బ్రిటన్‌లో రాచరికానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

రాణి శవపేటిక

ఫొటో సోర్స్, PA Media

బ్రిటన్‌లో రాచరికానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.

ఆ దేశ రాణి మరణం తరువాత ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ రాజు అయ్యారు. అయితే, రాజును ఎవరు ఎన్నుకున్నారంటూ కొందరు వీధుల్లో నిరసనకు దిగారు. మరికొందరు 'మీరు నాకు రాజు కాదు' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ నిరసనకారులను అరెస్టు చేస్తున్నారంటూ బ్రిటన్‌లోని మానవహక్కుల సంస్థలు ఆందోళనవ్యక్తం చేస్తున్నాయి.

స్కాట్లాండ్‌లోని పోలీసులు నిరసనలకు సంబంధించి ఇటీవల ఇద్దరిని అరెస్టు చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లోనూ ఒక వ్యక్తిని అరెస్టు చేసి మళ్లీ విడిచి పెట్టారు.

ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజు అయిన సందర్భంగా ఆ దేశంలో కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త రాజును అధికారికంగా ప్రకటించే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఎడిన్‌బరలోని సెయింట్ గిలేస్ కేథడ్రల్ బయట శాంతికి భంగం కలిగిస్తోందంటూ 22ఏళ్ల యువతిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వదిలి పెట్టినప్పటికీ త్వరలోనే ఎడిన్‌బర్ షెరిఫ్ కోర్టు ముందు ఆ యువతి హాజరు కావాల్సి ఉంటుంది.

అదే రోజు 45 ఏళ్ల సైమన్ హిల్‌ను అరెస్ట్ చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లో రాజుకు సంబంధించి జరుగుతున్న కార్యక్రమం వద్ద 'మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు?' అంటూ నినాదాలు చేసి శాంతికి విఘాతం కలిగించారనే ఆరోపణలు ఆయన మీద మోపారు.

ఆ తరువాత సైమన్ హిల్‌ను విడిచి పెట్టినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారు. అతనే స్వచ్ఛందంగా పోలీసులతో కలిసి పని చేస్తున్నారని వెల్లడించారు.

రాణి కోసం బారులు తీరిన ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

సోమవారం ఎడిన్‌బరాలో రాణి శవపేటికను తీసుకొచ్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్ ఆండ్రూను గేలి చేశారనే ఆరోపణలతో 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇలా నిరసనకారులను అరెస్టు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని హక్కుల కోసం పోరాడే ఇండెక్స్ ఆన్ సెన్సార్‌షిప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూత్ స్మీత్ అన్నారు. 'ఈ దేశ ప్రజలకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను మనం తప్పకుండా అడ్డుకోవాలి' అని స్మీత్ పిలుపునిచ్చారు.

మరొక స్వచ్ఛంద సంస్థ బిగ్ బ్రదర్ వాచ్ డైరెక్టర్ సిల్కీ కార్లో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 'రాచకుటుంబానికి మద్దతు ప్రకటించే వాళ్లకు, తమ బాధను వ్యక్తం చేసే వాళ్లకు, నివాళులు అర్పించేవాళ్లకు పోలీసులు ఎలా అయితే అవకాశం ఇస్తున్నారో అలాగే నిరసనతెలియచేసే వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉంది' అని కార్లో అన్నారు.

'నిరసనవ్యక్తం చేయడమనేది రాజ్యం ఇచ్చిన గిఫ్ట్ కాదు. అది ప్రజల ప్రాథమికహక్కు' అని లిబర్టీకి చెందిన జాడీ బెక్ చెప్పారు.

సోమవారం రాజు వస్తున్న సందర్భంగా వెస్ట్‌మిన్‌స్టర్ హాల్ వద్ద 'మీరు నా రాజు కాదు' అంటూ ఒకరు ప్లకార్డు పట్టుకుని నిలబడగా ఆమెను పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

అయితే ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు చెబుతున్నారు. వెస్ట్‌మిన్‌స్టర్ ప్యాలెస్ వద్ద వాహనాల రాకపోకలను ఇబ్బంది లేకుండా చూసేందుకు ఒకరిని పక్కకు వెళ్లమని చెప్పాం కానీ అసలు ప్యాలెస్ పరిసరాల నుంచే వెళ్లిపొమ్మని చెప్పలేదని పోలీసులు అన్నారు.

తెల్ల కాగితం చూపిస్తున్న ఒక వ్యక్తిని పోలీసు అధికారి వివరాలు అడుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ఆ కాగితం మీద 'నాకు రాజు కాదు' అని రాయాలన్నది తన ఉద్దేశమని ఆ వ్యక్తి తెలిపారు.

'నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజలకు తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్న అధికారుల అందరికీ ఈ విషయాన్ని మేం స్పష్టంగా చెప్పాం' అని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టూవర్ట్ కండీ తెలిపారు.

రానున్న కొద్ది రోజుల్లో లండన్‌లో రద్దీ భారీగా పెరగనుంది. పోలీసులు, స్వచ్ఛంద కార్యకర్తలతోపాటు అదనంగా సుమారు 1,500 మంది సైనికులు కూడా శాంతి భద్రతలను కాపాడేందుకు మోహరించనున్నారు.

తమ సిబ్బంది ఎంతో క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటోందని మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ సర్ మార్క్ రౌలీ అన్నారు. 'ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా సవ్యంగానే జరుగుతుంది. భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. వేల మంది పోలీసులు మోహరించనున్నారు. లక్షల మంది ప్రజలు నివాళులు అర్పించడానికి వస్తారు కాబట్టి భారీ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది' అని ఆయన వివరించారు.

అరెస్టుల మీద స్పందించేందుకు బ్రిటన్ ప్రధాని అధికారిక ప్రతినిధి నిరాకరించారు. కానీ, 'దేశంలో అత్యధిక మంది రాణి మరణానికి సంతాపం తెలుపుతున్నారు. మెజారిటీ దేశ ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. అదే సమయంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కు కూడా మన ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకం' అని అన్నారు.

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్ మరణం పట్ల సంతాపదినం ప్రకటించడంపై భిన్న వాదనలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)