కల్వకుంట్ల కవిత : దిల్లీ మద్యం విధానంపై వివాదంలో కేసీఆర్ కుమార్తె పేరెందుకు వినిపిస్తోంది?

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ మద్యం విధానంపై వివాదం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవితపై దిల్లీ రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు, ఇక్కడ ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రాన్నే అందించాయి. కేసీఆర్ జాతీయ స్థాయి ఎదుగుదలను అడ్డుకోవడానికే ఈ కుట్రలు పన్నుతున్నారని టీఆర్ఎస్ అంటుంటే, అసలు కవిత మనీష్‌ని కలిశారో లేదో చెప్పాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.
"ఇవాళ నేను మీకు పెద్ద విషయం చెబుతున్నాను. లిక్కర్ డీల్ గురించి దిల్లీ ఒబెరాయ్ హోటెల్‌లో సూట్ రూమ్ ఆరు నెలలు బుక్ అయింది. దిల్లీ ఎక్సైజ్ కమిషనర్, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కొందరు లిక్కర్ మాఫియా వ్యక్తులు, కొన్ని రాజకీయ కుటుంబాలకు చెందిన వారు ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు’’-దిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ సింగ్ ఇటీవల అన్న మాటలివి. ఎక్కడా కేసీఆర్ కుమార్తె కవిత పేరు నేరుగా ప్రస్తావించకుండా ఆయన ఈ మాటలు అన్నారు.
‘‘వాళ్లు (కేసీఆర్ కుటుంబ సభ్యులు) ఒక ప్రైవేటు విమానంలో వచ్చేవారు. ఆ రాష్ట్రానికి (తెలంగాణకు) చెందిన లిక్కర్ వ్యాపారులు ఆ విమానం ఏర్పాటు చేశారు. సూట్ రూమ్ వాళ్లే బుక్ చేశారు. ఇలాంటి లిక్కర్ విధానమే పంజాబ్‌లోనూ చేశారు. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కలసి ఇది ప్లాన్ చేశారు. తెలంగాణలోని ఇదే పాలసీని బెంగాల్లో కూడా ప్రారంభించబోతున్నారు’’ అని ఆయన ఆరోపించారు.
‘‘ఇక్కడ ఏ1 లైసెన్స్ హోల్డర్, కేసీఆర్ కుటుంబ సభ్యుల ద్వారా మనీష్ సిసోడియాకు 150 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది మొదటి డీల్. తెలంగాణ నుంచి వచ్చిన వారు ఈ రూ. 150 కోట్లు మొదటి వాయిదా కింద ఇచ్చారు. అసలు కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిశారా లేదా, ఒబెరాయ్ హోటెల్లో కలిశారా లేదా అనేది సిసోడియా సమాధానం చెప్పాలి?" అని పర్వేశ్ సింగ్ అన్నారు.
అదే సందర్భంలో దిల్లీకే చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా మాత్రం నేరుగా కవిత పేరు ప్రస్తావించారు.
"కె. కవిత చాలా మందిని దక్షిణాది నుంచి తీసుకుని వచ్చారు. మాగుంట కంపెనీ, రెడ్డి బ్రదర్స్ కూడా వచ్చారు. పంజాబ్, గోవా ఎన్నికల ఖర్చు కోసం రూ. 150 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నారు (సిసోడియా). పంజాబ్‌లోని చద్దా కుటుంబానికి చెందిన ఒక మద్యం ఫాక్టరీ సీల్ తెరిపించడం కోసం కవిత ద్వారా రూ. 4.5 కోట్లు ఇచ్చారు. ముందు రూ. 3 కోట్ల క్యాష్, రూ. 1.5 కోటి క్రెడిట్ నోట్ ఇచ్చారు. తరువాత క్రెడిట్ నోట్ రద్దు చేసి, మొత్తం క్యాష్ ఇచ్చేశారు. ఆ తరువాత పంజాబ్‌లో ఫాక్టరీ తెరిచారు. దక్షిణాది నుంచి వ్యాపారులను కవిత తీసుకువచ్చారు. కవితను కలిశారా లేదా అనేది సిసోడియా చెప్పాలి. మేం హోటెల్ రూమ్ నంబర్ కూడా చెప్పగలం. డబ్బు ఎవరు, ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ పెట్టారు? అనేది కూడా చెప్పగలం. అన్ని వివరాలూ మా దగ్గర ఉన్నాయి. మేం చెప్పేది తప్పయితే, మీరు సమాధానం చెప్పండి. మాకు ఒబెరాయ్ హోటెల్ మీటింగు గురించీ తెలుసు, చండీఘర్‌లోని హయత్ మీటింగులు గురించీ తెలుసు'' అన్నారు మంజీందర్ సిర్సా.
ఈ ఇద్దరు దిల్లీ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు, దిల్లీలో ఏమోగానీ తెలంగాణలో మాత్రం ప్రకంపనలు సృష్టించాయి. దిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన వివాదంలో కవిత పేరును బీజేపీ నాయకులు ప్రస్తావించడంతో, తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ముగ్గురూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. కవిత ఇంటి ముందు బీజేపీ తలపెట్టిన నిరసన కొట్లాట వరకూ వెళ్లింది.

ఫొటో సోర్స్, ANI
ఇంతకీ అసలు దిల్లీలో మద్యం గొడవ ఏంటి?
ఒక్క ముక్కలో చెప్పాలంటే, మొన్నటి వరకూ దిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. తరువాత ప్రైవేటుకు ఇద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్‌లో గోల్‌మాల్ జరిగిందన్నది బీజేపీ ఆరోపణ. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయించారు అక్కడి గవర్నర్. దీంతో మొత్తానికి ఆ పాలసీయే వద్దు, పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది ఆప్ ప్రభుత్వం.
కొంచెం వివరంగా చూస్తే, 2021 నవంబర్ నుంచి కొత్త విధానం అమలయింది. ప్రైవేటు సంస్థలకు మందు అమ్మే పద్దతి ప్రారంభించడంతో పాటూ, మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు దిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని దిల్లీ ప్రభుత్వం చెప్పింది.
ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది. తద్వారా వినియోగదారులకు మేలు కలుగుతుందని తెలిపింది.
మద్యం రిటైలర్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో దిల్లీలో అమ్మకాలు పెరిగాయి.
అంతా బాగానే ఉంది కానీ, ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. వెంటనే సీబీఐ ఎంక్వైరీ జరిగింది. ఆ తరువాత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిలో సీబీఐ సోదాలు చేసింది. ఆ వెంటనే, దీని వెనుక కేసీఆర్ కుమార్తె కవిత హస్తం కూడా ఉందని దిల్లీ బీజేపీ నాయకులు ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI
ఈ అక్రమాలపై సీబీఐ 11 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ ఎఫ్ఐఆర్‌లో మరో 15 మంది పేర్లను కూడా జతచేశారు. కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. మొత్తం 21 చోట్ల సీబీఐ సోదాలు చేసింది.
టెండర్ల తరువాత లైసెన్సు పొందిన వాళ్లకు అనుచితమైన ప్రయోజనాలు అందించడం కోసం, నిర్ణీతమైన అథారిటీ అనుమతి లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ, మంత్రి సిసోడియాలపై ఆరోపణలు చేసింది సీబీఐ.
''లైసెన్స్ ఫీజులలో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సును పొడిగించటం వంటి అనుచిత ప్రయోజనాలను లైసెన్సుదారులకు కల్పించటానికి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయటం సహా అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ'' అని సీబీఐ పేర్కొంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడానికి, ఆరోపిత ప్రభుత్వ సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలను బదిలీ చేయడంలో సిసోడియాకు సన్నిహితులైన కొందరు వ్యాపారవేత్తలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని ఈ ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.
ఎక్సైజ్ పాలసీని అమలు చేయటానికి వీలుగా, అవసరమైన స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని దిల్లీ మంత్రిమండలి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిందని.. కానీ ఆ తరువాత, నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ప్రకారం 2021 మే 21వ తేదీన మంత్రి మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని కూడా సీబీఐ పేర్కొంది.
అయినా కూడా, ఉప ముఖ్యమంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి అనుమతితో ఎక్సైజ్ విభాగం, ప్రస్తుత ఆరోపణలకు కారణమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేసిందని సీబీఐ ఆరోపించింది.
ఈ కొత్త విధానం వచ్చే సరికి దిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న తెలుగు వ్యక్తి, ఐఏఎస్ అధికారి అరవ గోపీకృష్ణపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను సస్పెండ్ చేశారు.

ఫొటో సోర్స్, BJPTELANGANA/FB
తెలంగాణలో హాట్ టాపిక్
దిల్లీ మద్యం విధానంలో అనూహ్యంగా కవిత పేరు ప్రస్తావనకు రావడంతో తెలంగాణ బీజేపీ దీనిపై దృష్టి పెట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై విలేఖరులతో మాట్లాడారు. దిల్లీ బీజేపీ నాయకులు చెప్పిన పేర్లు కాక అదనంగా మరికొన్ని పేర్లు ప్రస్తావించారు సంజయ్.
"కేసీఆర్ తరచూ దిల్లీ వెళ్లేది మద్యం పాలసీ గురించే. పంజాబ్‌కు కూడా రైతుల కోసం వెళ్లలేదు. అక్కడ మద్యం పాలసీ అమలు కోసమే వెళ్లారు. అసలు ఒబెరాయ్ హోటెల్‌లో మద్యం వ్యాపారులను కేసీఆర్ కుటుంబ సభ్యులు కలిశారా లేదా? ప్రైవేటు విమానంలో దిల్లీ వెళ్లారా లేదా? రామచంద్రన్ పిళ్లై, శరత్ చంద్రా రెడ్డి, సృజన్ రెడ్డి, అభిషేక్, చరణ్ రెడ్డి అనే వాళ్లు మీకు పరిచయమా కాదా? వాటికి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీరంతా కేసీఆర్‌కి బినామీలు. వారితో తమకు సంబంధం ఉందో లేదో చెప్పాలి. ఇప్పుడు తాము తప్పుకుని, వీళ్లను ఇరికించి, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే వీళ్లనే జైళ్లకు పంపుతారు" అన్నారు సంజయ్.
ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారని సంజయ్ ఆరోపించారు.
ఇందులో అరుణ్ రామచంద్ర పిళ్ళైను సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో ఏ 14గా చేసింది. ఆయన హైదరాబాద్ కోకాపేటలో ఉంటారు. ఇండో స్పిరిట్స్‌కి చెందిని సమీర్ మహేంద్రు నుంచి డబ్బు సేకరించి ప్రభుత్వంలోని వ్యక్తులకు ఇచ్చినట్టుగా రామచంద్ర పిళ్లైపై ఆరోపణలు చేసింది సీబీఐ. ఈ ఏడాది ప్రారంభించిన రాబిన్ డిస్టిలరీ అనే కంపెనీలో ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు.

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK
ఈ వ్యవహారంపై కవిత స్పందించారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌కూ, తనకూ ఏ సంబంధమూ లేదని ఆమె అన్నారు.
"దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలపై బట్ట కాల్చి మీద వేసి, దుమ్మెత్తి పోసి, మీరే తుడుచుకోండి అనేటి రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. నిరాధారంగా ఏదిబెడితే అది మాట్లాడడం ఆరోగ్యకరం కాదు. నాకూ, దానికీ ఏ సంబంధం లేదు. కేసీఆర్ కూతుర్ని బద్నాం చేస్తే కేసీఆర్ ఆగం అయిపోతాడు అని, భయపడతాడని అనుకుంటున్నారేమో. కేంద్రాన్ని ఎండగట్టే విషయంలో మేం వెనక్కు తగ్గుతాం అనుకుంటే, మీరు వృథా ప్రయత్నం చేస్తున్నట్టే లెక్క. అది పూర్తిగా వ్యర్థం. ఈ రకంగా మీడియాలో కథనాలు ఇచ్చి, మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో కూడా మా మీద ఇలానే చేశారు. ధైర్యంతో తిప్పి కొట్టాం. బిల్కిస్ బానో వంటి అంశాలపై మాట్లాడుతున్నందుకే ఇలా చేశారు" అని కవిత మీడియాతో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పరువు నష్టం దావా
తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులిద్దరిపైనా పరువు నష్టం దావా వేయబోతున్నాని కవిత చెప్పారు. ఇలాంటి ఆరోపణలు చేసిన వారిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా ఆమె పిటిషన్ వేయబోతున్నట్టు కవిత కార్యాలయం ప్రకటించింది. దీనిపై లాయర్లతో మాట్లాడి త్వరలోనే పిటిషన్ వేయబోతున్నట్టు ఆమె కార్యాలయం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?
- బంగారు జాడీలో చక్రవర్తి గుండె, ప్రత్యేక విమానంలో తరలింపు, సైనిక లాంఛనాలతో స్వాగతం - బ్రెజిల్లో ఏం జరుగుతోంది
- కశ్మీర్ లోయలో హిందువులను ఎందుకు చంపేస్తున్నారు, 1980 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయా?
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?
- Asia Cup 2022: భారత్-పాకిస్తాన్ జట్లు తలపడేదెప్పుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













