గుజరాత్: ఆవులను ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలుతున్నారు.. వాటి మూత్రం, పేడను ఆఫీసుల్లో వేస్తున్నారు.. ఎందుకు?

గుజరాత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవులు

ఫొటో సోర్స్, PARESH PADHIYAR

ఫొటో క్యాప్షన్, గుజరాత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవులు, పశువులు

గుజరాత్‌లో ఆవుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ స్వచ్ఛంద సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

తమ వద్ద ఉన్న వేలాది ఆవులను వీధుల్లోకి, ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవులు తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గుజరాత్‌తోపాటు అనేక రాష్ట్రాల్లోని పశువులు లంపీ స్కిన్ వ్యాధితో చనిపోతున్నాయి. ఆ రాష్ట్రంలో సుమారు లక్ష 70వేల పశువులకు వ్యాధి సోకగా 5,800కు పైగా చనిపోయాయి.

హిందువులు ఆవులను పవిత్రంగా భావిస్తుంటారు. గుజరాత్‌తోపాటు 18 రాష్ట్రాల్లో ఆవులను చంపడం నేరం. ఆవులను చంపిన వారికి జీవితకాల కారాగార శిక్ష విధిస్తూ 2017లో గుజరాత్ చట్టం తీసుకొచ్చింది.

ఇలాంటి చట్టాల ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో ఆవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రోడ్ల మీద తిరగడం వల్ల ట్రాఫిక్ కష్టాలు కూడా పెరిగాయి. కొంతమేరకు స్వచ్ఛంద సంస్థలు ఆవుల ఆలనా పాలన చూసుకుంటున్నాయి.

ఆవులు, ముసలి పశువుల షెల్టర్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది గుజరాత్ ప్రభుత్వం. అయితే తమకు ఈ పథకం కింద తమకు నిధులు రావడం లేదని, తమను మోసం చేశారంటూ షెల్టర్ల నిర్వహణదారులు నిరసనలకు దిగారు.

ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా తమ సమస్యలను పట్టించుకోలేదని వారు చెబుతున్నారు.

గుజరాత్ రోడ్ల మీద ఆవులను, పశువులను తోలుతున్నారు

ఫొటో సోర్స్, PARESH PADHIYAR

ఫొటో క్యాప్షన్, గుజరాత్ రోడ్ల మీద ఆవులను, పశువులను తోలుతున్నారు

రాష్ట్రవ్యాప్తంగా 1,750 ఆవుల షెల్టర్లు ఈ నిరసనలో పాల్గొన్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది. ఈ షెల్టర్లలో దాదాపు 4.50 లక్షల ఆవులున్నాయి.

'ఉత్తరప్రదేశ్, హరియాణ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలోని రాజస్థాన్ కూడా ఒక్కో ఆవుకు రూ.50 ఇస్తోంది. కానీ గుజరాత్ ఎందుకు ఆవులను ఆదుకోవడం లేదు?' అని గుజరాత్ గో సేవా సంఘ్ జనరల్ సెక్రటరీ విపుల్ మాలీ ప్రశ్నించినట్లు ఆ పత్రిక తెలిపింది.

గత కొద్ది రోజులుగా గుజరాత్‌లోని రోడ్లు, ప్రభుత్వ భవనాలు, కోర్టు ప్రాంగణాల్లో ఆవులను తోలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆవు మూత్రం, పేడను ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసనకారులు వేస్తున్నారు.

బనస్కాంఠ, పటాన్, కచ్ జిల్లాల్లో సుమారు 70 మంది నిరసనకారులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు.

పాలనా పరమైన ఇబ్బందుల వల్ల ఆవులకు సాయం అందించడం ఆలస్యమైందని, ఒకటి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని గుజరాత్ పశుసంవర్ధకశాఖ మంత్రి తెలిపారు.

ఈ నెల చివరి కల్లా సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, గుజరాత్: పశువులను ప్రభుత్వ కార్యాలయాల్లో వదులుతూ నిరసనలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)