మహారాజా హరి సింగ్: జమ్మూకశ్మీర్ చివరి డోగ్రా రాజు చరిత్రను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా?

మహారాజా హరి సింగ్

ఫొటో సోర్స్, Keystone-France/Gamma-Keystone via Getty Images)

ఫొటో క్యాప్షన్, మహారాజా హరి సింగ్
    • రచయిత, అశోక్ కుమార్ పాండే
    • హోదా, బీబీసీ కోసం

మహారాజా హరి సింగ్ జయంతిని సెలవుగా ప్రకటించాలన్న డోగ్రా సంఘాల డిమాండ్‌ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎట్టకేలకు ఆమోదించారు.

హరి సింగ్‌ను గొప్ప విద్యావేత్త, ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త, ఆదర్శవంతుడిగా మనోజ్ సిన్హా అభివర్ణించారు. అయితే, హరి సింగ్‌, డోగ్రా పాలనలపై జమ్మూ, కశ్మీర్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

డోగ్రా పాలకులను జమ్మూ ప్రజలు గొప్పగా స్తుతిస్తుంటే, కశ్మీర్ లోయలో మాత్రం అణచివేతకు ప్రతీకగా చూస్తారు.

1845లో బ్రిటిష్-సిక్కుల మధ్య యుద్ధ సమయంలో, ఈ ప్రాంతానికి గులాబ్ సింగ్‌ను కమాండర్‌గా పంజాబ్ రాణి నియమించారు. అయితే, గులాబ్ సింగ్ యుద్ధానికి దూరంగా ఉంటూ, బ్రిటిషర్లకు సాయం చేశారు. ఆ తర్వాత బ్రిటిషర్లతో ఆయన అమృత్‌సర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిలో భాగంగా బ్రిటిషర్లకు రూ.75 లక్షలు నానక్‌శాహీ చెల్లించి జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని గులాబ్ సింగ్ ఏర్పాటుచేశారు. ఈ ఒప్పందాన్ని కశ్మీర్ లోయలో ‘‘అమృత్‌సర్ బైనామా’’గా పిలుస్తారు.

అప్పటివరకు జమ్మూకశ్మీర్‌పై ‘‘కశ్మీర్ లోయ’’ ప్రభావం ఎక్కువగా ఉండేది. జమ్మూ పాలకులు కశ్మీర్ లోయలోని పాలకుల ఆధీనంలో ఉండేవారు. అయితే, గులాబ్ సింగ్ వచ్చిన తర్వాత, తమను అణచివేస్తున్నారని కశ్మీర్ లోయలోని ముస్లింలు భావించేవారు.

ఇంతకీ హరి సింగ్ పాలన ఎలా సాగింది? ఎందుకు ఆయన హయాంలో హిందు-ముస్లింల మధ్య విభేదాలు వచ్చాయి.

హరి సింగ్

ఫొటో సోర్స్, Keystone-France/Gamma-Keystone via Getty Images

హరి సింగ్ భిన్నమైన వారు

1925లో హరి సింగ్ సింహాసనాన్ని అధిష్టించారు. ఆయన అద్భుతమైన ప్రకటనలతో తన పాలన మొదలుపెట్టారు. ఆయన ఇచ్చిన హామీలను విప్లవాత్మకమైనవిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు.

హరి సింగ్ తొలి ప్రసంగం ఎలా సాగిందో ‘‘ద ట్రాజెడీ ఆఫ్ కశ్మీర్’’ పుస్తకంలో చరిత్రకారుడు హెచ్ఎల్ సక్సేనా వివరించారు. ‘‘నేను హిందువును. అయితే, ఒక పాలకుడిగా నాకు ఒకే మతం ఉంది. అదే ‘న్యాయం’’’అని హరి సింగ్ చెప్పారు. ‘‘1928లో శ్రీనగర్‌ను వరదలు ముంచెత్తాయి. అప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయనే నేరుగా పర్యటించారు’’అని సక్సేనా వివరించారు.

‘‘కశ్మీరీ ఫైట్స్ ఫర్ ఫ్రీడమ్’’ పుస్తకంలో చరిత్రకారుడు ఎంవై సరఫ్.. జమ్మూకశ్మీర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జార్జ్ ఎడ్వర్డ్ వక్‌ఫీల్డ్ వ్యాఖ్యలను ఉటంకించారు. ‘‘హరి సింగ్ చంచారిగీని పూర్తిగా వ్యతిరేకించేవారు. బాగా పనిచేసేవారికి ప్రత్యేక అవార్డులను కూడా ఇచ్చేవారు’’అని వక్‌ఫీల్డ్ చెప్పినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

తను రాజుగా బాధ్యతలు తీసుకునేటప్పుడు ఆయన చేసిన ప్రకటనలు ఆధునికత వైపుగా ప్రజలను నడిపించేవిగా ఉండేవి. ఉదాహరణకు జమ్మూ, కశ్మీర్ లోయలో చెరో 50 పాఠశాలలు, గిల్గిట్, లద్దాఖ్‌లలో చెరో పది పాఠశాలలు ఏర్పాటుచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పాఠశాలల నిర్మాణానికి అవసరమైన కలపను అటవీ విభాగం ఉచితంగా అందిస్తుందని చెప్పారు.

జమ్మూ, కశ్మీర్ లోయలో మూడు ఆసుపత్రుల నిర్మాణం, టెక్నికల్ విద్యా సంస్థలకు ప్రోత్సాహం, శ్రీనగర్‌లో మంచినీటి వసతి ఏర్పాటు లాంటి ఎన్నో ప్రకటనలను ఆయన చేశారు. పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిల కనీస వయసును 18గా, అమ్మాయిలకు 14గా ఆయన పెంచారు. మరోవైపు పిల్లలకు టీకాలు వేయించేందుకు సదుపాయాలు కల్పించారు.

రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ‘‘అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్’’ను ఆయన తీసుకొచ్చారు. వడ్డీ వ్యాపారుల నుంచి రైతులను కాపాడమే దీని లక్ష్యం. పిల్లలంతా తప్పనిసరిగా చదువుకునేలా నిర్బంధ విద్యా విధానాలను ప్రవేశపెట్టారు.

అయితే, ఆయన నిర్ణయాల్లో అన్నింటికంటే విప్లవాత్మక నిర్ణయం 1932లో ప్రకటించారు. దళితులకు కూడా ఆలయాల్లో ప్రవేశించేందుకు వీలు కల్పిస్తూ ఆయన నిబంధనలు విడుదల చేశారు. అంటరానితనంపై గాంధీజీ ఉద్యమం మొదలుపెట్టకముందే, హరి సింగ్ ఈ ప్రకటన చేశారు.

హరి సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఆర్టికల్ 35ఏ ఏమిటి?

కశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, భూమి కొనుగోళ్లు కేవలం ఇక్కడి పౌరుల మధ్యే ఉండాలని కశ్మీర్‌లో ఎప్పటినుంచో డిమాండ్లు వినిపించేవి. ఇక్కడి సంస్థానంలో బ్రిటిష్ రెసిడెంట్‌ను నియమించిన తర్వాత, బయటి అధికారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 1889లో పర్షియన్‌కు బదులుగా ఉర్దూను అధికారిక భాషగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పోటీ పరీక్షల ద్వారా నియమించడం మొదలుపెట్టారు.

13,14 శతాబ్దాల నుంచి కశ్మీర్ పండిట్ల మాతృభాష పర్షియన్‌గా ఉండేది. ఒక్కసారిగా ఉర్దూను అధికారిక భాషగా ప్రకటించడంతో, ముస్లింలతోపాటు వారి ఉపాధి అవకాశాలపై గండిపడింది. అయితే, అదే సమయంలో పంజాబ్‌లో అప్పటికే ఉర్దూ అధికారిక భాషగా ఉండేది. దీంతో పంజాబీల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.

1925లో హరి సింగ్ రాజుగా అధికారంలోకి వచ్చేవరకు ఈ విధానం ఇలానే కొనసాగింది. 1909లో కశ్మీర్ సంస్థానంలో బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉండే ఫ్రాన్సిస్ యంగ్‌హస్బెండ్ ఈ అంశంపై స్పందిస్తూ.. ‘‘కశ్మీరీ పండిట్లు విద్యావంతులు. పైగా ఉద్యోగాల కోసం వారు ఎదురుచూసేవారు. కశ్మీరీల కోసమే కశ్మీర్ అనే డిమాండ్ మొదట వారి నుంచే వచ్చింది. అయితే, 1912లో ఈ విషయంలో ఒక నిబంధన తీసుకొచ్చారు. కేవలం కశ్మీరీలే ఇక్కడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా మార్పులు చేశారు. అయితే, ఈ విధానం సరిగా అమలయ్యేది కాదు’’అని ఆయన చెప్పారు.

ఈ సమస్యపై మహారాజా హరి సింగ్ ఈ సమస్యపై ప్రధానంగా దృష్టిపెట్టారు. 1927, జనవరి 31న ఆయన ‘‘స్టేట్ ససెషన్ లా’’ను తీసుకొచ్చారు. దీని ప్రకారం, మహారాజా గులాబ్ సింగ్ అధికారం చేపట్టే సమయానికి ఇక్కడ ఉండే వారిని మాత్రమే సంస్థాన పౌరులుగా గుర్తించారు. బయటవారు భూములు కొనడం, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, ప్రభుత్వ కాంట్రాక్టులను తీసుకోవడంపై ఆంక్షలు విధించారు.

మహారాజా హరి సింగ్

ఫొటో సోర్స్, Horace Abrahams/Keystone/Getty Images

దీని తర్వాత, బయటవారు ఉద్యోగాలకు పోటీ పడటం, కశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేయడం తగ్గింది. ఈ చట్టమే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 35ఏకు బాటలు పరిచింది.

ప్రముఖ కశ్మీరీ చరిత్రకారుడు ప్రేమ్‌నాథ్ బజాజ్ తన పుస్తకంలో దీనిపై స్పందిస్తూ.. ‘‘స్టేట్ సిటిజన్‌షిప్ లాను ఆమోదించడం ద్వారా బయటి వ్యక్తుల అవినీతి, బంధుప్రీతిలకు హరి సింగ్ చెక్ పెట్టారు’’అని వివరించారు.

అయితే, హరి సింగ్ పాలనలో రాజ్‌పుత్‌లకు చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. చాలా విభాగాలకు వారే అధిపతులుగా ఉండేవారు. సైన్యంలో ఎక్కడ చూసినా డోగ్రా రాజ్‌పుత్‌లే కనిపించేవారు. దాదాపు 60 శాతం ఉన్నత పదవుల్లో వారే ఉండేవారు.

మిగిలిన పోస్టుల కోసం ముస్లింలు, కశ్మీరీ పండిట్లు పోటీపడేవారు. ఈ ఉద్యోగాల సమస్య వారి మధ్య భారీగా చిచ్చుపెట్టేది. 1930ల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. అలా మత రాజకీయాలకు ఇక్కడ పునాదిపడింది.

ఈ రాజకీయాల నుంచే షేక్ అబ్దుల్లా ఎదిగారు. మొదట ఆయన సెక్యులర్ నేషనల్ కాన్ఫెరెన్స్ పెట్టారు డోగ్రా-బ్రిటిష్ పాలన నుంచి కశ్మీర్‌కు విముక్తి కల్పించడమే ఈ పార్టీ లక్ష్యం.

కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

పతనం ఎలా?

‘‘ప్రతి భారత రాజు తన రాజ్యంలో ఒక హిట్లర్ లాంటివాడే. చట్టాలతో సంబంధం లేకుండా ప్రజలపై వీరు ఉక్కు పాదం మోపేవారు. హరి సింగ్ కూడా దీనికి మినహాయింపు కాదు’’అని గాంధీ ఒకసారి రాసుకొచ్చారు.

క్రమంగా 1930ల్లో కశ్మీర్ ఉద్రిక్తంగా మారడంతో హరి సింగ్ కూడా నిరంకుశ విధానాలను అనుసరించడం మొదలుపెట్టారు.

రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్‌లలో బ్రిటిష్ కామన్వెల్త్ దేశాల్లో భారతీయులకు సమాన హక్కులు ఉండాలని హరి సింగ్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఫెడరేషన్‌లో చేరాలని భారత రాజులను ఆయన అభ్యర్థించేవారు. ఆయన చర్యలపై బ్రిటిష్ ఆగ్రహంతో ఉండేది.

మరోవైపు గిల్గిట్‌లో మహారాజా వైఖరి కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేది. దీంతో కశ్మీర్‌లో అసమ్మతి పెరుగుతున్నప్పుడు, బ్రిటిషర్లు మహారాజాకు సాయం చేయలేదు. ముస్లింల తరఫున మాట్లాడటం వారు మొదలుపెట్టారు. పరిస్థితులను అవకాశంగా తీసుకొని అప్పటి కశ్మీర్ ప్రధాని హరికృష్ణ కౌల్ స్థానంలో బ్రిటిష్ అధికారి కాల్విన్‌ను ప్రధానిగా నియమించారు. ఆ తర్వాత హోం, రెవెన్యూ, పోలీసు విభాగాలను బ్రిటిషర్లకే అప్పగించారు.

ఆ తర్వాత గిల్గిట్‌ను 60ఏళ్ల లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితికి మహారాజా హరి సింగ్ వచ్చారు. అయితే, గిల్గిట్ అధికారులకు జీతాలు మాత్రం తన ఖజానా నుంచే ఇవ్వాల్సి వచ్చేది.

అలా క్రమంగా కశ్మీర్‌లో హరి సింగ్‌కు ప్రజాదరణ తగ్గిపోయింది. మరోవైపు ఆయనకు సవాళ్లు పెరిగాయి. 1930లో ఆర్థిక మాంద్యంతో కశ్మీరీ శాలువల పరిశ్రమ కుప్పకూలింది. దీంతో ప్రధాన ఆదాయ వనరుపై ప్రభావం పడింది.

1946లో క్విట్ ఇండియా తరహాలోనే క్విట్ కశ్మీర్ ఉద్యమాన్ని షేక్ అబ్దుల్లా మొదలుపెట్టారు. దీంతో పరిస్థితులు పతాకస్థాయికి చేరాయి. క్రమంగా కశ్మీర్ లోయ, హరి సింగ్ మధ్య దూరం మరింత పెరిగింది.

కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

స్వాతంత్ర్యం తర్వాత..

1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్తాన్, జమ్మూకశ్మీర్‌లు కూడా స్వతంత్రంగా మారాయి. అయితే, ఇటు భారత్, అటు పాకిస్తాన్‌లలో కలవకూడదని హరి సింగ్ భావించారు.

ముస్లింలు ఎక్కువగా ఉండే కశ్మీర్‌.. పాకిస్తాన్‌లో కలవాలని జిన్నా భావించేవారు. కానీ, స్వతంత్రంగా ఉండాలని హరి సింగ్ భావించడంతో మొదట సరిహద్దులను పాకిస్తాన్ మూసివేసింది. ఆ తర్వాత గిరిజనుల పేరుతో సరిహద్దుల నుంచి పాకిస్తాన్ సైన్యం కూడా రావడం మొదలుపెట్టింది. కశ్మీర్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడమే వీరి లక్ష్యం.

అయితే, సైన్యంలో శిక్షణ పొందిన హరి సింగ్ మొదట పరిస్థితులకు తలవంచలేదు. అయితే, క్రమంగా పరిస్థితులు చేజారడంతో పాకిస్తాన్‌తో తాను ఒంటరిగా పోరాడలేనని ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయన ముందు రెండే మార్గాలు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ ముందు తలవంచడం, లేదా భారత్ సాయం తీసుకోవడం.

వీడియో క్యాప్షన్, ప్రధాని మోదీ: ‘#TheKashmir Filesపై కుట్ర జరుగుతోంది.. వాస్తవాలను అంగీకరించట్లేదు’

అయితే, భారత్‌లో కలిస్తేనే సాయం చేస్తానని 26 అక్టోబరు 1947న భారత పాలకులు స్పష్టంచేశారు. దీంతో ఆయన భారత్‌లో విలీనం అయ్యేందుకు మొగ్గుచూపారు. ఫలితంగా డోగ్రిస్తాన్ ఏర్పాటు చేయాలన్న ఆయన కల అలానే మిగిలిపోయింది.

కశ్మీర్‌లో చివరి డోగ్రా పాలకుడు ఆయనే. అక్టోబరు 26న ఆయన తన నివాసాన్ని శ్రీనగర్ నుంచి జమ్మూకశ్మీర్‌కు మార్చుకున్నారు. తనతోపాటు 48 సైనిక ట్రక్కులు, వజ్రాలు, ఆభరణాలు, పెయింటింగ్స్‌ను తీసుకొచ్చారు. మొత్తంగా 20 జూన్ 1949న ఆయన అధికారికంగా పదవీచ్యుతుడయ్యారు. ఆ తర్వాత ఆయన ముంబయికి వెళ్లిపోయారు. అక్కడ ఆయనకు స్నేహితులు, బంధువులు ఉండేవారు.

కశ్మీర్‌లో డోగ్రా పాలనకు తెరపడటంతో షేక్ అబ్దులా ఆధిపత్యం పెరిగింది. అలా మళ్లీ రాష్ట్రంలో కశ్మీర్‌ లోయ ఆధిపత్యం చెలామణీలోకి వచ్చింది.

వీడియో క్యాప్షన్, ఏదైనా ఉంటే స్థానికులతోనే చర్చిస్తామన్నారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.

అయితే, ఇప్పుడు మళ్లీ హరి సింగ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్‌ను తమకు అనువుగా మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ, జన సంఘ్ భావిస్తున్నాయి. జమ్మూ, కశ్మీర్ లోయల మధ్య విభేదాల సాయంతో జమ్మూపై పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది.

మహారాజా హరి సింగ్ జీవిత చరిత్ర ‘‘హెయిర్ అప్రంటీస్’’లో ఆయన ఎదుర్కొన్న సందిగ్ధతలను ఆయన కుమారుడు కరణ్ సింగ్ ఇలా వివరించారు.

‘‘అప్పట్లో భారత్‌లో నాలుగు అధికార కేంద్రాలుండేవి. అయితే, ఎవరితోనూ మా నాన్నకు మంచి సంబంధాలు ఉండేవి కాదు. మా నాన్నగారికి దేశ భక్తి ఎక్కువ. ఆయన బ్రిటిషర్లతో రహస్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అసలు ఇష్టపడలేదు. ఆ తర్వాత కాంగ్రెస్. జవహర్‌లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లాలతో మా నాన్నకు విభేధాలకు కాంగ్రెస్సే కారణం. ఇంకొకవైపు జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్. అయితే, లీగ్‌లోని కొందరు ముస్లింలు మరీ అతివాదంతో ఉండేవారు. చివరగా షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫెరెన్స్. వారితో దశాబ్దాల నుంచి మా నాన్నకు శత్రుత్వం ఉండేది. అందరూ మా నాన్నకు వ్యతిరేకంగానే ఉండేవారు’’అని కరణ్ సింగ్ చెప్పారు.

చివర్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న హరి సింగ్ బొంబయిలో 26 ఏప్రిల్ 1961న మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)