Email Tracking: మార్కెటింగ్ సంస్థల చేతికి మీ వివరాలు చిక్కకుండా ఈ సెట్టింగ్స్‌తో తప్పించుకోవచ్చు - డిజిహబ్

ఈమెయిల ట్రాకింగ్
    • రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

ఓ శుక్రవారం సాయంకాలం, కరెక్టుగా మీరు పని ముగించుకుని లాగవుట్ అవుదామనుకునే సమయంలో, “భారీ తగ్గింపులతో కొత్త మోడల్ స్పోర్ట్ షూస్” అని ఒక ఈమెయిల్ వస్తుంది.

ఆసక్తి పెరిగి మీరు దాన్ని తెరిచి చూస్తారు. ఆ షూ కంపెనీ వెబ్‍సైట్‍కు వెళ్లి అక్కడ మోడల్స్, ఆఫర్స్ గురించి వివరాలు తెలుసుకుంటారు. అతి మామూలుగా అనిపించే ఈ వ్యవహారం వెనుక పెద్ద ప్రైవసీ సమస్యే దాగుంది.

ఇలాంటి మార్కెటింగ్ మెయిల్స్ కేవలం కొత్త కొనుగోలు అవకాశాల గురించి చెప్పి ఊరుకోవు. మనకు తెలీకుండా మన వివరాలను సేకరిస్తాయి. వాటిని తమ విపరీత మార్కెటింగ్ ధోరణులకు అనుగుణంగా మలచుకుంటాయి.

మనకి ఏ మాత్రం అనుమానం రానివ్వకుండా మనకి పంపిన ఈమెయిల్ నుంచి మన అలవాట్లను ట్రాక్‌చేసే ఈ వ్యవహారాన్ని “ఈమెయిల్ ట్రాకింగ్” అంటారు. దీనికి “రీడ్ రిసీప్ట్” అని కూడా పేరు.

ఈమెయిల ట్రాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఈమెయిల్ ద్వారా ఎలా ట్రాక్ చేస్తారు?

మార్కెటింగ్ కంపెనీలు వారు పంపించే ఈమెయిల్స్ హెడర్‍లోనో, ఫుటర్‍లోనో, బాడీలోనో కనిపించనంత చిన్న 1x1 పిక్సల్ ఇమేజీని ఉంచుతారు.

అది కంటికి కనిపించదు కాబట్టి మనం దాన్ని పసిగట్టలేం. కానీ మనం ఈమెయిల్ తెరవగానే మాత్రం ఈ ఇమేజీ ఆ కంపెనీల సర్వర్లతో కనెక్ట్ అవుతుంది. మనం ఎప్పుడు ఈమెయిల్ తెరిచాం? ఎన్ని నిమిషాల పాటు దాన్ని చూశాం? ఏ డివైజ్ నుంచి చూశాం? మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లు చదివాం? లాంటి వివరాలన్నీ మన ప్రమేయం లేకుండా ఆ సర్వర్లకి అందజేస్తుంది.

కంపెనీలు ఇలా లక్షలకొద్దీ ఈమెయిల్స్ ట్రాక్ చేసి కస్టమర్ల వినియోగ అలవాట్లను అర్థం చేసుకుని, తన వ్యాపార లాభాలకు వాడుకుంటాయి.

ఈమెయిల్ తెరిచారా, చదివారా, ఎంత సేపు చదివారు లాంటి వివరాల దగ్గర ఆగకుండా ఏ డివైజునుంచి, ఏ లొకేషన్ నుంచి చూశారన్నది కూడా ట్రాక్ చేయడం ద్వారా కస్టమర్ ప్రైవసీని అగౌరవపరిచినట్టే అవుతుంది.

అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ లాంటి పెద్ద వాణిజ్య సంస్థల నుంచి అనేకులు తమ మార్కెటింగ్/సేల్స్ కోసం ఇలా ఈమెయిల్స్ ట్రాక్ చేస్తుంటారు. ఇలా ట్రాక్ చేయడం ద్వారా కస్టమర్ అలవాట్లని – ఈమెయిల్ ఏవేళల్లో చదువుతుంటారు? నెల జీతం ఎప్పుడు వస్తుంది? ఎలాంటి వస్తువులు కొనే ఆసక్తి ఉంది? నెలలో ఏ రోజుల్లో/సమయాల్లో ఎక్కువ కొనుగోళ్లు చేస్తుంటారు? లాంటి వివరాలని – కూడా అందాజాగా చెప్పగలిగేంతగా వివరాలు ట్రాక్ చేయగలుగుతుంటారు.

ఈమెయిల ట్రాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఈమెయిల్ ట్రాకింగ్ వల్ల నష్టాలు ఎలాంటివి?

ట్రాకింగ్ చేసి మన గురించి పొందుపరిచిన సమాచారం అంతా ఎప్పుడు ఎవరి చేతుల్లో పడుతుందో తెలీకపోవడం మొదటి ఇబ్బంది. దీని ద్వారా చాలా ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా లొకేషన్ డేటా లాంటివి తప్పుడు చేతుల్లో పడితే ఎంతటి విపరీత పరిణామాలకైనా దారి తీయవచ్చు.

ట్రాకింగ్ చేయగలిగి, మన వివరాలు వారి సర్వర్లలో చేర్చుకున్నాక, దాన్ని ఒక అలవాటుగా మార్చుకుని మనకి విపరీతంగా మార్కెటింగ్ మెయిల్స్ పంపే అవకాశాలే ఎక్కువ.

దీని వల్ల మన అలవాట్లు వారికి తెలియడం ఒకటైతే, అన్ని మెయిల్స్ వల్ల స్టోరేజ్ సమస్యలు రావడం మరొకటి. రెండు విధాలా నష్టపోయేది మనమే. ఇలా పంపే మార్కెటింగ్ మెయిల్స్‌లో మళ్ళీ ఫిషింగ్‍కు అవకాశముండే మెయిల్స్ భయం కూడా ఉంటుంది.

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ఈమెయిల్ ట్రాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయచ్చు?

ఈమెయిల్ ట్రాకింగ్ బారినుంచి కాపాడేలా ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వల్ల భారం అంతా కస్టమర్లపైనా, లేదా ఆపరేటింగ్ సిస్టమ్స్ పైనా పడుతూ వస్తుంది.

తమ కస్టమర్లను కాపాడడానికి గత ఏడాది కాలంలోనే ఆపిల్ కొన్ని కొత్త సెక్యూరిటీ సెట్టింగ్స్ మొదలెట్టింది. వీటి ద్వారా మెయిల్‌లో ఉన్న ఇమేజీలు వాటంతట అవే లోడ్ అవ్వకుండా, ప్రైవేటుగా లోడ్ అవుతాయి. దీనివల్ల మార్కెటింగ్ కంపెనీలు మీ మెయిల్ అక్టివిటీ గురించి తెలుసుకోవడం కష్టమవుతుంది.

మీ ఐఫోన్ల మీద ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకోవాలంటే: Settings Mail Privacy ProtectionProtect Mail Activityని ఆన్ చేయాలి.

ఈమెయిల ట్రాకింగ్

ఫొటో సోర్స్, Purnima tammireddy

పైన చెప్పిన సెట్టింగ్ ఆపిల్ పరికరాలకు మాత్రమే వర్తిస్తుంది.

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతుంటే, జీమెయిల్/యాహూ/అవుట్‍లుక్ లాంటి ఈమెయిల్ క్లైయింట్స్ సెట్టింగ్స్ కు వెళ్ళి, అక్కడ “ఇమేజీలు చూపించే ముందు అనుమతి తీసుకో” అన్న సెట్టింగ్ (కింద చూపించిన విధంగా) ఆన్ చేసుకోవాలి.

అయితే, దీని వల్ల ఈమెయిల్‍లో ఇమేజీలు ఏవీ కనిపించవు, ఒక్కొక్కదానికీ అనుమతిని ఇస్తూ పోవాలి. అది కొంత ఇబ్బంది కలిగించే విషయమే కానీ, మన వివరాలు ఇమేజీలు ద్వారా బయటకుపోనివ్వకుండా కాపాడే మరో దారి లేదు కనుక, ఈ సెట్టింగ్‍ను వాడుకోవచ్చు.

ఈమెయిల ట్రాకింగ్

ఫొటో సోర్స్, Purnima tammireddy

పైన చెప్పుకున్న సెట్టింగ్ తాత్కాలికంగా (అంటే, మనం అనుమతి ఇచ్చేంత వరకే) మన వివరాలు బయటకు పొక్కకుండా చూస్తాయి. ఒకసారి అనుమతించాక మళ్ళీ అదే పాత కథ! దీనికి ఈమెయిల్ క్లైయింట్లు మరింత పకడ్బందీగా సెట్టింగ్స్ ఇవ్వవచ్చు.

కానీ జీమెయిల్‌ను నడిపించే గూగుల్ అతి పెద్ద యాడ్ కంపెనీ కూడా. అందుకనే వాళ్ళు యాడ్స్ మొత్తంగా పనిజేయకుండా ఉండే సెట్టింగ్స్ ఏవీ ఇవ్వరు. వారి వ్యాపారానికి నష్టం కాబట్టి.

వీడియో క్యాప్షన్, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో ఎలా మోసం చేస్తున్నారు? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

డక్‍డక్‍గో (https://duckduckgo.com/email/) లాంటి కంపెనీలు ఈమెయిల్ ప్రొటెక్షన్ అని ఉచితంగాను, మరికొన్ని సంస్థలు డబ్బులకు అందిస్తున్నాయి. ఆ సర్వీసులను వాడుకుని ఈమెయిల్ ట్రాకింగ్ నుంచి కొంత వరకూ బయటపడవచ్చు.

బ్యాంక్, ప్రభుత్వ డాక్యుమెంట్లకు, ఉద్యోగ అవసరాలకు ఒక ఈమెయిల్ పెట్టుకుని, మిగతా వాటికి (సోషల్ మీడియా, వెబ్‍సైట్లలో లాగిన్లు, న్యూస్‍లెటర్లు వగైరాలకు) మరో ఈమెయిల్ పెట్టుకోవడం క్షేమకరం.

వీడియో క్యాప్షన్, త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో అందమైన స్కూల్ బిల్డింగ్ కట్టేశారు

దీనివల్ల మన ఈమెయిల్ లీక్ అయినా ముఖ్యమైన, సున్నితమైన విషయాలు బయటకు పొక్కవు. అలానే, అడిగిన చోటల్లా ఈమెయిల్ ఇవ్వకుండా అవసరమైన చోటు మాత్రమే ఇస్తే, తక్కువ మందికి ఇలా మార్కెటింగ్ చేసే ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది.

ఏదైనా వెబ్‍సైట్/సర్వీస్ ఒకసారి వాడేసుకున్నాక, మళ్ళీ తిరిగి వాడే ఉద్దేశం లేకపోతే “unsubscribe” చేసుకోవడం మంచి అలవాటు. లేదంటే వారినుంచి మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈమెయిల్ ట్రాకింగ్ నుంచి కొద్దిలో కొద్దిగా బయటపడవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)