వాట్సాప్ లేటెస్ట్ ప్రైవసీ ఫీచర్లు: ఆ మెసేజ్‌ల స్క్రీన్ షాట్లు ఇకపై సాధ్యం కాదు.. గుట్టుచప్పుడు కాకుండా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోవచ్చు..

వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

వాట్సాప్ వినియోగదారులకు కొత్త ప్రైవసీ ఫీచర్లను మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇకపై ఏదైనా వాట్సాప్ గ్రూప్ నుంచి సభ్యులు ఎవరైనా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోవచ్చు. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారమైతే గ్రూప్ నుంచి లెఫ్ట్ అయితే ఆ యూజర్ 'లెఫ్ట్' అని గ్రూప్‌లో చూపించేది.

దీంతో పాటు మరో రెండు ఇతర సదుపాయాలనూ వాట్సాప్ తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

యూజర్ ఆన్‌లైన్‌లో(వాట్సాప్‌లో) ఉన్నప్పుడు ఆ విషయం ఎవరికి తెలియొచ్చు.. ఎవరికి తెలియకూడదు అనేది కంట్రోల్ చేసుకునే అవకాశాన్నీ కల్పిస్తోంది వాట్సాప్.

ఇంతకుముందు ఏ యూజర్ అయినా ఆన్‌లైన్లో ఉంటే ఆ విషయం ఎవరైనా తెలుసుకునే వీలుండేది. దీంతో ఆ సమయంలో ఎవరైనా మెసేజ్ పంపితే.. దానికి స్పందించకపోతే చూసి కూడా స్పందించనట్లుగా ఉండేది. అది అవతలి వ్యక్తులతో ఉన్న సంబంధాలను బట్టి ఒక్కోసారి ఇబ్బందిగా ఉండేది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌ స్టేటస్ చూపించడాన్ని నియంత్రించుకునే వీలు కలుగుతోంది.

వీడియో క్యాప్షన్, లబ్‌డబ్బు: వాట్సాప్‌ పే.. తప్పక తెలుసుకోవాల్సిన ఫీచర్ ఇది

ఇక మూడో ఫీచర్ 'వ్యూ ఒన్స్' మెసేజ్‌లకు సంబంధించినది. ఒకసారి చూశాక మెసేజ్ అదృశ్యమయ్యే ఫీచర్‌ను వాట్సాప్ గతంలోనే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దానికి అదనంగా మరో ఫీచర్ యాడ్ చేసింది. అలాంటి వ్యూ ఒన్స్ మెసేజ్‌లను గతంలో స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ, ఇకపై అలాంటి చాన్స్ ఉండదు. వ్యూ ఒన్స్ మెసేజ్‌లు వాట్సాప్‌లో స్క్రీన్ షాట్ తీయడానికి కుదరదు.

ఈ మూడు కొత్త ఫీచర్లు యూజర్లకు ఉపయోగపడతాయని వాట్సాప్ మాతృసంస్థ మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. వాట్సాప్ మెసేజింగ్ యాప్‌లో యూజర్ల మధ్య ముఖాముఖి సంభాషణలు మరింత భద్రంగా, వ్యక్తిగతంగా జరపడానికి ఈ ఫీచర్లు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

Whatsapp

ఫొటో సోర్స్, Whatsapp

'లెఫ్ట్'కి రైట్ రైట్

వాట్సాప్ గ్రూప్ నుంచి ఎవరైనా సభ్యుడు లెఫ్ట్ అయితే ఆ విషయంలో గ్రూప్‌లో సభ్యులందరికీ అలర్ట్ వచ్చేది.

దీంతో 'లెఫ్ట్' అయితే మిగతా సభ్యులు ఏమనుకుంటారో అనే సందేహాలు, మొహమాటాలతో చాలా గ్రూప్‌లలో అవసరం లేకున్నా కొనసాగే పరిస్థితి ఉండేది.

కానీ, ఇకపై అలాంటి అవసరం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గ్రూప్ నుంచి వెళ్లిపోయే సౌకర్యాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది.

ఈ కొత్త ఫీచర్ ప్రకారం అడ్మిన్‌లకు మాత్రమే అలర్ట్ వస్తుంది.

వాట్సాప్ మెసేజ్‌ల విషయంలో యూజర్లు మరింత ప్రైవసీ, కంట్రోల్ కలిగి ఉండేదుకు వీలు కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు మెటా ప్రొడక్ట్ హెడ్ అమీ వోరా చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంకే మెసేజింగ్ యాప్‌లోనూ ఈ స్థాయిలో ప్రైవసీ, కంట్రోల్ ఫీచర్లు లేవని ఆమె అన్నారు.

అయితే, తాజా ఫీచర్‌ యూజర్లకు ఉఫయోగకరమే అయినా... కొన్ని కొన్ని గ్రూపులలో సభ్యులందరినీ అడ్మిన్ చేస్తారు.. అలాంటి గ్రూపుల్లో ఈ ఫీచర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

అలాగే వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఆ విషయంలో ఎవరికీ తెలియొచ్చు, ఎవరికి తెలియకూడదు అనేదీ ఇకపై నియంత్రించొచ్చు. కాంటాక్ట్స్‌లో కొందరికే తెలియాలా.. అసలు ఎవరికీ తెలియకూడదా అనేది చూసుకోవచ్చు.

Whatsapp

ఫొటో సోర్స్, Getty Images

అలాన్ ట్యూరింగ్ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చ్ అసోసియేట్ జానిస్ వాంగ్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. యూజర్లకు ఇలాంటి కంట్రోల్ ఫీచర్లు అందుబాటులోకి తేవడం మంచిదేనని అభిప్రాయపడ్డారు.

కానీ, ఈ ఫీచర్ల గురించి పూర్తిగా తెలిసేలా చేయాలని.. లేకపోతే అవన్నీ నిరుపయోగమని ఆమె అన్నారు.

ఇవన్నీ డీఫాల్ట్‌గా ఉండాలని, ఎవరికైనా ఈ ఫీచర్లు అవసరం లేదనుకుంటే మార్చుకునేలా ఉండాలని సూచించారు.

అలాగే... వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లను ఎవరికీ చేరకుండా డిలీట్ చేసేందుకు ఉన్న గడువునూ మెటా పెంచింది.

ఇకపై యూజర్లు రెండు రోజుల కిందట పంపించిన మెసేజ్‌లనూ డిలీట్ చేసుకోవచ్చు.

60 గంటలలోపు మెసేజ్‌లను డిలీట్ చేసుకోవచ్చు. ఆ సమయం దాటితే అందరికీ డిలీట్ చేయడం కుదరదు.

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ పనిచేయకపోవడంతో నిమిషానికి ఎంత నష్టం కలిగిందో తెలుసా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)