తెలంగాణ: బాధితులకు నష్టపరిహారం ఎలా ఇస్తారు, ప్రభుత్వం తనకు నచ్చినంత ఇవ్వడం కరెక్టేనా?

తెలంగాణ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
ఫొటో క్యాప్షన్, ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ తెలుగు

దిల్లీ-పంజాబ్ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. సుదీర్ఘ ఆందోళనలో 600 మందికిపైగా రైతులు చనిపోయారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనని, ఆ ఆందోళనకు పిలుపు ఇవ్వని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతులకు 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మొత్తం 750 మందికి పైగా రైతుల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం రూ. 3 లక్షల పరిహారం ప్రకటించడం గర్వంగా ఉందని గత ఏడాది నవంబర్‌లో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గల్వాన్ దగ్గర చైనాతో సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లోనూ 20 మందికిపైగా భారత సైనికులు మరణించారు. తెలంగాణకు చెందిన సంతోష్ కుటుంబానికి రూ.5 కోట్లు, ఇతర రాష్ట్రాల వారికి 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సికిద్రాబాద్ అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఇటీవల కామారెడ్డి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనిలో మృతులకు రూ.2 లక్షల సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సికింద్రాబాద్‌లో ఇటీవల ఒక పాత సామాను గోడౌన్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 11 మంది బిహారీ కార్మికులు మరణించారు. వారికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల సాయం ప్రకటించింది.

వాస్తవానికి పైన జరిగిన ఏ ఘటనలోనూ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర లేదు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ సిబ్బంది ప్రత్యక్ష ప్రమేయం వల్ల అవి జరగలేదు.

పరిహారం

ఫొటో సోర్స్, Reuters

కానీ ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. పేద మహిళలను పిలిపించి, వారికి పిల్లలు పుట్టకుండా ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. జనాభా నియంత్రణలో భాగంగా ఈ ఆపరేషన్లు చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం స్వయంగా మహిళలను పిలిచి, వారికి విషయం వివరించి, ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో చేసే ఆపరేషన్.

ఈ ఆపరేషన్‌లో ప్రభుత్వ సిబ్బంది తప్పిదమో లేక అసలత్వం వల్లో నలుగురు మరణించారు. అందరూ 30ఏళ్ల లోపు వయసున్న చిన్న పిల్లల తల్లులే. అటు కుటుంబాలకు గృహిణి దూరమైంది. ఇటు చంటి పిల్లలకు చిన్న వయసులో తల్లి దూరమైంది.

ఈ మహిళలు తెలిసీ, కోరి వెళ్లి తెచ్చుకున్న అపాయం కాదు ఇది. స్వయంకృతం దీనిలో లేదు. తమను నమ్మించి, తీసుకొచ్చి చేసిన ఆపరేషన్ వికటించడం వల్ల జరిగిన నష్టం ఇది. వారికి ఇది మరణం వరకూ దారి తీయవచ్చని ఊహే లేదు.

స్పష్టంగా ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం వల్ల జరిగిన ఈ మరణాలకు కూడా ప్రభుత్వం ఇచ్చిన పరిహారం రూ.5 లక్షలే!

ఒకవైపు ప్రభుత్వానికి ఏ సంబంధం లేకుండా, రిస్కు ఉందని తెలిసీ ఎదురెళ్లిన ఈ రాష్ట్రానికి చెందని వారికీ, ప్రభుత్వాన్ని అమాయకంగా నమ్మి వచ్చి నిండా మునిగిన కుటుంబాలకీ ఒకటే పరిహారం ఎలా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం?

వీడియో క్యాప్షన్, ‘పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తానన్న కేసీఆర్ తెలంగాణ రైతులకు ఎందుకివ్వరు’

అసలు పరిహారం ఎలా ఇస్తారు?

ప్రభుత్వాలు ఇచ్చే పరిహారాలు చాలా రకాలుగా ఉంటాయి. భూమి తీసుకున్నప్పుడు ఇచ్చే పరిహారం లాంటివి చట్ట ప్రకారం తప్పకుండా ఇస్తారు. దానికి అనేక లెక్కలుంటాయి. చాలా సందర్భాల్లో వాటిల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంటాయి. ఇక రోడ్డు ప్రమాదాల్లో గుర్తు తెలియని వాహనం ఢీకొడితే చనిపోయేవారికి కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారం ఇస్తుంది. దానికీ చట్టం ఉంది. లైంగిక వేధింపు బాధితులకు ప్రభుత్వం సాయం ఇచ్చేందుకు ఫండ్ ఉంది. ఈ మూడు అంశాలూ మినహాయించి మిగిలిన సందర్భాల్లో ప్రభుత్వాలు ఇచ్చే పరిహారం చాలా వరకూ విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది.

సరిగ్గా ఈ ప్రభుత్వ విచక్షణ అనే పాయింట్ దగ్గరే ‘‘ఎంత’’ అనే సమస్య వస్తుంది. ఉదాహరణకు విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరణించిన వ్యక్తికి కోటి రూపాయల పరిహారం ఇచ్చింది. కానీ ఆ తరువాత విశాఖపట్నంలో జరిగిన చాలా పారిశ్రామిక ప్రమాదాల్లో మృతులకు ఆ స్థాయి పరిహారం అందలేదు.

రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2013 అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు రఘువీర చనిపోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఏడుస్తున్న తల్లి సరళ

తెలంగాణలోనూ దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అటు రైతు ఆత్మహత్యల పరిహారం విషయంలో ప్రభుత్వం పెట్టే అనేక నిబంధనలు క్షేత్ర స్థాయిలో పాటించలేక ఎన్నో రైతు కుటుంబాలు పరిహారం పొందలేకపోతున్నాయి. ఆత్మహత్యలపై సాయానికి పరిమితి కూడా పెట్టింది ప్రభుత్వం. క్రీడాకారులకు ఇచ్చే పారితోషికం మరో పెద్ద చర్చ.

ఇవన్నీ పక్కనపెడితే, ప్రభుత్వం కారణంగా లేదా ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన వారికి, ఎక్కడో రోడ్డుపై జరిగిన ప్రమాదానికీ బాధ్యులైన వారికి ఒకే పరిహారం ఎలా ఇస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

‘‘నిజానికి ఈ విషయంపై ప్రభుత్వానికి ఏ నియమావళి లేదు. ప్రభుత్వం అప్పటి ఎమోషన్‌ను బట్టి, రాజకీయ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటూ వెళుతోంది. ప్రమాదం జరిగిన చోటు, బాధితుల బ్యాగ్రౌండ్, బాధితుల సంఖ్య, రాజకీయ పరమైన అంశాలు – ఇవన్నీ లెక్కలేసుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అంత పెద్ద దుమారం లేవని అంశం అయితే నామమాత్రంగా ఇచ్చి సరిపెడుతున్నారు. అంతే తప్ప దీనికంటూ ప్రత్యేకంగా నిబంధనలు ఏమీ లేవు’’అని న్యాయవాది శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, @TELANGANACMO

అయితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఇచ్చిన పరిహారం విషయంలో మాత్రం ప్రభుత్వ వైఖరి సరైంది కాదని ఆయన అన్నారు.

‘‘ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, సిబ్బంది తప్పు చేసినప్పుడు దానిపై కోర్టుకు వెళ్లి జరిగిన నష్టానికి తగిన పరిహారం తెచ్చుకోవచ్చు. ప్రభుత్వ సిబ్బంది అలసత్వం లేదా తప్పిదానికి ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుంది? అనే విషయంలో దశాబ్దాల నుంచి అనేక విభిన్నమైన తీర్పులు ఉన్నాయి. కానీ స్థూలంగా తీవ్రమైన నష్టం, ప్రభుత్వ సిబ్బంది చర్యల వల్ల జరిగినప్పుడు కచ్చితంగా కోర్టులో కేసు వేయడం ద్వారా తగిన పరిహారం పొందవచ్చు’’అని శ్రీనివాస్ వివరించారు.

ఇతర రాష్ట్రాల వారికీ, ప్రభుత్వ రాజకీయ ఉద్దేశాల ప్రకారం పరిహారం ఇవ్వవచ్చా అనే విషయంలో ఎక్కడా స్పష్టమైన నిబంధనలు లేవని చెబుతున్నారు పరిపాలనా నిపుణులు.

ఉదాహరణకు ముఖ్యమంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి కార్యాలయ విచక్షణ మీద ఇస్తారు. ఇందులో చట్టపరమైన అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే, ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధుల విషయంలో శాసన సభకు కచ్చితంగా జవాబుదారీగా ఉంటుంది. అదే సందర్భంలో కొన్ని పద్దుల కింద ప్రభుత్వం చేసే ఖర్చుకు వారికి ప్రత్యేక అధికారాలు ఉంటాయని చెబుతున్నారు.

‘‘ఇలాంటివి చట్ట ప్రకారం కాకుండా, కాస్త విచక్షణా పరమైన స్వేచ్ఛ ఉన్న పద్దుల్లోంచి ఇస్తారు. ఉదాహరణకు పంజాబ్ రైతులకు కేసీఆర్ పరిహారం వంటివి. అవతలి వ్యక్తులు భారతీయ పౌరులే కాబ్టటి పెద్దగా చట్టపరమైన అభ్యంతరాలు ఉండవు’’అని మరో న్యాయవాది సీతారాం వివరించారు.

వీడియో క్యాప్షన్, ఇబ్రహీంపట్నంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మరణాలు... ఎవరిదీ పాపం?

అసలైన చర్చ దాని చుట్టూనే..

ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పాతకాలం రాజుల్లా చేస్తున్నారు. ఆయన ఏమనుకుంటే అదే చేస్తారు. చట్టబద్ధంగా వెళ్లడం కాకుండా, రాజుగారికి నచ్చితే ముత్యాలహారం ఇచ్చే పద్ధతిలో ఉంది. కేబినెట్ సలహా లేదా అడ్వైజరీ కమిటీ కాకుండా, నిబంధన అంటూ లేకుండా ఒక వ్యక్తి విచక్షణ ప్రకారం వెళుతోంది. ప్రభుత్వం ప్రమాణం ప్రకారం వెళ్లాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఇష్టమే ప్రమాణం అవుతోంది.

మనిషి మరణించినప్పుడు కుటుంబం కష్టాల్లో ఉంటుంది కాబట్టి ఆ కుటుంబాన్ని కాపాడడం, సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి సాయం ఇవ్వాలి. కానీ దానికీ ఒక ప్రమాణం ఉండాలి. కానీ తనకు నచ్చినట్టు ఇస్తూంటారు.

మరో ముఖ్యమైన విషయం కేసీఆర్ గారికి జాతీయ రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. అప్పటి నుంచీ ఇది మొదలైంది. ఉదాహరణకు సైనికుడికి ఐదు కోట్లు ఇస్తే వాళ్లు సంతోషిస్తారు. సైన్యంలోని అన్ని రాష్ట్రాల వారూ చర్చించుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఐదు కోట్లు ఇచ్చాడు అనుకుంటారు. ఐదు కోట్ల వల్ల తనకు వచ్చే గుడ్ విల్ గురించి ఆలోచిస్తున్నారాయన. ఇప్పుడు ఆయన ఇమేజ్ బిల్డింగ్ పనిలో ఉన్నారు. పంజాబ్ లో మూడు లక్షలు ఇస్తే అక్కడ కేసీఆర్ గురించి చర్చ జరుగుతంది.

జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆయన ఇప్పుడు లేడు. అందులో ఎంట్రీ కోసం తన చర్చలో ఉండడం ద్వారా ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఈ డబ్బు ఇవ్వడం వెనుక ఈ యాంబిషన్ ఉందని నాకు అనిపిస్తోంది. అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)