రిషి సునక్ vs లిజ్ ట్రస్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి ఎన్నిక ఎలా జరిగింది?

రిషి సునక్ vs లిజ్ ట్రస్

బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ సోమవారం ముగుస్తుంది. ఆ తరువాత, బ్రిటన్ కాబోయే ప్రధాని ఎవరో తెలుస్తుంది. రిషి సునక్, లిజ్ ట్రస్ ప్రధాని రేసులో ఉన్న సంగతి తెలిసిందే.

సర్వేల ప్రకారం, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌దే పైచేయి అని అంటున్నారు. ఈ రేసులో లిజ్ ట్రస్ స్థిరమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

బ్రిటన్‌లో, పార్టీ సభ్యులే ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిని ఎన్నుకుంటారు. వీరి సంఖ్య బ్రిటన్ జనాభాలో ఒక శాతం కంటే తక్కువగా ఉంటుంది.

కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓట్లు వేసి విజేతను నిర్ణయిస్తారు. ఆ అభ్యర్థి పార్లమెంటు దిగువ సభ 'హౌస్ ఆఫ్ కామన్స్‌' నాయకుడిగా ప్రధాన మంత్రి అవుతారు.

ప్రధాని పదవికి పోటీలో భాగంగా రిషి సునక్, లిజ్ ట్రస్ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో అభ్యర్థులిద్దరినీ వారి, వారి విధానాల గురించి ప్రశ్నించారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు, జర్నలిస్టులను కూడా వీటిల్లో అనుమతించారు. కాకపోతే, డిబేట్లలో ప్రశ్నలు అడిగే అవకాశం జర్నలిస్టులకు ఇవ్వలేదు. పార్టీ వెబ్‌సైట్‌లో వీటి ప్రసారం జరిగింది.

రిషి సునక్ vs లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, Magnum Photos

ఓట్ల ప్రక్రియ ఏమిటి?

కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు సెప్టెంబర్ 2, శుక్రవారం వరకు ఓటు వేయవచ్చు. 2022 జూన్ 3కు ముందు పార్టీలో చేరిన సభ్యులే ఓటు వేయగలరు.

సభ్యులు పోస్టు లేదా ఆన్‌లైన్ ద్వారా తమ ఓటు వేయవచ్చు.

సభ్యులందరూ రెండుసార్లు ఓటు వేయవచ్చని, రెండోసారి పోలైన ఓట్లను మాత్రమే లెక్కిస్తారని మొదట నిర్ణయించారు. అయితే, అలా చేయడం వల్ల ఈ ప్రక్రియలో విదేశీయులు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ హెడ్ క్వార్టర్స్‌‌ కోసం పని చేస్తున్న సైబర్ సెక్యూరిటీ సెంటర్ హెచ్చరించింది. దాంతో, ఒకసారే ఓటు వేయడానికి అనుమతించాలని కన్జర్వేటివ్ పార్టీ నిర్ణయించింది.

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బోరిస్ జాన్సన్

యూకే ప్రధానిని కేవలం 1,60,000 మాత్రమే ఎందుకు ఎన్నుకుంటారు?

బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానిగా, కన్జర్వేటివ్ నాయకునిగా పదవి నుంచి వైదొలిగారు. అయితే, ఆయన రాజకీయ వారసుడిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన అవసరం లేదు.

కన్సర్వేటివ్ పార్టీకి చెందిన 1,60,000 మంది సభ్యులు మాత్రమే బ్రిటన్ ప్రధానిని తిరిగి ఎన్నుకుంటారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో 4.7 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోగా, దేశ ప్రధానిని కేవలం 1,60,000 మంది మాత్రమే ఎందుకు ఎన్నుకుంటున్నారనే ప్రశ్న తలెత్తుతుంది.

దీనికి సమాధానం విభిన్నమైన యూకే రాజకీయ విధానంలోనే ఉంది. బ్రిటన్‌లో రెండవ సారి ప్రధానిని ఎన్నుకునేందుకు పార్టీ సభ్యత్వం ఉన్న వారు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొంటారు.

యూకేలో ఇలా జరగడం మొదటిసారి కాదు. కొన్ని సార్లు కొత్త నాయకులను అతి తక్కువ మంది సభ్యులు మాత్రమే ఎన్నుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

పోటీలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగిలేవరకూ ఈ ఓటింగ్ సాగుతుంది. అన్ని రౌండ్లు ముగిసే సమయానికి లిజ్ ట్రస్, యూకే విదేశాంగ కార్యదర్శి రిషి సునక్ పోటీలో మిగిలారు.

లిజ్ ట్రస్, రిషి సునక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లిజ్ ట్రస్, రిషి సునక్

కొత్త కన్సర్వేటివ్ నాయకుడిని ఎలా ఎన్నుకుంటారు?

ఇద్దరు అభ్యర్థులు బరిలో మిగిలిన తర్వాత కన్సర్వేటివ్ పార్టీలో సాధారణ సభ్యులు ఓట్లు వేస్తారు. బ్యాలట్ ద్వారా ఈ ఎన్నికలు జరుగుతాయి.

కానీ, ఓటింగ్‌లో పాల్గొంటున్న 1,60,000 మంది సభ్యులు బ్రిటిష్ ఓటర్ల సంఖ్యలో కేవలం 0.3 % మాత్రమే.

గతంలో ఈ విధానం పట్ల చాలా ఫిర్యాదులు కూడా వచ్చాయి. కానీ, యూకే ప్రధాని వారి సొంత రాజకీయ పార్టీ సభ్యులు, మద్దతుదారులతో మాత్రమే ఎన్నికవ్వడం సాధారణ విషయం.

గత అర్ధ శతాబ్దంలో, దేశంలో సగానికి పైగా మంది నాయకులను సాధారణ ఓటర్లు కాకుండా తమ సొంత రాజకీయ పార్టీల వారే ఎన్నుకున్నారు.

బ్రిటిష్ రాజకీయ వ్యవస్థలో దేశాధినేతలు పదవీ కాలం ముగియక ముందే వారి సొంత పార్టీల వారే తొలగించే అవకాశాలు చాలా ఎక్కువ.

కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు

శ్వేతజాతి వారే అధికం

రాజకీయ పార్టీల సభ్యులు దేశంలో ఉన్న ఓటర్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పేందుకు లేదు. ఇతర ప్రధాన పార్టీల మాదిరిగానే కన్సర్వేటివ్ పార్టీలో సభ్యులు కూడా ఎక్కువగా వయసులో పెద్దవాళ్ళు, మధ్య తరగతికి చెందిన వారు, శ్వేత జాతికి చెందిన వారున్నారు.

"ఈ ఎన్నికల్లో బ్రిటన్ ప్రధానిని ఎంపిక చేసుకుంటున్నవారు దేశంలో ఓటర్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదు" అని క్వీన్ మేరీ యూనివర్సిటీ హెడ్ ప్రొఫెసర్ టిం బేల్ అన్నారు.

"ఈ ఓటర్లలో జాతి వైవిధ్యం లేదు. వీరిలో ఎక్కువ మంది దక్షిణ ఇంగ్లాండ్‌కు చెందిన వారున్నారు. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ఉన్నారు. అత్యధికులు ఉన్నత వర్గాలకు చెందిన వారున్నారు. ప్రతీ 10 మందిలో నలుగురు 65 ఏళ్ళు పైబడిన వారుండగా సగటున 50ఏళ్ళు పైనున్న వారే ఎక్కువగా ఉన్నారు" అని అన్నారు.

"ఒక్క మాటలో చెప్పాలంటే నాయకులను ఎన్నుకునే (సెలెక్టోరేట్) ఓటర్లు (ఎలక్టోరేట్)కు పూర్తి భిన్నంగా ఉందని చెప్పొచ్చు" అని అన్నారు.

యూకేలో చాలా రాజకీయ పార్టీల సభ్యులు మధ్య తరగతికి చెందిన వారే అని బేల్ చేసిన అధ్యయనం చెబుతోంది. కానీ, కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల్లో మధ్య తరగతికి చెందినవారు ఇతర పార్టీల్లో కంటే ఎక్కువగా ఉన్నారు.

యూకేలో ప్రధాన పార్టీల్లో నల్ల జాతీయులు, ఇతర మైనారిటీ వర్గాలకు చెందిన వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది.

బేల్ బృందం 2018లో సమర్పించిన నివేదిక ప్రకారం.... లేబర్, లిబరల్ డెమోక్రాట్ పార్టీలలో 96 శాతం సభ్యులు బ్రిటిష్ శ్వేత జాతీయులు ఉండగా కన్సర్వేటివ్ పార్టీలో వారి సభ్యత్వం 97% ఉంది.

యూకేలో సొంత రాజకీయ పార్టీ సభ్యులే ప్రధాన మంత్రిని ఎంపిక చేసుకోవడం ఇది మొదటి సారీ కాదు, అలా అని ఇదే ఆఖరు సారి కూడా అవ్వదు.

వీడియో క్యాప్షన్, కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పదవికీ, బ్రిటిష్ ప్రధాని పదవి పోటీలో రిషి సునక్,లిజ్ ట్రస్

అత్యల్ప ప్రాతినిధ్యం

గతంలో పదవీ కాలం ముగియక ముందే మధ్యలో ఎంపిక చేసుకున్న ప్రధానిని ఎన్నుకున్న సభ్యుల సంఖ్య మరింత తక్కువగా ఉండేది.

కన్సర్వేటివ్ పార్టీలో 1998 వరకు, లేబర్ పార్టీలో 1981వరకు కేవలం పార్లమెంట్ సభ్యులే కొత్త నాయకులను ఎన్నుకునే అవకాశముండేది.

దీంతో కొన్ని వందల మంది సభ్యులు మాత్రమే కొత్త నాయకులను ఎన్నుకునే అవకాశం ఉండేది. వీరు యూకే మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పలేం.

ఈ ప్రక్రియ కూడా ప్రజాస్వామికంగా జరిగేది కాదు. 1965 వరకు కన్సర్వేటివ్ సభ్యులు కొత్త నాయకుని ఎన్నుకునేందుకు ఎన్నికలు కూడా నిర్వహించేవారు కాదు. కొంత మంది అభ్యర్థులలోంచి ఒక విజేతను ఎంపిక చేసుకునేవారు. కొత్తగా నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు తగిన వ్యక్తి గురించి సీనియర్ పార్టీ నాయకులు తమలో తాము చర్చించుకుని ఒకరిని ఎంపిక చేసేవారు.

మార్గరెట్ థాచర్
ఫొటో క్యాప్షన్, మార్గరెట్ థాచర్

ప్రేమ, ద్వేషాలతో నిండిన భావోద్వేగాలు

బ్రిటిష్ రాజకీయ పార్టీలకు తమ నాయకులను అధికారంలోంచి తప్పించడం పట్ల ఉన్న ఇష్టంతోనే బ్రిటిష్ ప్రధానమంత్రులను విభిన్నంగా ఎంపిక చేసుకోవడానికి ఒక కారణమై ఉండొచ్చు.

2010లో కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డేవిడ్ కేమరాన్, థెరెసా మే, బోరిస్ జాన్సన్ తమ సొంత రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడితో రాజీనామాను సమర్పించాల్సి వచ్చింది. బ్రిటిష్ రాజకీయాల్లో దిగ్గజాలు కూడా దీనికి అతీతం కాదు.

గత వందేళ్లలో కన్సర్వేటివ్ పార్టీకి చెందిన మార్గరెట్ థాచర్, లేబర్ పార్టీకి చెందిన టోనీ బ్లెయిర్ మాత్రమే అధికారంలో ఒక దశాబ్ద కాలం పైగా పదవిలో కొనసాగారు. కానీ, వారు కూడా సొంత పార్టీలో తలెత్తిన వర్గ పోరుతో పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

పార్టీ సభ్యులు తమ నాయకులకు వెన్నుపోటు పొడిచినా కూడా బహిరంగంగా మాత్రం వారి పై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.

పార్లమెంటులో బోరిస్ జాన్సన్ చేసిన ఆఖరు ప్రసంగానికి దద్దరిల్లేలా చప్పట్లు కొట్టి, ప్రసంగం ముగిసిన వెంటనే సభ్యులంతా నిలబడి ఆయనకు అభివాదం చేశారు. చప్పట్లు కొట్టడాన్ని ప్రోత్సహించని ఆయన పార్టీ సభ్యులు హౌస్ ఆఫ్ కామన్స్ లో ఇలా ప్రవర్తించడం చాలా అరుదు.

అంతకు కొన్ని వారాల ముందే బోరిస్ ఈ దేశానికి నాయకత్వం వహించేందుకు అర్హుడు కాదంటూ పార్టీ సభ్యులు ఆయనను పదవిలోంచి తప్పించేందుకు బహిరంగంగా పోరాడారు.

ఆయన రాజకీయ వారసులు కూడా తమ పదవీ కాలం కూడా జాన్సన్ మాదిరిగానే ప్రేమ, ద్వేషంతో మిళితమైన భావోద్వేగాలతో కూడుకుని ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరముంది.

వీడియో క్యాప్షన్, బోరిస్ జాన్సన్: హీరో నుంచి జీరో ఎలా అయ్యారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)