కశ్మీర్ లోయ ఉద్రిక్తం: 'కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు'

భద్రతా బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆదర్శ్ రాథోఢ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1990ల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కన్నా తీవ్రమైన పరిస్థితులు మళ్లీ ఇప్పుడు కశ్మీర్‌లో నెలకొన్నాయా?

ప్రస్తుతం కశ్మీర్లోని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వానికి ఇదే ప్రశ్న వేస్తున్నాయి. కశ్మీర్లో ఇలాంటి పరిస్థితులను గతంలో ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం 1990ల నాటి పరిస్థితులను గుర్తుకుతెస్తోందన్నారు.

గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోయకు అదనపు బలగాల తరలింపుతో ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. అమర్‌నాథ్ యాత్రికులు యాత్రను ముగించుకుని, స్వస్థలాలకు వెంటనే తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు రావడంతో ఈ భయం మరింత ఎక్కువైంది.

అంతకు ముందు, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేతలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘటనలపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది.

తాను ఇంతకు ముందెన్నడూ చూడని భయానక వాతావరణాన్ని కశ్మీర్ లోయలో చూస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు.

మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ప్రస్తుత పరిస్థితిపై కేంద్రాన్ని ప్రశ్నించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఒమర్... కశ్మీర్లో ఇంత ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఏమిటో పార్లమెంటులో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే, రాజ్యాంగంలో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి విషయంలో మార్పులు చేయబోతున్నారనే దానిపై తనకు సమాచారం లేదని రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మలిక్ స్పష్టం చేశారు.

అదనపు పారామిలిటరీ బలగాల తరలింపు భద్రతాకారణాల రీత్యా చేపట్టిన చర్య అని రాజ్ భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అమర్‌నాథ్ యాత్రను నిలిపివేయడాన్ని ఖండించారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి చాలాకాలంగా కశ్మీర్ వ్యవహారాలపై పనిచేస్తున్న కొందరు జర్నలిస్టులతో బీబీసీ మాట్లాడింది.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

కశ్మీర్ లోయలో ఏం జరుగుతోంది?

ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో ప్రజల్లో అసంతృప్తి నెలకొందని శ్రీనగర్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ తెలిపారు. ఒకట్రెండు నెలల్లో జనజీవనం స్తంభించే అవకాశాలు కనిపించడంతో ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయన్నారు. దీంతో వారు తమకు కావాల్సిన నిత్యావసరాలను నిల్వచేసుకుంటున్నారు.

"ప్రజలు తమ వాహనాల్లో ఇంధనం నింపుకుంటున్నారు. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్రోల్ తీసుకెళ్తున్నారు. రేషన్ దుకాణాల దగ్గర బారులుతీరారు. ఏటీఎంల్లో డబ్బు అయిపోయింది. అంతా ఆందోళనగా ఉంది" అని రియాజ్ తెలిపారు.

కశ్మీర్ లోయలో ఉన్న పర్యటకులు కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఇక్కడి నుంచి తిరుగుప్రయాణమవుతున్న యాత్రికులు శనివారం కూడా కనిపించారు.

బస్సులు, విమానాల్లో ప్రజలు తిరుగుముఖం పట్టారు. విమానాశ్రయం పరిమితికి మించిన ప్రయాణికులతో రద్దీగా మారింది.

నిత్యావసరాలు పోగేసుకుంటున్న కశ్మీరీలు

ఫొటో సోర్స్, AMIR PEERZADA

"వెంటనే" అనే పదాన్ని ప్రభుత్వం తన ఆదేశాల్లో ఉపయోగించడంతో ఏదో తీవ్రమైన పరిస్థితే తలెత్తిందని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో "చారిత్రక అనిశ్చితి" కనిపిస్తోంది అని రియాజ్ తెలిపారు.

"ఇక్కడే నివసించేవారు, ఎక్కడికీ వెళ్లలేనివారు దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలపాటు బంద్ వస్తే, మందులు ఎక్కడి నుంచి వస్తాయి, నిత్యావసరాలు ఎలా దొరుకుతాయి అని వారు ఆందోళనపడుతున్నారు. చిన్నారులకు, వృద్ధులకు దీనివల్ల ఇబ్బంది లేకుండా చూసుకుంటూ, అంతా బాగానే ఉందనే భావన వారికి కల్పించడం మరో ముఖ్యమైన సమస్య. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటి నుంచీ ఈరోజు ఎలా గడుస్తుందో, రేపు ఎలా ఉండబోతోందో అని కశ్మీరీలు ఆవేదన చెందుతున్నారు" అని రియాజ్ వివరించారు.

"1999 నాటి కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి భయం లేదు. భద్రతా బలగాల సంఖ్యను పెంచారు. భద్రతాదళాలకు కూడా ఇలాంటి వాతావరణంలో ఉండటం ఇబ్బందే. అధికారులకు సైతం ఆందోళనే" అని రియాజ్ అన్నారు.

తాను కేంద్రంతో నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నానని, భద్రతా కారణాల వల్లే అమర్‌నాథ్ యాత్ర రద్దు చేశారని గవర్నర్ అంటున్నారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న వాతావరణం, జరుగుతున్న ఘటనలపై కేంద్రం గానీ, స్థానిక నాయకత్వం గానీ స్పష్టతనివ్వడం లేదు.

ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఏదో జరగబోతోందని ఎవరికైనా అర్థమవుతుంది అని రియాజ్ అంటున్నారు.

భద్రతా బలగాలపై యువత దాడి

ఫొటో సోర్స్, Getty Images

'1990 జనవరి' లాంటిదేదో జరగబోతోంది

గవర్నర్‌గా జగ్మోహన్ కాలం నాటి పరిస్థితులను ప్రస్తుత వాతావరణం గుర్తుకుతెస్తోందని జమ్మూలో నివసించే, సుదీర్ఘ కాలంగా జమ్మూ, కశ్మీర్ రాజకీయాలు, సంఘటనలను దగ్గరి నుంచి పరిశీలించిన అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ అనురాధా భసీన్ అన్నారు.

1990లోని చలికాలంలో ఇక్కడ ఉగ్రవాద చర్యలపై నియంత్రణ తప్పింది. "ప్రజలను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన ఘటనలు గత 30 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. 1990 జనవరి నాటి పరిస్థితి లాంటిదేదో కచ్చితంగా ఇప్పుడు చూడబోతున్నాం" అని అనూరాధ అన్నారు. అప్పట్లో జరిగిన దారుణ మారణహోమం, జనజీవనం స్తంభించడాన్ని అనూరాధ గుర్తుచేశారు.

"ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరమైనదే, 1990లలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా తీవ్రంగా ఉండేవి. ప్రస్తుతం అవి నియంత్రణలో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ప్రస్తుత ఘటనలను పరిశీలిస్తే ఏదో పెద్ద మార్పు జరగబోతోందని అనిపిస్తోంది. గత 20 ఏళ్లలో అమర్‌నాథ్ యాత్రను ఎప్పుడూ ఆపలేదు. 1990ల్లో హర్కతుల్ అన్సార్ సంస్థ దాడికి పాల్పడింది. ఆ తర్వాత 2008, 2016, 2018ల్లో లోయలో ఎన్నో నిరసనలు జరిగాయి. కానీ యాత్రకు ఎప్పుడూ ఆటంకం కలగలేదు. మరి ఇప్పుడే ఎందుకు యాత్రను నిలిపివేసినట్లు" అని అనురాధ భసీన్ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుత ఆందోళనలకు కారణం ప్రభుత్వ చర్యలేనని, కానీ దీని వెనక ఉన్న కారణాలను వారు స్పష్టం చేయడం లేదని అనురాధ అన్నారు.

భద్రతా బలగాలు

ఫొటో సోర్స్, BILAL BAHADUR

హింస చెలరేగవచ్చనే అనుమానం

అదనపు బలగాల తరలింపు వెనక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం కష్టంగానే ఉందని శ్రీనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అల్తాఫ్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

"30 ఏళ్లుగా ఇక్కడి పరిస్థితులను గమనిస్తున్నా. 3000 మంది మిలిటెంట్లు క్రియాశీలంగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సంవత్సరానికి 500 నుంచి 600 మందిని హతమారిస్తే మళ్లీ కొత్తవారు వచ్చేవారు. కానీ ప్రస్తుతం 300 మంది లోపు మిలిటెంట్లు మాత్రమే ఇక్కడ క్రియాశీలంగా ఉన్నారు. పుల్వామా దాడి జరిగింది. కానీ గతంలో రోజుకు 30 ఉగ్రవాద ఘటనలు జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 20 రోజులకో హింసాత్మక ఘటన జరుగుతోంది. ప్రస్తుతం మిలిటెంట్ కార్యకలాపాలు ప్రమాదకర స్థితిలో ఏమీ లేవు" అని ఆయన అన్నారు.

భద్రతా బలగాలపై యువత దాడి

ఫొటో సోర్స్, EPA

"అయితే ఈ పోరాటంలో గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, యువత దీనిలో భాగస్వామ్యం కావడం. దీనికి కారణం కూడా ఉంది. ఎక్కడైనా ఎన్‌కౌంటర్ జరిగిన మిలిటెంట్లు హతమైతే, ఒక్కోసారి కొందరు పౌరులు కూడా మరణించిన సందర్భాలున్నాయి. దీంతో ఆగ్రహం చెందుతున్న ప్రజలు మిలిటెంట్ కార్యకలాపాలవైపు మొగ్గుచూపుతున్నారు" అని హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

"పౌరులు తమ దగ్గర తుపాకులు లేకపోతే, రాళ్లు తీసుకుని భద్రతా బలగాలపై దాడికి దిగుతున్నారు. అంటే, సమస్య కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సరైన చర్యలు చేపడితే వీటిని నియంత్రించవచ్చు. లేదంటే ఇక్కడి ప్రజలకు అవకాశాలు లభిస్తే వారు బయటకు వెళ్లి, తిరిగి వచ్చి ఇక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ప్రమాదముంది. ఇది వెంటనే జరగకపోవచ్చు, కానీ జరగడానికి ఆస్కారముంది" అని హుస్సేన్ అన్నారు.

"ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటే అటల్ బిహారీ వాజ్‌పేయి బాటలో ప్రయాణించి ఇక్కడ శాంతి నెలకొనేందుకు ఎంతో చేయగలరు. కానీ ఆయన తీవ్రనిర్ణయాలు తీసుకుంటే కశ్మీర్‌లో అశాంతి నెలకొనవచ్చు. దీంతో భారత్ మొత్తం బాధపడొచ్చు" అని అల్తాఫ్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)