థాయ్‌లాండ్: రాణిలా దుస్తులు ధరించినందుకు రెండేళ్లు జైలు శిక్ష

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Reuters

థాయ్‌లాండ్ రాణిలా దుస్తులు ధరించి ఆమెను అవమానించారన్న ఆరోపణలతో ఒక యాక్టివిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు థాయ్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది.

2020లో బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్ రాజకీయాలపై జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో 25 ఏళ్ల జటుపోర్న్ 'న్యూ' సాయోయెంగ్ గులాబీ రంగు పట్టు దుస్తులు ధరించారు.

అయితే, రాణిని అవమానించారన్న ఆరోపణలను జటుపోర్న్ ఖండించారు. తాను కేవలం సంప్రదాయ దుస్తులు ధరించానని, రాణిని అవమానించలేదని అన్నారు.

థాయిలాండ్‌లో రాజు, రాజకుటుంబంపై విమర్శలను నిషేధించే కఠినమైన 'లెస్-మెజెస్టె' చట్టాలు ఉన్నాయి.

2019లో మహా వజిరలాంగ్‌కార్న్ రాజు సింహాసనాన్ని అధిష్టించినప్పటి నుంచి పాలక వర్గాలు రాచరికపు చట్టాలను మరింత కఠినంగా అమలుచేస్తున్నాయని, నియంతృత్వాన్ని సంస్కరించాలని డిమాండ్ చేస్తున్నవారిని అణగదొక్కడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారని హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

2020 నవంబర్ నుంచి, కనీసం 210 మంది నిరసనకారులపై లెస్-మెజెస్టె చట్టాల కింద అభియోగాలు మోపి అరెస్ట్ చేశారు. అంతకుముందు మూడేళ్లు ఈ చట్టాల అమలును పూర్తిగా నిలిపివేశారని, కొత్త రాజు రాకతో మళ్లీ వాటిని కఠినంగా అమలుచేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

థాయ్‌లాండ్ నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2020తో బ్యాంకాక్‌లో ప్రజా నిరసనలను అడ్డుకోవడమే లక్ష్యంగా థాయ్‌లాండ్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది

జటుపోర్న్ కేసులో కోర్టు తీర్పును మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. జటుపోర్న్‌కు మొదట మూడేళ్ల జైలుశిక్ష విధించారు. కానీ, వెంటనే రెండేళ్లకు తగ్గించారు.

2020లో జరిగిన నిరసన ప్రదర్శనలో జటుపోర్న్ ఫార్మల్ పింక్ సిల్క్ డ్రెస్ వేసుకున్నారు. అదే డ్రెస్‌లో ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. పక్కనే పరిచారకుడు ఆమె కోసం గొడుగు పట్టుకుని నిల్చున్నాడు.

థాయ్‌లాండ్ రాజు భార్య రాణి సుతిదా, పబ్లిక్ ఈవెంట్లల్లో తరచుగా ఫార్మల్ సిల్క్ దుస్తులే ధరిస్తుంటారు. అలాగే, రాజ కుటుంబం బయటకు వచ్చినప్పుడు పరిచారకులు గొడుగులతో వెంట నడుస్తారు.

కోర్టు తీర్పుకు ముందు జటుపోర్న్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నాకు ఎవరినీ ఎగతాళి చేసే ఉద్దేశం లేదు. నాకోసం నేను ఆ దుస్తులు ధరించాను. థాయ్ సంప్రదాయ దుస్తులుగా భావించి వాటిని వేసుకున్నాను" అన్నారని ఏపీ వార్తాసంస్థ తెలిపింది.

థాయ్‌లాండ్ రాచరికాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఏడాది ఎన్నో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వాటిల్లో ఈ రెడ్ కార్పెట్ నిరసన ప్రదర్శన కూడా ఒకటి. వజిరలాంగ్‌కార్న్ కుమార్తెలలో ఒకరు ఈ ఫ్యాషన్ షోను నిర్వహించారు.

"మాక్ (పరిహాసం) ఫ్యాషన్ షో దేశంలోని రాజకీయ పరిస్థితులపై సంధించిన వ్యంగ్యాస్త్రం. ఇది శాంతియుతంగా జరిగిన బహిరంగ కార్యక్రమం. శాంతియుతంగా సాగిన సభలో పాల్గొన్నవారిని శిక్షించకూడదు" అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతినిధి ఒకరు అన్నారు.

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, థాయ్‌లాండ్ రాచరికాన్ని వ్యతిరేకిస్తూ 2020లో ఎన్నో నిరసన ప్రదర్శనలు జరిగాయి

అయితే, లెస్-మెజెస్టె కేసులపై కోట నుంచి ఎప్పుడూ ఎలాంటి స్పందనా రాలేదు.

ప్రారంభంలో నిరసన ఉద్యమం సైనిక-మద్దతు గల ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. 2014లో ఒక తిరుగుబాటులో మాజీ సైనిక నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాంటి మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.

తరువాత, కొత్త రాజు, రాజకుటుంబంపై కూడా విమర్శలు మొదలయ్యాయి.

రాచరికాన్ని విమర్శించకూడదన్న విశ్వాసాలను ఈ ఉద్యమం బద్దలుగొట్టింది. అయితే, నిరసనకారులు జాగ్రత్త వహించారు. రాచరికాన్ని పూర్తిగా ఎత్తివేయకుండా, సంస్కరణలు తీసుకురావాలని మాత్రమే కోరుతూ నిరసనలు చేపట్టారు.

రాజు వజిరలాంగ్‌కార్న్, అపారమైన రాజ్య సంపద, రెండు సైన్య విభాగాల నాయకత్వంపై నియంత్రణను నేరుగా తన చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి నిరసనకారులు మరింత సూక్ష్మ పరిశీలన, సంస్కరణలను కోరారు.

అంతే కాకుండా, మహమ్మారి సమయంలో చుట్టూ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్య ప్రజలకు, రాజు విలాసవంతమైన జీవితం పుండు మీద కారం జల్లినట్టయింది.

వీడియో క్యాప్షన్, పులులను కాపాడే సీక్రెట్ కెమేరాలు... థాయిలాండ్‌లో కొత్త ప్రయోగం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)