లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు... ఈ మైనర్లను రేప్ చేసి చంపారనే ఆరోపణలతో ఆరుగురి అరెస్ట్

ఫొటో సోర్స్, VIDEO GRAB/TWITTER
ఈ కథనంలోని కొన్ని వివరాలు పాఠకుల మనసులను కలచివేయవచ్చు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీ జిల్లాలో దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఘటన కలకలం రేపింది. ఇద్దరూ మైనర్ బాలికలే. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. అయితే, బాలికలను అపహరించినట్టు లేదా ఊరి బయటకి బలంతంగా ఎత్తుకెళ్లినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పోలీసులు అంటున్నారు.
బాలికల మరణవార్త వెలుగుచూడగానే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు గంటల తరబడి రోడ్డుపై బైఠాయించారు.
ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ప్రశ్నిస్తూ ఇతర రాజకీయ పార్టీలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని నిలదీశాయి.
ఇది ప్రభుత్వ వైఫల్యమని మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ఆరోపించారు.
గతంలో కూడా లఖీంపుర్ ఖీరీ వార్తల్లో నిలిచింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు రైతులపై జీపు ఎక్కించారన్న ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఈ జిల్లా ముఖ్యాంశాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోయారు.

ఫొటో సోర్స్, ANI
తాజా కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు?
లఖీంపుర్ ఖీరీ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ సుమన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, "నిందితులు మైనర్ బాలికలిద్దరినీ బలవంతంగా తీసుకెళ్లలేదు. ప్రధాన నిందితుడు ఈ అమ్మాయిల ఇంటి దగ్గరే ఉంటాడు. అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఈ అబ్బాయే ఆ అక్కచెల్లెళ్లిద్దరినీ మరో ముగ్గురు అబ్బాయిలకు పరిచయం చేశాడు. ఈ నలుగురు కాకుండా మరో ఇద్దరిని సాక్ష్యాలను నాశనం చేసినందుకు అరెస్టు చేశాం" అని చెప్పారు.
బుధవారం రాత్రి ఒంటిగంటకు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసిందని, మరికొద్దిసేపట్లో పోస్ట్‌మార్టం జరుగుతుందని పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ముగ్గురు వైద్యులతో కూడిన ప్యానెల్ పోస్టుమార్టం నిర్వహిస్తుంది. దీన్ని వీడియో తీస్తారు.
నేరం ఏమిటి?
నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికల వయసు 15 ఏళ్లు, 17 ఏళ్లుగా చెబుతున్నారు.
ముగ్గురు వ్యక్తులు బాలికలపై అత్యాచారం జరిపి, ఆపై వారిని హత్య చేసి మృతదేహాలను చెట్లకు వేలాడదీశారని గ్రామస్థులు, చనిపోయిన బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
"లఖీంపుర్ ఖీరీలోని ఒక గ్రామం వెలుపల ఉన్న పొలంలో చెట్టుకు వేలాడుతున్న ఇద్దరు మైనర్ బాలికల మృతదేహాలు కనిపించాయి. వాళ్ల చున్నీలతోనే వాళ్లను ఉరేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, శవాల ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. పోస్ట్‌మార్టం తరువాత ఇతర వివరాలు తెలుస్తాయి. దర్యాప్తు కొనసాగుతుంది" అని లక్నో రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లక్ష్మీ సింగ్ చెప్పారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోపంతో గ్రామస్థులు నిఘాసన్ కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిఘాసన్ కూడలిలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
దోషులను త్వరలోనే పట్టుకుంటామని ఉత్తరప్రదేశ్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.
లఖీంపుర్ ఖీరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ సుమన్ సహా కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు నిరసనకారులతో మాట్లాడుతూ, వారికి నచ్చజెబుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
బలవంతంగా పోస్టుమార్టంకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు ఆధారంగానే కేసు దర్యాప్తు చేస్తామని చెప్పారు. కుటుంబ సభ్యుల సమ్మతితో, వారి సమక్షంలోనే సీనియర్ వైద్యులతో కూడిన ప్యానెల్ బాలికల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తుందని తెలిపారు.
ఎస్పీ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ, బాధిత కుటుంబం న్యాయమైన డిమాండ్లన్నీ అంగీకరిస్తామని, అయితే, శాంతిభద్రతల పరిరక్షణ మా బాధ్యత అని అన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
"ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించాం. నిందితుడు జునైద్‌ను ఎన్‌కౌంటర్‌లో పట్టుకున్నారు. ఈ సందర్భంలో అతడి కాలికి బుల్లెట్ తగిలింది" అని ఎస్పీ సంజీవ్ సుమన్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మృతుల కుటుంబం ఏమంటోంది?
బాలికల మృతదేహాలు చెరుకు తోటలోని ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. బాలికల తల్లి స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, తన కూతుళ్లను హత్య చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు.
పక్క గ్రామం నుంచి ముగ్గురు యువకులు మోటార్‌సైకిల్‌పై వచ్చి, తమ ఇంటి బయటే గడ్డి కోస్తున్న బాలికలను బలవంతంగా బండిపై ఎక్కించుకుని తీసుకెళ్లారని ఆరోపించారు.
గతంలో బదాయూ జిల్లాలోని ఓ గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ రెండింటినీ పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
2014లో బదాయూ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు దళిత అక్కచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఆ బాలికలపై సామూహిక అత్యాచారం, హత్యపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసింది.
అఖిలేశ్ యాదవ్, మాయావతి, ప్రియాంక గాంధీ ఏమన్నారు?
లఖీంపుర్ ఖీరీ ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేస్తూ, "నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దళిత అక్కచెల్లెళ్ల కిడ్నాప్, హత్య, అనుమతి లేకుండా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని బాలికల తండ్రి పోలీసులపైచేసిన ఆరోపణ.. ఈ మొత్తం వ్యవహారం చాలా తీవ్రమైనది. గతంలో లఖీంపుర్ రైతులపై జీపు ఎక్కించిన ఘటన, ఇప్పుడు దళిత బాలికల హత్య, హథ్‌రస్ బాలిక హత్య ఘటనను పునరావృతం చేస్తున్నాయి" అని అన్నారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేస్తూ, "లఖీపుర్ ఖీరీలో ఇద్దరు దళిత బాలికల అత్యాచారం, హత్య ఘటన హృదయవిదారకం. ఇలాంటి విచారకరమైన, అవమానకరమైన సంఘటనలను ఎంత ఖండించినా కూడా తక్కువే. యూపీలోని నేరస్థులు నిర్భయంగా తిరుగుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ప్రాధాన్యాలు తప్పుగా ఉన్నాయి" అన్నారు.
ప్రియాంక గాంధీ కూడా జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై క్రూరమైన నేరాలు పెరుగుతున్నాయన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
- జ్ఞాన్వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?
- SCO Summit: ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఏం మాట్లాడబోతున్నారు?
- బీజేపీ నేత, మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు అయిదేళ్ల జైలు శిక్ష, ఆమె భర్తకు కూడా...అసలు కేసు ఏంటి?
- ఊబకాయులు తెలంగాణలో ఎక్కువా, ఆంధ్రలో ఎక్కువా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏం చెప్పింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














