నిద్ర తగ్గితే వచ్చే చిక్కులివే...

నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

ఒక వ్యక్తిగా మీరెంత దానశీలురు అనే విషయాన్ని ఏది నిర్ధారిస్తుంది? మీ దగ్గర ఉన్న ధనం కావొచ్చు, మీరు చూపించే జాలి గుణం కావొచ్చు, లేదా మీరు పాటించే విలువలు కూడా మీ దానగుణాన్ని చూపించవచ్చు.

కానీ, యూసీ బెర్కిలీ చేసిన ఒక కొత్త అధ్యయనం మాత్రం అసాధారణ విషయాన్ని చెప్పింది. మీ నిద్ర తీరుతెన్నులు, మీరు ఇతరులకు సహాయం చేయాలనే అంశంపై ప్రభావం చూపగలదని ఈ అధ్యయనం సూచించింది.

నిద్రలేమి వల్ల ఇతరులకు దానం చేయాలనే గుణం తగ్గుతుందని ఈ అధ్యయనంలో తేలింది.

అలసిపోయినప్పుడు ప్రజలు ఎంత స్నేహపూర్వకంగా, ఉదారంగా వ్యవహరిస్తారో తెలుసుకునేందుకు పరిశోధకులు ఒక పరీక్షను నిర్వహించారు.

మొదటగా 21 మంది వాలంటీర్లపై ఈ పరీక్షను చేశారు. వారిని 24 గంటల పాటు నిద్రకు దూరంగా ఉంచారు. ఆ తర్వాత అపరిచితులకు సహాయపడే విషయంలో వారు ఎంత ఆసక్తి చూపుతారో అనే విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు అడిగారు.

తర్వాత, ఒక రాత్రి సాధారణ నిద్ర తర్వాత అదే ప్రశ్నావళిని పునరావృతం చేశారు. ఆ సమయంలో 21 మంది వాలంటీర్ల మెదడు పనితీరును ఫంక్షనల్ మాగ్నటిక్ రిజనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎంఆర్ఐ) ద్వారా అధ్యయనం చేశారు.

ఆ తర్వాత 171 మంది వాలంటీర్లపై ఇదే విధంగా ప్రయోగం చేశారు. ఈ రెండు ప్రయోగాల్లోనూ అలసటకు గురైనవారు తక్కువ స్కోరు చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

అపరిచితులే కాకుండా తమకు బాగా తెలిసిన వారికి కూడా ఇలాంటి స్థితిలో సహాయం చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరచనట్లు ఈ ప్రయోగం ద్వారా తెలిసింది.

నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

తక్కువ వ్యవధి

అమెరికాలో వేసవిలో పగటి సమయంలో సూర్యరశ్మిని మెరుగ్గా ఉపయోగించుకునేందుకు గడియారాల్లోని సమయాన్ని ఒక గంట ముందుకు మార్చారు. ఇలా సమయాన్ని మార్చిన తర్వాత, మార్చకముందు చేసిన 38 లక్షలకు పైగా చారిటబుల్ డొనేషన్లను పరిశోధకులు విశ్లేషించారు. గడియారంలోని సమయాన్ని మార్చడం వల్ల ప్రజలందరూ ఒక గంట నిద్రపోయే సమయాన్ని కోల్పోయారు.

ప్రజలు నిద్ర తక్కువగా పోయిన సమయంలో డొనేషన్లు 10 శాతం తగ్గిపోయాయి.

నిద్ర లేమి వల్ల మెదడులో సామాజిక స్పృహను ప్రేరేపించే ప్రాంతంలో చురుకుదనం తగ్గుతుందని ఫంక్షనల్ మ్యాగ్నటిక్ రిజనెన్స్ ఇమేజింగ్ ద్వారా తెలిసింది.

మెదడు పనితీరులో వచ్చే ఈ మార్పు, తక్కువ సమయం నిద్రపోవడం వల్లే సంభవిస్తుంది. అయితే, ఈ ప్రభావం స్వల్పకాలికం మాత్రమే. మనం సరిపడినంత నిద్రపోతే మళ్లీ మెదడులో కార్యకలాపాలు యధావిధిగా జరుగుతాయి.

వీడియో క్యాప్షన్, నిద్ర సరిగా పోని వాళ్ళకు సాయం చేసే గుణం తగ్గిపోతుందా?

నిద్ర చాలా ముఖ్యం

మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకు నిద్ర చాలా కీలకమని ఎప్పుడో నిర్ధారించారు. 1959లో ఇది రుజువైంది. ఎలాగంటే, అదే ఏడాది అమెరికన్ డీజే పీటర్ ట్రిప్ 201 గంటల పాటు మెళకువగా ఉన్నారు.

ఈ రికార్డును 1964లో రాండీ గార్డ్‌నర్ అనే టీనేజర్ తిరగ రాశారు. స్కూల్ సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్ కోసం రాండీ గార్డ్‌నర్ 260 గంటల పాటు అంటే దాదాపు 11 రోజులు నిద్రపోకుండా ఉన్నారు.

రాండీ, పీటర్ మొదట బాగానే ఉన్నారు. కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ వారు అవస్థలు పడ్డారు. చిన్న విషయాలు అర్థం చేసుకోలేక అయోమయానికి గురికావడం, వర్ణమాలను కూడా చెప్పలేకపోకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వారిద్దరూ వివిధ రకాల భ్రాంతులకు గురయ్యారు. బూట్లపై సాలెపురుగు గూడును చూసిన పీటర్ దాన్ని సరిగా అర్థం చేసుకోలేక, డెస్క్‌కు మంటలు అంటుకున్నట్లు భావించారు.

నిద్రలేమి కారణంగానే వారు అలా భ్రమపడ్డారు. నిద్రలేమి వల్ల భ్రమపడటం, సైకోసిస్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఎక్కువకాలం పాటు తీవ్ర నిద్రలేమి కొనసాగితే దీర్ఘకాలిక నరాల సమస్యలు కలగవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి.

పీటర్, రాండీ ప్రయోగాల ద్వారా నిద్రలేమి అనేది మన ప్రవర్తనలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తేలింది.

నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

సరైన నిద్రలేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే ముప్పు పెరుగుతుందని స్లీప్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదికలో 'ద అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ స్లీప్ సొసైటీస్' హెచ్చరించింది.

అమెరికాలో పగటి సమయాన్ని ఆదా చేసేందుకు గడియారాలను ఒక గంట ముందుకు జరిపారు. దీనివల్ల ప్రజలకు ఒక గంట నిద్ర తగ్గింది. ఆ తర్వాతి రోజు రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగినట్లు 2015 అధ్యయనంలో తేలింది.

దయ, ఉదారంగా వ్యవహరించడం అనేవి మన సామాజిక నిర్మాణంలో భాగమని మానసిక శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఇతరులతో మనం ఎలా మాట్లాడాలో, వారి ప్రవర్తనకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అనే విషయాన్ని ఈ సామాజిక నిర్మాణమే నియంత్రిస్తుంది.

మనం తీసుకునే నిర్ణయాలపై, జ్ఞాపకశక్తిపై నిద్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి నాణ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే నాణ్యమైన నిద్ర అవసరం.

రచయిత్రి లారా బోబర్ట్, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌మిన్‌స్టర్‌లో సైకాలజీ ప్రొఫెసర్.

వీడియో క్యాప్షన్, మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తారు/ఉతుకుతారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)