అఫ్గాన్‌ నుంచి సేనల ఉపసంహరణతో భారత్‌లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?

భారత్ అమెరికా

ఫొటో సోర్స్, Indian External Affairs Ministry/Handout/Anadolu A

    • రచయిత, సచిన్ గొగోయ్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

అఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించడం, తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడంతో భారతదేశంలో అమెరికాపై విశ్వసనీయత సన్నగిల్లినట్లు కనిపిస్తోంది.

అఫ్గానిస్తాన్‌లోని అనేక ప్రాజెక్టుల్లో భారత ప్రభుత్వం అమెరికాతో కలిసి పనిచేసింది.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా యుద్ధం, అలాగే సేనల ఉపసంహరణ తీరుపై భారతీయ మీడియా, నిపుణులు ఘాటుగా విమర్శిస్తున్నారు.

భారతదేశానికి మంచి సంబంధాలున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌ నుంచి నిష్క్రమించడం సహజంగానే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా భావించాలి. అఫ్గానిస్తాన్‌లో భారతదేశం పెట్టుబడి పెట్టిన దాదాపు 22 వేల కోట్ల రూపాయల భవిష్యత్తు గురించి కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

అదే సమయంలో అఫ్గానిస్తాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్తాన్ ఉపయోగించవచ్చనే భయం కూడా ఉంది.

ఈ తాజా పరిణామాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత మీడియా చెబుతోంది.

''అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తిరిగి వెళ్లడంతో అంతా గందరగోళంగా మారింది. బీభత్సమైన వాతావరణం అఫ్గాన్లకు విషాదాన్ని మిగిల్చింది. వాస్తవానికి ఇదంతా అమెరికా తప్పు'' అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన సంపాదకీయంలో పేర్కొంది.

''అఫ్గానిస్తాన్‌లోని పరిస్థితిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. ఇది దేశం ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు అవుతుంది'' అని ఎడిటోరియల్‌లో ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్ అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

''శక్తివంతమైన దేశం చిత్తుగా ఓడింది'' అని అఫ్గాన్‌లో తాజా పరిణామాలను విశ్లేషిస్తూ హిందీ వార్తాపత్రిక దైనిక్ భాస్కర్ వ్యాఖ్యానించింది. అమెరికా సుదీర్ఘ యుద్ధం ముగిసింది. ''ఓడిపోయిన సైనికులు'' అర్ధరాత్రి కాబుల్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు అని తన రిపోర్టులో పేర్కొంది.

''ప్రపంచ జిహాద్ చరిత్రలో గొప్ప విజయం'' సాధించడానికి తాలిబాన్లకు అమెరికా ''సహాయం'' చేసిందని భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానీ అన్నారు. అఫ్గానిస్తాన్ విషయంలో బైడెన్ వ్యవహరించిన తీరుతో తీవ్రంగా నష్టపోయిన దేశంగా భారత్ అవతరించిందని ఆయన ట్వీట్‌ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అమెరికా, భారత్ స్నేహితులు కావచ్చు. కానీ అమెరికా విధానం భారత భద్రతను ఎల్లప్పుడూ ప్రమాదంలో పడేసేదిగానే ఉంటోంది. భారతదేశానికి చెక్ పెట్టడానికి మొదట పాకిస్తాన్‌కు ఆయుధాలను సరఫరా చేసింది. ఆపై చైనా ఎదుగుదలకు సాయం అందించిందని చెలానీ పేర్కొన్నారు.

అఫ్గాన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియకు అమెరికా సహకారం అందించలేదని కొన్ని మీడియా సంస్థలు విమర్శించాయి. కాబుల్ విమానాశ్రయంలోపల దౌత్య కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని భారత్ ఎన్నిసార్లు అడిగినా అమెరికా నిరాకరించిందని ఆరోపించాయి. దాంతో అఫ్గాన్ నుంచి భారత్ తన రాయబార సిబ్బందిని పూర్తిగా వెనక్కి రప్పించాల్సి వచ్చిందని న్యూస్ వెబ్‌సైట్ క్వింట్ పేర్కొంది.

భారత్ అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌తో అమెరికా సంబంధాలు, ముఖ్యంగా తీవ్రవాదంపై ఉమ్మడి పోరుపై విషయంలో మొదటి నుంచి భారతీయ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఉగ్రవాదంపై పోరుకు అమెరికా తిరిగి పాకిస్తాన్‌పై ఆధారపడుతుందన్న ఆందోళన సర్వత్రా ఉంది.

పాకిస్తాన్‌కు అమెరికా మద్దతు ఇవ్వడం 'ఇంటికి కాపలా ఉండమని దొంగకు డబ్బు చెల్లించిన' చందంగా ఉందని ప్రముఖ జర్నలిస్ట్, బర్ఖాదత్ హిందూస్తాన్ టైమ్స్‌లో పేర్కొన్నారు. 2002 నుంచి పాకిస్తాన్‌కు అమెరికా దాదాపు 240 కోట్ల రూపాయలు సాయం అందించిందని ఆ కథనంలో పేర్కొన్నారు.

''అమెరికా చేసిన ఈ సాయం ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో, భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంలో పాకిస్తాన్‌కు సహాయపడింది'' అని బర్ఖా దత్ ఆ వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కాబుల్ విమానాశ్రయం నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఆగస్టు 26న జరిగిన పేలుళ్ల గురించి సీనియర్ జర్నలిస్ట్ గౌరవ్ సి సావంత్ ప్రస్తావించారు.

కాబూల్ దాడులకు పాల్పడిన వారిని శిక్షించడంలో అమెరికా సీరియస్‌గా ఉంటే, ఖచ్చితంగా "పాకిస్తాన్ సైన్యం" ఐఎస్ఐకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి అని నొక్కిచెప్పారు.

భారత్ అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడాన్ని చాలామంది నిపుణులు అమెరికా శక్తి తగ్గినట్లుగానే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో యూఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలు సభ్య దేశాలుగా ఉన్న క్వాడ్ గ్రూప్ భవిష్యత్తుపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్వాడ్ గ్రూప్‌ను చైనాకు వ్యతిరేకంగా ఏకమైన దేశాల సమూహంగా పరిగణిస్తున్నారు.

స్నేహపూర్వక ఆసియా దేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికాకు క్వాడ్ గ్రూప్ అవకాశం కల్పిస్తుందని ది హిందూ పత్రిక సంపాదకీయం పేర్కొంది. కానీ అలాంటి ప్రయత్నం జరగకపోతే తమ ప్రయోజనాల పట్ల అమెరికా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆసియా దేశాలు భావించొచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)