Gamification: మన జీవితం వేరొకరి గేమ్‌లో భాగమా, ఆ గేమ్‌ను మనం ఎప్పటికీ ఆపలేమా?

గేమిఫికేషన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టామ్‌ చాట్‌ఫీల్డ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

మన ప్రపంచాన్ని రహస్య నెట్‌వర్క్‌లు నడిపిస్తున్నాయా? మన స్వేచ్ఛ, హక్కులను అణచివేయే యుద్ధంలో సైన్స్ ప్రధాన పాత్ర పోషిస్తోందా? ఇలాంటి ప్రశ్నలు మనకు ‘‘క్యూఏనాన్’’ ఉద్యమాల్లో కనిపిస్తాయి. 2017 నుంచి ఇలాంటి ప్రశ్నలతో ఫార్‌-రైట్ కల్ట్ క్యూఏనాన్ చర్చలు వైరల్‌గా మారుతున్నాయి. అయితే, ఇలాంటి కుట్ర సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఇలాంటి మరిన్ని పుట్టుకొచ్చే అవకాశముందని మీడియా స్కాలర్ విట్నీ ఫిలిప్స్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో దాదాపు 15 శాతం మంది క్యూఏనాన్ సిద్ధాంతాలను నమ్ముతున్నట్లు తేలింది.

అలాంటి నమ్మశక్యంగాని, అనుమానాలు రేకెత్తించే కుట్ర సిద్ధాంతాలను అంత మంది ఎలా నమ్ముతున్నారు? ఎందుకంటే ఈ సిద్ధాంతాలు మనలో ఆందోళన కలిగించేలా, ఉత్సుకత రేకెత్తించేలా ఉంటాయి. అయితే, అక్కడితో ఇవి ఆగిపోవు. వారి ఊహా ప్రపంచంలోకి తొంగి చూస్తే, ఏదో 21వ శతాబ్దపు గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తుంది.

‘‘యూ హేవ్ బీన్ ప్లేయ్‌డ్’’ పుస్తక రచయిత, గేమ్ డిజైనర్ అడ్రియన్ హాన్ చెప్పే అంశాలను పరిశీలిస్తే, ఇది నిజమని కూడా అనిపిస్తుంది. ఆ పుస్తకంలో ఆయన ఈ డిజిటల్ యుగాన్ని గేమ్‌ లాంటి పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తున్నాయో వివరించారు.

తన పుస్తకంలో గేమ్‌లు, కుట్ర సిద్ధాంతాల మధ్య సారూప్యాలను ఆయన వివరించారు. గేమ్ తరహా పరిస్థితులు మన జీవితంలో చాలా అంశాల్లోకి చొచ్చుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఆఫీసుల్లోని మెకానిక్స్‌తో మొదలుపెట్టి మనం తీరిక జీవితాన్ని ఎలా గడుపుతున్నాం? అనే అంశం వరకు అన్నింటిలోనూ గేమ్స్ ప్రభావం ఉంటోందని అన్నారు. అయితే, ఇలాంటి కుట్ర సిద్ధంతాలను నమ్మబోమని మీరు అనుకోవచ్చు. అయితే, ఏదో ఒక చోట మీరు కూడా ఈ ఆటలో భాగస్వామ్యం కావాల్సిందేనని హాన్ అంటారు. మరోవైపు మన జీవితాలపై నియంత్రణను మళ్లీ వెనక్కి తీసుకోవడం సాధ్యంకాదని ఆయన చెబుతారు.

గేమిఫికేషన్

ఫొటో సోర్స్, Jennie/Flickr/CC BY-SA 2.0

నేను హాన్‌ను 2006లో తొలిసారి కలిశాను. అప్పుడు ఆయన ప్రపంచంలోనే ప్రముఖ ఆల్టర్నేట్ రియాలిటీ గేమ్స్ (ఏఆర్‌జీ)లో ఒకటైన ‘‘పెర్‌ప్లెక్స్ సిటీ’’కి ప్రోడ్యూసర్, లీడ్ డిజైనర్‌గా ఉన్నారు. ఆల్టర్నేట్ రియాలిటీ గేమ్ అనేది పూర్తి కాల్పనిక ప్రపంచం లాంటిది. దీనిలో చాలా పజిల్స్, క్లూస్ ఉంటాయి. అయితే, ఇక్కడ చాట్ డేటాను సేకరిస్తుంటారు. మరోవైపు బిల్‌బోర్డ్స్, ఆన్‌లైన్ వీడియో, ఫోరమ్ పోస్టుల నుంచి మన సమాచారం తీసుకోవచ్చు. మరోవైపు కాల్పనిక క్యారక్టర్లతో మన సంభాషణ నుంచి కూడా సమాచారం సేకరించొచ్చు. ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని ట్రాక్ చేసే అవకాశముంటుంది.

ఈ ఏడాది మొదట్లో హాన్‌తో మాట్లాడినప్పుడు, ఏఆర్‌జీ గేమ్స్, కుట్ర సిద్ధాంతాల మధ్య సారూప్యతల గురించి మేం చర్చించుకున్నాం. అయితే, ఇప్పటివరకు మార్కెట్‌లోనున్న గేమ్‌లు.. ‘‘క్యూఏనాన్’’ సిద్ధాంతాలు చెప్పేటంత ప్రమాదకరమైనవికావని మేం అనుకున్నాం. మరోవైపు మత విశ్వాసాలు, రాజకీయాలు, వివక్షలను కలిపి చెప్పడంతో ఆ సిద్ధాంతాలు మనకు పదునైనవిగా కనిపిస్తున్నాయని చర్చించుకున్నాం.

సాధారణంగా అలాంటి కుట్ర సిద్ధాంతాలను వ్యాపించేసే సంస్థల్లో ప్రజలు ఎందుకు చేరుతారంటే.. ‘‘అక్కడ వారికి సరదా అనిపిస్తుంది, లేదా కాలక్షేపం తీరుతుంది లేదా వారి గుర్తింపు వస్తోంది’’అని హాన్ అన్నారు. అయితే, ఇవే పరిస్థితులు కోట్లాది మంది జీవితాల్లో రోజూ కనిపిస్తుంటాయి. నిజానికి మన జీవితాలు ఒక గేమ్‌లా మారిపోతున్నాయి. అయితే, ఈ గేమ్‌ను మనం ఎప్పటికీ ఆపేయలేం.

గేమిఫికేషన్

ఫొటో సోర్స్, Getty Images

వర్కర్ ప్లే

ఈ గేమ్‌ మీరు ఆడేందుకు కుట్ర సిద్ధాంతాలను నమ్మాల్సిన పనిలేదు. మీరు ఎప్పుడైనా అమెజాన్ ‘‘ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్స్’’లో పనిచేశారా? వేర్‌హౌస్‌లను అమెజాన్ ఇలా పిలుస్తుంటుంది. అక్కడ మనకు ఆన్‌లైన్ గేమ్‌ తరహా పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఇక్కడ పనిచేసిన ఒక ఉద్యోగి పోస్టిన్ స్మిత్ 2019లో ఒక బ్లాగులో ఓ కథనం రాశారు. ‘‘సిబ్బంది మధ్య వన్-ఆన్-వన్ డ్రాగన్ రేసు నడుస్తున్నట్లు పరిస్థితి ఉంటుంది. ఇక్కడ డ్రాగన్ స్పీడ్ అంటే పనిచేసే వేగం అనుకోవచ్చు. ఇదొక గేమిఫైడ్ ఫ్యూడలిజం లాంటిది. ఇక్కడ సిబ్బంది కూలీల్లా పనిచేస్తూ భారీ భవనాలు కట్టడానికి కృషిచేస్తుంటారు. ఇక్కడి పరిస్థితి మధ్యయుగాన్ని తలపిస్తోంది’’అని ఆయన ఆ కథనంలో రాసుకొచ్చారు.

‘‘గేమిఫికేషన్’’ అనే పదాం మనలో చాలా ఉత్సాహాన్ని రేకిస్తుంటుంది. పైపైన చూస్తే, ఏదైనా గేమ్ తరహాలో మార్చడం అనే అర్థం కనిపిస్తుంది. అంటే పాయింట్లు, మిషన్స్, రివార్డ్స్, ప్రొఫైల్, అవతార్, అద్భుతమైన వాతావరణం లాంటివి చేర్చుకోవడం. ఫలితంగా పనులు మరింత ఆస్వాదించేలా చేయడం. ఇక్కడ గేమ్‌లు అనేవి స్వచ్ఛందంగా ఆడతారు. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, నైపుణ్యం, అదృష్టం కలిసి రావడం లాంటి అంశాలతో మనకు విజయం వరిస్తుంది. అయితే, ఇదంతా పూర్తిగా ఆల్టర్నేట్ రియాలిటీ గేమ్ వరకు మాత్రమే. మనం అమెజాన్ వేర్‌హౌస్‌లో పరిస్థితులను గమనిస్తే, అలాంటివేమీ కనిపించవు.

మరోవైపు ఉబర్ డ్రైవర్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా మనం గేమిఫికేషన్ చూడొచ్చు. ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ట్రిప్స్ చేరుకునేవారికి ప్రత్యేక ఆఫర్లను సంస్థ ఇస్తుంది. వెంటవెంటనే కస్టమర్ల నుంచి రిక్వెస్టులు తీసుకునేవారికి కూడా బోనస్‌లు ఇస్తుంటుంది. ఇవన్నీ గేమ్‌లలో ఇచ్చే పాయింట్లలానే కనిపిస్తుంటాయి. మరోవైపు ఇన్‌స్టాకార్ట్, పోస్ట్‌మేట్స్, షిప్ట్ ఆఫర్ లాంటి డెలివరీ సంస్థలు కూడా వారంలో తాము నిర్దేశించినన్ని డెలివరీలు చేస్తే ప్రత్యేక ప్రోత్సహకాలను ప్రకటిస్తుంటాయి. ‘‘నిజానికి వీరికి జీతం సరిగ్గా ఇచ్చుంటే ఇలాంటి ప్రోత్సాహకాలు, బోనస్‌లు, పదోన్నతులు అవసరమే లేదు’’అని అంటారు హాన్. అయితే, ఇక్కడ రోజుకు మధ్యమధ్యలో భిన్నవేళలలో ప్రోత్సాహకాలు, బోనస్‌లపైనే మన వేతనం ఆధారపడి ఉండటంతో స్వచ్ఛందంగా పనిచేసుకోవడం అనే ప్రశ్నే ఉండదు. ఇక్కడ నిరంతం టార్గెట్‌లు మారుతుంటాయి. సిబ్బందిపై పర్యవేక్షణ పకడ్బందీగా ఉంటుంది. అదే సమయంలో వీరిపై మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి బాధ్యతా ఉండదు.

గేమిఫికేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి గేమిఫికేషన్‌ను సర్వైలెన్స్-డ్రివెన్ గేమిఫికేషన్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వచ్ఛందం అనేది నామ మాత్రానికే పరిమితం. ఇక్కడ పనిలో మనం మరింత భాగస్వామ్యం కావడం అంటే, గేమ్‌లో మరింత మునిగిపోయి ఆడటమే. ఇక్కడ మనకు బయటకు వచ్చే అవకాశమే ఉండదు. ‘‘కంపెనీలు తమ ఉద్యోగులను రోబోలుగా భావిస్తుంటాయి. అవసరమైతే వారి స్థానంలో కొత్త రోబోలను తెచ్చుకోవాలని చూస్తాయి’’అని హాన్ అన్నారు. ‘‘అదే సమయంలో తామొక గొప్ప కార్యం కోసం పనిచేస్తున్నామనే భావన ఉద్యోగులకు కలిగించేలా చూస్తాయి’’అని ఆయన చెప్పారు. కంపెనీలు ఇచ్చే ప్రోత్సాహకాలు, బోనస్‌లను ‘‘ఎక్స్‌ప్లాయిటేషన్‌వేర్’’గా విద్యావేత్త, గేమ్ డిజైనర్ అయాన్ బోగోస్ట్ అభివర్ణించారు. ‘‘ఇవన్నీ సాఫ్ట్‌వేర్ లూప్స్ లాంటివి. కనీస ఖర్చుతో గరిష్ఠ లాభాన్ని అర్జించేందుకు ఇవన్నీ ఇస్తుంటారు’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, అందరికీ అందుబాటు ధరల్లో పర్యావరణహితమైన ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నం

ఈ గేమిఫికేషన్ కేవలం గిగ్ ఎకానమీకి మాత్రమే పరిమితం అని అనుకోకూడదు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫిట్‌నెస్ యాప్ ఉపయోగించినప్పుడు, లేదా సోషల్ మీడియా పోస్టును లైక్ చేసినప్పుడు లేదా ఏదైనా ప్రొఫైల్‌ కోసం మీ వివరాలను సమర్పించినప్పుడు.. మీరు బహుశా ఏదోఒక గేమిఫైడ్ ఇంటెరాక్షన్‌లలో భాగస్వాములై ఉండొచ్చు. మీ సమాచారాన్ని వారు డేటాగా మార్చి, భవిష్యత్‌లో మీపైనే ఉపయోగించొచ్చు.

దీని వెనుక ఫిలాసఫీని బిహేవియరిజంగా పిలుస్తారు. ఇది చాలా ప్రాథమిక భావనల ఆధారంగా పనిచేస్తుంది. ఇక్కడ ప్రజల లోతైన మానసిక పరిస్థితులతో సంబంధం లేకుండా, వారి ప్రవర్తన ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ ప్రతిదానికి మన స్పందనలు, ఆ స్పందనలకు కారణమైన చర్యలను విశ్లేషిస్తే సరిపోతుందని బిహేవియరిజం చెబుతుంది. మనుషులను అర్థం చేసుకోవడానికి ఇది సరిపోతుందని వివరిస్తుంది. ఒకసారి అంచనాలకు వచ్చిన తర్వాత, దీన్ని చుట్టుపక్కల వారికీ వర్తింప చేస్తారు.

గేమిఫికేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఉదాహరణకు బోనులో ఉండే ఎలుక ఆ ఫుడ్ ట్రిగర్‌పై కాలు పెడితే అపాయం జరుగుతుందని కొన్ని రోజులకు తెలుసుకుంటుంది. అలానే మనుషులు ఒకలాంటి ఫీడ్‌బ్యాక్‌ ల్యూప్‌కు అలవాటుపడినప్పుడు వారి నుంచి ఒకేలాంటి స్పందనలు రావొచ్చని అంచనా వేయొచ్చు. ఇవి దాదాపు అన్నింటికీ వర్తిస్తాయి. పళ్లు తోముకోవడంతో మొదలుపెట్టి, ఒక ప్రోడక్ట్‌ను మళ్లీ ఆర్డరు చేసుకోవడం వరకు ఇలా అన్నింటికీ ఇవి వర్తిస్తాయి. ఒక బిహేవియర్‌ను ట్రాక్ చేస్తే, మరింత మందిని అదే బాటలో తీసుకొచ్చేలా చేయొచ్చు. దీని కోసం ప్రత్యేక ఫీడ్‌బ్యాక్ ల్యూప్‌లను సిద్ధం చేస్తారు.

ఇప్పుడు గేమిఫికేషన్‌కు కొనసాగింపుగా ఫీడ్‌బ్యాక్‌ ల్యూప్‌లను పిలుస్తున్నారు. ప్రజల్లో కొన్ని రకాల మార్పులు వచ్చేలా ఈ ఫీడ్‌బ్యాక్ లూప్‌లను సిద్ధం చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో ఎలా మోసం చేస్తున్నారు? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

అయితే, ఇక్కడ హాన్ మరో విషయం నాతో చెప్పారు. ‘‘అసలు బోనులోని ఎలుక లెవర్‌ను మళ్లీమళ్లీ ఎందుకు నొక్కాలని అనుకుంటుంది. ఎందుకంటే అది బోనులో ఉంది. దీనికి చేయడానికి వేరే ఏ పనీ లేదు’’అని ఆయన అన్నారు. ‘‘జంతువులను మనం బంధించినప్పుడు, ఒక్కో వస్తువుకు ఒక్కోలా స్పందిస్తుంటాయి. వాటి ప్రవర్తన అనేది ఆ స్పందనలకు అనుగుణంగా మారుతుంది. అలానే దీర్ఘకాలంలో మనుషుల ప్రవర్తన కూడా మార్చొచ్చు. అయితే, ఇక్కడ స్వేచ్ఛ, గౌరవం అనే వాటికి చోటే ఉండదు’’అని ఆయన అన్నారు.

చివరగా టెక్నాలజీ విషయానికి వస్తే, అడగాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కొందరిని పూర్తిగా అడగడమే మానేస్తారు. ఈ బోనస్‌లు, ప్రోత్సాహకాలను ఎందుకు ఇస్తున్నారు? సంస్థలు లాభాలు లేదా అధికారం తీసుకురావడం కోసమేనా? ఇక్కడ ఫీడ్‌బ్యాక్ లూప్‌లు, లెవర్లు మనల్ని ఎటు తీసుకెళ్తున్నాయి? లాంటి అంశాలను మనమే బెరీజు వేసుకోవాలని హాన్ అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)