భారత్ చైనాకు దూరంగా జరిగి తైవాన్‌కు దగ్గర అవుతోందా?

వీడియో క్యాప్షన్, చైనా- తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత్- తైవాన్ వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా.?

తైవాన్ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.

ప్రపంచ వాణిజ్యంలో ఓ పెద్ద భాగస్వామితో సంబంధాలు పెంచుకునేందుకు.. భారత్‌కు ఇది సువర్ణ అవకాశం అనుకోవచ్చా?

బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

తైపేయి.. తైవాన్ రాజధాని. కార్యాలయాలు తెరుచుకున్నాయి. వ్యాపారం పుంజుకుంటోంది. రెస్టారెంట్లు నిండిపోయాయి. వాహనాల రద్దీ ఎక్కువే ఉంది. నెల రోజుల నుంచి చైనాతో తైవాన్ సంబంధాలు క్షీణిస్తున్నాయి. అమెరికా, జపాన్‌లు బహిరంగంగానే తైవాన్‌కు మద్దతు పలుకుతున్నాయి. అయితే తైవాన్‌కు ఇతర దేశాల మద్దతు అవసరం కూడా పెరుగుతోంది.

‘‘భారత్, తైవాన్‌లలో ప్రజాస్వామ్య వ్యవస్థలున్నాయి. అవి మానవ హక్కులను గౌరవిస్తాయి. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. దురదృష్టత్తువశాత్తూ రెండు దేశాలూ చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల చైనా మా దేశం చుట్టూ చేపట్టిన సైనిక విన్యాసాలతో మాకు అందరి మద్దతు అవసరం అనేది స్పష్టమైంది. మాకు మద్దతిచ్చేందుకు భారతీయ మిత్రులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను’’ అని తైవాన్ విదేశాంగమంత్రి జోసెఫ్ వూ అన్నారు.

యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని చూసిన తర్వాత.. ఇప్పుడు ప్రపంచం దృష్టంతా తైవాన్ మీద ఉంది. తైవాన్ తమ దేశం నుంచి విడిపోయిన రాష్ట్రమని.. దాన్ని ఏ రోజుకైనా తమ దేశంలో కలుపుకోక తప్పదని చైనా అంటోంది. అయితే తైవాన్ మాత్రం తాను స్వతంత్ర దేశమని, తమది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం అని చెప్పుకొంటోంది. అయితే తైవాన్ ఇప్పటి వరకూ తనను తాను స్వతంత్ర దేశంగా అధికారికంగా ప్రకటించుకోలేదు.

చైనా వన్ నేషన్ పాలసీ ప్రకారం, తైవాన్‌తో సంబంధాల విషయంలో భారత్ ఆచితూచి అడుగేస్తోంది. తైవాన్‌తో సంబంధాలను అనధికారికంగా సాగిస్తోంది. అయితే ఇప్పుడు చైనాతో సంబంధాలు బలహీన పడటంతో తైవాన్ కూడా భాగస్వాముల కోసం ఎదురు చూస్తోంది. ఇది కచ్చితంగా భారత్‌కు మంచి అవకాశమే. తైవాన్‌ను తన వైపు మలుపుకోవడమే కాకుండా.. దాంతో వాణిజ్య, ఆర్థిక, వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.

‘‘1970 నుంచి తైవాన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉంది. భారత ప్రభుత్వం తన బేస్‌ను ఇక్కడ నిర్మించే నాటికే చిప్‌సెట్స్ మొదలుకొని అన్నింటినీ తైవాన్ ఉత్పత్తి చేస్తోంది. భారత ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ రాయబార కార్యాలయం ఏర్పాటు చేయనప్పటికీ, అలాంటి దాన్ని నిర్వహిస్తోంది. ఇప్పుడు భారత విద్యార్థుల రాక కూడా పెరుగుతోంది. మనం ఒకరినొకరం బాగా ఆర్థం చేసుకుంటున్నాం’’ అని తైవాన్ ఇండియన్ కల్చరల్ సెంటర్ కు చెందిన జాఫ్రీ వు చెప్పారు.

ఈ రోజు పరిస్థితిని చూస్తే... భారత్-తైవాన్ మధ్య వార్షిక వాణిజ్యం 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా-తైవాన్ మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. తైవాన్ ‌2.25 కోట్ల మంది జనాభాలో ఐదు వేల మంది భారతీయ సంతతి వారున్నారు. వారిలో సగం మంది విద్యార్థులే. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యానికి ఇంకా ఎంతో అవకాశం ఉంది.

‘‘తైవాన్ హార్డ్‌వేర్‌లో, భారత్ సాఫ్ట్‌వేర్‌లో శక్తిమంతమైన దేశాలు. ఈ రెండు దేశాల మధ్య సహకారము, సమన్వయానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకు నెమ్మదించింది?. తైవాన్ నుంచి చాలా సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినా, నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. సాంస్కృతిక విభేధాలు, భాషాపరమైన సమస్యలు, అనుమతుల జారీలో అలవిమాలిన జాప్యం లాంటివి సమస్యల్ని సృష్టించాయి. ఈ సంస్థలు చైనాతోనూ వ్యాపారం చెయ్యడం మరో సమస్య. భారత్ ‌నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ సంస్థలు వియత్నాంలో పెట్టుబడులు పెట్టాయి. భారత్‌లోకి ఈ పెట్టుబడులను ఆహ్వానించినా.. భయాలు కూడా ఉన్నాయి’’ అని తైపేయి వ్యాపారవేత్త ప్రియా లాల్వాని చెప్పారు.

తైవాన్‌లో చాలా కొద్ది మంది మాత్రమే దక్షిణాసియా సంతతివారు. ప్రత్యేకించి భారతీయులు. మన దేశ పారిశ్రామికవేత్తలు కూడా భాష, సంస్కృతి, ఆహారం లాంటి అంశాల వల్ల 15 ఏళ్ల నుంచి తైవాన్ కాకుండా చైనాలోనే పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు తైవాన్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

తైవాన్ ప్రతీ రోజూ డజన్ల కొద్దీ ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసి.. వాటిని థాయిలాండ్, లాటిన్ అమెరికాతో పాటు భారత్‌లోనూ అమ్ముతోంది. అయితే వీటి తయారీకి అవసరమైన ముడి సరకులో సగానికి పైగా చైనా నుంచే వస్తోంది.

తైవాన్‌లో ప్రస్తుతం చైనా దూకుడు వ్యవహారశైలి మీద చర్చ జరుగుతోంది. మూడేళ్ల నుంచి భారత్‌కు కూడా చైనా నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే భారత్ మాత్రం బహిరంగంగా తైవాన్‌కు మద్దతివ్వడంలేదు.

ఇటీవల తైవాన్‌లోనూ చాలా మంది భారత్ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

తైవాన్ అంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా మంది చెప్పే మాట. థర్మల్ ఇమేజింగ్ లేదా చిప్‌ల తయారీ, లేదా నూతన సాంకేతిక పరికరాల ఆవిష్కరణ.. ఈ అంశాల్లో తైవాన్‌కు పోటీ లేదు. భారత్‌కు కూడా ఈ రంగాల్లోనే అద్భుతమైన అవకాశాలున్నాయి. భారత్‌కు దిగుమతి అయ్యే తక్కువ ధరకు లభించే ఎలక్ట్రానిక్ ఉపకరణాల దిగుమతుల విషయంలో విషయంలో చైనాకు తైవాన్ ప్రత్యామ్నాయం కాగలదు.

తైవాన్‌కు చుట్టు పక్కల ఉన్న దేశాల నుంచి స్నేహితులు అవసరం. భారత పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఇప్పుడిక నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మిగిలి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)