థాయ్‌లాండ్: సంప్రదాయ థాయ్ మసాజ్ విధానం ఏమిటి? దీని మూలాలు ఎక్కడున్నాయి?

థాయ్ మసాజ్

ఫొటో సోర్స్, Tourism Authority of Thailand

    • రచయిత, క్లేయిర్ టర్రెల్
    • హోదా, బీబీసీ ట్రావెల్

బ్యాంకాక్ వాట్ ఫో మందిరంలోని ఎత్తైన స్తంభాలు, సెరామిక్ స్థూపాల మధ్యలో 19 వ శతాబ్దానికి చెందిన శాసనాలు కూడా చెక్కి ఉన్నాయి. చెక్కతో చేసిన పై కప్పు నీడలో ఉన్న పాల రాతి పై చెక్కిన శిలా శాసనాలు థాయ్ జీవన విధానాన్ని మాత్రమే కాకుండా థాయిలాండ్‌లో ప్రముఖ మసాజ్ విధానం నువాడ్ థాయ్ మెళకువలను కూడా తెలియచేస్తాయి.

యునెస్కో (UNESCO) ఈ విధానాన్ని తమ ఇంటాన్జిబిల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ 2019 జాబితాలోకి కూడా చేర్చింది. బౌద్ధ సన్యాసులు పాటించే ఈ సంప్రదాయ విధానంలో శరీరాన్ని వంచడం, యోగా, ఆక్యుప్రెషర్ కూడా మిళితమై శరీరానికి సేద చేకూరుస్తాయి.

స్వీడిష్, హవాయి మసాజ్‌లలో మసాజ్ చేయించుకునే వ్యక్తి నిశ్చలంగా ఉంటారు. కానీ, థాయ్ మసాజ్‌లో మసాజ్ చేయించుకునే వ్యక్తి పూర్తిగా దుస్తులు ధరించి, థెరపిస్ట్ సహాయంతో శరీరాన్ని, జాయింట్ భాగాలను వంచడం, కదల్చడం లాంటివి చేస్తారు. దీంతో శరీరంలో కీళ్ల కదలిక మెరుగు పడుతుంది.

థాయ్‌లాండ్‌లో కొంత మంది థెరపిస్ట్‌లు రోగి వీపు మీద కెక్కి మసాజ్ చేస్తారు. అయితే, ఈ విధానాన్ని అందరూ అవలంబించరు.

థాయ్ మసాజ్

ఫొటో సోర్స్, Getty Images

వాట్ ఫో పాలరాతి శిలలపై చెక్కిన సేన్ గీతలు శరీరంలో శక్తి కేంద్రాలను సూచిస్తాయి. వీటిని అనుసరించే థెరపిస్టులు మసాజ్ చేస్తారు. ప్రతి శిల మీద వెన్నెముక, పక్కటెముకలు లాంటి శరీర భాగాలతో కూడిన మానవ ఆకారం చెక్కి ఉంటుంది. చుక్కలను కలుపుతూ ఉండే నల్ల గీతలు అక్యు ప్రెషర్ పాయింట్‌లను సూచిస్తాయి. ఏ వ్యాధికి ఏ పాయింట్ పని చేస్తుందో సూచిస్తూ పేర్లు రాసి ఉంటాయి.

నువాడ్ థాయ్ విధానం ప్రకారం శరీరంలో భూమి, నీరు, జలం, అగ్ని అనే నాలుగు గుణాలు ఉంటాయి. ఆక్యుప్రెషర్ చేయడం ద్వారా, సేన్ గీతల్లో ఆగిపోయిన శక్తి ప్రవాహాన్ని ఉత్తేజితం చేసి శరీరంలో ఉన్న ఈ తత్వాలను సమ స్థాయిలోకి తీసుకుని వస్తారు.

19వ శతాబ్దపు మధ్య భాగంలో థాయిలాండ్‌లో ఆధునిక వైద్యం ప్రవేశించక ముందు, ఈ 16వ శతాబ్దపు మందిరమే వైద్య విద్యకు కేంద్రంగా పని చేసింది.

నువాడ్ థాయ్ మసాజ్ విధానం కూడా ఈ విద్యా విధానంలో భాగంగా ఉంది. 1955లో థాయ్ రాజు భూమిభోల్ థాయ్ మసాజ్ స్కూల్‌ని ప్రారంభించాలని అనుకున్నప్పుడు ఆయన వాట్ ఫో మైదానాన్నే అనుకూలమైన ప్రాంతంగా ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రపంచం నలు మూలల నుంచి విద్యను అభ్యసించడానికి విద్యార్థులు ఇక్కడకు వస్తారు.

అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పాలలో ఈ మసాజ్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ దాని మూలాలు మాత్రం థాయిలాండ్‌లో నేటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి.

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Tourism Authority of Thailand

వాట్ ఫోని సంప్రదాయ థాయ్ మసాజ్‌కి జన్మస్థలంగా చెప్పినప్పటికీ, దీని మూలాలు మాత్రం థాయ్ గ్రామీణ వ్యవసాయ సమూహాలలో దొరుకుతాయి.

గ్రామాలలో ప్రజలు సంప్రదాయ వైద్యుని దగ్గరకు వెళ్లి రోజంతా కష్టపడిన తర్వాత వచ్చిన నొప్పులు, బాధలను నయం చేసుకునేవారు.

ఈ వైద్యులు తమ పూర్వీకుల దగ్గర నుంచి వివిధ రకాల మెళకువలు నేర్చుకుని వైద్యంలో ఉపయోగించేవారు.

సమాజ సేవగా పరిగణించే ఈ సేవలకు వీరు ఎవరి దగ్గర నుంచీ డబ్బులు వసూలు చేయరు.

గ్రామీణ జీవితంలో ఈ వైద్యులు పోషించే పాత్ర గురించి ఉత్తర థాయిలాండ్‌‌లోని ఫెట్ చబూన్ ప్రాంతానికి చెందిన వాట్ ఫో మసాజ్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న క్రైరత్చన్త్ర శ్రీకి అవగాహన ఉంది. "మా గ్రామంలో ప్రజలకి మా తాతగారు చికిత్స చేసేవారు. నేను చిన్నవాడినే గాని, మా ఇంటికి వైద్యం కోసం ప్రజలు రావడం, వాళ్ళేమి చేస్తున్నారో నేను వెళ్లి చూడటం మాత్రం గుర్తుంద”ని ఆయన చెప్పారు.

గ్రామీణ ప్రాంతాలలో ప్రతీ ఇంటిలో నువాడ్ థాయ్ మసాజ్ విధానం అలవాటులో ఉంటుంది. పిల్లలందరికీ ఈ మసాజ్ లోని మెళకువలు నేర్పిస్తారు. ఇంట్లో తల్లి తండ్రులు, తాత మామ్మలు పొలంలో పని చేసి వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులతో బాధ పడుతుంటే పిల్లలు వారికి మసాజ్ చేస్తారు.

ప్రత్యేకంగా ఆక్యుప్రెషర్ పాయింట్లు తెలియనప్పటికీ కాళ్ళను ఎక్కడ పట్టుకోవాలి, ఎలా వంచాలి, వీపు మీద ఎక్కి ఎలా తొక్కాలో వారికి తెలుసు. ఇవి చాప మీద గాని, నేల మీద గాని చేస్తారు.

థాయ్ మసాజ్

ఫొటో సోర్స్, David Herraez/Alamy

వాట్ ఫో మసాజ్ స్కూల్ లో శిక్షణ పొందిన తర్వాత నుంచి చన్త్ర శ్రీ ఈ విధానంలో చికిత్స చేస్తున్నారు.

"మా అమ్మగారు ఆవిడ కాళ్ళ మీద నిలబడి మసాజ్ చేయమనే వారు. అలా మెళకువలు నేర్పారు. అయితే, వాట్ ఫో స్కూల్ లో ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న మెళకువలు పాఠ్యాంశాలలో లేకపోవడం వలన పాటించడం లేదని”, ఆయన చెప్పారు.

థాయ్ మసాజ్ గురించి సమాజానికి తెలియచేసే శాసనాలు వాట్ ఫో శిలా శాసనాల మీద లభించవచ్చు కానీ, ఈ విధానం గురించి 1455 లో చేసిన ఒక శాసనంలో లభిస్తుంది.

రక రకాల వైద్య విధానాల మేళవింపుతోనే నువాడ్ విధానం రూపుదిద్దుకుందని ‘ఆన్షియెంట్ థాయ్ మసాజ్ హీలింగ్ విత్ ప్రాణ’ పుస్తక సహ రచయిత జన్ చైతఉత్తి చెప్పారు. థాయ్ మసాజ్ లో శక్తిని ఉత్తేజితం చేసే అంశం చైనా, భారత సంస్కృతుల నుంచి ప్రభావితమై ఉండవచ్చు. అయితే, థాయ్ మసాజ్ ని ప్రత్యేకంగా నిలబెట్టే మెళకువలని మాత్రం థాయ్ ప్రజలే కనిపెట్టి తర్వాత తరాల వారికి అందించారని అన్నారు.

థాయ్ మసాజ్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి జానపద థాయ్ మసాజ్, రెండవది, రాజరిక థాయ్ మసాజ్. జానపద మసాజ్ ని గ్రామీణ ప్రాంతాలలో పాటిస్తారు. ఇందులో, మసాజ్ చేసే వారు, నొప్పుల నుంచి ఉపశమనం కల్పించడానికి తమ చేతులు, మోచేతులు, మోకాళ్ళు, పాదాలను కూడా మసాజ్ చేయడానికి వాడతారు. ఈ విధానం థాయిలాండ్ అంతటా , ప్రపంచంలో పలు చోట్ల విరివిగా అమలులో ఉంది.

రాజరిక మసాజ్ థాయిలాండ్ అంతః పురాలకే పరిమితం. ఇందులో చేతులు, మునివేళ్ళని మాత్రమే వాడి మసాజ్ చేస్తారు.

సామాజిక ఆరోగ్య కేంద్రాలలోను, హాస్పిటళ్లలోనూ ఇదే విధానాన్ని పాటించమని ప్రజా ఆరోగ్య విభాగం సూచిస్తోంది.

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Tourism Authority of Thailand

శతాబ్దాలుగా థాయ్ నువాడ్ చికిత్స గురువుకి ప్రార్ధన సమర్పించడంతోనే మొదలవుతుంది. "మేము గురువుని, బుద్ధుడి వైద్యుడైన చివాక కొంపర ఫట్ ని స్మరిస్తాం. ఆయనను థాయ్ సంప్రదాయ వైద్యానికి తొలి గురువుగా భావిస్తాం”, అని వాట్ ఫో మసాజ్ స్కూల్ లో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్న సెరాట్ టాంగ్ట్రోన్గ్చిత్ర్ చెప్పారు. మేము ధన్యవాదాలు తెలిపి, క్లయింట్ కి నయం అవ్వాలని ప్రార్థిస్తాం.

1985 లో వియత్నాంతో యుద్ధం సమయంలో నువాడ్ మసాజ్ విధానాని కున్న ప్రతిష్టని అమెరికా పూర్తిగా దెబ్బ తీయడంతో , థాయ్ ప్రభుత్వం థాయ్ మసాజ్ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టింది. దీనిని ఆధ్యాత్మిక థెరపీగా ప్రాచుర్యంలోకి తెచ్చి దానికున్న అప్రతిష్టను తొలగించాలని చూసింది.

ప్రజా ఆరోగ్య నిపుణులు, థాయ్ సంప్రదాయ వైద్య నిపుణులు, మసాజ్ నిపుణులు కలిసి థాయ్ మసాజ్ కోసం నియమావళిని, మెలకువలతో కూడిన పాఠ్యాంశాలను రూపొందించారు. శిక్షణ పొందిన థెరపిస్ట్ లుగా మారాలంటే 800 గంటల పాటు వీటిని చదవాల్సి ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది.

ఈ విధానాన్ని ఇప్పుడు థాయ్ హాస్పిటళ్లలో కూడా స్ట్రోక్ వచ్చిన రోగుల కోసం, డయాబెటిస్ ఉన్న వారి కోసం చికిత్స కోసం వాడుతున్నారు. ఈ విధానం థాయ్ లో కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తూ ఒక మల్టీ బిలియన్ డాలర్ పరిశ్రమగా ఎదిగింది.

బ్యాంకాక్ లో అంధులకు కూడా మసాజ్ స్కూళ్ళు ఉన్నాయి. చియాంగ్ మై మహిళల జైలులో కూడా మసాజ్ కాలేజీ నిర్వహిస్తున్నారు.

ఈ మసాజ్ చేయించుకోవడానికి గాని, లేదా నేర్చుకోవడానికి గాని చాలా మంది యాత్రీకులు, దేశ విదేశాల నుంచి విద్యార్థులు వస్తుంటారు.

కెనడాలో మార్కెటింగ్ ఉద్యోగి పాల్ బఫెల్ చియాంగ్ మై లో టిఎంసి లో ఈ విధానం నేర్చుకోవడానికి వచ్చారు.

"థాయ్ సంస్కృతి లోంచి చూస్తే థాయ్ మసాజ్ ని సరిగ్గా అర్ధం చేసుకోగలమని”, ఈ విధానంలో ఇక్కడ ప్రజలందరూ మమేకమై ఉన్నారని”, ఆయన అన్నారు.

థాయిలాండ్‌లో ప్రతి ఒక్కరికి ఉచిత ప్రభుత్వ వైద్య సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ , గ్రామీణ హీలర్లు ఇప్పటికీ థాయ్ సంస్కృతిని ప్రభావితం చేస్తున్నారు. "థాయ్ మూలికా వైద్యం, థాయ్ మసాజ్ మా జీవితాలలో భాగమని” చైతవుత్తి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)