లంపీ వైరస్: ఒక్కసారిగా వేల సంఖ్యలో ఆవులు ఎందుకు చనిపోతున్నాయి, వీటికి సోకిన వ్యాధికి చికిత్స అంత కష్టమా?

ఫొటో సోర్స్, Mohar Singh Meena/BBC
- రచయిత, మోహర్ సింగ్ మీనా
- హోదా, బీబీసీ కోసం..
మనుషుల్లో కరోనావైరస్ చెలరేగినట్లే ప్రస్తుతం జంతువుల్లో లంపీ వైరస్ విధ్వంసం సృష్టిస్తోంది.
ఒక్క రాజస్థాన్‌లోనే ఇప్పటివరకు లక్షా 20 వేల 782 జంతువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీటిలో 5,807 పశువులు ప్రాణాలు కోల్పోయాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అయితే, ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కల కంటే మృతులు, కేసులు చాలా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనావైరస్ వ్యాప్తి సమయంలోనూ కేసులను, మరణాలను ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందని ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం లంపీ వైరస్ కేసుల్లోనూ అలానే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
లంపీ వైరస్ సోకిన జంతువుల్లో 90 శాతం ఆవులే ఉన్నాయి. మృతుల్లోనూ ఆవులే మొదటి సంఖ్యలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Mohar Singh Meena/BBC
ఏమిటీ లంపీ వైరస్?
లంపీ వైరస్.. కాప్రీపాక్స్ ఫ్యామిలీకి చెందిన ప్రమాదకర వైరస్ అని స్టేట్ డిసీజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రవి ఇస్రానీ బీబీసీతో చెప్పారు. గోట్ పాక్స్, షీప్ పాక్స్ తరహాలోనే ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు చర్మంపై బొబ్బలు (లంప్‌లు) వస్తాయి.
జోధ్‌పుర్ డివిజన్‌లో కేసులు విపరీతంగా పెరగడంతో డాక్టర్ రవిని ప్రభుత్వం జైపుర్ నుంచి ఇక్కడకు పంపించింది.
''ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు పశువుల చర్మంపై బొబ్బలు ఏర్పడతాయి. దోమలు లేదా ఈగలు వీటిపై వాలిన తర్వాత, వేరే జంతువులను కుట్టినప్పుడు వాటికి కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది''అని రవి చెప్పారు.
ప్రస్తుతం ఈ వైరస్ వల్ల రాజస్థాన్‌లోని బాడ్‌మేడ్ జిల్లా తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఈ విషయంపై గ్రామీణ బాడ్‌మేడ్‌లోని ''ముండో కీ ఢాణీ'' గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ.. ''నాకు ఆరు ఆవులు ఉండేవి. వీటిలో ఒకటి లంపీ వైరస్ వల్ల మరణించింది. మూడింటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది''అని చెప్పారు.
ఇదే గ్రామానికి చెందిన నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. ''మొదట మా ఆవు కాళ్లపై బొబ్బలు వచ్చాయి. ఆ తర్వాత మెడ, ఇతర భాగాలకూ ఇవి విస్తరించాయి. కొన్ని రోజులకు ఆవు నడవలేకపోయింది. ఆ తర్వాత దాని నోటి నుంచి నురుగలు కారడం మొదలయ్యాయి. క్రమంగా తిండి తినడం, పాలు ఇవ్వడం కూడా మానేసింది''అని వివరించారు.
''అవసరం అనిపించిన కొన్ని ఆవులకు శవ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వ్యాధి బాగా ముదిరిన తర్వాత, పేగులు, ఊపిరితిత్తుల్లోనూ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది''అని డాక్టర్ రవి చెప్పారు.
ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధరణ అయిన కొన్ని పశువుల శాంపిల్స్‌ను పరీక్షల కోసం భోపాల్, హిసార్‌లకు పంపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena/BBC
16 జిల్లాల్లో లక్షకుపైగా
గత పది రోజులుగా రాజస్థాన్‌లో లంపీ వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పశ్చిమ రాజస్థాన్‌లోని 16 జిల్లాల్లో లక్షకుపైగా పశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
తాజాగా ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్‌ను అడ్డుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. అయితే అప్పటికే వేల సంఖ్యలో జంతువులు మరణించాయి.
రాజస్థాన్ పశు సంరక్షణ విభాగం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే, సరిహద్దుల్లోని బాడ్‌మేడ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఆగస్టు నాలుగో తేదీ ఉదయం నాటికి ఈ జిల్లాలో 16,247 పశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీటిలో 1,307 పశువులు మరణించాయి.
బాడ్‌మేడ్ తర్వాత శ్రీగంగానగర్, జోధ్‌పుర్, బీకానేర్‌లలోనూ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.
జోధ్‌పుర్, బాడ్‌మేడ్, జైసల్మేర్, జాలౌర్, పాలీ, సిరోహీ, బీకానేర్, చూరు, గంగానగర్, హనుమాన్‌గఢ్, అజ్మేర్, నాగౌర్, సీకర్, ఝుంఝునూ, ఉదయ్‌పుర్‌లలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం జైపుర్‌లో లంపీ వైరస్‌తో 282 పశువులు బాధపడుతున్నాయి. తొమ్మిది ఇప్పటికే మరణించాయి.
కేసులు పెరుగుతున్న ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను ప్రభుత్వం తరలిస్తోంది.

ఫొటో సోర్స్, Mohar Singh Meena/BBC
ఆవులపై ప్రభావం
పశ్చిమ రాజస్థాన్ జిల్లాలతోపాటు రాష్ట్రంలో ప్రధాన ప్రాంతమైన జైపుర్‌లోనూ లంపీ వైరస్ కేసులు వస్తున్నాయి. ఇక్కడి హింగోనియా గోశాలలో పెద్దయెత్తున ఆవులకు ఈ వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి.
మిగతా పశువులతో పోల్చినప్పుడు ఆవులే ఎక్కువగా ఈ వైరస్ వల్ల ప్రభావితం అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
''ఎద్దుల్లోనూ కొన్ని కేసులు వచ్చాయి. కానీ, 90 శాతం కేసులు ఆవుల్లోనే కనిపిస్తున్నాయి''అని డాక్టర్ రవి వెల్లడించారు.
''ఆవుల్లో కూడా సంకర జాతుల్లో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది. దేశీయ ఆవుల్లో వీటి ప్రభావం కాస్త తక్కువగానే ఉంది''అని ఆయన తెలిపారు.
మరోవైపు గత పది రోజులుగా పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని బాడ్‌మేడ్ గ్రామీణ పంచాయతి సమితి సభ్యుడు హేమరాజ్ పురోహిత్ బీబీసీతో చెప్పారు. తమ పంచాయతీ సమితిలోని చాలా గ్రామాలు ప్రభావితం అయ్యాయని ఆయన వివరించారు.
''ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని జిల్లా పరిపాలనా విభాగాన్ని మేం అభ్యర్థించాం. గత కొన్ని రోజులుగా పశు వైద్యులను పంపిస్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన జంతువులకు ఇంజక్షన్లు ఇస్తున్నారు. కానీ, ఇన్ఫెక్షన్ చాలా వేగంగా విస్తరిస్తోంది''అని ఆయన చెప్పారు.
రాష్ట్ర పశు సంరక్షణ విభాగం విడుదల చేస్తున్న గణాంకాల్లో మొత్తంగా మరణించిన పశువుల సంఖ్య చెబుతున్నారు. అయితే, వీటిలో ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎన్ని ఎద్దులు ఉన్నాయి? లాంటి వివరాలు వెల్లడించడం లేదు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena/BBC
చాలా ఆలస్యమైందా?
జైసల్మేర్‌తోపాటు బాడ్‌మేడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల క్రితమే లంపీ వైరస్ వ్యాపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా చర్యలు తీసుకోవాలని కొంతమంది అధికారులను అభ్యర్థించారు. మరోవైపు జంతువుల ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
జైసల్మేర్, బాడ్‌మేడ్‌ల తర్వాత జోధ్‌పుర్, జాలౌర్, సిరోహీలలోనూ కేసులు విపరీతంగా పెరిగాయి. అయితే, గత వారం రోజుల నుంచే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.
''మేం ముగ్గురు సోదరులం. మాకు మొత్తంగా 25 ఆవులు ఉన్నాయి. ఆవులకు ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే, మేం రూ.4000 పెట్టి మందులు కొన్నాం. వాటిని ఆవులకు ఇచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు''అని నారాయణ్ సింగ్ చెప్పారు.

లంపీ వైరస్ వ్యాప్తిపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉష శర్మ సమావేశమయ్యారు. మరోవైపు పశు సంరక్షణ శాఖ మంత్రి లాల్‌చంద్ కటారియా కూడా అధికారులతో సమావేశయ్యారు.
ఇప్పటి వరకు మొత్తంగా రూ.12 లక్షలను ప్రభావిత జిల్లాల్లో ఔషధాల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
జిల్లా స్థాయిలో ఇన్ఫెక్షన్ సోకిన ఆవులపై సర్వే నిర్వహిస్తున్నారు. అయితే, వరుసగా ఆవులు చనిపోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.
''ప్రస్తుతానికి ఈ ఇన్ఫెక్షన్‌పై మెరుగ్గా పనిచేసే చికిత్సలు మా దగ్గర లేవు. కానీ, కౌపాక్స్ వ్యాక్సీన్లు జంతువులకు ఇస్తున్నాం. ఇవి కొంతవరకు పనిచేస్తున్నాయి''అని డాక్టర్ రవి చెప్పారు.
పాల వ్యాపారంపై ప్రభావం
రాజస్థాన్‌కు సరిహద్దుల్లోని గుజరాత్ గ్రామాల్లోనూ లంపీ వైరస్ వ్యాపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, పాల వ్యాపారంపైనే ఆధారపడే పశ్చిమ రాజస్థాన్‌లోని పాడి రైతుల జీవితాలు ఈ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ప్రభావితం అవుతున్నాయి.
లంపీ వైరస్ వల్ల ఆవుల పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఇన్ఫెక్షన్ మొదలైందనే అనుమానంతో చాలా ఆవుల పాలను తీసుకోవడానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. మరోవైపు కొన్ని జంతువులు మరణించడంతో వాటిపైనే ఆధారపడే రైతులు ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమ రాజస్థాన్‌లోని ప్రాంతాల్లో పడుతున్న వర్షాలు కూడా కేసులు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.
''వర్షాల వల్ల దోమలు, ఈగల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాధి తేలిగ్గా సోకుతోంది''అని డాక్టర్ రవి చెప్పారు.
ఇన్ఫెక్షన్ సోకిన పశువులను విడిగా ఉంచకపోవడమూ కేసులు పెరగడానికి ఒక కారణం.
గుజరాత్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా..
రాజస్థాన్‌కు సరిహద్దుల్లోని కచ్‌తోపాటు గుజరాత్‌లోని చాలా జిల్లాల్లోనూ లంపీ వైరస్‌తో పశువులు చనిపోతున్నాయి. అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు కచ్‌లోని గ్రామాలకు బీబీసీ ప్రతినిధి సాగర్ పటేల్ వెళ్లారు.
''ఇక్కడ రోజుకు 30 నుంచి 40 ఆవులు చనిపోతున్నాయి. ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు చనిపోయిన ఆవుల మృతదేహాలను ఏం చేయాలో పాడి రైతులకు తెలియడం లేదు''అని సాగర్ చెప్పారు.
ఈ విషయంపై సర్వ సమాజ్ సేన కచ్ ప్రదేశ్ సంస్థ అధ్యక్షుడు యోగేశ్‌భాయ్ పోకర్ మాట్లాడుతూ.. ''గత పది రోజుల నుంచి గ్రామాల్లోని రోడ్లపై ఆవుల మృతదేహాలు అలా పడిపోయి కనిపిస్తున్నాయి''అని చెప్పారు. తామే జంతువులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని వివరించారు.
వైరస్‌ను మొదట్లోనే నిర్ధారించేందుకు ప్రభావిత జిల్లాలకు ఆరోగ్య సిబ్బందిని పంపిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని 1,935 గ్రామాల్లో వైరస్ కేసులు వచ్చినట్లు నిర్ధారించామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి రాఘవ్‌జీ పటేల్ చెప్పారు.
ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ నేతృత్వంలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు కమిటీలు ఏర్పాటుచేసినట్లు రాఘవ్‌జీ పటేల్ వివరించారు. గుజరాత్ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు లంపీ వైరస్‌తో 1400కుపైగా పశువులు మరణించాయి. ఇక్కడ కూడా ప్రభుత్వ లెక్కల కంటే మరణాలు ఎక్కువగా ఉంటాయని అంచనాలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి, భారత్ వృద్ధి మందగమనంలో ఉందా?
- 'స్పేస్ ఎక్స్ క్యాప్సూల్' శకలం: అంతరిక్షం నుంచి జారింది.. పొలంలో పడింది..
- సీఎంకు ప్రత్యేక గది, హెలీప్యాడ్, దాదాపు 10లక్షల సీసీ కెమెరాల అనుసంధానం....కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలేంటి, దానిపై విమర్శలేంటి?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- జూ ఎన్‌క్లోజర్‌లో మొసళ్లకు బదులు అందమైన హ్యాండ్‌బ్యాగ్ పెట్టారు, సందర్శకులు దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












