Air Travel: ప్రపంచమంతా విమాన ప్రయాణాలు ఒక్కసారిగా ఆగిపోతే ఏం జరుగుతుంది?
ఒక్కసారిగా ప్రపంచంలో విమానాలన్నీ ఆగిపోతే... ఈ ప్రపంచం ఎలా ఉంటుంది?
ఊహకు కూడా అందని విషయం అనిపించవచ్చు కానీ.. ఒక్కసారి ఊహించండి ఎలా ఉంటుందో...
మన సంగతేమో కానీ... ఈ భూగోళానికి మాత్రం అంతో ఇంతో మంచి జరుగుతుంది.
2013 నుంచి 2019 మధ్య కాలంలో విమానాల రాకపోకల వల్ల ఏకంగా 30 శాతం కర్బన ఉద్గారాలు పెరిగాయి. వీటికి బ్రేక్ పడుతుంది.
2020లో కరోనా పుణ్యమా అని మెజారిటీ విమానాలు విమానాశ్రయాలకే పరిమితం కావడంతో వాటి ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలు 60శాతం వరకు తగ్గాయి.
విమాన ప్రయాణాలను నిషేధించాలని డిమాండ్..
అయితే తాజాగా కొందరు శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలో మున్ముందు ఏవియేషన్ రంగం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు 6 నుంచి 17 శాతాని పరిమితమైతే భూతాపాన్ని 1.5 డిగ్రీల నుంచి 2 డిగ్రీలకు మించి పెరగకుండా చూడవచ్చని తేలింది.
మరో పదేళ్లలో అంటే 2030 తర్వాత పర్యావరణ అనుకూల వైమానిక ఇంధనాల వినియోగం పెరగడం, అలాగే విద్యుత్ ఆధారిత విమానాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, ఫలితంగా కర్బన ఉద్గారాలు తగ్గవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయ్యింది. అందుకే ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భూతాపం తగ్గించడంపై పని చేస్తున్న కొన్ని స్వచ్ఛంధ సంస్థలు విమాన ప్రయాణాలను తగ్గించాలని లేదా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
నిజానికి ప్రపంచ వ్యాప్తంగా విమానాల ద్వారా రాకపోకలు సాగించే వారి సంఖ్య తక్కువే.
2018 ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 శాతం మంది జనాభా మాత్రమే విమానం ఎక్కారు.
అంతర్జాతీయ ప్రయాణీకుల విషయానికి వస్తే కేవలం నాలుగంటే 4 శాతం మాత్రమే.
వీరిలో తరచుగా ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువ.
భారత్, బ్రిటన్ వంటి దేశాల్లో సగం కన్నా ఎక్కువ జనాభా ఏడాదిలో ఒక్కసారి కూడా విమాన ప్రయాణాలు చెయ్యరు కూడా.
అంటే దీన్ని వల్ల మనకు ఏం అర్థమవుతోంది..?
పాసింజర్ విమానాలు ప్రయాణాలు ఆగిపోయినంత మాత్రాన ప్రపంచం తలకిందులైపోదు. అంతెందుకు కోవిడ్ సమయంలో పాసింజర్ విమానాలన్నీ ఎక్కడవి అక్కడే ఆగిపోయాయి. అప్పుడు ఏం జరిగింది. అవి లేకపోతే ఎలా ఉండాలో నేర్చుకున్నాం కదా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచమంతా విమాన ప్రయాణాలు ఒక్కసారిగా ఆగిపోతే ఏం జరుగుతుంది?
విమానాలు తిరగలేదు కాబట్టి, విమనాశ్రయాల చుట్టు పక్కల వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం గణనీయంగా తగ్గింది. కొన్ని నెలల పాటు ఆ చుట్టు పక్కల ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉండగలిగారు.
విదేశీ విహారయాత్రలు తగ్గిపోతాయి. ఫలితంగా కొన్ని చోట్ల దేశీయ పర్యాటకం పెరుగుతుంది. అదే సమయంలో పర్యటకంపైనే ఆధార పడ్డ దేశాలకు మాత్రం పెద్ద ఇబ్బందే.
కోవిడ్ తర్వాత అదే పరిస్థితి ఎదురయ్యింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యటక రంగంలో ఏకంగా 10 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. చాలా మంది శాశ్వతంగా ఉపాధి కోల్పోయారు.
విమానాలన్నీ నేలకే పరిమితమైతే ఏవియేషన్ రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడిన సుమారు కోటి పది లక్షల మందికిపైగా జనం చిక్కుల్లో పడతారు. పరోక్షంగా ఆధారపడ్డ మరో కోటి 80 లక్షల మంది కూడా నిరుద్యోగులవుతారు.
విదేశీ ప్రయాణాలు దాదాపు తగ్గిపోతాయి. వర్క్ ఫ్రమ్ హోం, హైబ్రీడ్ వర్క్ స్టైల్స్ శాశ్వతమైపోతాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరాలు తగ్గిపోతాయి. తమ పిల్లల రాకకోసం ఏళ్ల తరబడి ఎదురు చూసే తల్లిదండ్రుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది. సభలు, సమావేశాలకు విదేశాలకు వెళ్లాల్సిన వాళ్లు వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. అయితే ముఖాముఖి చర్చలు జరపక తప్పని ప్రాజెక్టుల విషయంలో మాత్రం సమస్యలు వస్తాయి.
విమానాల ద్వారా జరిగే వాణిజ్యం ఆగిపోతుంది. అప్పుడు సముద్ర మార్గమే దిక్కవుతుంది. ఫలితంగా రోజుల తరబడి సరుకుల కోసం వేచి చూడాల్సి వస్తుంది.

ఫొటో సోర్స్, ViewStock/Alamy
హై స్పీడ్ రైళ్లకు డిమాండ్..
ఇప్పుడు సూపర్ మార్కెట్లలో తాజాగా కనిపించే విదేశీ పళ్ల రకాలు అప్పుడు మాయమవుతాయి. మెజార్టీ సరకు రవాణా రోడ్డు, సముద్ర మార్గంలోనే జరుగుతోంది కనుక పెద్దగా ప్రభావం ఉండదు.
అయితే ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే మందుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉదాహరణకు కోవిడ్ సమయంలో టీకాలను విదేశాలకు సమయానికి అందించడంలో వైమానిక రంగం కీలక పాత్ర పోషించింది. అలాగే మానవీయ సంక్షోభాలు ఏర్పడినప్పుడు వారికి ఆహారం, మందులు, నీళ్లు ఇతర అవసరాలను వెంటనే అందించడంలోనూ విమానాల పాత్రే కీలకం. ఒక వేళ అవి లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.
ప్రపంచ దేశాల మధ్య దూరం పెరిగిపోతుంది. ఫలితంగా ఇతర ప్రయాణ సాధానాలపైనా అలాగే వాటి సామర్థ్యం పెంచడంపైన ప్రపంచం దృష్టి పెడుతుంది. వివిధ దేశాల మధ్య రోడ్డు, రైలు మార్గాలపై ఆయా దేశాలు దృష్టి పెడతాయి. హై స్పీడ్ రైళ్లకు డిమాండ్ పెరుగుతుంది. 2035 నాటికి ప్రపంచ వ్యాప్తంగా హైస్పీడ్ రైలు మార్గాలు 70 వేల కిలోమీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలంటే సముద్ర మార్గంపైనే ఆధారపడాలి.
ఇవన్నీ ఇబ్బందులే అయినప్పటికీ విమాన ప్రయాణాలను ఆపేయడం వల్ల అన్నింటికీ మించి పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చన్నది పర్యావరణ వేత్తల మాట. ఇతర ప్రయాణా మార్గాలపై మరింత దృష్టి పెట్టడం వల్ల 2030 నాటికి ఇప్పటితో పోల్చితే 25 రెట్ల గ్రీన్ హౌజ్ వాయువుల్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. భూతాపాన్ని కనీసం 1.5 డిగ్రీలకు పరిమితం చెయ్యాలన్నది ప్రపంచ దేశాల లక్ష్యం. ఏవియేషన్ రంగం వల్ల కలిగే మార్పు తక్కువే కావచ్చు, కానీ ప్రస్తుతానికి చేరుకోవాల్సిన లక్ష్యానికి మధ్య గ్యాప్‌ను పూరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
- లేడీ ఆఫ్ హెవెన్: 'మొహమ్మద్ ప్రవక్త కూతురు కథ' సినిమాను పలు ముస్లిం దేశాలు ఎందుకు నిషేధిస్తున్నాయి?
- కమేరా: సోవియట్ యూనియన్ శత్రువుల్ని అంతం చేసేందుకు కేజీబీ నడిపించిన సీక్రెట్ పాయిజన్ ఫ్యాక్టరీ
- పెట్రోల్, డీజిల్ ఆదా చేసే ట్రిక్స్‌లో అపోహలు, 5 వాస్తవాలు
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- ఆకాశంలో అద్భుతం: ఒకే వరుసలోకి అయిదు గ్రహాలు... బైనాక్యులర్స్ లేకుండానే చూడొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)