కింగ్ కోబ్రా: ఈ పాముకు మనుషులంటే చాలా భయం. కానీ, అది ఎంత మేలు చేస్తుందో తెలుసా?

కింగ్ కోబ్రా

ఫొటో సోర్స్, EGWS

ఫొటో క్యాప్షన్, కింగ్ కోబ్రా
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలం ఉన్న ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సోసైటీ (EGWS) ఆఫీసుకు వచ్చే ఫోన్ కాల్స్‌లో అవతలి వ్యక్తులు భయంతో, తడబడుతూ, మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతున్నారంటే పాముల్లో అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను చూసి ఉంటారని ఈజీడబ్య్యూఎస్ సిబ్బందికి అర్ధమైపోతుంది. వెంటనే ఆ కాల్ వచ్చిన ప్రదేశానికి అటవీశాఖ సిబ్బందితో కలిసి చేరుకుంటారు.

తూర్పుకనుమల సరిహద్దు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కింగ్ కోబ్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. 15 నుంచి 20 ఏళ్లు జీవించే కింగ్ కోబ్రాలను రాచనాగులు లేదా గిరినాగులు అని కూడా అంటారు.

ఇవి అత్యంత విషపూరితమైన సర్పాలు. సాధారణంగా 13 నుంచి 15 అడుగుల పొడవు ఉండే గిరినాగులు మూడు, నాలుగు అడుగుల ఎత్తున పడగ విప్పుతాయి. అంత పైకి పడగెత్తినప్పుడు ఆ గిరినాగుని చూసిన వారికి చెమటలు పడతాయి. ఈ విషయాలు ఈజీడబ్య్లూఎస్ వ్యవస్థాపకులు మూర్తి కంఠిమహంతి చెప్పారు. కింగ్ కోబ్రాలను రెస్క్యూ చేసిన గ్రామాలకు బీబీసీ వెళ్లినపపుడు చోడవరం అటవీ రేంజ్ అధికారి పీవీ రవివర్మ, మూర్తి కంఠిమహంతి ఈ విషయాలు తెలిపారు.

కింగ్ కోబ్రాలు ఎక్కడ నుంచి వస్తాయి? జనావాసాల్లోకి వచ్చిన వాటిని ఎలా పట్టుకుంటారు? పట్టుకున్నవాటిని ఎక్కడ విడిచిపెడతారు? అవి మళ్లీ తిరిగి వచ్చే అవకాశముందా వంటి విషయాలను మూర్తితో పాటు అటవీశాఖ అధికారి రవివర్మ కూడా వివరించారు.

కింగ్ కోబ్రా

ఫొటో సోర్స్, EGWS

'కింగ్ కోబ్రాలు పిరికి పాములు'

చోడవరం, చీడికాడ, దేవరాపల్లి, మాడుగుల వంటి తూర్పు కనుమల సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల నుంచి ఎక్కువగా కింగ్ కోబ్రా కనిపించిందనే కాల్స్ వస్తుంటాయని వారు చెప్పారు. సాధారణంగా నెలకు ఒకటీరెండు ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తుంటాయని తెలిపారు. ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీని 2016లో మూర్తి కంఠిమహంతి స్థాపించారు. జువాలజీలో ఎంఫిల్ చేసిన మూర్తికి, చిన్నతనం నుంచి వన్యప్రాణులు ముఖ్యంగా పాములంటే బాగా ఆసక్తి.

"ప్రస్తుతం అంతరించిపోతున్న వన్యప్రాణుల జాతుల్లో కింగ్ కోబ్రా కూడా ఒకటి. వీటి భారీ ఆకారం, పొడవు... దాని పొడవులో మూడో వంతును పడగగా విప్పే విధానం చూసి జనాలకు భయం పట్టుకుంటుంది.

నిజానికి కింగ్ కోబ్రాలు పడగ విప్పడమంటే తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తుందని అర్థం. అటువంటి సమయంలో మనం మరింత భయపడిపోయి, వాటిని చంపేందుకు ప్రయత్నిస్తుంటాం.

ఆ క్రమంలోనే పాములు మనల్ని కాటేస్తాయి. నిజానికి కింగ్ కోబ్రాలతో పోలిస్తే నాగుపాము, కట్లపాము, పొడపాములు మనుషులును ఎక్కువగా కాటేస్తాయి.

కానీ, కింగ్ కోబ్రాలు అలా చేయవు. కింగ్ కోబ్రాలు నిజానికి పిరికివి. మనిషి సమీపంలో ఉంటే అవి తప్పించుకుని పారిపోవడానికే చూస్తాయి" అని బీబీసీతో మూర్తి కంఠిమహంతి చెప్పారు.

ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు

ఫొటో సోర్స్, EGWS

'దోమ తెరల మధ్య కింగ్ కోబ్రా గుడ్లను ఉంచాం'

"సాధారణంగా కింగ్ కోబ్రాలు నీటి లభ్యత ఉండే ప్రాంతాల్లో అంటే సెలయేళ్లు, చెరువులు ఉన్న ప్రదేశాల్లో నివసిస్తాయి. కింగ్ కోబ్రా నీటిలో ఈదగలదు. ఈజీడబ్ల్యూఎస్, తూర్పు కనుమల్లో గిరినాగుల సమాచారాన్ని సేకరిస్తోంది. తూర్పు కనుమల్లో కనిపించే కింగ్ కోబ్రాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. జీవ సమతుల్యతను కాపాడటంలో కింగ్ కోబ్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని చోడవరం అటవీ రేంజ్ అధికారి రవివర్మ చెప్పారు.

"మార్చ్, ఏప్రిల్ నెలల్లో కింగ్ కోబ్రాలు జత కట్టి జూన్ చివరి వారానికి గుడ్లు పెడతాయి. ఆడ కింగ్ కోబ్రా చిన్న చిన్న పుల్లలతో గుడ్లకు రక్షణగా గూడు కడుతుంది. ప్రపంచంలో గూడు కట్టే సర్పం ఆడ కింగ్ కోబ్రా మాత్రమే. ఆ గూడులో సాధారణంగా 30 నుంచి 40 గుడ్లను పొదుగుతుంది. పొదిగిన గుడ్లపై వాటికి రక్షణ కల్పిస్తూ దాదాపు నెలన్నర రోజుల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండిపోతుంది’’ అని మూర్తి కంఠిమహంతి అన్నారు.

‘‘అది ఆహారం కోసం గూడుని వదిలే క్రమంలో ఇతర జంతువులు వచ్చి ఆ గుడ్లను తినేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలోనే గుడ్లను రక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో వి. మాడుగుల మండలం కృష్ణంపాలెం సమీపంలో 30 కింగ్ కోబ్రా గుడ్లు చూశామని కొందరు ఈజీడబ్ల్యూఎస్‌కు సమాచారం అందించారు. వెంటనే స్థానికుల సహకారంతో ఆ గుడ్లకు రక్షణ కల్పిస్తూ దోమ తెరలు కట్టాం. వారం తర్వాత ఆ గుడ్ల నుంచి పిల్ల కింగ్ కోబ్రాలు బయటకు వచ్చాయి. అవి జనావాసాల నుంచి దూరంగా వెళ్లిపోయే విధంగా చూశాం" అని మూర్తి కంఠిమహంతి చెప్పారు.

కింగ్ కోబ్రా

ఫొటో సోర్స్, EGWS

'సర్...మళ్లీ పెద్ద పాము వచ్చిందా...?'

ఇలా కింగ్ కోబ్రా విషయాలను చెబుతూ ఉండగా దేవరాపల్లి మండలం నాగయ్యపేట గ్రామం చేరుకున్నాం. అక్కడ గ్రామంలోని కొబ్బరితోటలో ఉన్న ఒక ఇంటికి చేరుకున్నాం. ఆ ఇంటిలోకే దాదాపు నెల రోజుల ముందు 13 అడుగుల కింగ్ కోబ్రా వచ్చింది.

ఆ రోజున బట్టలు ఆరబెట్టి, నీళ్ల బిందె పట్టుకుని ఇంటి లోపలకి వచ్చేసరికి పడగెత్తిన పొడవాటి కింగ్ కోబ్రాని చూసి హడలెత్తిపోయారు ఆ ఇంటి యాజమాని దేముడు (మహిళ).

ఏంటి సర్... మళ్లీ పాము వచ్చిందా? అని ఆమె మూర్తిని అడిగారు. లేదని చెప్పడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. కింగ్ కోబ్రాని చూసినప్పుడు తనకు కలిగిన అనుభవాన్ని ఆమె బీబీసీకి చెప్పారు.

"నేను పామును చూసేటప్పటికీ దాని పడగ మా హాల్‌లో ఉంటే, దాని తోక వంట గదిలో ఉంది. దాన్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. అయితే, వెంటనే కాస్త తమాయించుకుని ముందు తలుపు గడియ పెట్టేశాను. అప్పటికే వంట గది తలుపు గడి పెట్టేసే ఉంది. వెంటనే ఈజీడబ్ల్యూఎస్ వాళ్లు ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేశాను.’’ అన్నారామె.

‘‘దూరం నుంచి చూడబట్టి సరిపోయింది. లేకపోతే అంత పెద్ద పాము నన్ను కాటేసేది. తల్చుకుంటే ఇప్పటికీ భయంగానే ఉంది. అంత పెద్ద పాముని నేనెప్పుడూ చూడలేదు" అని దేముడు చెప్పారు.

"పట్టుకున్న తర్వాత ఆ పాముని ఎక్కడ వదిలేశారో మాకు తెలియదు. ఆ పాము మళ్లీ వస్తుందేమోననే భయం ఉంది. ఇంతకు ముందైతే పాము కనిపిస్తే గ్రామస్థులమంతా కలిసి చంపేసేవాళ్లం. కానీ ఈజీడబ్ల్యూఎస్ వాళ్లు చంపొద్దని చెప్పడంతో మానేశాం" అని ఆమె అన్నారు.

ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు

ఫొటో సోర్స్, EGWS

పట్టుకున్న వాటిని ఎక్కడ వదులుతామంటే...

"మేం ముగ్గురు, నలుగురు టీమ్‌గా ఏర్పడి అటవీ శాఖ వారితో కలిసి రెస్క్కూ చేస్తాం. వాటిని రెస్క్యూ చేసేటప్పుడు ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటాం. పామును పట్టుకునే హుక్స్, టార్చ్ లైట్, మంచి షూ...ఇవే మా ఆయుధాలు. వీటి సహాయంతో పాముని పట్టుకుని ఒక బ్యాగ్‌లో పెట్టి దాని బరువు చూస్తాం’’ అని మూర్తి కంఠిమహంతి వివరించారు.

నాగయ్యపేటలో పట్టుకున్న పాము 11 కేజీల పైనే ఉందని, రెస్క్యూ చేసే సమయంలో పాముకి ఏదైనా గాయం తగిలిందా? లేదా? అనే ఇతర వివరాలను అటవీ సిబ్బంది నోట్ చేసుకుంటారని, ఆ తర్వాత దగ్గర్లో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా వివరాలను అటవీశాఖ నుంచి తీసుకుని అక్కడ ఏదైనా నీటి వసతి, వెదురు తోటలు ఉన్న ప్రాంతంలో కింగ్ కోబ్రాలను విడిచిపెడతామని ఆయన తెలిపారు.

‘‘కింగ్ కోబ్రా కాటు వలన చనిపోయిన కేసులు చాలా అరుదు. నాగుపాము, కట్లపాము, పొడపాము కరిచి చనిపోయిన కేసులు చాలా ఉంటాయి. ఈ పాములను తినేదే కింగ్ కోబ్రా. కాబట్టి కింగ్ కోబ్రాల అవసరం చాలా ఉంది. అందుకే దాన్ని చంపవద్దని, దాని అవసరం ఎంత ఉందో చెప్పేందుకు వీడియోలు, కరపత్రాలు చిన్నచిన్న నాటికలు ద్వారా అవగాహన కల్పిస్తుంటాం. ఇప్పుడు కింగ్ కోబ్రా కనిపించగానే చంపేయకుండా మాకు ఫోన్ చేస్తున్నారు. నాగయ్యపేటలోని దేముడు అనే మహిళ మాకు ఫోన్ చేసిన కేసే తాజా ఉదాహరణ" అని మూర్తి కంఠిమహంతి వివరించారు.

కింగ్ కోబ్రా

ఫొటో సోర్స్, EGWS

'మనుషులంటే కింగ్ కోబ్రాలకు భయం'

కింగ్ కోబ్రాలనే కాదు ఏ పామునైనా హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరమని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవివర్మ చెప్పారు. కింగ్ కోబ్రాలు అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నట్లు IUCN (The International Union for Conservation of Nature) చెప్పిందని వివరించారు.

"తూర్పు కనుమలు, సరిహద్దు గ్రామాల్లో గిరినాగులు కనిపించడానికి కారణం ఇక్కడున్న పచ్చదనం, చల్లగా ఉండే భూములే.

అంతరించిపోతున్న ఈ గిరినాగులను కాపాడుకునే బాధ్యత మనకి ఉంది. ఈ కింగ్ కోబ్రాలు ఇతర పాములను ఆహారంగా తింటాయి.

ఈ పాములు మనుషుల కంట పడేందుకు ఇష్టపడవు. కానీ అప్పుడప్పుడు జనావాసాల్లోకి కింగ్ కోబ్రాలు వస్తున్నాయి. ఈ సర్పాలపై గిరిజనులకు, స్థానిక గ్రామస్థులకు ఈజీడబ్ల్యూఎస్, అటవీ శాఖ సంయుక్తంగా అవగాహన కల్పించింది" అని రవివర్మ అన్నారు.

ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ

ఫొటో సోర్స్, EGWS

'జీవ సమతౌల్యానికి కింగ్ కోబ్రాలు చాలా అవసరం'

"కింగ్ కోబ్రాలు పొలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. రైతులకు ఎలుకల సమస్యను తగ్గిస్తాయి. అలాగే ఇతర పాములను తింటూ వాటి సంఖ్య పెరిగిపోకుండా కింగ్ కోబ్రాలు జీవ సమతౌల్యాన్ని కాపాడతాయని మూర్తి కంఠిమహంతి అన్నారు.

కింగ్ కోబ్రా కనపడగానే ముందు కంగారు పడిపోకుండా దానికి వెళ్లిపోయే మార్గాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే పరుగెత్తకూడదని ఆయన అన్నారు.

‘‘కింగ్ కోబ్రా సాధారణంగా కాటేయదు. కానీ, కాటు వేస్తే మాత్రం దాని విషం మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విషం శరీరంలోకి ఎక్కిన కొద్ది సేపటికే సృహ కోల్పోతారు. ఆ తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టమై మరణం సంభవిస్తుంది. అయితే భారత్‌లో కింగ్ కోబ్రా కాటుకి మందు లేదు. థాయ్‌లాండ్‌లో మాత్రమే ప్రస్తుతం అతి తక్కువ పరిమాణంలో కింగ్ కోబ్రా కాటుకు మందు తయారవుతుంది" అని మూర్తి కంఠిమహంతి బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)