ఆకలిని తగ్గించే ఆహార పదార్థాలు ఏవి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెసికా బ్రాడ్లీ
- హోదా, బీబీసీ ఫ్యూచర్
అద్భుతమైన రుచితోపాటు ఎక్కువ రోజులు తాజాగా ఉండే, మనకు మేలు చేసే ఆహార పదార్థాలను మనం ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాం. ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనిపించేవిగా చెప్పే ఆహార పదార్థాలను మన ఫుడ్ షాపింగ్ లిస్టులో పెట్టుకుంటాం. అయితే, నిజంగానే ఈ ఆహార పదార్థాలు మన ఆకలిని తగ్గించగలవా?
1. కారంగా ఉండే ఆహారం..
అల్లం, పచ్చిమిర్చి లాంటి పదార్థాలతో నిండిన ఆహారంతో ఆకలి తగ్గినట్లు అనిపిస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అయితే వీటిపై లండన్ ఇంపీరియల్ కాలేజీలోని న్యూట్రిషన్ అండ్ ఫుడ్ నెట్‌వర్క్ విభాగం అధిపతి గ్యారీ ఫ్రోస్ట్ సందేహాలు వ్యక్తంచేశారు. ‘‘ఈ అధ్యయనాల్లో ఆహారం భారీగా ఇచ్చారు. పైగా ఇవి జంతువులపై చేపట్టారు. మనుషులపై ఈ ఆహారాల ప్రభావం ఇంకా తెలియాల్సి ఉంది’’అని ఆయన అన్నారు.
అయితే, మిర్చీలోని ‘‘కాప్ససిన్’’ నిజంగా ఆకలిని తగ్గించగలదా? అనే కోణంలో, సగటున మనుషులు తీసుకునే పరిమాణంలో ఆహారాన్ని ఇస్తూ ఒక అధ్యయనం జరిగింది. మొదట ఈ అధ్యయనాన్ని ఒహైయోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీలోని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మేరీ జాన్ లూడీ తన ఇంటిలోనే నిర్వహించారు. తన భోజనంలో ఆమె భరించగలిగే స్థాయి(అమెరికాలోని మిడ్‌వెస్ట్‌లో తినగలిగే స్థాయిలో)లో ఆమె మిర్చీని కలుపుకొని చూశారు.

ఫొటో సోర్స్, Rakesh Picholiya/Getty Images
ఆ తర్వాత ఈ పరిశోధన కోసం తమ ల్యాబ్‌కు 25 మందిని ఆమె ఆహ్వానించారు. వారికి టమాటో సూప్‌ను ఆమె అందించారు. అది తాగిన తర్వాత, నాలుగన్నర గంటలు వారిని తన ల్యాబ్‌లోనే ఉండమని ఆమె సూచించారు. ఆ సమయంలో వారి ఆకలి, శక్తి స్థాయిలను ఆమె పరిశీలించారు. ఆ తర్వాత మళ్లీ ఆహారం పెట్టి, కావాల్సినంత తినమని వారికి సూచించారు.
ఒక గ్రాము మిర్చీ కలిపిన సూప్‌ను తీసుకున్నప్పుడు, ఆ తర్వాత నాలుగున్న గంటల్లో వారి శరీరానికి సాధారణం కంటే పది క్యాలరీలు అదనంగా ఖర్చయ్యాయి. అయితే, నెలలో ఒకసారి మాత్రమే మిర్చీ తీసుకునే వారు తమకు ఆ సూప్ తాగిన తర్వాత, ఆహారం గురించి అంతలా ఆలోచనలేవీ రాలేదని చెప్పారు. ఆ తర్వాత భోజనంలో ‘‘వారానికి మూడుసార్లు లేదా అంత కంటే ఎక్కువగా మిర్చీ తీసుకునేవారి’’తో పోలిస్తే, వీరు 70 క్యాలరీల ఆహారాన్ని తక్కువగా తీసుకున్నారు.
అయితే, ఈ అధ్యయనాన్ని సూప్‌కు బదులుగా కాప్ససిన్ మాత్రలతోనూ లూడీ నిర్వహించారు. అయితే, కేవలం మిర్చీ-సూప్ తీసుకున్నప్పుడు మాత్రమే అదనంగా కేలరీలు ఖర్చవుతున్నట్లు తేలింది.
‘‘ఆహారం తీసుకుటేప్పుడు కారంగా అనిపించడం లేదా నోరు మండడం లాంటి పరిణామాలపై ఈ అధ్యయనం కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడిస్తోంది’’అని ఆమె చెప్పారు.
అయితే, కారంగా ఉండే ఆహారం తీసుకున్నతర్వాత పది క్యాలరీలు అదనంగా ఖర్చుకావడం అనేది అంత పెద్ద విషమేమీ కాదు, పైగా దీర్ఘ కాలంలో దీనితో వచ్చే ప్రభావమేమీ కనిపించడంలేదని గ్యారీ వివరించారు.

ఫొటో సోర్స్, George Clerk/Getty Images
2. కాఫీ ప్రభావం ఎలా ఉంటుంది?
ఆ తర్వాత ఇదే కోణంలో చేపట్టిన 32 అధ్యయనాల్లో మిర్చీతోపాటు గ్రీన్ టీ కూడా ఆకలిని తగ్గించేందుకు తోడ్పడటంలేదని వెల్లడైంది.
మరోవైపు ఆకలిని తగ్గించేదిగా చెప్పే మరో ఆహార పదార్థం కాఫీ. అయితే, నిజంగానే కాఫీ ఆకలిని తగ్గిస్తుందా అనే కోణంలో జరిగిన పరిశోధనలను కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని కినీసియాలజీ (శరీర కదలికలను అధ్యయనంచేసే విభాగం) అసిస్టెంట్ ప్రొఫెసర్ మ్యాథ్యూ షూబట్ సమీక్షించారు.
కడుపు వేగంగా ఖాళీ అవ్వడానికి, అంటే మనం తీసుకున్న ఆహారం కడుపు నుంచి చిన్న పేగుల్లోకి త్వరగా వెళ్లడానికి కాఫీ తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అంటే దీని వల్ల త్వరగా ఆకలి వేసే అవకాశముంది. కానీ, కాఫీ వల్ల శరీరంలో ఇలాంటి మార్పులు జరుగుతాయని కచ్చితంగా ఈ అధ్యయనాలేవీ వెల్లడించలేదు.
ఒకవేళ భవిష్యత్‌లోనైనా మన ఆకలిని కాఫీతో తగ్గించే విధానం కనుక్కున్నట్లు ఏదైనా అధ్యయనం చెబితే, అది అంత గొప్ప విధానమై ఉండకపోవచ్చని షూబట్ అన్నారు. కేవలం కాఫీతో రోజుకు వంద లేదా రెండు వందల క్యాలరీలు మాత్రమే తగ్గించుకోవడం సాధ్యమని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. ఫైబర్ ఎలా?
ఇలా విడివిడిగా ఆహార పదార్థాలు ఆకలిపై చూపే ప్రభావాన్ని పక్కన పెడితే, కొన్ని మ్యాక్రోన్యూట్రియంట్లపైనా పరిశోధకులు దృష్టిపెట్టారు. ఇవి ఆకలిని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలించారు. కడుపు నిండినట్లు అనిపించేవి చెప్పే వాటిలో ‘‘ఫైబర్’’ ముందుంటుంది. ఎక్కువ ఫైబర్‌ను తీసుకోవడం వల్ల బరువు పెరగడం కూడా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, కేవలం భారీగా ఫైబర్‌ను తీసుకున్నప్పుడు మాత్రమే అలా జరుగుతుందని గ్యారీ చెప్పారు.
‘‘మనం రోజుకు ఒక 30 గ్రాములు డైటరీ ఫైబర్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతారు. అయితే, చాలా ప్రాంతాల్లో ప్రజలు కేవలం రోజుకు 15 గ్రా. మాత్రమే తీసుకుంటారు. ఒకవేళ మీరు దీన్ని 30 గ్రా. పెంచితే, ఆకలి కాస్త తగ్గినట్లు అనిపించొచ్చు. అయితే, ఈ ఫీలింగ్ కొద్దిసేపు మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి’’అని ఆయన అన్నారు.
మరోవైపు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆకలి తగ్గుతుందని చెబుతుంటారు. కానీ, చాలా తక్కువ మందిపై ఈ అధ్యయనాలు జరిగాయి.
ఆకలి తగ్గినట్లుగా ఏ మ్యాక్రోన్యూట్రియంట్లతో అనిపిస్తుందో కునుక్కొనే దిశగా చాలా పరిశోధనలు జరిగాయి. అయితే, స్పష్టమైన సమాధానాలు మాత్రం లభించలేదు.
‘‘కొన్ని అధ్యయనాలు మాత్రం ప్రోటీన్‌ను ఎక్కువగా తీసుకున్నప్పుడు కడుపు నిండిన సంతృప్తి కలుగుతుందని చెబుతున్నాయి. అయితే, తర్వాత వచ్చే ఆకలిపై దీని ప్రభావం ఎంత ఉంటుందనే విషయంలో స్పష్టమైన సమాధానం లేదు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భిన్న మ్యాక్రోన్యూట్రియంట్లను ఒకదానితో మరొక దాన్ని పోల్చి చూడటం చాలా కష్టం’’అని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలోని మార్కెటింగ్ అండ్ బిహేవియరల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ యాన్ కార్నిల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Dulin/Getty Images
4. నీరు తాగితే..
ఆకలిని తగ్గించే పదార్థాలపై దృష్టి పెట్టేకంటే, నీరు ఎక్కువగా తాగడంతో కాస్త ఫలితం ఉంటుందని అమెరికా నార్త్ కాలిఫోర్నియాలోని గిలింగ్స్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన న్యూట్రిషన్ ప్రొఫెసర్ మార్టిన్ కోల్‌మీర్ చెప్పారు. ఎందుకంటే నీరు తీసుకోవడం వల్ల స్వల్ప కాలంపాటు ఆకలి తగ్గినట్లు అనిపిస్తుందని మార్టిన్ వివరించారు.
భోజనం తీసుకునేముందు, రెండు గ్లాసుల నీరు తాగేవారు, తక్కువగా ఆహారం తీసుకుంటున్నట్లు పరిశోధనల్లో రుజువైంది.
అయితే, ఆకలిలో వచ్చే ఎలాంటి మార్పులైనా స్వల్పంగానే ఉంటాయని గ్యారీ చెప్పారు. దీని వెనుక కారణాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయని ఆయన అన్నారు.
‘‘కొద్ది కాలం క్రితం మాత్రమే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం లభించడం మొదలైంది. పరిణామక్రమంలో మనం అతి తక్కువ ఆహారంతోనే ముందుకు వచ్చాం. దీంతో ఆహారం తీసుకోవాలని సూచించేలానే మన శరీరాలు పరిణామం చెందాయి. నిజంగా ఒకవేళ ఏదైనా ఆహారం ఆకలిని తగ్గిస్తుందంటే, మీరు దాన్ని పూర్తిగా తీసుకోవడం మానేయాలని శరీరం సూచిస్తుంది’’అని గ్యారీ వివరించారు.
మరోవైపు దీర్ఘకాలంలో ఏ ఆహారమూ మన ఆకలిని తగ్గించకపోవడానికి కారణం ఏమిటంటే, ఒక నిర్దిష్టమైన బరువును కలిగి ఉండేలా శరీరం రూపుదిద్దుకోవడమేనని కోల్‌మీర్ అన్నారు.
‘‘బరువును నియంత్రించేందుకు మన శరీరంలో వ్యవస్థలు ఉంటాయి. పరిణామ క్రమ కోణంలో నుంచి చూస్తే, మనుషులకు అతిపెద్ద ముప్పు ఆకలి. అది మనల్ని చంపేస్తుందని కాదు, చాలా వ్యాధులు సోకేలా మన శరీరాన్ని అది కృశించిపోయేలా చేయగలదు. అందుకే పరిణామక్రమంలో భాగంగా మన శరీరాల్లో కొన్ని వ్యవస్థలు అభివృద్ధి అయ్యాయి. అవి మనం ఎంత ఆహారం తీసుకోవాలో నియంత్రించే విధానం చాలా సంక్లిష్టమైనది’’అని కోల్‌మీర్ వివరించారు.
‘‘మీరు శరీరాన్ని ఒక పెద్ద యంత్రంగా చూస్తే, ఇది పనిచేయడానికి సరిపడా స్థాయిలో నీరు, మ్యాక్రోన్యూట్రియంట్లు, మైక్రోన్యూట్రియంట్లు అవసరం అవుతాయి. ఇక్కడ ఏం తినకుండా ఉండాలో తెలుసుకోవడం అన్నింటి కంటే ముఖ్యం’’అని ఆయన చెప్పారు.
అయితే, కొన్ని పోషకాలు మన శరీరంలో లోపించినట్లు అయితే, మనకు ఆకలి ఎక్కువగా వేసినట్లు అనిపిస్తుందని ఆయన తెలిపారు.
‘‘ఇది ఒక వలయం లాంటిది. దీనికి కావాల్సినవి అందిస్తూ, ఇది నిత్యం తిరుగుతుండేలా చూడాలి. నిజానికి మన శరీరానికి ఏం కావాలి, ఏ ఆహారంలో ఏముంది.. లాంటివి అసలు ఎలా తెలుసుకోగలం? ఎందుకంటే మన ఆకలిని ప్రభావితం చేసే వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి’’అని ఆయన వివరించారు.
మరి ఎలా?
ఆకలిని మెరుగ్గా నియంత్రించడం ఎలా అనే ప్రశ్నకు మరి సమాధానం ఎలా? అన్ని పోషకాలు సమస్థాయిలో ఉండే ఆహారమే దీనికి పరిష్కారమని కోల్‌మీర్ అంటున్నారు. అప్పుడే ఏదైనా పోషకాల లోపం వల్ల ఎక్కువగా ఆహారం తీసుకోవాలని శరీరం సూచించకుండా ఉంటుందని ఆయన వివరించారు.
ఇక్కడ మరో కోణం ఏమిటంటే, ఆకలిపై మానసిక ప్రభావం ఎలా ఉంటుంది. దీనిపై దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. 1987లో దీనిపై ఓ పరిశోధన పత్రం ప్రచురించారు. దీని ప్రకారం.. ఆహారాన్ని చూసినా, ఆ వాసనలు తగిలినా.. ఆహారం తినడానికి, దాన్ని జీర్ణం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని శరీరానికి మెదడు సంకేతాలు పంపిస్తుంది. ఆ ఆహారంతో మనం సంతృప్తి చెందుతామని భావించినప్పుడు, అది మన ఆకలిని గణనీయంగా ప్రభావితం చేయగలదని ఆ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.
ఆకలిపై మన నమ్మకాలు, అంచనాలు, జ్ఞాపకాలు ప్రభావం చూపిస్తాయని కార్నిల్ అన్నారు. ముఖ్యంగా ఆ ఆహారం తీసుకున్నప్పుడు గతంలో మనం ఎలా ఫీలయ్యాం అనేది దానిపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. అంటే భారీగా ఆహారం తీసుకున్నట్లు మన మెదడుకు అనిపిస్తే, ఆ తర్వాత మనం తినే ఆహారం తగ్గుతుందని వివరించారు.
మరోవైపు ఈ ఆహారం ‘‘కడుపు నింపుతుంది’’అనే చెప్పినప్పుడు సాధారణంగానే మనం తీసుకునే పరిమాణం తగ్గుతుందని, అదే ఆహారం ‘‘లైట్ ఫుడ్’’అని చెప్పినప్పుడు ఎక్కువగా తీసుకుంటామని ఒక అధ్యయనంలో తేలింది.
ఎక్కువసేపు కడుపు నిండేలా చూస్తాయని చెప్పే ఆహారాలను ఇప్పటికీ మీరు హాయిగా తీసుకోవచ్చు. అయితే, ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. అన్ని పోషకాలూ తగిన స్థాయిలో ఉండే సంతులిత ఆహారం మన శరీరానికి అవసరం.
ప్రకృతికి విరుద్ధంగా ఆకలిని ఎక్కువ సేపు నియంత్రించలేం. అయితే, ఎలాంటి పోషకాలు లోపించకుండానే మితంగా తీసుకుంటూ అదనపు క్యాలరీలపై కోత పెట్టొచ్చు.
ఇవి కూడా చదవండి:
- మూన్‌లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?
- ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చిరుతలివి, 70 ఏళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాయి.
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- స్వాతి రెడ్డి: రైలులో పురిటినొప్పులతో విలవిల్లాడుతున్న మహిళకు కత్తెర కూడా వాడకుండా ఆమె ఎలా పురుడు పోశారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














