ఎక్స్‌పైరీ డేట్ దాటిన, బూజు పట్టిన ఆహార పదార్థాల్లో ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, మిచెల్ మోస్లీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రాజాంలో సగటున ఒక్కొక్కరూ ఏడాదికి 58 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) తెలిపింది.
యూఎన్ఈపీ ఈ ఏడాది మార్చిలో ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు 2021’ ప్రచురించింది. రాజాంలో 2016లో నిర్వహించిన ఒక అధ్యయనం వివరాలను ఈ రిపోర్టులో పేర్కొంది.
రాజాంతో పాటు డెహ్రడూన్‌లో కూడా ఒక అధ్యయనం జరిపారు. అక్కడ 2014లో సగటున 73 కేజీల ఆహారం వృధా కాగా, 2015 నాటికి ఆహార వృధా 20 కేజీలకు తగ్గినట్లు ఈ అధ్యయనంలో తేలింది.
భారతదేశంలో సగటున ప్రతి ఏటా ఒక్కొక్కరూ 50 కేజీల చొప్పున ఆహారాన్ని వృధా చేస్తున్నారని, దీని ప్రకారం దేశ ప్రజలంతా కలిపి ఏడాదికి 68,760,163 టన్నుల ఆహారాన్ని వృధా చేస్తున్నారని లెక్కకట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆహారం వృధా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మనం ఇళ్లల్లో వండుకునే ఆహారం వృధా కావడం ఒకవైపు, కొనుక్కునే ఆహరపదార్థాలు వృధా కావడం మరోవైపు.
వండిన ఆహారాన్ని ఆరోజు లేదా మర్నాటి వరకూ తింటాం. పాకెట్లలో దొరికే ఆహారం అయితే, వాటిపై ఉండే ఎక్స్పైరీ డేట్ లోపల వినియోగిస్తాం. ఆ తేదీ దాటిపోతే పారేస్తాం. ముఖ్యంగా బ్రెడ్, కూరగాయలు, చీజ్, జామ్ లాంటివి ఎక్స్పైరీ డేట్ దాటిపోయిందని పారేస్తూ ఉంటాం.
సూపర్ మార్కెట్లు పెరిగిపోతున్న ఈ కాలంలో పట్టణ, నగర ప్రాంతాల్లో చాలావరకు నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు ప్యాకెట్లలోనే లభిస్తున్నాయి.
అలాంటి పరిస్థితుల్లో, ఎక్స్పైరీ డేట్ దాటిన తరువాత కూడా తినగలిగే పదార్థాలు ఏమైనా ఉన్నాయా? అలా చేయగలిగితే కొంతవరకైనా ఆహారం వృధా కాకుండా నివారించగలమా?
లేబుల్‌పై రాసి ఉన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఆహార పదార్థాలను అమ్మే ప్యాకెట్లపై రకరకాల లేబుల్స్ ఉంటాయి. వాటిని గమనిస్తే లోపల ఉన్న పదార్థం ఎంతవరకు నిల్వ ఉంటుందో మనకు తెలుస్తుంది. ఒక్కో లేబుల్ ఒక్కో విషయాన్ని తెలుపుతుంది.
- ‘డిస్‌ప్లే అన్‌టిల్’ లేదా ‘సెల్ బై’ అని రాసి ఉన్న తేదీలు దుకాణదారుల కోసం రాసినవి. కొనుగోలుదారుల కోసం కాదు. ఎప్పటి వరకూ వాటిని అమ్మవచ్చో ఈ తేదీలు సూచిస్తాయి.
- ‘బెస్ట్ బిఫోర్’ కింద రాసే తేదీ కొనుగోలుదారుల కోసం. నిజానికి ఈ తేదీ నాణ్యతను సూచించేదే తప్ప భద్రతను సూచించేది కాదు. అంటే ఆ తేదీ తరువాత, పదార్థం రంగు, రుచి మారచవచ్చని, గట్టిగా లేదా మెత్తగా అయిపోవచ్చని అర్థం.
- 'యూజ్ బై' కింద రాసిన తేదీని మాత్రం జాగ్రత్తగా గమనించాలి. ఆ తేదీ దాటిన తరువాత అందులో పదార్థాన్ని తినడం సురక్షితం కాకపోవచ్చు.
అయితే, అన్ని ఆహార పదార్థాలకు 'యూజ్ బై' తేదీ ఉండకపోవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయల ప్యాకెట్లపై ఈ తేదీ ఉండదు. మరి వీటిని ఎంతకాలం వరకు తినవచ్చు? 'బెస్ట్ బిఫోర్' తేదీ దాటిన తరువాత కూడా తినొచ్చా?
ఇది తెలుసుకోవడానికి మేం ఒక చిన్న ప్రయోగం చేశాం. కొన్ని ఆహార పదార్థాలను బెస్ట్ బిఫోర్ తేదీ దాటిన తరువాత కూడా ఒక వారం పాటు వెచ్చని ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాం.
ఆ తరువాత, వాటిని డాక్టర్ పాట్రిక్ హిక్కీ పరిశీలించారు. పాట్రిక్ హిక్కీ ఆహారపదార్థాలపై వ్యాపించే బ్యాక్టీరియా, బూజు నిపుణులు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బూజు పట్టిన, పాచి పట్టిన తరువాత కూడా వాడగలిగే పదార్థాలు
కొన్ని పదార్థాలపై ఏర్పడిన బూజును తొలగించి వాటిని తిరిగి వినియోగించవచ్చు.
గట్టిగా ఉండే చీజ్
గట్టి చీజ్‌పై బూజు పడితే, దాన్ని తొలగించి కింద ఉన్న చీజ్‌ను హాయిగా తినేయొచ్చు.
చీజ్ ఎంత మందంగా ఉంటుందంటే దాని ఉపరితలం కింది పొరల్లో బూజు వృద్ధి చెందడానికి తగినంత ఆక్సిజన్ ఉండదు. దానికి కన్నాలు పెడితే తప్ప ఆక్సిజన్ లోపలి పొరల్లోకి పోదు.
అయినా సరే, మన భద్రత కోసం బూజు పట్టిన పొరను ఒక సెంటీమీటరు వరకు కోసేసి మిగతా చీజ్‌ను వాడుకోవచ్చు.
జామ్
పండ్లను ఎక్కువకాలం నిల్వ చేసేందుకు జామ్‌ను కనిపెట్టారు. చక్కెర శాతం అధికంగా ఉన్న పదార్థాలలో బూజు త్వరగా వృద్ధి చెందదు.
ఈ మధ్యకాలంలో చాలామంది ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ చక్కెర తక్కువగా ఉండే పదార్థాలను వినియోగిస్తున్నారు. దాంతో, తీపి తక్కువగా ఉండే జామ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిపై చాలా వేగంగా బూజు చేరుతుంది.
నిల్వ చేయడానికి ప్రిజర్వేటివ్స్ వాడకపోతే చక్కెర తక్కువగా ఉండే జామ్‌లు త్వరగా బూజు పడతాయి.
అయితే, ఆ బూజు ఉన్న భాగాన్ని తొలగించి, ముందు జాగ్రత్తగా మరి కొన్ని సెంటీమీటర్ల కిందవరకూ జామ్‌ను తీసేసి మిగతాది చక్కగా తినొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెడ్
బ్రెడ్ మీద తెల్లగా, లేత నీలం రంగులో బూజు పట్టడం చూస్తూ ఉంటాం.
ఇది మొదట ఉపరితలంపై ఏర్పడి, మెల్లగా కిందకు పాకుతుంది. బ్రెడ్‌కు స్పాంజిలాగ కన్నాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బూజు త్వరగా లోపలి భాగాలకు చేరుతుంది.
అయితే, బ్రెడ్ మీద కొంచమే బూజు పడితే వెంటనే ఆ భాగం వరకూ లేదా ఇంకొంచం కింది వరకూ తొలగించి మిగతా బ్రెడ్ తినొచ్చు.
కానీ, బ్రెడ్‌పై ఆరెంజ్, పసుపు లేదా నల్లటి మచ్చలు కనిపిస్తే మాత్రం వెంటనే మొత్తం బ్రెడ్ పారేయాల్సిందే. ఇది తినడం చాలా ప్రమాదకరం.
మరో విషయం ఏమిటంటే, రంగు ఎలా ఉన్నా బూజు ఎక్కువగా ఉంటే కూడా ఆ బ్రెడ్ తినకూడదు. కడుపు నొప్పి రావొచ్చు.
పండ్లు
సాధారణంగా పండ్లు త్వరగా కుళ్లిపోవు ఎందుకంటే వాటిల్లో ఉండే ఆమ్లాలు వాటిని రక్షిస్తూ ఉంటాయి. కానీ, ఆమ్లాలు బూజు పట్టకుండా ఆపలేవు. బూజు ఉన్న భాగాన్ని తొలగించి, మిగతా పండు తినొచ్చు.
మొత్తం పండంతా బూజు పట్టి, కుళ్లిపోతే పారేయాల్సిందేగానీ కొంచమే కుళ్లిపోతే మాత్రం పారేయక్కర్లేదు. మిగతా పండు తినడం ప్రమాదకరం కాదు.
ఆపిల్స్ సంగతి మాత్రం కొంచం వేరు. ఆపిల్స్‌పై సాధారణంగా కనిపించే ఒక రకమైన బూజు, 'పాటులిన్' అనే విషపదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మోతాదుకు మించి తింటే ప్రమాదకరంగా మారవచ్చు.
సాధారణంగా ఆపిల్స్ ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి. కానీ వాటికి తొక్క ఊడినా, కన్నం పడినా సులువుగా ఫంగస్ లోపలికి చేరుతుంది. అప్పుడు త్వరగా కుళ్లిపోతాయి.
అందుకని, బూజు పట్టిన ఆపిల్ పారేయడమే మంచిది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బూజు పడితే కచ్చితంగా పారేయాల్సిన ఆహార పదార్థాలు
మొజరెల్లా లాంటి మృదువైన చీజ్‌లు
పిజ్జాలపై వాడే మొజరెల్లా చీజ్‌లాంటి వాటిపై కనిపించే బూజు బ్యాక్టీరియా కావొచ్చు. బూజు కన్నా బ్యాక్టీరియా ఎక్కువ ప్రమాదకరం. వీటికి బూజు పడితే పారేయల్సిందే.
జిగటగా ఉండే కూరగాయలు
జిగట బ్యాక్టీరియాకు చిహ్నం. ఇది బూజు కన్నా చాలా ప్రమాదకరం. బ్యాక్టీరియా వలన ఫుడ్ పాయిజన్ కావొచ్చు. కడుపు నొప్పి రావొచ్చు.
బూజు పట్టిన గింజలు (నట్స్), విత్తనాలు
నట్స్ చేదుగా లేదా మెత్తగా అయిపోయాయంటే వాటికి బూజు పట్టినట్టే లెక్క. లేదా పొడి రాలుతున్నా బూజు ఎక్కాయనే అర్థం.
ముఖ్యంగా తేమ వాతావరణంలో నట్స్‌కు పట్టే బూజు చాలా ప్రమాదకరమైన విషాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికి వరకూ మానవులకు తెలిసిన అత్యంత ప్రమాదకరమైన విషాల్లో ఇదీ ఒకటి.
దాని పేరు "ఆస్పర్‌జిలస్ ఫ్లేవస్". ఇది ఉత్పత్తి చేసే విషాన్ని 'అఫ్లాటాక్సిన్' అంటారు. ఇది కాలేయంలోకి చేరి కాలేయం క్యాన్సర్‌కు కారణం కావొచ్చు.
మాంసం
మాంసానికి బూజు పట్టదు కానీ దానిపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాంటివి తినకుండా ఉండడమే మేలు.
అయితే, సలామీ లాంటి కొన్ని రకాలకు మినహాయింపు ఉంటుంది. వీటిని 'క్యూరింగ్' చేస్తారు. అంటే నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ కలపడం లేదా ఫ్లేవర్స్ కలపడం లాంటివి చేస్తారు. ఇలా క్యూరింగ్ చేసిన మాంసంపై తెల్లగా పొడిలాగ ఏర్పడే బూజు ప్రమాదకరం కాదు.
కానీ, ఇంట్లోనే మాంసం లేదా చేపలను క్యూరింగ్ చేసేవాళ్లు మాత్రం జాగ్రత్త వహించాలి. ప్రమాదకరమైన బూజు వృద్ధి చెందే అవకాశం ఉంది.
(అదనపు సమాచారం: బీఎస్ఎన్ మల్లేశ్వరరావు, బీబీసీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి:
- అన్నం ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా? బియ్యంలో ఉండే ఆర్సెనిక్ ఎంత ప్రమాదకరం?
- పిల్లల్లో పోషకాహార లోపానికి బ్యాక్టీరియాతో పరిష్కారం దొరుకుతుందా
- ఈ కీటకాలతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మేలు అంటున్న చెఫ్
- భారత్‌లోనే అత్యంత ఘాటైన రాజా మిర్చి కథ ఇది
- గుండెపోటు మనుషులకే ఎందుకొస్తుంది
- బ్రిటన్‌లో భారతీయ వంటకాల వ్యాపారం చేస్తున్న 76 ఏళ్ళ బామ్మ
- సాంబారు పుట్టినిల్లు తమిళనాడా.. మహారాష్ట్రా
- తాటి ముంజలు: 'అధిక బరువుకు విరుగుడు, క్యాన్సర్ నిరోధకం'
- బెల్లం: ఆహారమా... ఔషధమా
- 'ఈ నత్తలను తింటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది... చలికాలం పున్నమి రోజుల్లో మాత్రమే వీటిని వేటాడాలి'
- పాకిస్తాన్: ఫ్రీగా బర్గర్లు ఇవ్వలేదని రెస్టారెంట్ సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- మీరు తినే ఆహారం విడుదల చేసే కార్బన్ ఫుట్‌ప్రింట్స్ గురించి మీకు తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













