కొత్తపల్లి గీత: రూ. 42.79 కోట్ల లోన్ ఎగవేత కేసులో మాజీ ఎంపీకి, ఆమె భర్తకు అయిదేళ్ల జైలు శిక్ష

ఫొటో సోర్స్, Kothapalli Geetha/fb
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో బీజేపీ నాయకురాలు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త రామకోటేశ్వర రావు, కొందరు బ్యాంకు సిబ్బందిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది.
కొత్తపల్లి గీతకు హైదరాబాద్ సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది.
రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 42.79 కోట్లు మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వర రావు, కొందరు బ్యాంకు సిబ్బందిని సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
కొత్తపల్లి గీత దంపతులతో పాటు బ్యాంకు అధికారులు జయ ప్రకాశన్, అరవిందాక్షన్‌కూ అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాకు రూ.2 లక్షల జరిమానా విధించింది
కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావు డైరెక్టర్లుగా ఉన్న విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో హైదరాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బంజారాహిల్స్ బ్రాంచ్ నుంచి 2008 డిసెంబర్ 30న రూ.42.79 కోట్లు రుణం పొందింది.
బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఈ రుణం పొందారని, ఆ డబ్బును ఇతర అవసరాలకు మళ్లించి మోసం చేశారని వీరిపై అభియోగం నమోదైంది.

ఫొటో సోర్స్, Kothapalli Geetha/fb
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు చేయడంతో కొత్తపల్లి గీత, పి.రామకోటేశ్వరరావు, విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు బీకే జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్, డాక్యుమెంట్లు తయారు చేసిన ఎస్.రాజ్‌కుమార్‌పై బెంగళూరులోని సీబీఐ బ్యాంకింగ్ నేరాల విభాగం కేసు నమోదు చేసింది.
వీరందరిపై ఐపీసీ 120, 420, 458, 421, 13 (2) రెడ్ విత్ 1 (సీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
దర్యాప్తు చేసి నిందితులపై 2015 జూలై 11న హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం (13.09.2022) తీర్పు చెప్పింది.

ఫొటో సోర్స్, Kothapalli Geetha/fb
కోర్టు, జైలు శిక్ష విధించడంతో వెంటనే సీబీఐ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కొత్తపల్లి గీత అస్వస్థతకు గురి కావడంతో నిన్న ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చించారు. ఇవాళ వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు చంచల్‌గూడ మహిళా జైలుకు, పి.రామకోటేశ్వరరావు, బీకే జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
2014లో వైకాపా తరఫున అరకు ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత ఆ తర్వాత కొంత కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. కొద్ది రోజులు టీడీపీకి దగ్గరయ్యారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉండి 2018లో జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పారు. ఆ తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో ఆయిల్ పామ్: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చు, దిగుమతి బిల్లులు తగ్గుతాయా?
- గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోటు... రూ.200 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- కరోనా మహమ్మారి తరువాత చైనా అధ్యక్షుడి తొలి విదేశీ పర్యటన, పుతిన్‌తో భేటీ కానున్న షీ జిన్‌పింగ్
- తెలంగాణ: బాధితులకు నష్టపరిహారం ఎలా ఇస్తారు, ప్రభుత్వం తనకు నచ్చినంత ఇవ్వడం కరెక్టేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











