కేసీఆర్ కోరుకుంటున్న ప్రతిపక్ష కూటమిని నితీశ్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ కోరుకోవడం లేదా

ఫొటో సోర్స్, facebook/KalvakuntlaChandrashekarRao
- రచయిత, చందన్ కుమార్ జాజ్‌వాడె
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీజేపీ పార్టీని 2024 ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.
దిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ల సమావేశాన్ని ఈ కోణంలోనే చూస్తున్నారు. వీళ్లంతా చెబుతున్న మాట ఒక్కటే... 2024లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం.
కాంగ్రెస్ పెద్ద పార్టీగా ఉన్నందున అందరూ దానితో కలిసి రావాలని లాలు ప్రసాద్ యాదవ్ కోరుతున్నారు. తమతో అన్ని పార్టీలు కలిసి రావాలని, అందరినీ కలుపుకొని పోతామని నితీశ్ కుమార్ అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వారు ఆ పార్టీ అధ్యక్ష పదవి చేపడతారనే వార్తలు వస్తున్నాయి. అందుకు తగినట్లుగానే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, సీనియర్ లీడర్ శశి థరూర్ వంటి వారు పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌తో పాటు వామపక్ష పార్టీల నేతలను కూడా నితీశ్ కుమార్ కలిశారు.

ఫొటో సోర్స్, Facebook/KCR
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమి కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్‌తో కూడిన కూటమి కోసం నితీశ్, లాలు చేస్తున్న తాజా ప్రయత్నాలకు మధ్య పొంతన కనిపించడం లేదు.
2018 నుంచి ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారు. ఇందుకు అనుగుణంగానే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జేడీఎస్ కుమార స్వామి, ఆప్ అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ, శరద్ పవార్ వంటి వారిని ఆయన కలిశారు. ఇటీవలే బిహార్ వెళ్లి నితీశ్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌లతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.
ఇక జాతీయ పార్టీ పెడతామంటూ ఇటీవలే కేసీఆర్ ప్రకటించారు. ఇంత వరకు ప్రతిపక్ష నేతల్లో ఎవరూ కేసీఆర్‌తో వస్తామని కానీ, కలుస్తామని కానీ చెప్పలేదు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలిసిన కుమార స్వామి... మీరు జాతీయ పార్టీ పెట్టడండి అని కేసీఆర్‌ను ప్రోత్సహించారు కానీ అంతకు మించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు.
కేసీఆర్ కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. మరొకవైపు కాంగ్రెస్ కావాలని దానితోనే నడవాలని నితీశ్, లాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏమిటనేది రానున్న రోజుల్లో కానీ తెలియదు.
సోనియా గాంధీతో నితీశ్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ భేటీ అయిన సందర్భంగా బీబీసీ ప్రతినిధి చందన్ కుమార్ జజ్‌వాడే అందిస్తున్న విశ్లేషణ.

ఫొటో సోర్స్, Facebook/Lalu Prasad Yadav
ఈ సమావేశాలు ఫలిస్తాయా?
ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనే ముందుముందు కానీ తెలియదు.
'2024లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి. అందుకే నితీశ్ కుమార్ గత నెల రోజులుగా ఇలా సమావేశాలు జరుపుతూ వస్తున్నారు' అని సీఎస్‌డీఎస్‌కు చెందిన సంజయ్ కుమార్ అన్నారు.
సోనియా గాంధీతో సమావేశం ద్వారా 2020 ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించేందుకు ఒక ప్రయత్నం జరిగింది. 2020 బిహార్ ఎన్నికల్లో తమ కూటమి ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ అని ఆర్జేడీ నాయకులు ఆరోపించారు.
నాడు సంకీర్ణంలో భాగంగా బిహార్‌లో కాంగ్రెస్‌కు 70 సీట్లు కేటాయించారు కానీ 19 సీట్లలో మాత్రమే ఆ పార్టీ గెలిచింది.
నితీశ్ కుమార్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా చూపే ప్రయత్నం జేడీయూ చేస్తూ వచ్చినప్పటికీ, ఆయన మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇటీవల బీజేపీతో సంబంధాలు తెంచుకున్నాక, 2024 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఇప్పుడు ఆయన ఉన్నారు.
'ప్రస్తుతం అలాంటి సమావేశాల్లో అంతా బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమావేశాలు అన్నీ ప్రతిపక్ష పార్టీలు కలిసి రావడం గురించే.
కానీ అందరూ ఏకమైన తరువాత, ఆ కూటమిని నడిపించే లీడర్ ఎవరు? ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? వంటి అంశాలపై ఇంకా చర్చలు లేవు. ఈ చర్చ మొదలైతే కానీ ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం ఏ పాటిదో తెలుస్తుంది.
ప్రతిపక్షాల మధ్య ఇప్పుడు సఖ్యత కనిపించినా రేపు ఎన్నికలు రాగానే విభేదాలు బయట పడొచ్చు' అని సంజయ్ కుమార్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Facebook/Nitish Kumar
కానీ కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు టీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కాంగ్రెస్‌కు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
ఆదివారం మాజీ ఉపప్రధాని దేవీలాల్ చౌధరీ జయంతి సందర్భంగా హరియాణలో ప్రతిపక్షాలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలా ప్రయత్నం చేశారు.
1977 ఎమర్జెన్సీ తరువాత ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఓం ప్రకాశ్ చౌతాలా తండ్రి దేవీ లాల్ చౌదరి చాలా కృషి చేశారు.
కేసీఆర్, అఖిలేశ్ యాదవ్, హెచ్‌డీ దేవేగౌడ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ప్రకాశ్ సింగ్ బాదల్, మమత బెనర్జీ, తేజస్వీ యాదవ్ వంటి వారిని ఓం ప్రకాశ్ చౌతాలా ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరికీ ఆహ్వానం అందలేదు.

ఫొటో సోర్స్, ANI
'దేశంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టుకొచ్చినవే. అందువల్ల కేసీఆర్, మమత బెనర్జీ వంటి వాళ్లు కాంగ్రెస్‌ను వ్యతిరేకించడంలో ఆశ్చర్యం లేదు.
ఇక నితీశ్ కుమార్‌ను గమనిస్తే ఆయన కాంగ్రెస్ మీద ఎప్పుడూ దూకుడుగా మాట్లాడలేదు. ప్రస్తుతం జాతీయస్థాయిలో ప్రతిపక్షంలో ఒక శూన్యం ఏర్పడి ఉంది. ఆ శూన్యంలో తనకు ఒక అవకాశం లభిస్తుందని నితీశ్ కుమార్ భావిస్తున్నారు.
ఈ విషయంలో ఆర్జేడీ కూడా నితీశ్ కుమార్‌కు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఆయనను జాతీయ రాజకీయాలకు పంపడమే ఆ పార్టీకి ఉన్న ఏకైక లక్ష్యం. అప్పుడే బిహార్ రాజకీయాలు తమ చేతికి వస్తాయని ఆర్జేడీ భావిస్తోంది' అని పట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ డీఎం దివాకర్ అన్నారు.
హరియాణలో లోక్ దళ్, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న పోటీ వల్ల దేవీ లాల్ చౌధరీ జయంతి వేడుకలకు కాంగ్రెస్‌ను దూరంగా ఉంచారు తప్ప మరొక కారణం లేదని జేడీయూ నేత కేసీ త్యాగీ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోనియా గాంధీ, నితీశ్ కుమార్‌ల మధ్య సమావేశాన్ని ఒక 'మర్యాదపూర్వక భేటీ'గా జేడీయూ చూస్తోంది.
'ప్రధానమంత్రి పదవికి తాను పోటీపడటం లేదని నితీశ్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో తాను ముందు ఉండాలని ఆయన భావిస్తున్నారు' అని బీబీసీతో కేసీ త్యాగీ అన్నారు.
'బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన ఏడు పార్టీల నేతలను నితీశ్ కుమార్ తొలుత కలిశారు. నాడు సోనియా గాంధీ దేశంలో లేరు. అందుకే ఆయన ఇప్పుడు కలిశారు' అని ఆయన చెప్పారు.
అయితే అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్‌లో జేడీయూ ఉనికి లేకుండా చేస్తున్నందుకు బీజేపీ మీద నితీశ్ కుమార్ కోపంగా ఉన్నారని ప్రొఫెసర్ డీఎం దివాకర్ అంటున్నారు.
'ఇటీవల ఆ రాష్ట్రాలలోని జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. కాబట్టి బిహార్‌లో తన పార్టీని కాపాడుకునేందుకు ఆయన కాంగ్రెస్, ఆర్జేడీలను వదిలి పెట్టరు' అని దివాకర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
- RRR- ఛెల్లో షో : భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సినిమా కథ ఏంటి, దీని ముందు ‘RRR' ఎందుకు వెనుకబడింది?
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













