ఒబేసిటీ: ఊబకాయులు తెలంగాణలో ఎక్కువా, ఆంధ్రలో ఎక్కువా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏం చెప్పింది

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మా అమ్మాయికి రోజూ నాన్‌వెజ్ ఫుడ్ కావల్సిందే, కాయగూరలు వండిన రోజు భోజనమే చేయదు"

"మా అమ్మాయికి నెలసరి సక్రమంగా ఉండటం లేదు".

"పెళ్ళై ఐదేళ్లయినా పిల్లలు పుట్టడం లేదు. ఇన్‌ఫెర్టిలిటీ చికిత్స కూడా ఇప్పటికే మూడు సార్లు విఫలమయింది"

"ఇవన్నీ నా దగ్గరకు వైద్యానికొచ్చేవారు చెప్పే సమస్యలు" అని హైదరాబాద్‌కు చెందిన లాప్రోస్కోపిక్, బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ కోన బీబీసీతో చెప్పారు.

ఈ సమస్యలెందుకొస్తున్నాయి?

భారతదేశంలో ఊబకాయంతో బాధపడేవారు 2015-16లో 21% మంది ఉండగా, 2019-20నాటికి 24 శాతానికి పెరిగినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 5 నివేదిక చెబుతోంది.

గత సర్వేతో పోలిస్తే ఊబకాయుల సంఖ్య 3.3% పెరిగిందని హైదరాబాద్‌కు చెందిన కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ విశ్లేషణ చెబుతోంది.

పురుషుల్లో 19% మంది ఉండే ఊబకాయులు 23 శాతానికి పెరిగారు.

15-49 మధ్య వయసు వారిలో పురుషుల కంటే మహిళల్లోనే ఊబకాయం ఎక్కువగా ఉన్నట్లు సర్వే చెబుతోంది. దేశవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడే మహిళలు 24% మంది ఉండగా, పురుషులు 22.9% మంది ఉన్నారు.

ఉత్తరాదితో పోలిస్తే, దక్షిణాదిలో ఊబకాయుల సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. "ఇది ఆందోళన కలిగించే విషయం" అని డాక్టర్ లక్ష్మి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఊబకాయుల సంఖ్య ఎక్కువగా ఉంది. కేరళ, తమిళనాడులో కూడా ఇదే మాదిరి పరిస్థితి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో 36% మంది మహిళలు, 31% మంది పురుషులు ఊబకాయంతో ఉన్నారు.

ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ (మహిళలు 30.1%, పురుషులు (32.3%) కాస్త మెరుగైన స్థితిలో ఉంది. తెలంగాణాలో ఊబకాయంతో ఉండే మహిళల సంఖ్య కూడా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే తక్కువగానే ఉంది.

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఊబకాయుల సంఖ్య 9.5 శాతం పెరగగా, తెలంగాణాలో మాత్రం 2% పెరుగుదల మాత్రమే కనిపించింది.

గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాల్లో ఊబకాయుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

డాక్టర్ లక్ష్మీ కోన

ఫొటో సోర్స్, DR LAKSHMI KONA

మహిళల్లో ఊబకాయం ఎందుకు ఎక్కువగా ఉంటోంది?

మహిళల్లో ఊబకాయం పెరగడానికి, దాని వల్ల తలెత్తే సమస్యల గురించి డాక్టర్ లక్ష్మీ కోన బీబీసీకి వివరించారు.

జీవనశైలి

ఊబకాయం ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పెరుగుతోందని అంటూ, ఇందుకు ఆధునిక జీవన శైలి ప్రధాన కారణమని అన్నారు.

"వ్యాయామం చేసేందుకు ఎన్ని సౌకర్యాలు, పార్కులు, జిమ్‌లు, వాకింగ్ ఏరియాలు ఉన్నప్పటికి, వ్యాయామం చేయలేకపోవడానికి 1001 కారణాలను చెబుతారు".

మీట నొక్కితే అరచేతిలోకి అన్నీ చేరుతుండటంతో శారీరక శ్రమ కరువవుతోంది.

కోవిడ్ మహమ్మారి కూడా చాలా మంది జీవన శైలిని మార్చేసింది. 'వర్క్ ఫ్రమ్ హోమ్' అవకాశాలతో మంచం మీద నుంచే బ్రేక్ ఫాస్ట్ చేసి ల్యాప్ టాప్ లను పట్టుకుని పనిలో కూర్చుంటుంటే ఊబకాయం రాక ఏమవుతుందని ప్రశ్నించారు.

ఫుడ్ జాయింట్

ఫొటో సోర్స్, Getty Images

అడుగుకొక ఫుడ్ జాయింట్

రోడ్డు మీదకు వెళితే ప్రతీ పది అడుగులకు ఒక ఫుడ్ స్టాల్ లేదా రెస్టారంట్ కనిపిస్తోంది. కష్టపడాల్సిన అవసరం లేకుండానే రకరకాల ఆహార పదార్ధాలు లభిస్తున్నాయి.

"మార్కెట్ లో లభించే ఆహార పదార్ధాల్లో సగానికి పైగా ఆరోగ్యానికి హాని చేసే కార్బోహైడ్రేట్లతో కూడుకున్నవే" అని అన్నారు.

"ఒక 30ఏళ్ల క్రితం ఇన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉండేవా? కేకులు, స్వీట్లు, పిజాలు, ఐసు క్రీమ్ లు, పిజా కార్నర్‌లు అడుగుకొకటి ఉండేవా?" అని అడిగారు.

రోజంతా ఉద్యోగం చేసి, మార్కెట్ నుంచి కూరలు తెచ్చుకుని వండుకోవడం కంటే కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవడం సుఖం అని భావిస్తున్నారు. "క్షణిక సుఖం కోసం ఆలోచిస్తే, దీర్ఘకాలంలో జరిగే నష్టాన్ని ఎదుర్కోక తప్పదు" అని హెచ్చరించారు.

శరీరానికి మేలు చేసే ఆహారం కంటే నోటికి రుచిగా ఉండే ఆహారం తినేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మరొక కారణం.

జంక్ ఫుడ్ తినడాన్ని ఆధునికత అని అనుకోవడం కూడా ఊబకాయులు పెరగడానికి మరొక కారణం

ఫొటో సోర్స్, Getty Images

జంక్ ఫుడ్

జంక్ ఫుడ్ తినడాన్ని ఆధునికత అని అనుకోవడం కూడా ఊబకాయులు పెరగడానికి మరొక కారణం అని అంటారు డాక్టర్ లక్ష్మి.

"పొద్దున్న లేవడాన్ని పాత చింతకాయ అలవాటులా, ఇంట్లో పనులు చేయడాన్ని తక్కువగా చూస్తున్నారు. వీటన్నిటికీ తోడు, ఉద్యోగాలు చేసే తల్లితండ్రులు ఇంట్లో వండి పెట్టలేక పిల్లలడిగిన ఫుడ్ ను ఆర్డర్ చేసేందుకు అనుమతించడం కూడా అనేక సమస్యలకు దారి తీస్తోంది" అని అన్నారు.

"కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం తింటూ వ్యాయామం చేయకుండా, ఓటీటీలకు, వీడియో గేమ్స్‌కు అతుక్కుపోతుంటే బరువు పెరగక తగ్గుతారా?" అని ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, అందానికి- ఊబకాయానికి సంబంధం ఉందా ?

"పొట్ట చెత్త బుట్ట కాదు"

"మహిళల శరీరంలో జరిగే హార్మోన్ మార్పుల వల్ల కూడా త్వరగా ఊబకాయం పేరుకుపోయే అవకాశమెక్కువ" అని అన్నారు.

"చాలా మంది మహిళలు ఇంట్లో వండిన ఆహారం వృథా అయిపోతుందనే ఉద్దేశ్యంతో అవసరాన్ని మించి మిగిలిన ఆహారాన్ని తినేస్తూ ఉంటారు. మన పొట్ట చెత్త తొట్టె కాదనే విషయం గ్రహించాలి" అని అన్నారు.

"బరువు పెరుగుతున్నావని హెచ్చరించడం బాడీ షేమింగ్ కాదు"

పిల్లలు బరువు పెరుగుతున్నప్పుడు హెచ్చరిస్తే దానిని బాడీ షేమింగ్ అని అంటున్నారు. దీనినొక సామాజిక సమస్యగా చూపిస్తుండటంతో బరువు పెరుగుతున్నావు, జాగ్రత్త అని చెప్పేందుకు కూడా సంశయిస్తున్నారు" అని అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

సీతారామంలో నటించిన మృణాల్ ఠాకూర్ కూడా గతంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యారు. ఆమె ట్రోలర్లకు సమాధానమిచ్చేందుకు కిక్ బాక్సింగ్ చేస్తున్నట్లు ఫోటో పెట్టారు. అయితే, ఆమె అభిమానులు ఆమెను ప్రశంసించినప్పటికీ కొంత మంది ఆమెను బాడీ షేమ్ చేశారు.

"నీ వీపు భాగం కుండలా ఉంది" అంటూ ఒక యూజర్ ట్రోల్ చేశారు. ఇలాంటి వాటికి ఆమె సున్నితంగా "థాంక్ యూ " అని సమాధానమిచ్చారు. కొన్ని ట్రోల్స్ కు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.

"పని గట్టుకుని బాడీ షేమింగ్ చేయడం తప్పే కానీ, పెరుగుతున్న బరువు గురించి హెచ్చరించడంలో తప్పు లేదు అని అంటారు డాక్టర్ లక్ష్మి. ఎవరినైనా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా బాడీ షేమింగ్ చేయడం కూడా సరైంది కాదు" అని అన్నారు.

"శరీరం ఆకారం గురించి మాట్లాడకూడదనే అంశాన్ని ప్రచారంలోకి తేవడంతో యువత ఎవరు చెప్పినా వినేందుకు సిద్ధంగా ఉండటం లేదు" అని అన్నారు.

"ఎంత బరువు పెరిగినా వారికి తగిన ప్లస్ సైజ్ దుస్తులు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. దీంతో, లావు పెరిగితే తమకు సరిపోయే దుస్తులు దొరకవేమో అనే చింత కూడా ఉండటం లేదు" అని అన్నారు.

ఊబకాయం వల్ల అమ్మాయిల్లో పీసీఓడీ, మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటిస్, గుండెపోటు లాంటి సమస్యలు వచ్చే అవకాశముంది.

ఫొటో సోర్స్, SPL

ఊబకాయం వల్ల వచ్చే సమస్యలేంటి?

ఊబకాయం ఉన్న మహిళల్లో ఎక్కువగా పుదుచ్చేరి లో 46%, తమిళనాడు, పంజాబ్ (41%, కేరళ, అండమాన్ నికోబార్ దీవుల్లో 38% ఉన్నారు. దిల్లీలో 41శాతం మంది మహిళలు, చండీగఢ్ లో 44% మంది ఊబకాయంతో ఉన్నారు.

ఊబకాయం వల్ల అమ్మాయిల్లో పీసీఓడీ, మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటిస్, గుండెపోటు లాంటి సమస్యలు వచ్చే అవకాశముంది.

57% పైగా మహిళలు 48% పైగా పురుషులకు మెటబాలిక్ సమస్యలు తలెత్తే విధంగా వారి వెయిస్ట్ హిప్ రేషియో ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు చెబుతున్నాయి.

"రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది. కొన్ని సార్లు ఊబకాయం లేకుండా కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. యుక్త వయసు

మహిళల్లో ముఖ్యంగా ఊబకాయం వల్ల సంతానోత్పత్తి సమస్యలు కూడా వస్తాయి" అని చెప్పారు.

"గ్రామాల్లో కూడా సంతాన సాఫల్య కేంద్రాలు రావడానికి ఊబకాయం కూడా కారణమే" అని అంటారు లక్ష్మి

చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండె పోటుకు గురవ్వడానికి ఊబకాయం కూడా ఒక కారణం అని చెప్పారు.

"ఇవి కాకుండా, ప్రసవంలో సమస్యలు కూడా తలెత్తుతాయి" అని అన్నారు.

"మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు మధుమేహంతో ఉంటే బిడ్డ కూడా మధుమేహంతో పుట్టే అవకాశముంది. ఇది భావితరాలను కూడా నాశనం చేయడమే" అని అన్నారు.

"ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆయుఃప్రమాణం తగ్గి చిన్న వయసులోనే చాలా మంది మరణించడానికి మెటబాలిక్ సిండ్రోమ్ కూడా ఒక కారణం" అని అన్నారు.

వ్యాయామం చేయడం ద్వారా ఊబకాయానికి కొంత వరకు చెక్ పెట్టవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఎలా తగ్గించుకోవచ్చు?

ఆహార అలవాట్లను మార్చుకోవడం, ఇంట్లో వండిన కొవ్వు , పిండి పదార్ధాలు తక్కువగా ఉండే ఆహరం తీసుకోవడం, జీవన శైలిని మార్చుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఊబకాయానికి కొంత వరకు చెక్ పెట్టవచ్చని చెప్పారు.

అయితే, పరిమితిని మించి బరువు పెరిగిపోతే మాత్రం వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని సూచించారు.

కీటో, ఇంటర్‌మిటెంట్ డైట్‌లు పని చేస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images

బారియాట్రిక్ సర్జరీలు, కీటో, ఇంటర్ మిటెంట్ డైట్ లు పని చేస్తాయా?

పరిమితిని మించి బరువు పెరిగిపోతే ఎటువంటి డైట్ చేసినా వైద్య లేదా న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలోనే జరగాలి తప్ప ఇంటర్నెట్ చూసో లేదా పక్కవారిని చూసో డైటింగ్ మొదలుపెట్టకూడదని హెచ్చరించారు.

"ముఖ్యంగా పక్కవారికి పని చేసిన డైట్ మీ శరీరానికి కూడా సరిపోతుందని మాత్రం అనుకోకండి" అని అన్నారు.

"బారియాట్రిక్ సర్జరీ బరువు తగ్గించుకోవడానికి షార్ట్ కట్ కాదు. 40 - 50 కేజీల బరువు తగ్గాల్సిన వారు బారియాట్రిక్ సర్జరీకి వెళ్లొచ్చు" అని సూచించారు.

"ఈ సర్జరీ అయిన తర్వాత కూడా డైట్, వ్యాయామం పట్ల దృష్టి వహించాలి. సర్జరీ చేయించుకుని పాత అలవాట్లను మొదలుపెడితే సమస్య మొదటికి రావడం ఖాయం" అని చెప్పారు.

"18ఏళ్ళు పైబడిన వారు, తగినంత ఎముకల బరువు ఉన్నవారికి, బారియాట్రిక్ సర్జరీ చేయవచ్చు."

"డైట్, వ్యాయామం, లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా తగ్గించుకోగలిగే వారికి మాత్రం ముందు వాటి ద్వారానే బరువు తగ్గించుకోమని సూచిస్తాం" అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఊబకాయులకు కరోనా ముప్పు అధికం

"ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. కానీ, పాత కాలంలో అందరికీ చౌకగా అందుబాటులో ఉండే సేంద్రియ కూరగాయలు, తాజా వస్తువుల ధరలు ప్రస్తుతం ఆర్గానిక్ అనే పేరుతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. మరో రెండు మూడు తరాలు దెబ్బ తిన్న తర్వాత సమస్య అర్ధం కావచ్చేమో" అని డాక్టర్ లక్ష్మి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)