రష్యా - యుక్రెయిన్ యుద్ధానికి 6 నెలలు: ఇప్పటివరకు ఏం జరిగిందో ఆరు గ్రాఫిక్స్‌లో చూద్దాం

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లోర్నా హాంకిన్, డేలా జర్నలిజం, విజువల్ జర్నలిజం టీమ్‌లు
    • హోదా, బీబీసీ న్యూస్

యుక్రెయిన్‌లో యుద్ధం మొదలై నేటికి ఆరు నెలలు గడిచింది.

ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌లోని దోన్బస్ ప్రాంతంపై ‘‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్’’ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అదే రోజున ఈ చర్యలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) ఆయన్ను అభ్యర్థించింది.

‘‘తమ భూభాగం, స్వేచ్ఛ, తమ జీవితాలను ఎవరైనా తీసుకోవాలని ప్రయత్నిస్తే, కచ్చితంగా పోరాడతాం’’ అని ఆ రోజే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియన్‌స్కీ కూడా చెప్పారు.

ఆ రోజుతో చాలా మంది జీవితాలు అనుకోని మలుపులు తిరిగాయి.

ఆగస్టు 24న యుక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని.. యుద్ధ ప్రభావాన్ని పరిశీలిద్దాం. రష్యా ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలతో మొదలుపెట్టి, ఎంత మంది మరణించారు?, ఎంత మంది నిరాశ్రయులయ్యారు? లాంటి అంశాలు తెలుసుకుందాం.

యుక్రెయిన్ యుద్ధం

1. దాడికి ముందు యుక్రెయిన్ ఎలా ఉండేది?

దాడికి ముందు రష్యా మద్దతున్న వేర్పాటువాదుల ఆధీనంలో.. తూర్పు యుక్రెయిన్‌లోని దోన్బస్‌లో కొన్ని ప్రాంతాలు ఉండేవి.

ఫిబ్రవరి 21న యుక్రెయిన్ నుంచి వేరుపడిన దోన్యస్క్ పీపుల్స్ రిపబ్లిక్, లూహాన్స్‌క్ పీపుల్స్ రిపబ్లిక్‌లను రెండు స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.

అయితే, పుతిన్ చర్యలను యుక్రెయిన్, నాటో, పశ్చిమ దేశాలు ఖండించాయి.

అంతకుముందే, అంటే 2014లోనే క్రైమియా పీఠభూమిని రష్యా ఆక్రమించింది. ఇప్పటికీ దీన్ని యుక్రెయిన్‌లో భాగమని చాలా దేశాలు చెబుతున్నాయి.

యుక్రెయిన్ యుద్ధం

2. ఆరు నెలల తర్వాత ఎలా ఉంది?

ఆరు నెలల తర్వాత తూర్పు యుక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలపై రష్యా పట్టుసాధించింది.

అయితే, దాడి మొదట్లో ఆక్రమించిన ఉత్తర యుక్రెయిన్‌, రాజధాని కీయెవ్, ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలపై రష్యా పట్టు సడలిపోయింది.

మరోవైపు లూహాన్స్‌క్ ప్రాంతంపై రష్యా పట్టు పూర్తిగా కోల్పోయింది. అయితే, దోన్యస్క్‌లోని కొన్ని ప్రాంతాలపై ఇప్పటికీ పట్టు కోసం రష్యా ప్రయత్నిస్తోంది.

నెలల నుంచి ఖార్కియెవ్ నగరంలో భారీగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.

వీడియో క్యాప్షన్, యుద్ధ క్షేత్రం నుంచి బీబీసీ స్పెషల్ రిపోర్ట్

మారియుపూల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్‌వర్క్స్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ బలగాలను ఉపసంహరించుకోవడంతో.. క్రైమియాకు నేల మార్గం గుండా వెళ్లేందుకు రష్యాకు అవకాశం లభించింది. మరోవైపు అజోవ్ సముద్రంపై పూర్తి పట్టు కూడా వచ్చింది. మొత్తంగా ఆగ్నేయ యుక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలపై రష్యా పట్టు సంపాదించింది.

ఇప్పటికీ క్రైమియాపై రష్యా సైన్యానికి పట్టుంది. అయితే, ఆగస్టులో బెల్‌బెక్ వైమానిక స్థావరం వెలుపల సెబాస్టోపోల్ వద్ద భారీ పేలుళ్లు జరిగాయి. యుక్రెయిన్‌పై దాడికి ఈ స్థావరాన్ని రష్యా ఉపయోగించుకుంటోంది.

దక్షిణ భాగంలో యుక్రెయిన్ చేతుల్లో నుంచి రష్యా పరమైన మొదటి నగరం ఖేర్సన్. అయితే, ఈ నగరాన్ని మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది. నైప్రో నది వెంబడి వంతెనలే లక్ష్యంగా దాడులు చేపడుతోంది.

యుక్రెయిన్ యుద్ధం

3. ఎంతమంది చనిపోయారు?

ఈ సంక్షోభంలో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారో అంచనా వేయడం కాస్త కష్టమే.

అయితే, అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘‘ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్’’ (ఏసీఎల్‌ఈడీ) మృతులను మొదట్నుంచీ లెక్కిస్తోంది. ఆగస్టు 10 నాటికి మొత్తంగా ఈ యుద్ధంలో 13,000 మంది మరణించినట్లు సంస్థ అంచనా వేసింది.

అయితే, మృతుల సంఖ్య అంచనాల కంటే చాలా ఎక్కువే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

మృతుల సంఖ్య పది వేలకు మించే ఉంటుందని యుక్రెయిన్, రష్యా రెండు దేశాలూ చెబుతున్నాయి. అయితే, వీటిని ధ్రువీకరించేందుకు బీబీసీకి వీలుపడలేదు.

దాడుల్లో పాలుపంచుకుంటున్న దేశాలు విడుదల చేసే మృతుల సంఖ్యలు విశ్వనీయదగినవి కాదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

యుక్రెయిన్ యుద్ధం

4. ఎంత మంది నిరాశ్రయులయ్యారు?

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి 1.2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ముఖ్యంగా పొరుగునున్న దేశాలకు 50 లక్షల మంది వెళ్లిపోగా, మరో 70 లక్షల మంది యుక్రెయిన్‌లోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

అయితే, కీయెవ్‌ లాంటి నగరాల్లోని తమ ఇళ్లకు లక్షల మంది మళ్లీ తిరిగివచ్చారు.

ఆగస్టు 17 వరకు 64 లక్షల మంది మొత్తంగా యుక్రెయిన్ నుంచి యూరప్‌కు వలస వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) తెలిపింది.

మరోవైపు లూహాన్స్‌క్, దోన్యస్క్ లాంటి ప్రాంతాల నుంచి కొందరు రష్యాకు కూడా వెళ్లారు. మారియుపూల్ నుంచి 1,40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అయితే, ఎవరినీ బలవంతంగా రష్యాకు పంపించలేదని ఆయన అన్నారు.

ప్రజలు ఎక్కువగా పొరుగునున్న పోలండ్ లేదా జర్మనీకి వలస వెళ్తున్నారు.

యుక్రెయిన్ యుద్ధం

5. ఎంత నష్టం సంభవించింది?

ఆరు నెలలుగా యుక్రెయిన్ భూభాగంలో విధ్వంసాలు కళ్లకు కనపడుతున్నాయి.

ఒకప్పుడు ఇక్కడుండే భారీ భవనాలు, ప్రజల ఇల్లు ఇప్పుడు శిథిలాలుగా మారాయి.

యుద్ధంలో దెబ్బతిన్న ప్రజల ఇళ్లను బాగు చేయాలంటే 39 బిలియన్ డాలర్లు (రూ. 3 లక్షల కోట్లు)కుపైనే ఖర్చవుతుందని కీయెవ్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అంచనా వేసింది.

మొత్తంగా మౌలిక సదుపాయాలకు నష్టం విలువ 104 బిలియన్ డాలర్లు (రూ.8.29 లక్షల కోట్లు) ఉంటుందని పేర్కొంది. అయితే, వాస్తవంగా ఇంతకంటే ఎక్కువే నష్టం సంభవించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు?

యుక్రెయిన్

6. ప్రపంచ వ్యాప్తంగా ఆహారంపై ఎలాంటి ప్రభావం పడుతోంది?

ఈ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఆహార సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.

చాలా దేశాలు యుక్రెయిన్ నుంచి వచ్చే గోదుమలపై ఆధారపడతాయి. అయితే, యుక్రెయిన్ పోర్టుల నుంచి ఈ ఆహార ధాన్యాల ఎగుమతిని రష్యా అడ్డుకుంది.

ఇప్పటికి ఆరు నెలలు గడిచింది. అయితే, ఎగుమతులు వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూలేదని ఇప్పుడు రష్యా చెబుతోంది.

ముఖ్యంగా ఆహార ధాన్యాలతో వెళ్లే నౌకలు, వాహనాలపై దాడులు చేయబోమని రష్యా అంటోంది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధంలో జరిగిన సైనిక నష్టాన్ని పూడ్చుకునేందుకు రష్యాలో వాలంటీర్ల భర్తీ

ప్రస్తుతం కొన్ని రవాణా నౌకలు.. యుక్రెయిన్‌కు చెందిన నల్ల సముద్రం పోర్టుల నుంచి వెళ్తున్నాయి. అయితే, ఇవి తిరిగివచ్చేటప్పుడు సమస్యలు తలెత్తొచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఆహార ధాన్యాల కోసం ఐక్యరాజ్యసమితి, టర్కీ మధ్యవర్తిత్వం వహించడంతో రష్యా ఈ ఒప్పందానికి అంగీకరించింది.

ప్రపంచ దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తకుండా అందరూ కృషి చేయాలని ఈ ఒప్పందం చర్చల్లో ప్రముఖ పాత్ర వహించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు.

ఈ ఆహార ధాన్యాల ఒప్పందమే శాంతి చర్చల దిశగా రెండు దేశాలను నడిపిస్తుందని టర్కీ అధ్యక్షుడు ఎర్దవాన్ అన్నారు.

అయితే, ఆక్రమించిన భూభాగాల నుంచి రష్యా వెనక్కి వెళ్తేనే శాంతి చర్చలకు వస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)