కంబోడియా-ఖెమెర్ రూజ్: 20 లక్షలమందిని చంపిన కేసుల్లో నిందితులు ఎందరు, ట్రిబ్యునల్ ఏం సాధించింది

ఖియూ సంఫాన్‌ను 2018లో దోషిగా నిర్ధారించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖియూ సంఫాన్‌ను 2018లో దోషిగా నిర్ధారించారు.
    • రచయిత, జొనాథన్ హెడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కంబోడియాలో ఖెమెర్ రూజ్ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కంపూచియా ప్రభుత్వం) మతోన్మాద పాలనలో జరిగిన దురాగతాలపై విచారించడానికి ఏర్పాటైన ప్రత్యేక ట్రిబ్యునల్, ఈ కేసు తుది విచారణను చేపట్టింది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు, మారణహోమానికి సంబంధించి 2018 నాటి తీర్పును ఈ ట్రిబ్యునల్ సమర్థించింది.

ఖెమెర్ రూజ్ ప్రభుత్వానికి చెందిన కొంతమంది నాయకులను ఈ ప్రత్యేక హైబ్రిడ్ కోర్టు విచారించింది. కోర్టు విచారించిన నాయకుల్లో 'ఖియూ సంఫాన్' ఒకరు. కంబోడియా, అంతర్జాతీయ న్యాయమూర్తులు, న్యాయవాదులతో ఈ ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు.

1970 చివర్లలో దాదాపు 20 లక్షల మంది కంబోడియన్ల మరణాలకు కారణమైన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి చేసిన అంతర్జాతీయ ప్రయత్నాలకు ఈ చివరి విచారణతో ముగింపు లభించింది.

కంబోడియా కోర్టు (ఎక్స్‌ట్రార్డినరీ చాంబర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కంబోడియా- ఈసీసీసీ) చివరకు ముగ్గురిని దోషులుగా నిర్ధరించింది. 13 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణకు 300 మిలియన్ డాలర్ల (రూ. 2,437 కోట్లు)కు పైగా ఖర్చు అయింది.

ఖియూ సంఫాన్ సహోద్యోగి న్యూయాన్ చియా. ఖెమెర్ రూజ్ అధికార క్రమంలో న్యుయాన్ చియాను 'బ్రదర్ నంబర్ 2' అని పిలిచేవారు. ఆయనను 2007లో అరెస్ట్ చేశారు. 2014లో జీవిత ఖైదు విధించారు. శిక్ష పడిన అయిదేళ్ల తర్వాత జైలులోనే ఆయన మరణించారు.

1976-79 మధ్య ఖెమెర్ రూజ్ ప్రభుత్వాన్ని పోల్ పాట్ పాలించారు

ఫొటో సోర్స్, DOCUMENTATION CENTER OF CAMBODIA ARCHIVES

ఫొటో క్యాప్షన్, 1976-79 మధ్య ఖెమెర్ రూజ్ ప్రభుత్వాన్ని పోల్ పాట్ పాలించారు

2010లో దోషిగా తేలిన తొలి ముద్దాయి కామ్రేడ్ డచ్. ఆయన ఫ్నామ్ పెన్‌ నగరంలో త్యుయోల్ స్లెంగ్ అనే టార్చర్ సెంటర్‌ను నిర్వహించారు. ఈ సెంటర్‌ బారిన పడిన 20 వేల మంది బందీల్లో కేవలం 12 మంది మాత్రమే బతికి బయటపడ్డారు. 2020లో డచ్ మరణించారు.

మరో ఇద్దరు నిందితులు లెంగ్ సరీ, ఆయన భార్య లెంగ్ తిరిత్. లెంగ్ సరీ, ఖెమెర్ రూజ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వీరిద్దరూ వారి విచారణ పూర్తికాకముందే చనిపోయారు. లెంగ్ తిరిత్‌కు డెమెంతియా వ్యాధి నిర్ధారణ కావడంతో ఆమెపై విచారణను మధ్యలోనే ఆపేశారు.

ఖెమెర్ రూజ్ పాలనకు నేతృత్వం వహించిన పోల్ పాట్, 1998లో చనిపోయారు.

ఖెమెర్ రూజ్ ప్రభుత్వానికి చెందిన ఇతర అధికారులపై కేసులను కొనసాగించాలని ఈసీసీసీలోని అంతర్జాతీయ ప్రాసిక్యూటర్లు కోరుకున్నారు. కానీ, ఈ బెంచ్‌లో భాగంగా ఉన్న కంబోడియన్ న్యాయమూర్తులు దీన్ని అడ్డుకున్నారు.

ఈ కేసులో మరింత ముందుకు పోతే, కంబోడియన్ సమాజానికి అయిన గాయాలను తిరిగి రేపినట్లు అవుతుందని కంబోడియా ప్రధానమంత్రి హున్ సెన్ అన్నారు. ఆయన ఖెమెర్ రూజ్ ప్రభుత్వంలో మిలిటరీ అధికారిగా పనిచేశారు.

కంబోడియాలో 1975-79 మధ్య ఖెమెర్ రూజ్‌ క్రూర పాలన సాగింది. ఆ సమయంలో సుమారు 20 లక్షల మందిని హతమార్చారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కంబోడియాలో 1975-79 మధ్య ఖెమెర్ రూజ్‌ క్రూర పాలన సాగింది. ఆ సమయంలో సుమారు 20 లక్షల మందిని హతమార్చారు.

ఆశావాద దృక్పథం నుంచి పుట్టిన ట్రిబ్యునల్

1990 చివర్లలో అంతర్జాతీయ సంబంధాలు ఆశావహంగా ఉన్న కాలంలో ఖెమెర్ రూజ్‌ పాలన పై విచారణ కోసం ట్రిబ్యూనల్‌ను ఏర్పాటు చేశారు.

ప్రచ్ఛన్న యుద్దం ముగియడం వల్ల కంబోడియా వంటి దేశంలో తొలిసారిగా న్యాయ పోరాటం సాధ్యమైంది.

ప్రచ్ఛన్న యుద్ధానంతరం కంబోడియాలో జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ జోక్యం ఇదే. యుగోస్లోవియా, రువాండాలకు ప్రత్యేక ట్రిబ్యునల్‌లు, అంతర్జాతీయ కోర్టులు ఏర్పాటైన సమయం కూడా ఇదే.

రాజకీయ కారణాల వల్ల ఈసీసీసీ ఏర్పాటుకు చాలా సంవత్సరాల సమయం పట్టింది.

యుక్ చాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్ చాంగ్

ఆశ, నిరాశ

ఖెమెర్ రూజ్ ప్రభుత్వ అకృత్యాల నుంచి బయటపడిన వారు ఈసీసీసీ గురించి మిశ్రమంగా స్పందించారు.

ప్రత్యేకంగా ఏర్పాటైన ట్రిబ్యునల్, కంబోడియాతో పాటు ఇతర దేశాలకు విలువైన సేవను అందించిందని యుక్ చాంగ్ అన్నారు. ఖెమెర్ రూజ్ ప్రభుత్వ హయాంలో జరిగిన నేరాల వివరాలను భద్రపరచడం కోసం 'కంబోడియా డాక్యుమెంట్ సెంటర్'ను యుక్ చాంగ్ స్థాపించారు.

''దీనితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మేం 30 వేలకు పైగా బాధితులతో మాట్లాడాం. వారి అనుభవాల గురించి తెలుసుకున్నాం. అందులో చాలా మంది తమకు ఈ కోర్టు ప్రక్రియ చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పారని'' అని యుక్ తెలిపారు.

కంబోడియాలోని మానవ హక్కుల గురించి బాగా తెలిసిన విరాక్, 1980లలో అంతర్యుద్ధం సమయంలో శరణార్థిగా థాయ్‌లాండ్‌కు వెళ్లిపోయారు. ఆయన తండ్రి కూడా ఖెమెర్ రూజ్ ప్రభుత్వ దురాగతాల్లో చనిపోయారు. ట్రిబ్యూనళ్లు శాశ్వత పరిష్కారాన్ని చూపుతాయనే నమ్మకం తనకు లేదని విరాక్ అన్నారు.

''మాకు వీటిపై చాలా తక్కువ నమ్మకం ఉంది. ట్రిబ్యూనళ్ల రాజకీయ స్వభావాన్ని మేం అర్థం చేసుకున్నాం. మానవ హక్కుల సమస్యలను ఎదుర్కొంటోన్న మేం, ట్రిబ్యూనళ్ల నుంచి కొంత జవాబుదారీతనాన్ని కోరుకుంటాం.

ట్రిబ్యూనళ్లు, చారిత్రక వాస్తవాలను బయటకు తెస్తాయని, అప్పుడు ఏం జరిగిందనేదానిపై అవగాహనను కల్పిస్తాయని మేం ఆశిస్తున్నాం. కానీ, ట్రిబ్యూనల్ నుంచి డాక్యుమెంటేషన్‌లో ఇప్పటివరకు మాకు ఏం తెలిసిందో దాని గురించి మాత్రమే చెప్పారు'' అని విరాక్ చెప్పారు.

పోల్ పాట్

ఫొటో సోర్స్, BETTMANN/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, పోల్ పాట్

ఇంతకీ ఖెమెర్ రూజ్ పాలకులు అంటే ఎవరు?

* కంబోడియాలో 1975-79 మధ్య ఖెమెర్ రూజ్‌ క్రూర పాలన సాగింది. ఆ సమయంలో సుమారు 20 లక్షల మందిని హతమార్చారు.

* పోల్ పాట్ పాలనలో కంబోడియాను మధ్య యుగాల కాలానికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి. నగరాలు, పట్టణాల్లోని లక్షలాది మందిని బలవంతంగా పల్లెటూర్లకు తరలించి అక్కడి పొలాల్లో పనిచేయించారు.

* ఖెమెర్ రూజ్ కాలం నాటి నాయకుల్లో ప్రస్తుతం జీవించి ఉన్నవారిని విచారించడానికి 2009లో ఐరాస ఒక ట్రైబ్యునల్ ఏర్పాటుకు సహకరించింది.

* ఖెమెర్ రూజ్ పాలకుల్లో ముగ్గురికి మాత్రమే శిక్ష పడింది. ఆ కాలంలో అరాచకాలకు నిలయమైన త్యుయోల్ స్లెంగ్ జైలు బాధ్యతలు చూసిన కైంగ్ గ్యుయెక్ ఈవ్, ఖెమెర్ రూజ్ పాలనలో అధ్యక్షుడిగా ఉన్న ఖియూ సంఫాన్, అప్పటి ప్రధాని పోల్ పాట్‌కు డిప్యూటీగా పనిచేసిన న్యూయాన్ చియాలను జైలుకు పంపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)