చైనా: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్న షీ జిన్‌పింగ్, కోవిడ్ సంక్షోభం తరువాత తొలి విదేశీ పర్యటన

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్రాన్సిస్ మావో
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నారు. 2020 ప్రారంభంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత షీ జిన్‌పింగ్ దేశం నుంచి బయటకు అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
జిన్‌పింగ్, పుతిన్ కలిసి యుక్రెయిన్ యుద్ధం, ఇతర "అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై" చర్చిస్తారని క్రెమ్లిన్ తెలిపింది.
ఉజ్బెకిస్తాన్‌లో వచ్చే వారం పాశ్చాత్య ప్రపంచానికి "ప్రత్యామ్నాయం" చూపే సదస్సు జరగనుందని, ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షులు భేటీ కానున్నారని క్రెమ్లిన్ పేర్కొంది.
చైనా, రష్యాలకు ఇది కీలక సమయం. జిన్‌పింగ్ చైనాలో మూడవసారి అధ్యక్ష పదవిని ఆశిస్తుండగా, యుక్రెయిన్ యుద్ధం వల్ల పుతిన్‌కు పశ్చిమ దేశాలతో సంబంధాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి.
జిన్‌పింగ్ బుధవారం కజక్‌స్తాన్‌లో మూడు రోజుల పర్యటన ప్రారంభించనున్నారు. సెప్టెంబరు 15-16 తేదీల్లో సమర్‌కండ్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమ్మిట్‌లో గురువారం పుతిన్‌ను కలుస్తారు.
మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్, కజక్‌స్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్‌తో పాటు ఇతర సభ్య దేశాలైన ఇరాన్, భారతదేశం, పాకిస్తాన్ కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నాయి. పుతిన్ ఆ దేశాల నాయకులను కూడా కలవనున్నారు.
అయితే, చైనా అధ్యక్షుడితో సమావేశం "ప్రాముఖ్యం సంతరించుకుంటుందని" క్రెమ్లిన్ విదేశాంగ విధాన ప్రతినిధి యూరి ఉషకోవ్ అన్నారు.
"పెద్ద ఎత్తున రాజకీయ మార్పులు జరుగుతున్న నేపథ్యంలో" ఈ సదస్సు జరుగుతోందని ఆయన అన్నారు.
పాశ్చాత్య సమూహాలకు ప్రత్యామ్నాయంగా ఎస్‌సీఓను నిలబెట్టడానికి చైనా, రష్యాలు దీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో లాక్‌డౌన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆ దేశం జీరో కోవిడ్ పాలసీకి ఇప్పటికీ కట్టుబడి ఉంది. మిగతా దేశాలు చాలావరకు వైరస్‌తో కలిసి జీవించేందుకు సిద్ధపడ్డాయి. కోవిడ్ నిబంధనలను సడలించాయి. కానీ, చైనాలో ఇప్పటికీ ఏ మాత్రం కోవిడ్ కేసులు పెరిగినా ఆ పట్టణాలు, నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు.
షీ జిన్‌పింగ్ చివరిసారిగా 2020 జనవరిలో విదేశీ ప్రయాణం చేశారు. వూహాన్‌లో తొలి లాక్‌డౌన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు మియన్మార్ వెళ్లారు. ఆ తరువాత దేశం నుంచి బయటకు అడుగుపెట్టలేదు. అయితే, ఈ ఏడాది జూలైలో హాంగ్‌కాంగ్ వెళ్లొచ్చారు.
పుతిన్‌కు కూడా ఇది అరుదైన విదేశీ పర్యటనే. యుక్రెయిన్‌పై దాడి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే విదేశీ పర్యటన చేశారు. జూలైలో తుర్కియే (టర్కీ పేరును తుర్కియే అని జూన్‌లో మార్చారు), ఇరాన్ నాయకులతో తెహ్రాన్‌లో సమావేశం తరువాత ఇప్పుడు చైనా అధ్యక్షుడిని కలవనున్నారు.
ఈ ఏడాది వీరిద్దరూ కలుసుకోవడం రెండవసారి. ఫిబ్రవరిలో బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు పుతిన్ హాజరయ్యారు.
పుతిన్, జిన్‌పింగ్‌ల సమావేశం పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా తమ బలం చూపించుకునే ప్రయత్నమేనని విశ్లేషకులు అంటున్నారు.
ఫిబ్రవరిలో బీజింగ్‌లో సమావేశమైనప్పుడు ఇరువులు నాయకులూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తమ దేశామల మధ్య స్నేహానికి "పరిమితులు లేవని" చెప్పారు.
తరువాత కొద్ది రోజులకు రష్యా యుక్రెయిన్‌పై దాడి ప్రారంభించింది. దీన్ని చైనా ఖండించలేదు, మద్దతు పలకలేదు. వాస్తవానికి, ఇరువైపులా తప్పు ఉందని బీజింగ్ చెప్పింది.
రష్యాపై అంతర్జాతీయ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ, చైనా అందులో భాగం పంచుకోలేదు. పైగా, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతూ వస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి భారత్, చైనాలలో రష్యా చమురు దిగుమతులు పెరిగాయి.
ఇటీవల కాలంలో పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికాతో చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. తైవాన్‌పై ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య అలజడి రేగింది. తైవాన్ తమ భూభాగంలో భాగమనని చైనా వాదిస్తోంది.
గత నెలలో, అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనకు ప్రతిస్పందనగా చైనా, ఆ ద్వీపం చుట్టూ అయిదు రోజులు సైనిక దిగ్బంధనం చేసింది.
చైనాలో లాక్‌డౌన్లు, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ లాంటి సమస్యలు ఉన్నప్పటికీ జిన్‌పింగ్ విదేశీ పర్యటన చేయాలని నిర్ణయించుకోవడం ఆయనకు తన నాయకత్వంపై ఉన్న నమ్మకమేనని చైనా వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు.
అక్టోబర్‌లో జరగబోయే ఎన్నికల్లో షీ జిన్‌పింగ్ మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
బీబీసీ చైనా కరెస్పాండెంట్ స్టీఫెన్ మెక్‌డోనెల్ విశ్లేషణ
షీ జిన్‌పింగ్ రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలు చేయకుండా కోవిడ్ సోకే ప్రమాదాన్ని చాలావరకు తగ్గించుకున్నారు. (ఆయనకు ఇప్పటివరకూ కరోనా సోకలేదని, సోకినా మనకు తెలీదన్నది ఒక ఊహ).
స్వదేశానికే పరిమితం కావడం జిన్‌పింగ్ ప్రచార వ్యూహం కూడా. ఈ సంక్షోభ సమయంలో చైనా ప్రజలు విదేశీ ప్రయాణాలు చేయకూడదన్న సందేశం పంపించారు.
ఇప్పుడు, ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరడం అంటే ఇది సురక్షితమేనని పార్టీ భావిస్తోందా?
ఒక సంవత్సరం క్రితం సురక్షితం కాకపోతే, ఇప్పుడెలా సురక్షితం అవుతుందన్నది మరో ప్రశ్న.
అలాగే, జిన్‌పింగ్ విదేశీ ప్రయాణాలు.. చైనా ప్రజలు మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణ పరిమితులను మరింత సడలించాలనే సందేశాన్ని పంపుతుందా?
చైనాలో ప్రభుత్వ నిర్ణయాలకు కారణాలు చెప్పే అలవాటు లేదు. కాబట్టి, నిజానికి వాళ్ల ఆలోచనలేమిటో మనకు తెలీదు.
ఏది ఏమైనా, జిన్‌పింగ్ విదేశీ పర్యటన, చైనా "జీరో కోవిడ్" చర్యలలో సడలింపులు రావచ్చనే దానికి సూచనగా కనిపిస్తోంది.
కావచ్చు అని ఎందుకన్నానంటే, కఠినమైన కరోనావైరస్ నిబంధనలకు ముగింపు పలకాలని చైనా ప్రభుత్వం భావిస్తున్నట్లయితే, ఆ సమాచారాన్ని కచ్చితంగా ప్రజలతో పంచుకోవట్లేదు.

ఫొటో సోర్స్, Getty Images
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) అంటే ఏమిటి?
ఎస్‌సీఓ అనేది 2001లో చైనా, రష్యా, కజక్‌స్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు సంయుక్తంగా స్థాపించిన యురేషియా రాజకీయ, ఆర్థిక, భద్రతా సంస్థ. ప్రస్తుతం ఇరాన్ ఈ సమూహంలో చేరే ప్రయత్నాలు చేస్తోంది.
రాబోయే సదస్సులో సభ్య దేశాలు పరస్పర వాణిజ్య సంబంధాల గురించి చర్చిస్తాయి. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. కాబట్టి చైనాతో వాణిజ్య సంబంధాలపై చర్చలు సాగుతాయి.
చైనా చాలా కాలంగా యూరప్‌తో వాణిజ్యం కోసం కొత్త రైలు మార్గాలను తెరవాలని చూస్తోంది. మరోవైపు, మధ్య ఆసియా దేశాలు చైనాతో మరిన్ని సంబంధాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
కిర్గిజ్‌స్తాన్ నుంచి చైనా, ఉజ్బెకిస్తాన్‌లకు కొత్తం మార్గం వేసే ప్రాజెక్టును 2023లో మొదలెడతామని ఆ దేశం ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- INDvsPAK మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిదీ కూతురు భారత జాతీయ జెండాను ఎందుకు ఊపింది?
- బ్రిటన్‌లో రాచరికానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- జ్ఞానవాపి కేసు: ‘ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఈ మసీదు... ఆ మసీదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది’
- థాయ్‌లాండ్: రాణిలా దుస్తులు ధరించినందుకు రెండేళ్లు జైలు శిక్ష
- ఐఫోన్ 14 అమ్మకాలను నిషేధించిన బ్రెజిల్, కారణం ఏమిటంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












