భీకర యుద్ధం మధ్యే పొలాల్లో వ్యవసాయం చేసి, పంటలు పండిస్తున్న యుక్రెయిన్ రైతులు
అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు యుక్రెయిన్ గోధుమ ఎంతో కీలకం. కానీ రష్యా ఆక్రమణతో వ్యవసాయమనేది ప్రమాదకర వృత్తిగా మారిపోయింది.
యుక్రెయిన్‌లో యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న డోన్బాస్ ప్రాంతంలో ఇది పంటకోతల కాలం.
వ్లాదిమిర్ బుఖాంత్సేవ్‌కు ఇక్కడి నుంచి యుద్ధరంగం కనిపిస్తుంది. ఉత్తరాన ఒక కొండకు ఆవల యుద్ధం జరుగుతోంది.
రష్యన్ స్థానాలపై దాడి చేసేందుకు ఇప్పుడే రెండు యుక్రెయిన్ ఫైటర్ జెట్లు దూసుకెళ్తున్నాయి.
ఈ విమానాలను కూల్చేందుకు రష్యా రాకెట్లను ప్రయోగించింది. ఒక జెట్ తృటిలో తప్పించుకుంది.
రెండు విమానాలూ శత్రువును ఏమార్చేందుకు ఫ్లేర్స్ ప్రయోగించి, త్వరగా వెనక్కి మళ్లాయి.
ఇటువంటివి రోజూ చూస్తుంటామని వ్లాదిమిర్ అన్నారు. పైలట్లు తమ పని చేస్తున్నారు - మేం మా పని చేస్తున్నామన్నారు. సమీపంలోని యుద్ధరంగంలో తన కొడుకు కూడా పోరాడుతున్నాడని చెప్పారు.
రైతులు, సైనికులు తప్ప మిగిలిన వాళ్లంతా ఈ ప్రాంతం నుంచి ఇప్పటికే వెళ్లిపోయారు, లేదా వెళ్లిపోతున్నారు.
సమీపంలో రష్యన్ రాకెట్ల పేలుళ్లు వినిపిస్తుండగా... ఓ బస్ స్టాప్‌లో త్వరత్వరగా వీడ్కోలు చెప్పుకుంటున్నారు.
యుక్రెయిన్‌లోని గోధుమ చేలపై లెక్క లేనన్ని రాకెట్లు, క్లస్టర్ బాంబులు పడ్డాయి. దాంతో వేలాది ఎకరాల పంట అగ్నికి ఆహుతయ్యింది.
యుక్రెయిన్ రైతులకూ, యుక్రెయిన్ ధాన్యం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రపంచ దేశాలకూ ఇది మరో సవాలు.
తన పొలంలో బాంబు పడటంతో ఏర్పడ్డ గుంతను సెర్గెయ్ కురిన్నీయ్ మాకు చూపిస్తున్నారు.
తన పొలంలో పండే గోధుమలు, పొద్దుదిరుగుడు పంటనంతా ఆయన ఎగుమతి చేస్తుండేవారు. కానీ యుద్ధంతో అది ఆగిపోయింది.
తన పొలానికి జరిగిన నష్టానికి సంబంధించిన మరిన్ని దృశ్యాల్ని మాకు చూపిస్తున్నారు.
మరో బాంబు దాడిలో ఇక్కడే ఆవులు చనిపోయాయి. కొంచెం దూరంలో ఇప్పటికీ మాకు పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ ఉదయం బాంబు మోతలతో దద్దరిల్లిపోతోంది.
రష్యన్ల దిగ్బంధమే అన్నింటికన్నా పెద్ద సమస్య అని సెర్గెయ్ అంటారు.
నౌకాశ్రయాలను మూసివెయ్యడంతో ఎగుమతులు చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. దాంతో గోధుమల ధర మూడింట రెండొంతులు పడిపోయింది.
రష్యన్ల దిగ్బంధాన్ని ఎత్తివేసేందుకు కుదిరిన ఒప్పందంతో త్వరలోనే ఓ పెద్ద మార్పు రావచ్చని ఆశిస్తున్నారు. కానీ అది యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. అందుకే, ఇక్కడ డోన్బాస్ ప్రాంతంలో... యుక్రేనియన్ రైతులంతా ప్రమాదాల మధ్యే పంటల్ని కోసి వీలైనంత మేరకు వాటిని నిల్వ చేసేందుకు త్వరపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కార్గిల్ యుద్ధం: వీరోచితంగా పోరాడిన పాక్ సైనికుడు.. భారత్ సిఫార్సుపై అత్యున్నత శౌర్య పురస్కారం ఇచ్చిన పాకిస్తాన్
- చరిత్ర: ‘అంకెల్లో చెప్పలేనంత సంపద కలిగిన’ 10 మంది కుబేరులు..
- ఆస్ట్రేలియా చెఫ్‌ల పోటీలో మెరిసిన భారతీయ వంటకాలు.. బిరియానీ గెలిపించిందా?
- నాటుసారా ఎలా తయారు చేస్తారు, అది తాగితే మనుషులు ఎందుకు చనిపోతారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)