అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు.. ‘ఒక బీరువాను బలవంతంగా తెరిచారు’

ఫొటో సోర్స్, Getty Images
ఫ్లోరిడాలోని తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు చేసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు. ఇంట్లోని ఒక బీరువాను కూడా వారు బలవంతంగా తెరిచారని చెప్పారు.
'పామ్ బీచ్‌లోని నా నివాసం మార్ ఎ లాగోను పెద్ద సంఖ్యలో ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారు' అంటూ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు.
అధికారిక పత్రాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఎఫ్‌బీఐ ఈ సోదాలు చేసినట్లు చెబుతున్నరు.
2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయనపై చట్టాన్ని ఉపయోగించడం పెరుగుతోంది.
సోమవారం ఫ్లోరిడాలో ఈ సోదాలు జరిగే సమయానికి ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఉన్నారని సీబీఎస్ న్యూస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
సోదాల నేపథ్యంలో ట్రంప్ విడుదల చేసిన ప్రకటనను ఆయన... 'ఇది మన దేశానికి చీకటి కాలం' అంటూ ప్రారంభించారు.
ప్రభుత్వ సంస్థల దర్యాప్తులకు తాను సహకరించానని, అయినా తన ఇంటిపై ఇలా సమాచారం ఇవ్వకుండా దాడి చేయడం సరికాదని ట్రంప్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
'ఇది విచారణపరమైన దుష్ప్రవర్తన, న్యాయవ్యవస్థను ఆయుధంలా వాడుకోవడమే ఇది' అన్నారు ట్రంప్.
'ఇలాంటి దాడి విచ్ఛిన్న దేశాలు, తృతీయ ప్రపంచ దేశాలలో మాత్రమే జరుగుతుంది. విషాదమేంటంటే... ఇప్పుడు అమెరికా కూడా అలాంటి దేశంగానే మారింది, అమెరికాలో మునుపెన్నడూ లేని స్థాయిలో అవినీతి జరుగుతోంది' అన్నారు ట్రంప్.
''వాళ్లు ఇంట్లోని బీరువాలనూ తెరిచారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
డోనల్డ్ ట్రంప్ రెండో కుమారుడు ఎరిక్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. 'నేషనల్ ఆర్కైవ్స్ రికార్డుల నిర్వహణకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా మార్ ఎ లాగో ఎస్టేట్‌లో సోదాలు చేశారు' అని చెప్పారు.
అమెరికా అధ్యక్ష పత్రాలను నిర్వహించే ప్రభుత్వ ఏజెన్స్ నేషనల్ ఆర్కైవ్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో.. ట్రంప్ పదవీ కాలంలో అధ్యక్ష పత్రాల నిర్వహణకు సంబంధించి దర్యాప్తు చేయాలని న్యాయశాఖను కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
మార్ ఏ లాగో నుంచి 15 పెట్టెల్లో రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ ఆర్కైవ్స్ తాజాగా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు ఆ పదవి నుంచి వైదొలగిన తరువాత పదవీకాలం నాటి అధికారిక ఉత్తరాలు, మెయిళ్లు, ఇతర పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, ట్రంప్ అనేక పత్రాలను ఇవ్వకుండా అక్రమంగా చించివేశారని అధికారులు చెబుతున్నారు.
అందులో కొన్ని పత్రాలను తిరిగి అతికించాల్సి వచ్చిందని నేషనల్ ఆర్కైవ్స్ చెప్పింది.కాగా అధికారిక రికార్డులను సక్రమంగా నిర్వహించలేదన్న వార్తలను అప్పట్లో ట్రంప్ ఫేక్ న్యూస్‌గా కొట్టిపారేసేవారు.
మరోవైపు పామ్‌బీచ్‌లోని ట్రంప్ సలహాదారు ఒకరు కూడా ఈ సోదాలు పీఆర్ఏ(ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్)లో భాగమని సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
దాడులు చేసిన వెళ్లిపోయారని... వాళ్లు తీసుకెళ్లిందేమీ పెద్దగా లేదని చెప్పారు.
సాధారణంగా ఫెడరల్ సెర్చ్ వారంట్‌పై న్యాయమూర్తి సంతకం చేయాలి. చట్టాన్ని అమలు చేసే ఈ సంస్థలు ఆధారాల కోసం సోదాలు చేయడానికి ముందు అక్రమాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు చూపాల్సి ఉంటుంది.
ఉదయం 10 గంటల సమయంలో సెర్చ్ వారంట్ ఇచ్చారని.. అక్కడికి కొద్దిసేపటి ముందు సీక్రెట్ సర్వీసెస్‌కు సమాచారం ఇచ్చారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
తలుపులేవీ బద్దలుగొట్టలేదని, మధ్యాహ్నానికి సోదాలు పూర్తి చేసుకుని కొన్ని పెట్టెల్లో పత్రాలు తీసుకెళ్లారని ఆ అధికారి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- పాప్ స్మియర్: మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఈ టెస్ట్ వెనుక ప్రేమ కథ మీకు తెలుసా?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















