చాలా సవాళ్లు ఉన్నాయని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది.

పాస్‌పోర్టు

పాస్‌పోర్టుల జారీలోనూ జాప్యం చోటుచేసుకుంటోంది. అయితే, ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రక్రియ మెరుగుపడే అవకాశంలేదనే ఆందోళనలు ఉన్నాయి. జూన్ చివరినాటికి 5,50,000 పాస్‌పోర్టు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

కాబట్టి రానున్న రోజులు, వారాలు, నెలల్లో ఈ సవాళ్లతో కొత్త హోం మంత్రి సువెల్లా చాలా బిజీగా ఉండబోతున్నారు.

లైను

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)