కర్నాటక: ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు... ఏమిటీ వివాదం, వక్ఫ్ ఆస్తులంటే ఏమిటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్నాటకలోని హుబ్బల్లి ఈద్గా మైదానంలో గణేషుడి పూజపై వివాదం రాజుకొంది. ఈ స్థలం ముస్లింల ఆస్తి అని, ఇక్కడ వేరే మతాల వారు పూజలు చేసుకోవడానికి వీల్లేదని మొదట్నుంచీ కర్నాటక వక్ఫ్ బోర్డు దీన్ని వ్యతిరేకిస్తోంది.
అయితే, ఈ స్థలం వక్ఫ్ కింద రిజిస్టర్ కాలేదని చెబుతూ పూజలకు కర్నాటక హైకోర్టు అనుమతించింది.
ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవచ్చంటూ హుబ్బల్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్‌డీఎంసీ) ఇచ్చిన అనుమతులకు కోర్టు మద్దతు పలికింది.
‘‘ఈ స్థలం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందినది. ఇందులో ఎలాంటి వివాదమూ లేదు’’అని కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిక్ అశోక్ ఏ కినాగీ తీర్పు ఇచ్చే సమయంలో వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇక్కడ వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
హుబ్బల్లి ఈద్గాను హెడ్‌డీఎంసీ ఆస్తిగా 2010లో సుప్రీం కోర్టు ప్రకటించింది.
అయితే, బెంగళూరులోని చామరాజపేట ఈద్గా దగ్గర వినాయక చవితి వేడుకలను మాత్రం సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ప్రస్తుతం ఈ స్థలం ఎవరికి దక్కుతుందనే అంశంపై సుప్రీం కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉంది.

ఫొటో సోర్స్, AFP
వక్ఫ్ అంటే?
ఇస్లాంను అనుసరించేవారు అల్లా పేరు మీద విరాళంగా ఇచ్చే స్థిర, చర ఆస్తులను వక్ఫ్‌గా పిలుస్తారు. సమాజ సేవ కోసం ఈ ఆస్తులను ఉపయోగిస్తుంటారు. ఇవన్నీ అల్లా పేరున ఉంటాయి.
‘‘వక్ఫ్ అనేది అరబిక్ పదం. అలానే ఉంచడం అని దీనికి అర్థముంది. అల్లా పేరు మీద ఆస్తిని దానం చేసిన తర్వాత ఇది మళ్లీ చేతులు మారే అవకాశం ఉండదు. ఇది ఎప్పటికీ అల్లా ఆస్తిగానే ఉంటుంది’’అని వక్ఫ్ వేల్ఫేర్ ఫోరమ్ అడ్వొకేట్ అహ్మద్ జావెద్ చెప్పారు.
‘‘ఒకసారి వక్ఫ్‌గా మారిన ఆస్తులు.. ఎప్పటికీ వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి’’అని 1998 జనవరిలో సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది.
వక్ఫ్ ఆస్తులను ఇతరులు కొనడం లేదా వారి పేరు మీద బదిలీ చేసుకోవడం లాంటివి చేయకూడదు.
వక్ఫ్ గురించి ఇస్లామిక్ చరిత్రలో ఏం రాసివుందో అనే అంశంపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడీస్ వైస్ చైర్మన్ అఫ్జల్ వానీ బీబీసీతో మాట్లాడారు.
‘‘తమ ఆస్తిని దేవుడి కోసం దానం చేయాలని భావించేవారు ఏం చేయాలో మహమ్మద్ ప్రవక్త సూచించారు. ఖలీఫా హజ్రత్ ఉమర్ దగ్గర చాలా ఆస్తి ఉండేది. దాన్ని మెరుగ్గా ఎలా ఉపయోగించాలని మహమ్మద్ ప్రవక్తను ఆయన అడిగారు. అప్పుడే వక్ఫ్ గురించి ప్రవక్త చెప్పారు. దేవుడి పేరున ఆ ఆస్తిని దానం చేస్తే, అవసరమైన వారికి అది చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు’’అని వానీ తెలిపారు.
‘‘ఒక ఆస్తిని వక్ఫ్‌గా మార్చడమంటే అల్లా పేరు మీద రాసివ్వడమే. అంటే ఆ భూమిపై వచ్చే పంట, లేదా ఆ దుకాణం నుంచి వచ్చే అద్ది.. ఇలా ఏదైనా కావొచ్చు. అది అల్లాకే చెందుతుంది. దీన్ని కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఖర్చుచేస్తారు’’అని ఆయన వివరించారు.
‘‘మరోవైపు వక్ఫ్‌గా ఆస్తిని ఇచ్చేవారు.. ఆ ఆస్తి నుంచి వచ్చే సంపదను ఎలా ఖర్చుచేయాలో కూడా సూచించొచ్చు’’అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

ఈ పదాల గురించి తెలుసుకోండి..

వక్ఫ్: అల్లా పేరు మీద విరాళంగా రాసిచ్చిన ఆస్తి
వాకిఫ్: ఆస్తిని విరాళంగా రాసిచ్చిన వారు
ముతవలీ: ఆస్తిని సంరక్షించేవారు
వక్ఫ్ బోర్డు: వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించేందుకు ఏర్పాటుచేసే బోర్డు


ఫొటో సోర్స్, http://centralwaqfcouncil.gov.in/
ఒక ఆస్తిని ఎలా వక్ఫ్‌గా మారుస్తారు?
వక్ఫ్ బోర్డు చట్టం-1995 కింద ఆస్తులను వక్ఫ్‌గా మారుస్తారని అఫ్జల్ వానీ చెప్పారు. ఈద్గా, శ్మశానం, మసీదు, పంట భూమి, నివాస భవనాలు, తోటలు ఇలా ఎలాంటి ఆస్తినైనా వక్ఫ్‌గా మార్చొచ్చని ఆయన వివరించారు.
ఈ చట్టం ప్రకారం.. ఎవరైనా అభ్యంతరాలుంటే, వక్ఫ్‌గా రిజిస్ట్రేషన్ పూర్తయిన ఏడాదిలోగా వక్ఫ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పుడు సదరు ఆస్తిని వక్ఫ్‌గా మార్చొచ్చో లేదో ట్రైబ్యునల్ నిర్ణయిస్తుంది.
‘‘వక్ఫ్‌గా మార్చేందుకు మొదట ఆ ఆస్తిపై వక్ఫ్‌నామా సిద్ధం చేస్తారు. దీనిలోనే ఆ ఆస్తిని దేని కోసం ఉపయోగించబోతున్నారో కూడా వివరిస్తారు. వక్ఫ్ బోర్డు సర్వే అనంతరం దీన్ని రికార్డుల్లో పొందుపరుస్తారు. ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో ఈ ఆస్తి.. వక్ఫ్‌గా రికార్డు అయితేనే పని పూర్తయినట్లు’’అని సెంట్రల్ వక్ఫ్ బోర్డు కౌన్సిల్ మాజీ సభ్యుడు ఖైసర్ షమీమ్ చెప్పారు.
‘‘మొదట మనం సదరు ఆస్తిని వక్ఫ్ బోర్డు దగ్గర రిజిస్టర్ చేయించాలి. ఆ తర్వాత ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లోనూ మార్పించాలి. అప్పుడే ఆ ఆస్తి విషయంలో ఎలాంటి వివాదాలూ ఉండవు’’అని అడ్వొకేట్ అహ్మద్ కూడా వివరించారు.
‘‘మొదట్లో స్థిరాస్తులను మాత్రమే వక్ఫ్ కింద రికార్డు చేసేవారు. ఇప్పుడు చరాస్తులను కూడా వక్ఫ్‌గా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఆస్తి అనే నిర్వచనం నేడు పూర్తిగా మారింది’’అని వానీ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఎన్ని వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి?
భారత్‌లోని వక్ఫ్ ఆస్తులను డిజిటల్ రూపంలో రికార్డు చేసేందుకు వక్ఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఏఎంఎస్ఐ) పేరుతో మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక ప్రాజెక్టును చేపడుతోంది.
ఆగస్టు 2022నాటికి మొత్తంగా దేశంలో 8,51,535 ఆస్తులను వక్ఫ్‌గా రికార్డై ఉన్నాయి. వీటిలో ఎక్కువ ఆస్తులు ఉత్తర్ ప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లలో సున్నీ, షియాల కోసం వేర్వేరు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు పరిధిలో 2,10,239 ఆస్తులు ఉండగా.. షియా బోర్డు పరిధిలో 15,386 ఆస్తులు ఉన్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 80,480 ఆస్తులు వక్ఫ్‌గా ప్రకటించారు. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ (70,994), తమిళనాడు (65,945), కర్నాటక (61,195) ఉన్నాయి.
అయితే, వాస్తవానికి దేశంలో వక్ఫ్ ఆస్తులు దీని కంటే చాలా ఎక్కువే ఉంటాయని, ఎందుకంటే చాలా ఆస్తులను వక్ఫ్ బోర్డుల దగ్గర రిజిస్టర్ చేయరని నిపుణులు అంటున్నారు.
‘‘వక్ఫ్ చట్టం కింద ప్రతి పదేళ్లకు వక్ఫ్ ఆస్తులను సర్వే చేయాలి. కానీ, అసలు ఈ సర్వేలను పట్టించుకోవడం లేదు. దీంతో ఎన్ని ఆస్తులు ఉన్నాయో పక్కాగా తెలియడం లేదు’’అని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు ఖైసర్ షమీమ్ అన్నారు.

ఫొటో సోర్స్, Suresh Saini
వీటిని ఎలా నిర్వహిస్తారు?
వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు కేంద్ర స్థాయిలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ పనిచేస్తుంది. మరోవైపు రాష్ట్ర స్థాయిలో ఈ ఆస్తుల నిర్వహణకు వక్ఫ్ బోర్డులు ఉంటాయి. దేశంలో మొత్తంగా 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి.
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది వక్ఫ్ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటుందని షమీమ్ చెప్పారు. మరోవైపు రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులను కూడా ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుందని వివరించారు.
వక్ఫ్ బోర్డులో స్థానికులను సభ్యులుగా నియమిస్తుంటారు. వీరంతా కలిసి చైర్మన్‌ను ఎన్నుకుంటారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమిస్తుంది.
వక్ఫ్ ఆస్తుల నిర్వహణ బాధ్యత ముతవలికి అప్పగిస్తారు. వీరి ఆధీనంలోనే ఆస్తులు ఉంటాయి.

వివాదాలు ఎందుకు?
భారత కోర్టుల్లో వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హుబ్బల్లిలోని ఈద్గా స్థలం వివాదం కూడా ఇలానే దశాబ్దాల పాటు నడిచింది.
అల్లా పేరిట ఉండే ఈ ఆస్తులను తమ పేరిట మార్చుకునేందుకు ప్రయత్నించడం వల్లే వివాదాలు వస్తున్నాయని మత నిపుణులు చెబుతున్నారు.
‘‘ముస్లింలకు వక్ఫ్ ఆస్తులు వెన్నెముకలా నిలుస్తాయి. ఎందరో ముస్లింలను ఈ ఆస్తులు ఆదుకుంటున్నాయి. కానీ, కొందరు వీటిని బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారు’’అని వానీ వ్యాఖ్యానించారు.
‘‘ఆస్తి అంటేనే వివాదాలు రావడం సహజం. చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉన్నప్పుడూ అందరూ ఉల్లంఘించాలనే చూస్తారు. నేడు సమాజంలో నైతిక విలువలు కూడా పడిపోతున్నాయి’’అని ఆయన అన్నారు.
‘’30-40ఏళ్లుగా సదరు ఆస్తి వక్ఫ్‌గా కొనసాగితే, సర్వేలో అది తెలుస్తుంది. అలాంటప్పుడు వివాదాలు సృష్టించడం ఎందుకు? ఇలాంటి వివాదాల వెనుక పలుకుబడి, అధికారం ఉంటాయి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘కొన్నిసార్లు వక్ఫ్ బోర్డు రిజిస్టర్ చేసుకున్న ఆస్తులను ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అప్‌డేట్ చేయడానికి నిరాకరిస్తుంటారు. ఇక్కడ కూడా వివాదాలకు చోటు ఉంటుంది’’అని అడ్వొకేట్ అహ్మద్ జావెద్ చెప్పారు.
‘‘చాలా ఏళ్లపాటు సదరు ఆస్తిని వక్ఫ్‌గా ఉపయోగించినా దాన్ని మనం వక్ఫ్‌గానే పరిగణించాలి. ఉదాహరణకు ఆస్తిని ఏళ్లుగా ఈద్గా లేదా మసీదుగా ఉపయోగిస్తే, దాన్ని వక్ఫ్‌గానే చూడాలి’’అని షమీమ్ అన్నారు. చాలాసార్లు ఈ వివాదాల వెనుక కొన్ని ఉద్దేశపూర్వక కారణాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్థిక ఇబ్బందులు..
ర్వైల్వే, రక్షణ శాఖ తర్వాత భారత్‌లో అత్యధిక ఆస్తులు వక్ఫ్ బోర్డుల దగ్గరే ఉన్నాయి. ఈ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని పేదలు, అనాథల కోసం ఉపయోగించాలని ఇస్లాం చెబుతోంది.
అయితే, వక్ఫ్ ఆస్తులను సరిగ్గా సంరక్షించకపోవడం వల్లే అవసరంలో ఉన్నవారికి వీటి ఫలాలు చేరడంలేదని ఇస్లాం నిపుణులు విశ్లేషిస్తున్నారు.
‘‘వక్ఫ్ ఆస్తులను పారదర్శకంగా నిర్వహిస్తూ, వాటిని అభివృద్ధి చేస్తే, ముస్లింల చాలా సమస్యలు తీరుతాయి’’అని వానీ చెప్పారు.
‘‘వక్ఫ్ ఆస్తులతో చాలా మంది పేద ముస్లింలను ఆదుకోవచ్చు. కానీ, అసలు వాటిని సరిగా పట్టించుకోవడం లేదు. వాటిని డిజిటల్ రూపంలోకి మార్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఇది చాలా పెద్దపని. దీన్ని సరైన దిశలో చేపడితే, ఈ ఆస్తుల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది’’అని అడ్వొకేట్ అహ్మద్ అన్నారు.
భారత్‌లో ఎన్ని వక్ఫ్ ఆస్తులు ఉన్నాయనే విషయంలో కాస్త స్పష్టత ఉన్నప్పటికీ, వీటి నుంచి ఎంత ఆదాయం వస్తుందనే సమాచారం అందుబాటులో లేదు.
ఇవి కూడా చదవండి:
- 'వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానిది మారణహోమం.. కళ్లుమూసుకుని కూర్చోకండి’
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా
- నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసా ఇస్తున్న ‘గిగ్ వర్క్’
- వేలంలో కొన్న సూట్‌కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













