Indian Railways: కొత్తపల్లి రైల్వే ప్రమాదం - పట్టాలపై పనిచేసేవారి ప్రాణాల రక్షణ ఎలా

కొత్తపల్లి రైల్వే ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సెప్టెంబర్ 20న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయినవారిలో రైల్వే పట్టాలపై మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్న ఇద్దరు రోజువారి కూలీలతో పాటూ రైల్వే ఉద్యోగి ఒకరు ఉన్నారు.

‘మిషన్ రఫ్తార్’లో భాగంగా రైళ్ల వేగం పెంచే పనులు కొనసాగుతున్నాయి. వీటిలో భాగంగానే చాలాచోట్ల రైల్వే లైన్ల నిర్మాణం, మెయింటెనెన్స్, రిపేర్ పనులు జరుగుతున్నాయి.

అయితే, తాజా ఘటన అనంతరం.. రైల్వే సిబ్బంది పనిచేసే ప్రాంతాల్లో భద్రత ప్రమాణాల అంశం చర్చనీయమవుతోంది.

కొత్తపల్లి రైల్వే ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM

అసలు ఆరోజు ఏం జరిగింది?

సెప్టెంబర్ 20న కొత్తపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని హుసేన్ మియా వాగు వంతనె వద్ద రైల్వే పట్టాలపై గ్రీజ్ రాసే పనిని కూలీలు చేస్తున్నారు.

ఆ సమయంలో బెంగళూరు నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని రైలు వారిని ఢీకొంది. దీంతో రైల్వే ఉద్యోగి కత్తుల దుర్గయ్యతోపాటు రోజు కూలీలు పెగడ శ్రీనివాస్, కాంపెల్లి వేణుకుమార్ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదం నుంచి ఊదరి శ్రీనివాస్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు.

కొత్తపల్లి రైల్వే ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM

ఫొటో క్యాప్షన్, ఊదరి శ్రీనివాస్

130 కి.మీ. వేగంతో రైలు మాపైకి వచ్చింది

ఒక సెకన్ కాలంలో అంతా జరిగిపోయిందని ఈ ప్రమాదం నుండి బయటపడ్డ ఊదరి శ్రీనివాస్ చెప్పారు.

డిగ్రీ చదువును మధ్యలో ఆపేసిన శ్రీనివాస్ 2013 నుంచి ఆటో నడుపుతున్నారు. ‘‘కరోనా సమయంలో ఆటో అమ్మేయాల్సి వచ్చింది. 20 రోజుల కింద రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ పనులకు కూలీగా చేరాను. రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రాకను గుర్తించే లోపే ప్రమాదం జరిగిపోయింది’’అని ఊదరి శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.

‘‘నా చేతిలో గ్రీజ్ అయిపోవడంతో, తల పైకెత్తి గ్రీజ్ డబ్బా కోసం చూశాను. మేం పనిచేస్తున్న ట్రాక్‌లో అత్యంత సమీపంలోకి ట్రైన్ వచ్చింది. నా తోటి కార్మికులను గట్టిగా హెచ్చరించి ట్రాక్ పక్కకు జంప్ చేశాను. అంతే ఆ తర్వాత కొద్ది సేపటివరకు నాకు ఏం గుర్తులేదు. తేరుకుని చూస్తే ముగ్గురిని ఢీకొట్టి రైలువెళ్లిపోయింది. వారి మృతదేహాలు కనిపించాయి’’ అని ఆయన చెప్పారు.

‘‘మా ట్రాక్ పైనే ట్రైన్ వస్తుందన్న విషయం గురించి మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. మాతోపాటు ఉన్న రైల్వే విభాగం వ్యక్తి ట్రైన్ సమాచారం గురించి హెచ్చరించాలి. కానీ అలా జరగలేదు. నాతోపాటు ఉన్న కూలీల్లో దీర్ఘకాలంగా రైల్వే ట్రాక్‌లపై పనులు చేసిన అనుభవం ఎవరికి లేదు. ఈ పనికి అందరం కొత్తే. ట్రైన్ వస్తున్న వైబ్రేషన్ కానీ, శబ్దం కానీ మాకు వినిపించలేదు. అది 130 కి.మీ. వేగంతో వచ్చింది’’ అని ఊదరి శ్రీనివాస్ అన్నారు.

కొత్తపల్లి రైల్వే ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM

పనిలో చేరిన మరుసటిరోజే ప్రాణాలు పోయాయి

రైల్వే ఉద్యోగి ‘మేట్ కత్తుల దుర్గయ్య’ గతంలో ఒకసారి విధి నిర్వహణలో రైలు ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే, ఈ సారి ప్రమాదం నుండి తప్పించుకోలేక పోయారు. దుర్గయ్యతో పాటు ప్రాణాలు కోల్పోయిన కూలీలు పెగడ శ్రీనివాస్, కాంపెల్లి వేణుకుమార్‌లు రైల్వే పనులకు కొత్త వారు.

మృతుల్లో ఒకరైన వేణుకుమార్ కుటుంబాన్ని కలిసేందుకు అతని స్వగ్రామం పెద్దపల్లి జిల్లా నర్సాపూర్ గ్రామానికి బీబీసీ వెళ్లింది. రైల్వే పనుల్లో చేరిన మరుసటి రోజే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఊరు చివర పొలాల మధ్య రేకుల షెడ్డులో వేణుకుమార్ కుటుంబం నివసిస్తోంది. వేణుకుమార్ తండ్రి పోచయ్యతో పరామర్శకు వచ్చిన బంధువులతో మాట్లాడుతూ కనిపించారు. వేణుకుమార్‌కు ఇద్దరు పిల్లలున్నారు.

కొత్తపల్లి రైల్వే ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM

ఫొటో క్యాప్షన్, మృతుడు కాంపెల్లివేణు కుమార్ కుటుంబం

కాంపెల్లి వేణుకుమార్ ఐటీఐ పూర్తి చేశారు. కరోనావైరస్ వ్యాప్తికి ముందు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఫ్లైట్ క్యాంటీన్‌లో, భార్య వాణి ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఆయాగా పని చేసేవారు.

తమ కుటుంబ ఆర్థిక పరిస్థితితోపాటు ఏ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను వదిలి స్వగ్రామం నర్సాపూర్‌కు తిరిగి రావాల్సివచ్చిందో బీబీసీకి వాణి వివరించారు.

‘‘కరోనా తర్వాత మా కుటుంబ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగ భద్రత కరవయింది. జీతం సరిగా వచ్చేది కాదు. దీంతో ఇంటి కిరాయి, పిల్లల స్కూల్ ఫీజులు కూడా కష్టంగా మారాయి. పరిస్థితుల్లో ఏమార్పు లేకపోవడంతో రెండు నెలల క్రితం మా స్వంత గ్రామానికి వచ్చాం’’అని ఆమె చెప్పారు.

‘‘మొదట కరీంనగర్‌లో ఓ ఆసుపత్రిలో ఆయన పనికి కుదిరారు. అయితే ఎక్కువ పని గంటలు ఉండటంతో రైల్వే పట్టాలపై కూలిపనికి పోయారు. రైల్వే లైన్‌పై పనులకు వెళ్లొద్దని చెప్పాను. అక్కడ చేతిలో జెండాలు పట్టుకుని పనిచేయిస్తారని, ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. ఇప్పుడు నేను ,నా పిల్లలు పెద్ద దిక్కు లేని వారిమయ్యాం. మా కుటుంబాన్ని ఆదుకోవాలి”అని వాణి అన్నారు.

కొత్తపల్లి రైల్వే ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM

ఫొటో క్యాప్షన్, మృతుడు పెగడ శ్రీనివాస్ కుటుంబం

‘‘మేం భయపడతామని.. రైలు పట్టాలపై పనులకు వెళ్తున్న విషయం దాచాడు’’

ఈ ప్రమాదంలో మరణించిన మరో వ్యక్తి పెగడ శ్రీనివాస్. పెద్దపల్లి మార్కెట్‌లో ఉల్లిగడ్డల బస్తాలు మోసే రోజువారి హమాలీ పని ఆయన చేసేవారు. వారసత్వ ఆస్తికి సంబంధించిన వివాదాల పరిష్కార పనుల కారణంగా కొన్ని రోజులు పనికి పోలేదు. దీంతో యజమాని శ్రీనివాస్‌ను పనిలో నుంచి తీసివేశారని, ఆ పరిస్థితుల్లో సమీప బంధువు ఆయనను రైల్వే కాంట్రాక్టర్ వద్ద 15 రోజుల కిందట పనికి కుదిర్చారని ఆయన కుటుంబ సభ్యులు బీబీసీతో చెప్పారు.

డిగ్రీ పూర్తయి బీఈడీ చదవాలనుకుంటున్న పెద్ద కూతురు ప్రియాంక, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మరో కూతురు ఉషారాణి, అందరికంటే చిన్నవాడు గణేష్ తల్లి లక్ష్మిని ఓదారుస్తూ కనిపించారు.

పెగడ శ్రీనివాస్ తల్లి ప్రమీల గతేడాది కరోనాతో పెద్ద కుమారున్ని కోల్పోయారు. ఇప్పుడు చిన్నవాడైన పెగడ శ్రీనివాస్ రైలు ప్రమాదం కారణంగా ఆమెకు దూరమయ్యారు.

‘‘ఎందుకు పనిలో నుండి తీసివేశారని రెండుమూడు సార్లు వెళ్లి అడిగినా పనిలో చేర్చుకోలేదు. రైల్వే పట్టాలపై పనులకు వెళ్తున్న విషయం మొదట మావద్ద దాచాడు. పస్తులైనా ఉందాం, ఆ ప్రమాదకర పనికి వెళ్లొద్దని కాళ్ల మీద పడ్డాం. నేను కూలికి పోతున్నా, దొంగతనానికి కాదు అని అన్నాడు’’ అని పెగడ శ్రీనివాస్ భార్య లక్ష్మి వాపోయారు.

‘‘ఏ ఆస్తులు లేవని, బాగా చదువుకోవాలని చెప్పేవారు. అంతా అనుకోకుండా జరిగిపోయింది’’ అని శ్రీనివాస్ చిన్న కూతురు ఉషారాణి చెప్పారు.

‘‘పట్టాల వద్ద సరైన భద్రత ఏర్పాట్లు ఉంటే ఇన్ని జీవితాలు రోడ్డునపడేవి కాదు. రైలు వస్తున్న సంగతి ముందే హెచ్చరించాలి కదా? ఆయన చావడానికి పోలేదు, కూలీ చేసి పిల్లలను పోషించుకుందామని పోయాడు. ’’ అని పెగడ శ్రీనివాస్ బంధువు అర్కూటి కవిత అన్నారు.

అన్నీ కరెక్ట్ గా ఉంటే ఇన్ని జీవితాలు రోడ్డుమీద పడేది కాదు కదా సార్, రైల్వే శాఖ కరెక్ట్ గా ఉండి ఉంటే ఇన్ని కుటుంబాలు అనాధలైపోయేవారు కాదు అన్నారామె.

కొత్తపల్లి రైల్వే ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVEEN KUMAR SHUBHAM

పరిహారం దక్కిందా?

బాధిత కుటుంబాలకు పరిహారం విషయం స్థానికంగా చర్చనీయమవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో మరణించిన రైతులు, సైనికులకు ఇటీవల పరిహారాలు ప్రకటించిన నేపథ్యంలో సొంత రాష్ట్రానికి చెందిన కార్మికులు పరిహారం ఏమైనా ఇచ్చారా అనేది చర్చనీయమైంది.

దీనిపై బీబీసీ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో మాట్లాడింది.

ఆయన ఇది కేంద్రం పరిధిలోని అంశమని, పరిహారం రైల్వే డిపార్ట్ మెంట్ లేదా కాంట్రాక్టర్ ఇవ్వాలని చెప్పారు.

‘కాంట్రాక్టర్ 14 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చారు. కాంట్రాక్టర్ వద్దే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వమని చెప్పాం. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దృష్టికి ఇంకా విషయం పోలేదు. తీసుకెళ్తాము. ఇప్పటికైతే అందాల్సిన సహాయం అందే ఏర్పాటు చేశాం’ అని చెప్పారు.

ఏమిటీ మిషన్ రఫ్తార్?

మిషన్ రఫ్తార్’లో భాగంగా రైళ్ల వేగం పెంచే పనులు కొనసాగుతున్నప్పుడు తాజా ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఏమిటీ మిషన్ రఫ్తార్ అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

రైళ్ల సరాసరి వేగాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం 2016-2017 రైల్వే బడ్జెట్‌లో ‘మిషన్ రఫ్తార్’ కార్యక్రమాన్ని ప్రకటించింది.

దీనిలో భాగంగా.. ఆధునిక టెక్నాలజీ, సిగ్నలింగ్, శక్తివంతమైన ఇంజన్లు, ఆధునిక రైల్వే కోచ్‌లు, అత్యధికంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణించేందుకు వీలుగా రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, లైన్లను పటిష్టపరచడం, రవాణా రైళ్ల వేగం పెంచేందుకు డీఎఫ్‌సీ (డెడికేటెడ్ ఫ్రయిట్ కారిడార్)ల నిర్మాణ పనులు రైల్వే శాఖ చేపడుతోంది. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో ఈ పనులు వేగం అందుకున్నాయి. 2022 కల్లా మిషన్ రఫ్తార్‌ను పూర్తి చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.

వీడియో క్యాప్షన్, నార్త్ వెస్ట్రన్ రైల్వేలో లోకో పైలట్‌గా పని చేస్తున్న నీలమ్ రాథల్ చెబుతున్న విశేషాలు

ఎలాంటి భద్రత ఏర్పాట్లు ఉండాలి

భారత రైల్వే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. చాలాచోట్ల కొత్త లైన్ల నిర్మాణం, విస్తరణ కొనసాగుతోంది.

గ్వాలియర్‌లోని ఇండియన్ రైల్వేస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ మెయింటెనెన్స్ టెక్నాలజీ (CAMTECH) సంస్థ.. రైల్వే లైన్లు, బ్రిడ్జీలు, టన్నెల్స్ వంటి పని ప్రదేశాల్లో వివిధ మెయింటెనెన్స్, రిపేర్ పనులు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉండాల్సిన రక్షణ చర్యలపై పలు సూచనలు, సలహాలు చేసింది.

దీని ప్రకారం.. నడిచే రైల్వే లైన్ల వద్ద (రన్నింగ్ లైన్స్) కాంట్రాక్టర్లు చేపట్టే వివిధ రకాల పనులకు సంబంధించిన ‘‘సమగ్ర ప్రణాళిక’’కు రైల్వే విభాగంలోని ఇంజనీరింగ్, సిగ్నలింగ్ విభాగం నుంచి ముందస్తు అనుమతి ఉండాలి.

పనులు జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలను సూపర్‌వైజర్లు తీసుకోవాలి. పని ప్రదేశంలో ఉండే పరిస్థితులు, రక్షణ చర్యలపై కూలీలకు ముందుగానే అవగాహన కల్పించాలి. కూలీలు, ఇతర ఏర్పాట్ల వివరాలను రికార్డుల్లో పొందుపరచాలి.

వీడియో క్యాప్షన్, చావు అంచుల్లోకి వెళ్లిన రిక్షా కార్మికుడు, ఎలా బతికి బయటపడ్డాడంటే...

శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన స్టాఫ్ కాంట్రాక్టర్, రైల్వే శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ధ్రువపరిచిన సర్టిఫికేట్ కలిగిన కాంట్రాక్ట్ సూపర్‌వైజర్ ఆధ్వర్యంలోనే పనులు జరగాలి.

పనులు జరుగుతున్న ట్రాక్‌లపై నడిచే రైళ్ల వివరాలు, సమయంపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలి. సెల్‌ఫోన్, వాకీటాకీల ఎప్పటికప్పుడు కూలీలకు హెచ్చరికలు జారీ చేయాలి.

‘‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’’ లాంటి సైన్ బోర్డును పని జరిగే చోట ఏర్పాటు చేయాలి. ట్రాక్ పక్కన నిర్మాణ సామగ్రిని తరలించే వాహనాలు పార్క్ చేసేందుకు నిర్ణీత దూరాన్ని సూచించేలా సున్నంతో మార్క్ చేయాలి.

మొత్తంగా కూలీలు, సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన ప్రమాణాలను సంస్థ సూచించింది.

విచారిస్తున్న రైల్వే అధికారులు

ఈ ఘటనపై స్థానిక రైల్వే అధికారుల వివరణ కోసం బీబీసీ ప్రయత్నించగా వారి నుంచి సరైన స్పందన రాలేదు.

ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే అధికారుల విచారణ కొనసాగుతోంది.

నిపుణుల బృందం ఘటన స్థలాన్ని పరిశీలించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)