జ్ఞానవాపి కేసు: ‘ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఈ మసీదు... ఆ మసీదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది’

జ్ఞానవాపి మసీదు

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాశీ జ్ఞానవాపి కేసులో హిందువులు వేసిన పిటీషన్‌ విచారణ కొనసాగించాలంటూ సోమవారం వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.

విచారణ ఆపేలా ఆదేశించాలంటూ ముస్లింలు వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే దీని మీద హై కోర్టుకు వెళ్తామని ముస్లింలు చెప్పారు.

వారణాసి జిల్లా కోర్టు తీర్పు మీద అక్కడి ముస్లింలు, హిందువులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం బీబీసీ చేసింది.

స్థానిక జర్నలిస్టు అతీక్ అన్సారీ
ఫొటో క్యాప్షన్, స్థానిక జర్నలిస్టు అతీక్ అన్సారీ

ముస్లింలు ఏమంటున్నారు?

రెవారీ తాలాబ్ ఇరుకు సందుల్లోని ఒక దానిలో నివసిస్తుంటారు స్థానిక జర్నలిస్టు అతీక్ అన్సారీ. కోర్టు తీర్పు వచ్చిన కొద్ది సేపటి తరువాత సన్నని వాన జల్లుల మధ్య మేం అన్సారీని కలవడానికి వెళ్లాం.

'ఇలా జరగడం చాలా బాధాకరం. నిరాశ చెందిన కమిటీ పై కోర్టుకు వెళ్తుంది. అలా వెళ్లే హక్కు వారికి ఉంది. వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది' అని అతీక్ అన్సారీ అన్నారు.

'ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. కాశీ, మథుర, తాజ్‌మహాల్, కుతుబ్‌మినార్... ఈ మసీదు... ఆ మసీదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఇంతటితో ఆగుతుందా? అనేది తేలాలి.

ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభించాలని కోరుకుంటున్నారు? పరస్పరం చర్చల ద్వారానా లేక కోర్టు ద్వారా అనేది నిర్ణయించాలి. కానీ సాధ్యమైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలి. ఉపాధి, బతుకుదెరువు మీద చర్చ జరగాలి' అని అన్సారీ చెప్పారు.

1992లో బాబ్రీ మసీదును హిందుత్వవాదులు కూల్చేశారు. అయితే జ్ఞానవాపి విషయంలో అలా జరగకపోవచ్చని కొందరు ముస్లింలు అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో అయోధ్య రామమందిర ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991లో 'ప్రార్థనా స్థలాల ప్రత్యేక చట్టాన్ని' తీసుకొచ్చింది. దాని ప్రకారం 1947 అగస్టు 15నాటికి ప్రార్థనా స్థలాలు ఏ స్థితిలో ఉన్నాయి వాటిని అలాగే కొనసాగించాల్సి ఉంటుంది. అయోధ్య రామమందిర వివాదాన్ని మాత్రం ఆ చట్టం నుంచి మినహాయించారు.

జ్ఞానవాపి కేసుకు సంబంధించి 26 పేజీల తీర్పును సోమవారం కోర్టు వెల్లడించింది. '1993 వరకు తాము అక్కడ శృంగార గౌరీకి పూజలు చేస్తూ ఉండే వాళ్లమని అయిదుగురు మహిళలు పిటీషన్‌లో పేర్కొన్నారు. వారు పూజలు చేసుకునేందుకు అనుమతి అడుగుతున్నారు తప్ప, వివాదాస్పద ప్రాపర్టీ మీద యాజమాన్యపు హక్కులు అడగడం లేదు' అని 17వ పేజీలో కోర్టు పేర్కొంది.

'అలాగే వివాదాస్పద ప్రాంతాన్ని గుడిగా ప్రకటించాలని పిటీషనర్లు కోరడం లేదు' అని కోర్టు వ్యాఖ్యానించింది.

కోర్టు ఇచ్చే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండాలని అతీక్ అన్సారీ అన్నారు.

ఆకాశ్ కేసరీ
ఫొటో క్యాప్షన్, వారణాసిలో ఆకాశ్ కేసరీ దుకాణం నడుపుతున్నారు

హిందువులు ఏమంటున్నారు?

కాశీ విశ్వనాథ్ మందిరం దగ్గర ఉండే గోదౌలియా చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం అంత సులభమైన పని కాదు. 'చాలా మంచి నిర్ణయం వచ్చింది. తదుపరి విచారణలోనూ అలాంటి తీర్పు వస్తూ ఉండాలి' అని ఇక్కడ దుకాణం నడుపుతున్న ఆకాశ్ కేసరీ అన్నారు.

ఆ పక్కనే నారాయణ యాదవ్ మరొక దుకాణం నడుపుతున్నారు. 'హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం' అని ఆయన చెప్పారు.

'అక్కడ(జ్ఞానవాపి) పూజలు చేయాలనుకునే వాళ్లను అనుమతించాలి' అని గోదౌలియా చౌరస్తా వద్ద మరొక హిందూ వ్యక్తి అన్నారు.

స్థానిక జర్నలిస్టు అయిన అతీక్ అన్సారీ ఇంటికి దగ్గర్లోనే హఫీజ్ జహూర్ మసీదు ఉంది. దాని బయట చాలా మంది పోలీసులు పహారా కాస్తున్నారు. వారణాసిలోని చాలా ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించాయి. కోర్టు తీర్పుకు ఒక రోజు ముందు పోలీసులు కవాతు కూడ చేశారు.

అబ్దుల్లా అన్సారీ
ఫొటో క్యాప్షన్, అబ్దుల్లా అన్సారీ

హఫీజ్ జహూర్ మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సమయంలో మొహ్మద్ సులైమ్ మాకు కనిపించారు. జ్ఞానవాపి కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు మీద స్పందన అడగ్గా ముందు ఆయన చిన్నగా నవ్వారు.

'కోర్టుల్లో నిర్ణయాలు జరుగుతాయి. కానీ మాకు న్యాయం జరగలేదు' అని మొహ్మద్ అన్నారు.

ఇక్కడ వాతావరణం ప్రశాంతంగానే ఉందని మొహ్మద్‌ పక్కనే నిలబడి ఉన్న చీరల వ్యాపారి అబ్దుల్లా నాసిర్ అన్నారు. ఇంతకు ముందు మేమంతా ఎలా ఉండే వాళ్లమో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నామని ఆయన తెలిపారు.

'కోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని పాటించేందుకు మా మత పెద్దలు సిద్ధంగా ఉన్నారు. కోర్టు ఏం చెబితే అది చేస్తామని వారు చెబుతున్నారు' అని అబ్దుల్ నాసిర్ అన్నారు.

వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల మీద పై కోర్టుకు వెళ్తామని అంజుమన్ ఇంతజామియా మసీదు జనరల్ సెక్రటరీ ఎస్‌ఎమ్ యాసిన్ తెలిపారు.

ముస్లింలు పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని స్థానిక న్యాయవాదులు కూడా చెబుతున్నారు.

వారణాసి

‘వ్యాపారం జరగడం లేదు’

వారణాసిలో కొత్తగా నిర్మించిన టెక్స్‌టైల్ మార్కెట్‌కు కొద్ది దూరంలోనే రెవారీ బజారు ఉంటుంది. అక్కడికి దగ్గర్లోనే కాశీ విశ్వనాథ్ మందిరం, జ్ఞానవాపి మసీదు ఉంటాయి.

'నిర్ణయం ఏది అయినప్పటికీ దాన్ని అంగీకరించాల్సిందే. ఈ వివాదంతో మార్కెట్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రజలు భయంతో ఎక్కడికీ వెళ్లడం లేదు. మార్కెట్‌కు ఎవరూ రావడం లేదు. మాటిమాటికి పోలీసులు వస్తున్నారు. అక్కడ వివాదం తలెత్తితే ఇక్కడ అంతా నష్టపోతున్నారు' అని వస్త్ర వ్యాపారి ఫిరోజ్ సిద్ధికీ అన్నారు.

మానవత్వం, చదువు గురించి చర్చలు జరగాలని ఫిరోజ్ అంటున్నారు.

దగ్గర్లోనే మరొక దుకాణాన్ని నడుపుతున్నారు షకీల్ అహ్మద్.

'కోర్టు ఇచ్చిన తీర్పును విమర్శించడం తప్పు అవుతుంది' అని షకీల్ అన్నారు.

'దుకాణాలు తెరుస్తున్నాం. కానీ వ్యాపారం జరగడం లేదు. మార్కెట్‌లో వాతావరణం చెడిపోతోంది. మందిర్-మసీదు వివాదం వల్ల మరింత నష్టం జరుగుతోంది. పరిస్థితులు మరింత దిగజారొచ్చనే భయాలు పెరిగిపోతున్నాయి. గత ఆరు నెలలుగా ఇక్కడ కస్టమర్లు కనిపించడం లేదు' అని షకీల్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.

వారణాసిలో పోలీసుల కవాతు

స్థానిక జర్నలిస్టుల్లో ఉత్పల్ పాఠక్ ఒకరు.

'మేలో ఈ వివాదం మీద వారణాసి జిల్లా కోర్టు ఎప్పుడైతే విచారణ మొదలు పెట్టిందో నాటి నుంచి ఇక్కడకి న్యూస్ చానెల్స్ రాక పెరిగి పోయింది. నిత్యం టీవీలో దీన్ని చూపిస్తూనే ఉన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో మూడు రోజుల పాటు ఇక్కడ చాలా ప్రాంతాల్లోని షాపులను పోలీసులు మూయించారు' అని పాఠక్ తెలిపారు.

దాల్‌మండీ, హర్‌హా సరాయ్, నయీ సడక్ వంటి ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేల సంఖ్యలో ముస్లింల దుకాణాలున్నాయి. ఇక్కడి నుంచి బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలతో పాటు నేపాల్ సరిహద్దులకు కూడా బట్టలు పోతాయి.

'మే నెల రాగానే పెళ్లి సీజన్ మొదలవుతుంది. కాబట్టి అమ్మకాలు బాగా జరుగుతాయి. కానీ అదే నెలలో జ్ఞనవాపి వివాదానికి మీడియా కవరేజ్ పెరగడం వల్ల ఒకరకమైన భయానక వాతావరణం నెలకొంది. సరుకు కొనుక్కొని పోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు రావడం లేదు' అని పాఠక్ వివరించారు.

మళ్లీ విచారణ ప్రారంభం కావడంతో మళ్లీ పోలీసుల పహారా పెరిగిందని అందువల్ల దాల్‌మండీ, నయా సడక్ వంటి ప్రాంతాల్లో కొనేందుకు కస్టమర్లు రావడం లేదని పాఠక్ తెలిపారు.

వీడియో క్యాప్షన్, కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)