Iran honour killings: దేశంలో పెరుగుతున్న ‘పరువు’ హత్యలు.. మహిళల్ని చంపేస్తున్న కుటుంబ సభ్యులు

వీడియో క్యాప్షన్, పరువు పేరుతో జరుగుతున్న హత్యల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరం అంటున్న హక్కుల సంఘాలు

ఇరాన్‌లో పరువు హత్యలుగా చెప్పే ఘటనలు పెరిగిపోతున్నాయని మానవ హక్కుల కార్యకర్తలు హెచ్చరించారు.

తమ ప్రవర్తన ద్వారా కుటుంబానికి తలవంపులు తెచ్చారనే ఆరోపణతో సొంత కుటుంబ సభ్యులు లేదా భాగస్వాములే ఒక వ్యక్తిని హత్య చేయడాన్ని హానర్ కిల్లింగ్స్ లేదా ‘పరువు’ హత్యలు అంటున్నారు.

ఫిబ్రవరిలో మోనా హైదరీ అనే యువతిని క్రూరంగా హత్య చేసినప్పుడు పరువు హత్యల అంశం చర్చలోకి వచ్చింది.

బీబీసీ ప్రతినిధి సారా మొనెట్టా అందిస్తున్న ఈ కథనంలో కొన్ని వివరాలు మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు.

పన్నెండేళ్ల వయసులోనే మోనా వివాహం తన కజిన్‌తో జరిగింది. అయితే, గృహహింసను తప్పించుకోవడానికి ఆమె టర్కీకి పారిపోయింది. కానీ కుటుంబం ఆమెను కన్విన్స్ చేసి వెనక్కి రప్పించింది. ఆమెకు రక్షణ ఉంటుందని నమ్మబలికారు. అప్పటికే ఆమెకు కేవలం 17 ఏళ్లే.

మోనా లాంటి విషాదగాథ పరీసాది కూడా. ఆమె ఓ స్కూల్ టీచర్. మోనాది, ఆమెది ఒకే ప్రాంతం. తెగ పెద్దలు బలవంతపెట్టి ఒక దుర్మార్గుడితో ఆమె పెళ్లి జరిపించారు. తన కష్టాల గురించి మాట్లాడేందుకు ఆమె సిద్ధపడ్డారు.

పరీసాపైన ఆమె భర్త వేడి నీళ్లు గుమ్మరించడంతో మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. తను తల్లి కాబోతున్నానన్న విషయం ఆమెకు అప్పుడే తెలిసింది.

ఆ క్రమంలో ఆమె టర్కీకి పారిపోయి, అక్కడ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

పరీసాకు బెదిరింపులు వస్తున్నప్పటికీ టర్కీ అధికారులు ఆమెకు శరణార్థి హోదాను రద్దు చేశారు. ఆమెను, ఆమె బిడ్డను ఇప్పుడు ఇరాన్‌కు తరలించే ప్రమాదం ఉంది.

2019లో అచ్చయిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఇరాన్‌లో ఏటా 450 మంది మహిళలను సొంత కుటుంబ సభ్యులు లేదా భర్తలు పరువు హత్యల పేరుతో చంపేస్తున్నారని అంచనా. ఇలాంటి హత్యలు పబ్లిక్‌గా, అత్యంత క్రూరంగా జరిగినప్పుడు మాత్రమే వార్తల్లోకి ఎక్కుతుంటాయి. చాలా సందర్భాల్లో, ఇలాంటి హత్యలు ఎవరి దృష్టిలో పడకుండానే జరిగిపోతుంటాయి. ఈ కేసుల్లో పడుతున్న శిక్షలు కూడా అతి స్వల్పం.

రిపోర్ట్ అవుతున్న హత్యలు ఇప్పుడు పెరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్తలంటున్నారు. దేశంలోని చట్టాలే ఒక మేరకు ఈ హత్యలకు కారణమని వారంటున్నారు.

కుటుంబంలో జరిగే హత్యలను లోలోపలే దాచేస్తున్నారు. హతులైన మహిళల తల్లిదండ్రులు హంతకుడిపై కేసులు కూడా పెట్టడం లేదు.

మరి దీనికి పరిష్కారం ఏంటి?

ముందుగా, చట్టాలు మారాలి. రెండోది విద్య, సంస్కృతి, మసీదుల్లో మార్పులు రావాలి. పరువు హత్యలనేవి కేవలం వృద్ధ తరం పురుషులకు సంబంధించిందని కొందరు అనుకోవచ్చు. కానీ, దురదృష్టవశాత్తు కొత్త తరాల్లో కూడా ఇవి కనిపిస్తున్నాయి. అంటే, మహిళలను గౌరవించాల్సిన అవసరం గురించి నేర్పించడంలో మన విద్యావిధానం విఫలమైందన్న మాట.

ఫిబ్రవరిలో మోనా హత్య తర్వాత, పరువు హత్యల సమస్యను పరిష్కరించడానికి తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని ఇరాన్ మహిళా, కుటుంబ వ్యవహారాల ఉపాధ్యక్షుడు ఎన్సీహ్ ఖజాలీ అన్నారు. కానీ ఆ తర్వాత కూడా కనీసం ఇద్దరు మహిళలను వారి కుటుంబ సభ్యులే హత్య చేశారన్న సమాచారం ఉంది. ఈ కేసులు వార్తల్లోకి ఎక్కడం చాలా అరుదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)