యుక్రెయిన్ యుద్ధం: రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తుందా

రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తుందా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తుందా

రష్యన్ భూభాగాన్ని పరిరక్షించుకునేందుకు అవసరమైతే న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీంతో, రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడిలో భాగంగా వ్యూహాత్మక అణ్వస్త్రాయుధాలను వాడుతుందేమో అనే భయం మొదలయింది.

రష్యా ఈ చర్యకు పాల్పడితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం చూడని స్థాయిలో సైనిక చర్యలను చూడాల్సి ఉంటుందని అన్నారు.

వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలంటే ఏంటి?

యుద్ధ భూమిలో పరిమిత దాడులు చేసేందుకు ఉపయోగించే చిన్న అణ్వస్త్ర క్షిపణులు, ఆయుధ రవాణా వ్యవస్థను వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలని అంటారు.

వీటిని ప్రధానంగా రేడియో యాక్టివ్ ప్రభావం ఎక్కువగా లేకుండా ఒక ప్రత్యేక ప్రాంతంలో శత్రు లక్ష్యాలను వినాశనం చేసేందుకు రూపొందించారు.

అతి చిన్న వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధం ఒక కిలో టన్ను లేదా అంత కంటే తక్కువ బరువు ఉంటుంది. అతి పెద్దది 100 కిలో టన్నుల వరకు బరువు ఉండొచ్చు.

అణ్వస్త్ర ఆయుధాలు భారీగా 1000 కిలో టన్నుల వరకు బరువుతో ఉంటాయి. వీటిని సుదూర లక్ష్యాలను చేధించేందుకు ప్రయోగిస్తారు.

అమెరికా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో (1945)లో జపాన్ లోని హిరోషిమా పై 15 కిలో టన్నుల బరువుండే అణు బాంబును వేసింది.

రష్యా దగ్గర ఎలాంటి వ్యూహాత్మక ఆయుధాలున్నాయి?

రష్యా దగ్గర సుమారు 2000 వ్యూహాత్మక ఆయుధాలున్నట్లు అమెరికన్ ఇంటెలిజెన్స్ సమాచారం.

ఈ అణ్వస్త్ర ఆయుధాలను క్రూయిజ్ క్షిపణులు, తుపాకీ గుళ్ళు లాంటి సాధారణ పేలుడు పదార్ధాలను ప్రయోగించగలిగే క్షిపణుల ద్వారా కూడా ప్రయోగించవచ్చు.

వ్యూహాత్మక అణ్వస్త్రాయుధాలను విమానాలు, నౌకల నుంచి కూడా పేల్చవచ్చు.

రష్యా ఇటీవలి కాలంలో తమ పరిధిని, దాడుల కచ్చితత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు వ్యూహాత్మక అణ్వస్త్రాయుధాల పై అధికంగా వెచ్చిస్తోందని అమెరికా అంటోంది.

షార్ట్ రేంజ్ న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగించగలిగే రెండు రష్యా వ్యవస్థలు

వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలను గతంలో ఎప్పుడైనా వాడారా?

వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలను గతంలో ఎప్పుడూ పోరాట సమయాల్లో వాడలేదు.

ఈ ఆయుధాలు యుద్ధభూమిలో లక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రభావవంతంగా పని చేస్తాయని న్యూక్లియర్ శక్తులైన అమెరికా, రష్యా రెండు దేశాలు భావించాయి.

రష్యా భారీ అణ్వస్త్ర ఆయుధాల కంటే వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలను వాడేందుకు ఆసక్తి చూపిస్తోంది.

"ఇవి ప్రయోగించడం ద్వారా అణ్వస్త్ర ఆయుధాలను ప్రయోగించే పరిధిని అతిక్రమించినట్లు అవ్వదని భావిస్తోంది" అని ఛాథం హౌస్ థింక్ ట్యాంక్ లో అంతర్జాతీయ భద్రతా కార్యక్రమం అధినేత డాక్టర్ పాట్రీషియా లూయిస్ అన్నారు.

"వీటిని రష్యా తమ సంప్రదాయ ఆయుధాల మాదిరిగా పరిగణించవచ్చు" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధం ఆపాలని కోరుతోన్న ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు
వ్యూహాత్మక అణ్వస్త్రాయుధాలను విమానాలు, నౌకల నుంచి కూడా పేల్చవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

పుతిన్ చేసిన న్యూక్లియర్ ఆయుధాల ప్రయోగం ఆందోళన కలిగిస్తోందా?

ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ పై దాడికి ముందు పుతిన్ రష్యన్ న్యూక్లియర్ సేనలను యుద్ధానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వీరితో అత్యున్నత స్థాయి న్యూక్లియర్ డ్రిల్స్ కూడా నిర్వహించారు.

"భౌగోళిక భద్రతకు ముప్పు వాటిల్లిన పక్షంలో రష్యాను, ప్రజలను రక్షించుకునేందుకు సందేహం లేకుండా రష్యా దగ్గరున్న అన్ని విధానాలను ప్రయోగిస్తాం" అని పుతిన్ ఇటీవల ప్రకటించారు.

రష్యా ఆక్రమించిన దక్షిణ, తూర్పు యుక్రెయిన్ ప్రాంతాలను కలపాలని రష్యా చూస్తోంది. రిపబ్లిక్ రాజ్యాల స్వరూపం మార్చేందుకు రిఫరెండం నిర్వహించాలని ప్రణాళిక చేస్తోంది. ఈ ప్రాంతాల భౌగోళిక అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు రష్యా అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఇటీవల పుతిన్ అన్నారు.

పుతిన్ చేసిన ఈ ప్రకటనలు న్యూక్లియర్ యుద్ధానికి సంకేతంగా కాకుండా, పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌కు సహాయం చేయకుండా ఆ భూభాగాలను ఆక్రమించేందుకు రష్యా చేసిన బెదిరింపులా అమెరికన్ ఇంటెలిజెన్స్ పరిగణిస్తోంది.

కానీ, రష్యా గనక మరిన్ని ప్రతిఘటనలను ఎదుర్కొంటే, పోరాటాన్ని మలుపు తిప్పేందుకు, లేదా ఓటమి పాలు కాకుండా ఉండేందుకు రష్యా చిన్న చిన్న ట్యాక్టికల్ ఆయుధాలను వాడొచ్చని కొంత మంది భావిస్తున్నారు.

"అలాంటి పరిస్థితి ఏర్పడితే యుక్రెయిన్ లో ప్రజలను భయపెట్టి తన దారిలోకి తెచ్చుకునేందుకు, పుతిన్ తప్పకుండా న్యూక్లియర్ ఆయుధం వాడొచ్చనే భయం నాకు ఉంది. అయితే, ప్రస్తుతం మనం ఇంకా ఆ పరిస్థితికి చేరలేదు" అని వాషింగ్టన్ డీసీ లో కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పేస్ లో న్యూక్లియర్ నిపుణులు జేమ్స్ ఏక్టన్ అన్నారు.

అమెరికా ఎలా స్పందించింది?

యుక్రెయిన్‌లో న్యూక్లియర్ ఆయుధాలను వాడొద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాను హెచ్చరించారు.

ఆయన సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "అటువంటి చర్యలు యుద్ధం ముఖ చిత్రాన్ని మార్చేస్తాయి. ప్రపంచం రెండవ ప్రపంచం తర్వాత ఎన్నడూ చూడని సైనిక చర్యలను చూడాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

అయితే, న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తే నాటో, అమెరికా ఎలా స్పందిస్తాయో ఊహించడం కష్టం. ఈ పరిస్థితిని మరింత ఉద్రేకపరిచి న్యూక్లియర్ యుద్ధం తలెత్తే పరిస్థితికి మాత్రం పాల్పడకపోవచ్చు.

రష్యా న్యూక్లియర్ ఆయుధాలను వాడకుండా చైనా కూడా నియంత్రించే అవకాశముంది.

"రష్యా చైనా అందించే సహకారం పై చాలా ఎక్కువగా ఆధారపడింది" అని లండన్ కింగ్స్ కాలేజీలో న్యూక్లియర్ నిపుణులు డాక్టర్ హీథర్ విలియమ్స్ చెప్పారు.

"చైనా న్యూక్లియర్ ఆయుధాలను ముందుగా తాము ప్రయోగించకూడదనే విధానం ఉంది. పుతిన్ వాటిని ప్రయోగిస్తే, చైనా రష్యా తరుపున నిలబడటం కష్టంగా మారుతుంది. రష్యా గనక న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తే, చైనా మద్దతును కోల్పోవలసి ఉంటుంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)