ఇరాన్ నిరసనలు: హిజాబ్‌లను తగులబెడుతున్న మహిళలు

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, TWITTER

    • రచయిత, డేవిడ్ గ్రిటెన్, ఆలివర్ స్లో
    • హోదా, బీబీసీ న్యూస్

ఇరాన్‌లో హిజాబ్ చట్టాన్ని గౌరవించలేదన్న కారణంతో ఒక మహిళను అక్కడి మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసి హింసించారని, దాంతో ఆమె మరణించారణి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె మరణం ఇరాన్‌లో నిరసనలకు దారి తీసింది. అనేక మంది మహిళలు వీధుల్లోకొచ్చి హిజాబ్ తొలగించి తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.

నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న మహిళలు తమ హిజాబ్‌లను తొలగించి వాటిని మంటల్లో వేసి కాలుస్తున్నారు.

గత ఐదు రోజులుగా ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ నిరసనలు చాలా పట్టణాలు, నగరాలకు వ్యాపించాయి.

మహసా అమీనీ అనే 22 ఏళ్ల అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత ఆసుపత్రిలో చేర్చారు.. మూడు రోజుల పాటు కోమాలో ఉన్న తరువాత శుక్రవారం ఆస్పత్రిలో మరణించారు.

టెహ్రాన్‌కు ఉత్తరంగా ఉన్న సారీలో మహిళలు నిరసనలను చేస్తూ తమ హిజాబ్‌ను తొలగించి కాల్చుతుండగా భారీ సంఖ్యలో మహిళలు వారికి మద్దతు పలికారు.

హిజాబ్ ధరించలేదనే ఆరోపణతో అమీనీని ఇరాన్‌లోని మొరాలిటీ పోలీసులు(దేశంలో అమలులో ఉన్న ఇస్లామిక్ డ్రెస్ కోడ్ అమలు పర్యవేక్షించే విభాగం) గత వారంలో అరెస్టు చేశారు.

అరెస్ట్ తరువాత ఆమె స్పృహ తప్పి పడిపోయి కోమాలోకి వెళ్లిపోయారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అయితే, పోలీసులు అమీనీ తలపై లాఠీతో కొట్టడంతో పాటు ఆమె తలను ఒక వాహనానికి వేసి కొట్టినట్లు వార్తలొచ్చాయని మానవ హక్కుల ఐక్యరాజ్య సమితి యాక్టింగ్ హై కమిషనర్ నదా అల్ నషీఫ్ చెప్పారు.

అయితే, పోలీసులు మాత్రం.. తాము ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని, గుండెపోటుతో ఆమె కుప్పకూలిపోయారని చెబుతున్నారు.

అమీనీ కుటుంబం మాత్రం ఆమె ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారని చెబుతున్నారు.

మహసా అమీనీ పశ్చిమ ఇరాన్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతానికి చెందిన వారు.

నిరసనకారుల పై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో సోమవారం ముగ్గురు మరణించారు.

అయతుల్లా అలీ ఖొమేనీ సహాయకులు అమీనీ కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లి, "హక్కులను ఉల్లంఘిస్తే వాటిని రక్షించడానికి అన్ని వ్యవస్థలు చర్యలు తీసుకుంటాయి" అని చెప్పినట్లు ప్రభుత్వ మీడియా ప్రకటించింది.

"మొరాలిటీ పోలీసు వ్యవస్థ ఇరాన్‌కు నష్టాన్ని, హానిని కలిగించింది. ఈ వ్యవస్థే ఒక తప్పిదం" అని సీనియర్ పార్లమెంట్ సభ్యుడు జలాల్ రషీద్ కూచి మొరాలిటీ పోలీస్ వ్యవస్థను బహిరంగంగా విమర్శించారు.

మహసా అమీనీ

ఫొటో సోర్స్, Mahasa Amini Family

ఇరాన్ హిజాబ్ చట్టాలు ఏం చెబుతున్నాయి?

1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో అధికారులు మహిళలందరూ హెడ్ స్కార్ఫ్‌తో పాటు ఒంటికి అతుక్కోకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించాలనే నియమాన్ని విధించారు. మహిళల ఆకృతి బయటకు కనిపించకుండా ఉండాలి.

మహిళలు సరైన దుస్తులు ధరించారో లేదో పర్యవేక్షించే బాధ్యతను మొరాలిటీ పోలీసు (గతంలో గైడెన్స్ పెట్రోల్స్) విభాగం తీసుకుంటుంది.

అధికారులకు మహిళలను ఆపి వారి వస్త్రధారణను, కనిపించే తీరును, కురులు బయటకు కనిపించే తీరు, వాళ్ళు ధరించిన ప్యాంటులు, ఓవర్ కోట్లు పొట్టిగా లేదా ఒంటికి అతుక్కుని ఉన్నాయా లాంటి అంశాలను కూడా పరిశీలించే అధికారం ఉంటుంది.

వాళ్ళు అతిగా మేకప్ వేసుకుంటున్నారో లేదో కూడా చూస్తారు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే జరీమానా, జైలు శిక్ష లేదా కొరడా దెబ్బలు కూడా ఉండొచ్చు.

2014లో ఇరాన్ లో మహిళలు "మై స్టీల్తీ ఫ్రీడమ్" అనే ప్రచారంలో భాగంగా హిజాబ్ చట్టాలను బహిరంగంగా విమర్శిస్తూ తమ ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఈ ఉద్యమం వైట్ వెడ్నెస్ డే", "గర్ల్స్ ఆఫ్ రివల్యూషన్ స్ట్రీట్" లాంటి చాలా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది.

శనివారం, ఆదివారం సాకేజ్, సనందాజ్ ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ వంటి వాటితో కాల్పులు జరపడంతో సుమారు 38 మంది గాయపడినట్లు కుర్దిష్ ప్రాంతాల్లో మానవ హక్కులను పర్యవేక్షించే నార్వేకు చెందిన సంస్థ హెంగా తెలిపింది.

ఈ నిరసనలను అణచివేసేందుకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు పురుషులు కూడా మరణించినట్లు తెలిపింది. అయితే, ఇందులో ఒక వ్యక్తి ఇంకా మరణించలేదని పరిస్థితి విషమంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

టెహ్రాన్‌లో మహిళలు తమ హిజాబ్‌లను తొలగిస్తున్నట్లు చూపిస్తున్న వీడియోలు షేర్ అవుతున్నాయి. వీళ్ళు నియంత మరణించాలని నినాదాలు కూడా చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం నేతను ఉద్దేశించి ఇలాంటి నినాదాలు చేస్తారు.

"కొంత మంది న్యాయం, స్వేచ్ఛ, హిజాబ్ తప్పనిసరి కాదు" అంటూ నినాదాలు చేశారు.

గిలాన్‌లో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి.

పోలీసు బృందాలు లాఠీలతో , గొట్టాలతో నిరసనకారులను కొట్టడంతో ఒక మహిళ తనకు గాయాలైనట్లు చెబుతూ బీబీసీ పర్షియా కు కొన్ని ఫోటోలు పంపారు.

"పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగిస్తూనే ఉన్నారు. మా కళ్ళు మండిపోయాయి. మేము పారిపోయాం. కానీ, మమ్మల్ని వెతికి పట్టుకుని మరీ కొట్టారు. నన్ను వేశ్య అని పిలుస్తూ, నన్ను నేను అమ్ముకోవడానికి వీధుల్లోకొచ్చానని దూషించారు" అని ఆమె చెప్పారు.

"మేము మా హిజాబ్‌లను తొలగించి గాలిలోకి ఊపుతున్నప్పుడు, మా చుట్టూ చేరిన పురుషులు మాకు రక్షణగా నిలబడటం చూసి భావోద్వేగానికి గురయ్యాను. ఈ విధమైన ఐక్యత చూసి చాలా గొప్పగా అనిపించింది. ప్రపంచం కూడా మాకు మద్దతిస్తుందని ఆశిస్తున్నాం" అని ఇస్‌ఫహాన్‌కు చెందిన మరో మహిళ బీబీసీకి చెప్పారు.

"దేశంలో అనిశ్చితి సృష్టించేందుకు ఈ నిరసనలను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు" అని టెహ్రాన్ గవర్నర్ మోహ్‌సేన్ మన్‌సౌరీ మంగళవారం ట్వీట్ చేశారు.

"ప్రభుత్వ విమర్శకులు, కుర్దిష్ వేర్పాటువాదులకు అమీనీ మరణం ఒక నెపం మాత్రమే" అని ప్రభుత్వ టీవీ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)