‘ప్రపంచానికి నాయకత్వం వహించే దేశం‘గా అమెరికా తన ప్రతిష్ఠను కోల్పోయిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మార్క్ లోవెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ మాజీ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేతిలో చేయి వేసి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటి నుంచీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ భుజం పై చేయివేసి మాట్లాడేవరకూ.. ఇరువురు నాయకులకు మేక్రాన్ అభివాదం చేసిన తీరు చూస్తే, యూరోపియన్ యూనియన్ నాయకులు అమెరికాలో మారిన ప్రభుత్వాలను చూస్తున్న విధానం సులభంగా అర్ధమవుతుంది.
మే 2017లో జరిగిన నాటో సమావేశంలో మేక్రాన్.. డోనల్డ్ ట్రంప్ చేతిలో చేయివేసి ఆయన ముఖం వైపు చూశారు. "ఆయన ముఖం అమాయకంగా లేదు. ద్వైపాక్షిక చర్చల్లో నేను ఏ అంశాన్నీ సులువుగా వదలను" అని ఆ తర్వాత మేక్రాన్ అన్నారు.
సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత కార్న్‌వాల్‌లో జరిగిన జి-7 సమావేశంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేతిని మేక్రాన్ పట్టుకున్నారు. ఒక వైపు ఆ క్షణాన్ని కెమెరాలు బంధిస్తుండగా, బైడెన్ భుజంపై చేయి వేసి సముద్ర తీరంలో నడిచారు. వారి హావభావాల్లో వచ్చిన తేడా స్పష్టంగా కనిపించింది. మళ్ళీ రెండు దేశాలూ చేతిలో చేయి వేసుకుని తిరుగుతున్నట్లు కనిపించాయి.
అయితే, జో బైడెన్ తొలి పర్యటనలో ఆస్వాదించిన మధుర క్షణాలను ఆ తర్వాతి పరిణామాలు చెడగొట్టాయి. ఇది కేవలం అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడం వల్ల జరిగింది కాదు. ఈ విషయంలో అమెరికా మిత్రదేశాలతో సరైన రీతిలో సమన్వయంతో ముందుకు వెళ్లలేదనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా, అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి వైదొలిగే సమయానికి నాటో మిషన్‌కు చెందిన 36 దేశాల సేనలు అక్కడే ఉన్నాయి. అందులో మూడు వంతుల మంది అమెరికన్లు కాదు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి జర్మనీ సేనలు యుద్ధం కోసం అఫ్గానిస్తాన్ వెళ్లాయి. దాంతో, ఈ మొత్తం వ్యవహారం ముగిసిన తీరు పట్ల విపరీతమైన గందరగోళం నెలకొంది.
"నాటో స్థాపించనప్పటి నుంచీ చూస్తే, అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడం తొలిసారి నాటోకు కలిగిన అతి పెద్ద ఓటమి" అని జర్మనీ ఛాన్సలర్ పదవికి పోటీ చేస్తున్న కన్సర్వేటివ్ అభ్యర్థి ఆర్మిన్ లాస్చెట్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఇది పిరికిపంద వ్యవహారం" అని చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమాన్ వ్యాఖ్యానించారు.
"ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా అమెరికా తన ప్రతిష్ఠను కోల్పోయింది" అని ఆయన అన్నారు.
"జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఆయనపై చాలా ఎక్కువగా అంచనాలు ఉండేవి. అందులో కొన్ని నెరవేరేలా లేనివి కూడా ఉన్నాయి" అని స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్ బీబీసీతో అన్నారు.
"అమెరికా తిరిగి పుట్టింది" అని బైడెన్ అన్న మాటలు మా సంబంధాల్లో స్వర్ణయుగాన్ని సూచించాయి. కానీ, ఆ విధంగా జరగలేదు.
‘‘అతి తక్కువ సమయంలోనే పరిస్థితులు మారిపోయాయి. అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడం పట్ల ఇతర దేశాలతో చర్చలు జరపకపోవడం ఒక మచ్చను మిగిల్చింది" అని అన్నారు.
ప్రపంచ వ్యవహారాల్లో సరైన రీతిలో వ్యవహరించే విషయంలో డోనల్డ్ ట్రంప్ పట్ల 10 శాతం ఉన్న జర్మన్ల నమ్మకం జో బైడెన్ విషయంలో 79 శాతానికి పెరిగినట్లు గత సంవత్సరం ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన పోల్ తెలిపింది. ఫ్రాన్స్‌లో కూడా ఇలాంటి ఫలితాలే కనిపించాయి.
కానీ, "చాలా యూరోప్ దేశాలు నేడు తమను తిరస్కరించారనే భావంతో ఉన్నాయి" అని 2019 వరకు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న నటాలీ లోజు అన్నారు.
"ట్రంప్ పదవి నుంచి వైదొలిగే వరకూ వేచి చూస్తే, తిరిగి పాత సాధారణ స్థితికి వస్తామని వారంతా భావించారు. కానీ, ఆ పాత రోజులు ఇక లేవు. ఇది మమ్మల్ని తట్టి లేపడం లాంటిదే" అని అన్నారు.
అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి వైదొలిగిన తీరు, మరే ఇతర దేశాల పునర్నిర్మాణానికీ సేనలను పంపదని జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు డోనల్డ్ ట్రాంప్ అవలంబించిన "అమెరికా ఫస్ట్" (ముందు అమెరికా) విధానాన్ని ప్రతిధ్వనించాయి.
కానీ, యూరోపియన్ యూనియన్ దేశాలతో అమెరికా సంప్రదింపులు జరపకపోవడం పట్ల ఒక వైపు చికాకు ఉన్నప్పటికీ, అమెరికాలో మారిన ప్రభుత్వాలతో వచ్చిన ఉపశమనాన్ని ఇది ఎంత వరకు కుంగదీస్తుందో ఇప్పట్లో చెప్పడం కష్టం.
"ట్రంప్ పాలనలో ప్రత్యేకంగా విదేశీ విధానాల వల్ల కంటే కూడా, అందరూ ఒకేలాంటి విలువలను పాటించడం లేదనే అంశం పై వైరం తలెత్తింది" అని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్ సలహాదారు, హార్వర్డ్ ప్రొఫెసర్ నథాలీ టోకీ అన్నారు.
"ట్రంప్ పరిపాలనలో "అమెరికా ఫస్ట్" అని అంటున్నందుకు కలిగిన వేదన కంటే.. ఆయన పుతిన్, జింగ్‌పిన్‌లతో ఎక్కువగా కాలుదువ్వుకునేవారని అంతా ఆందోళన చెందేవారు. మేమంతా ఒకే వైపు ఉన్నామా లేదా అని అఫ్గానిస్తాన్ విషయంలో ఆయన ప్రశ్నించలేదు. కానీ, ప్రపంచ దేశాల నుంచి దూరంగా జరుగుతూ అమెరికా తమ స్వదేశంలో విలువలను సంరక్షించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొచ్చు. కానీ, మిగిలిన దేశాల మాటేంటి? అనే సందేహం యూరోప్ దేశాల్లో వ్యక్తమవుతోంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి, అమెరికా దీర్ఘకాలంలో ఏకాకిగా వ్యవహరించాలనే తీరును కొనసాగిస్తుందనే కోణంలోనే కొంత మంది అఫ్గానిస్తాన్ అంశాన్ని కూడా చూస్తున్నారు.
"ఇదేమైనా కొత్త విషయమా? అని టోకి ప్రశ్నించారు.
"ఇది అమెరికా గురించి యూరోప్ ఎప్పుడూ చేసే ఫిర్యాదే. ప్రస్తుతం అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి వైదొలిగే విషయంలో కూడా ఎటువంటి సమన్వయం లేకుండా వ్యవహరిస్తోంది. అఫ్గాన్‌లో అడుగు పెట్టినప్పుడు మాత్రం అలా చేయలేదు" అని అన్నారు.
యూరోప్ ప్రతిసారీ అన్ని విషయాల్లో తోడుగా నిలబడుతోందనే భావన వ్యూహాత్మకంగా స్వయం ప్రతిపత్తి గురించి చర్చను తిరిగి తెర మీదకు తీసుకొచ్చింది. ముఖ్యంగా అమెరికాతో సమానంగా భౌగోళిక రాజకీయ సమానత్వం ఉండాలని ఫ్రాన్స్ కోరుకుంటోంది. ఇది యూరోపియన్ యూనియన్ దీర్ఘకాల లక్ష్యం.
"యూకే, జర్మనీ లాంటి దేశాలు భద్రత విషయంలో అమెరికా మీద ఆధారపడవచ్చని ఎప్పుడూ భావిస్తాయి" అని మాజీ ఫ్రెంచ్ మంత్రి లోజు అన్నారు.
"దాంతో, కాలం మారిందని వారు భయపడుతున్నారు. కానీ, నాటో పని తీరు గురించి మనం తిరిగి ఆలోచించాలి అని చాలా సార్లు చెప్పాం. మనం తిరస్కారానికి గురయ్యామనే భావనతో ఉండకూడదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవైపు ఇతర ట్రాన్స్ అట్లాంటిక్ అంశాలు ముదురుతుండగా, అఫ్గానిస్తాన్ గందరగోళం తలెత్తింది. దాంతో, జో బైడెన్ పట్ల యూరోప్ కున్న స్నేహభావం క్షీణిస్తోంది.
ట్రంప్ పాలనలో యూరోపియన్ ఉత్పత్తులపై విధించిన వాణిజ్య సుంకాలను పూర్తిగా తొలగించకపోవడం, కోవిడ్ వ్యాక్సీన్లకు పేటెంట్లను తొలగించాలని యూరోపియన్ యూనియన్‌ను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడం, మహమ్మారి సమయంలో యూరోపియన్ దేశాలపై విధించిన ప్రయాణ నిబంధనలను తొలగించకపోవడంతో సవాళ్ళు ఎదురయ్యాయి.
"ప్రయాణ నిబంధనల విషయంలో పరస్పర అంగీకారం ఉన్నట్లు కనిపించటం లేదు. యూరోపియన్ యూనియన్ సురక్షితంగా ప్రయాణం చేసే దేశాల జాబితా నుంచి అమెరికాను తొలగించింది. దీంతో, వచ్చే వారం తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్లు యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ మార్గరైటిస్ చీనాస్ చెప్పారు. ఇదంతా యూరోపియన్ యూనియన్, అమెరికా మధ్య పెరుగుతున్న విభేదాలకు అద్దం పడుతోంది" అని అన్నారు.
యూరోపియన్ యూనియన్‌కి రెండు రకాలైన విచారాలున్నాయి.
మొదటిది అఫ్గానిస్తాన్‌లో తలెత్తిన సంక్షోభం శరణార్ధుల సమస్యను సృష్టిస్తుంది. దాంతో, 2015లో 10 లక్షల మంది శరణార్థులు సిరియాతో పాటు కొన్ని ఇతర దేశాల నుంచి యూరోప్‌కు వలస వెళ్లిన పరిస్థితి తిరిగి తలెత్తే అవకాశం ఉంది.
రెండవది, సొంత ప్రయోజనాలపై దృష్టి పెట్టిన అమెరికాకు ఏంజెలా మెర్కెల్ లేని జర్మనీ, త్వరలోనే అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్న ఫ్రాన్స్ మిగిల్చిన అధికార ఖాళీని ఇప్పటికే రష్యా, చైనా పూరిస్తున్నాయనే ఆందోళన ఉంది. ఇది, పశ్చిమ దేశాలు తిరగబడతాయనే భయం లేకుండా తైవాన్‌ను బెదిరించేందుకు చైనాకు ప్రోద్బలం ఇస్తుంది.
"ఒకప్పుడు గ్లోబల్ ఆర్డర్‌ను కాపాడాలని అమెరికా మాట్లాడేది" అని కార్ల్ బిల్డ్ అన్నారు.
"కానీ, ప్రస్తుతం వైట్ హౌస్ నుంచి అలాంటి భాష వినిపించటం లేదు. ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి పెట్టుకున్న అంచనాలు కరిగిపోయాయి. అమెరికా తనకు నచ్చిన తీరులోనే వ్యవహరిస్తుందనే నిర్ణయానికి అంతా వచ్చేశారు".
ఇవి కూడా చదవండి:
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









