షింజో అబే అంత్యక్రియలకు హాజరైన నరేంద్ర మోదీ.. అధికారికంగా అంత్యక్రియలను జపాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే
    • రచయిత, రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హేస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, టోక్యో

సుమారు వారం రోజుల కిందట బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల కోసం ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది దేశాధినేతలు లండన్ వచ్చారు.

ఇప్పుడు వీరిలో చాలా మంది జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కోసం టోక్యో వచ్చారు. సుమారు వంద దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు.

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, సింగపూర్ ప్రధాని లీ సెన్ లూంగ్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బేనీస్ వంటి వారు కూడా వచ్చారు.

అయితే షింజో అబేకు ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడాన్ని జపాన్‌లో చాలా మంది ప్రజలు ఇష్టపడటం లేదు. ఈ అంత్యక్రియలకు సుమారు రూ.80 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు కూడా దాదాపుగా ఇంతే ఖర్చు అయినట్లు భావిస్తున్నారు.

గత కొద్ది వారాలుగా అధికారిక అంత్యక్రియలను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. తాజా సర్వేల ప్రకారం జపాన్‌లో దాదాపు సగం మంది దీన్ని తప్పుపడుతున్నారు.

జపాన్ ప్రధానమంత్రి కార్యాలయం ముందు ఒక వ్యక్తి తనకు తాను నిప్పు అంటించుకున్నాడు. అధికారిక అంత్యక్రియలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సుమారు 10 వేల మంది టోక్యోలో ర్యాలీ నిర్వహించారు.

షింజో అబేకు నివాళులు అర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Facebook/Narendra Modi

ఫొటో క్యాప్షన్, షింజో అబేకు నివాళులు అర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

రాజకీయ నేతకు రెండోసారి

జపాన్‌లో సాధారణంగా రాచకుటుంబానికి చెందిన వారికి మాత్రమే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

రెండో ప్రపంచయుద్ధం తరువాత 1967లో ఒక్కసారి మాత్రమే రాజకీయ నేతకు అధికారికంగా అంత్యక్రియలు చేశారు. ఆ తరువాత మళ్లీ షింజో అబేకు మాత్రమే ఆ గౌరవం దక్కింది.

షింజో అబే హత్యకు గురై చనిపోవడం వల్ల ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించింది.

ఆ మధ్య జరిగిన ఒక ఒపినీయన్ పోల్ ప్రకారం షింజో అబే అంత పాపులారిటీ ఉన్న నేత కాదు. అయితే జపాన్‌ భద్రత పెంచడంలోనూ ఆర్థిక స్థిరత్వం తీసుకురావడంలోను ఆయన కృషి చేశారంటే కాదనే వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు.

జపాన్‌కు సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా ఉన్నారు షింజో అబే. రెండో ప్రపంచయుద్ధం తరువాత అబే నేతృత్వంలోనే జపాన్ అంతర్జాతీయ వేదికల మీద తనదైన ముద్ర వేసింది.

'చైనా ఎదుగుదలతో ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో సమీకరణాలు ఎలా మారుతున్నాయో ఆయన అర్థం చేసుకున్నారు. ఆ మార్పులకు అనుగుణంగా జపాన్‌ను ఆయన సిద్ధం చేశారు' అని షింజో అబే మాజీ సలహాదారు కజుటో సుజుకీ అన్నారు.

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలోని తమ మిత్ర దేశాలను స్వేచ్ఛా వాణిజ్యం కోసం ట్రాన్స్-ఫసిఫిక్ పార్టనర్‌షిప్(టీపీపీ) పేరిట ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామ.

2016లో డోనల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తరువాత టీపీపీ నుంచి అమెరికా తప్పుకుంది. దాంతో టీపీపీ విచ్ఛిన్నం అవుతుందని నాడు అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

టీపీపీ బాధ్యతను భుజానికి ఎత్తుకున్న షింజో అబే, దాని పేరును కాంప్రహెన్సివ్ అండ్ ప్రొగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ది ట్రాన్స్-ఫసిఫిక్ పార్టనర్‌షిప్‌(సీపీటీపీపీ)గా మార్చారు.

ఆసియాకు మళ్లీ నాయకత్వం వహించాలని జపాన్ ఆశిస్తుందనేదానికి అది ఒక సంకేతంగా కనిపించింది. అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియాలతో క్వాడ్ కూటమిని ఏర్పాటు చేయడంలోనూ అబే కీలక పాత్ర పోషించారు.

షింజో అబేకు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, షింజో అబేకు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు

ఎందుకు వ్యతిరేకత?

రెండో ప్రపంచ యుద్ధం తరువాత తమ దేశ సరిహద్దుల బయట అమెరికాతో కలిసి సైనిక కార్యకలాపాలు చేపట్టేలా తొలిసారి షింజో అబే నేతృత్వంలోని జపాన్ చట్టం తీసుకొచ్చింది.

కానీ ఆ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకించారు. జపాన్‌ను షింజో అబే యుద్ధం వైపు మళ్లించాడని, ఆయనకు అధికారిక అంత్యక్రియలు జరపకూడదని వేల మంది నిరసనలు తెలిపారు.

'అబే తీసుకొచ్చిన సెల్ఫ్ డిఫెన్స్ చట్టంతో అమెరికాతో కలిసి జపాన్ మళ్లీ యుద్ధాలకు వెళ్తుంది. వాళ్లు జపాన్‌ను మళ్లీ యుద్ధంలోకి లాగుతున్నారు. మరి నేను ఆయన అంత్యక్రియలకు డబ్బులు ఎందుకు కట్టాలి? అందుకే వ్యతిరేకిస్తున్నా' అని మచికో తకుమీ అనే ప్రొటెస్టర్ అన్నారు.

రెండో ప్రపంచయుద్ధం తరువాత రూపొందించుకున్న జపాన్ రాజ్యాంగం, 'యుద్ధం చేసే హక్కును' స్వచ్ఛందంగానే వదులుకుంది. ఒక వేళ రాజ్యాంగాన్ని మార్చాలని అబే అనుకుని ఉంటే ముందుగానే ప్రజల అభిప్రాయం సేకరించి ఉండాల్సింది. కానీ అందుకు విరుద్ధంగా ఆయన రాజ్యాంగాన్ని పునిర్వచించి, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

'ప్రజలకు జవాబుదారీగా ఉండడు అనే ఇమేజ్‌ను అబే తెచ్చుకున్నారు. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఆయన నడుచుకున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు' అని టోక్యోలోని సోఫియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొయిచీ నకనో అన్నారు.

అయితే ప్రజలు అబేను సరిగ్గా అర్థం చేసుకోలేదని ఆయన మద్దతుదార్లు అంటున్నారు. చైనాతో జపాన్‌కు కలిగే ముప్పును ప్రపంచంలోని నాయకుల అందరికంటే ముందే అబే పసిగట్టారని, అందువల్లే అమెరికాకు మరింత దగ్గరగా ఉండాలని ఆయన కోరుకున్నారని చెబుతున్నారు.

నరేంద్ర మోదీతో షింజో అబే

ఫొటో సోర్స్, Getty Images

'చైనా ఈ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదిగితే అమెరికా ఇక్కడ నుంచి వెళ్లిపోతుందని అబే ఊహించారు. కాబట్టి అమెరికా ఉండాలంటే జపాన్ కూడా బలంగా నిలబడాలని ఆయన భావించారు' అని కజుటో సుజుకీ అన్నారు.

జపాన్ సైనిక శక్తి సామర్థ్యాలు పెంచుకోవడాన్ని అమెరికానే కాదు చైనా ఎదుగుదలను చూసి ఆందోళన చెందుతున్న దేశాలన్నీ ఆహ్వానించాయి.

ఆస్ట్రేలియా, భారత్‌లు మంచి మిత్రులుగా మారతారని కూడా అబే ఆశించారు. ఆయన హత్యకు గురైనప్పుడు భారత్‌లో ఒక రోజు సంతాప దినంగా ప్రకటించారు.

కానీ చైనాలో అబే మరణానికి సంతాపం తెలుపలేదు. ఆయనను యుద్ధోన్మాదిగా చైనా చూస్తూ వచ్చింది. బ్రిటన్ రాణి అంత్యక్రియలకు చైనా వైస్ ప్రెసిడెంట్ వెళ్లారు. కానీ బయటి ప్రపంచానికి తెలియని మాజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిని అబే అంత్యక్రియలకు పంపింది చైనా.

వీడియో క్యాప్షన్, 230 తిమింగలాలు బీచ్‌కు కొట్టుకొచ్చాయి, వాటిలో చాలా వరకు చనిపోయాయి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)