ఆంధ్రప్రదేశ్: వాట్సాప్‌లో పోస్టుకు సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్, సీఐడీ కుట్ర కేసు ఎందుకు పెట్టింది

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి సీరియస్‌గా స్పందించారు. ఓ సీనియర్ జర్నలిస్టుని అరెస్ట్ చేశారు. ఏకంగా కుట్ర కేసు కూడా నమోదు చేశారు.
గతంలో పలు పత్రికల్లో పనిచేసిన కొల్లు అంకబాబు అనే జర్నలిస్టుని గురువారం సాయంత్రం విజయవాడలోని ఆయన ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం అరెస్ట్ ధృవీకరిస్తూ, ఆయన్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచారు.
అనంతరం కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయన్ని బెయిలుపై విడుదల చేశారు
పోలీసుల అభియోగం ఏమిటి?
ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్టులో అక్రమంగా బంగారం తరలిస్తూ ఓ మహిళ పట్టుబడ్డారు. ఏలూరుకు చెందిన ఆమెను ఎయిర్ పోర్టు పోలీసులు సెప్టెంబర్ 9న అదుపులోకి తీసుకున్నారు.
దుబాయ్ నుంచి వస్తున్న ఆమె వద్ద 970 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడడంతో ఈ కేసు కలకలం రేపింది.
ఆ కేసుకి సంబంధించి నిందితురాలు ఓ ఐఏఎస్ అధికారి భార్యగా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని కే అంకబాబు వాట్సాప్‌లో పోస్ట్ చేస్తూ, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి భార్య బంగారం తరలిస్తూ పట్టుబడ్డారని ప్రచారం చేశారన్నది ఏపీ సీఐడీ వాదన.
తమకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి, విచారణ చేయగా, ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశామని సీఐడీ అధికారులు కోర్టుకు తెలియజేశారు.

ఫొటో సోర్స్, TWITTER/APCID
'అరగంటలో పంపిస్తామని తీసుకెళ్లారు..'
అంకబాబుకు గతంలో ఈనాడు, ఉదయం వంటి వివిధ పత్రికల్లో పనిచేసిన అనుభవం ఉంది. గత ప్రభుత్వంలో హోం మంత్రి వద్ద కూడా పనిచేశారు.
గురువారం సాయంత్రం ఆయన ఇంటి వద్ద ఉండగా, కొందరు పోలీసులు వచ్చి భయకంపితులను చేసేలా వ్యవహరించారని అంకబాబు భార్య ఆరోపించారు. తన భర్తను పోలీసులు అపహరించారంటూ ఏపీ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీజీపీలకు లేఖ కూడా రాశారు.
"మఫ్టీలో పోలీసులు వచ్చారు. ఓ కేసు విషయమై మాట్లాడాలి అన్నారు. వారిలో ఓ మహిళా పోలీసు కూడా ఉన్నారు. దురుసుగా ఇంట్లోకి దూసుకొచ్చి, అరగంటలో పంపిస్తామంటూ ఉన్నపళంగా తీసుకెళ్లారు. ఆయన ఎవరికైనా ఫోన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు’’ అని అంకబాబు భార్య అన్నారు.
‘‘ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. ఏం జరిగిందో చెప్పలేదు. చీకటి పడిన తర్వాత వచ్చి, 70 ఏళ్లు దాటిన వ్యక్తిని ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పకుండా వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు" అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
తన భర్తను అపహరించి, ఎక్కడ ఉన్నారో చెప్పకుండా పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ తొలుత ఆమె మీడియా ముందు వాపోయారు.
ప్రమాదకర ధోరణి అంటున్న జర్నలిస్టులు
ఏపీలో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి మీద, ఇతరుల మీద చేసిన పోస్టులకు, విమర్శలకు ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. విపక్షాలకు చెందిన వారిని అరెస్ట్ చేశారు కూడా.
టీడీపీ హయంలో కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన సమయంలో, జగన్ దానిని తప్పుబట్టారు. సోషల్ మీడియాలో పోస్టులకే అరెస్ట్ చేస్తారా అంటూ విమర్శించారు.
కానీ, గడిచిన మూడేళ్లలో దాదాపు 40 మందిని కేవలం సోషల్ మీడియాలో చేసిన పోస్టులకే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారిలో టీడీపీ, జనసేన కార్యకర్తలున్నారు. యూట్యూబ్ చానెళ్ల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ కొందరని అరెస్ట్ చేశారు.
ఒక సీనియర్ జర్నలిస్టును అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడంతో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అక్రమ కేసులు ఉపసంహరించాలంటూ డిమాండ్ చేశారు.
"ఎమర్జన్సీ సమయంలో కూడా ప్రింటుకు సిద్దమయిన పేజీలు అప్పటి సమాచార శాఖ అధికారి ఆమోదం పొందాకే అచ్చుకు వెళ్ళేవి. ఇలాంటి సెన్సార్‌కు వ్యతిరేకంగా ఆనాడు ఎంతోమంది జర్నలిస్టులు నిరసనలు తెలిపి జైలుకెళ్లిన చరిత్ర ఉంది. పత్రిక స్వేచ్ఛను కాపాడేందుకు విజయవాడలో కూడా పాత్రికేయ సంఘాలు అప్పట్లో ఉద్యమించాయి. మళ్ళీ అలాంటి ప్రమాదమే ఇప్పుడు మీడియాను వెంటాడుతోంది’’ అని సీనియర్ జర్నలిస్ట్ గాలి నాగరాజు అన్నారు.
‘‘ఇప్పుడు జగన్ కావచ్చు. చంద్రబాబు కావచ్చు. మరొకరు కావచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావించే ఒక న్యూస్ ఫీడ్‌ను ఆయన వాట్సాప్ ద్వారా షేర్ చేసారని అభియోగం. అంతమాత్రానికె అరెస్టు చేయాలా?" అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వంలో అంతమంది సలహాదారులున్నారు.. ఇంత చిన్న విమర్శను కూడా సహించలేకపోతే ఎలాగని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అరెస్ట్‌ను ఖండించిన ప్రతిపక్ష నేతలు
అంకబాబు అరెస్ట్ సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు స్పందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నేరుగా డీజీపీకి లేఖ రాశారు.
"వాట్సాప్‌లో ఒక వార్తను ఫార్వర్డ్ చేసిన కారణంగానే అరెస్ట్ చెయ్యడం అన్యాయం. అక్రమ కేసులు, అరెస్టులతో సీఐడీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతోంది. 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్‌ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుంది. విజయవాడ ఎయిర్ పోర్ట్‌లో బంగారం పట్టుబడిన విషయం వాస్తవం కాదా? ఆ వార్తను ఫార్వర్డ్ చేస్తే తప్పు ఏంటి? వెంటనే అంకబాబును విడుదల చేయాలి" అంటూ చంద్రబాబు కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా అందరినీ తప్పుడు కేసులతో అదుపు చేయాలని చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. అంకబాబు మీద పెట్టిన ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.
అంకబాబుపై సీఐడీ అధికారులు ఐపీసీ 120B, 153, 550 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఐపీసీ 120B ప్రకారం, శిక్షార్హమైన నేరానికి పాల్పడే, నేరపూరిత కుట్రలో భాగస్వామ్యం పంచుకునే కేసుల్లో ఈ సెక్షన్ వర్తిస్తుంది.
ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా, ఉద్దేశపూర్వకంగా నేరాలకు పాల్పడితే ఐపీసీ సెక్షన్ 153 వర్తిస్తుంది. ఇతరులను కించపరిచేలా, అపఖ్యాతి పాలు చేసేందుకు చేసిన ప్రయత్నాలకుగానూ సెక్షన్ 550 వర్తిస్తుంది.
ఈ మూడు నేరాలకు అంకబాబు పాల్పడినట్టు సీబీఐ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- డేటింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్‌ను ఎలా నడిపిస్తారు?
- టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
- ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












