ఇల్హాన్ ఒమర్ ఎవరు, ఆమెను ఇండియా రాకుండా శాశ్వతంగా నిషేధించాలని నెటిజన్లు ఎందుకంటున్నారు

ఫొటో సోర్స్, @SHIREENMAZARI1
- రచయిత, మునిజా అన్వర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ఐదు రోజుల పర్యటన కోసం పాకిస్తాన్ వచ్చారు. ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయంలో అమెరికా వ్యవహారాల డైరెక్టర్ జనరల్ మాలిక్ ముదస్సిర్ టిప్పు స్వాగతం పలికారు.
ఇల్హాన్ ఒమర్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇతర ప్రభుత్వ నేతలను కలిశారు.
ఏప్రిల్ 24 వరకు కొనసాగే ఈ పర్యటనలో ఒమర్ వివిధ ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులను కలుస్తారని, ప్రావిన్స్ రాజధాని లాహోర్, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌ను కూడా సందర్శిస్తారని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం బీబీసీకి తెలిపింది.
పాకిస్తాన్ చేరుకున్న తర్వాత, పాక్ పాలిత కశ్మీర్ అధ్యక్షుడు సుల్తాన్ మహమూద్ చౌధరితో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఇల్హాన్ ఒమర్, మానవ హక్కుల ఉల్లంఘన సమస్యను లేవనెత్తారు. తన పర్యటన తర్వాత మానవ హక్కులు గురించి, దాని కోసం పని చేస్తున్న వారి గురించి మరింత చర్చ జరగాలని, అలాగే కశ్మీర్ అంశంపైనా చర్చ జరగాలని తాను కోరుకుంటున్నట్లు ఇల్హాన ఒమర్ అన్నారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అమెరికా కుట్ర పన్నిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్న సమయంలోనే ఈ యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నారు.
39 ఏళ్ల ఇల్హాన్ ఒమర్ అమెరికాలోని మిన్నెసోటా నుంచి కాంగ్రెస్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి ఇద్దరు ముస్లిం మహిళల్లో ఆమె ఒకరు. ఇల్హాన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు.
2016లో ఇల్హాన్ ఒమర్ అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, @PTVNewsOfficial/twitter
హిజాబ్ ధరించిన అమ్మాయి
హిజాబ్ ధరించిన ఇల్హాన్ ఒమర్ తన బాల్యాన్ని కెన్యా శరణార్థి శిబిరంలో గడిపారు. ఆమె కుటుంబం సోమాలియా నుండి వలస వచ్చింది. శరణార్థి శిబిరంలో ఆమె నాలుగేళ్లు గడిపారు.
ఆ తర్వాత, 1997లో ఓ స్పాన్సర్ సహాయంతో ఆమె అమెరికా రాష్ట్రం మిన్నెసోటాకు చేరుకున్నారు.
2016 లో ఇల్హాన్ ఒమర్ మొదటి సోమాలి-అమెరికన్ కాంగ్రెస్ మహిళ అయ్యారు. తన విజయం తర్వాత, ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "ఈ విజయం శరణార్థి శిబిరంలో ఉన్న ఎనిమిదేళ్ల బాలికది. ఈ విజయం చిన్న వయస్సులోనే బలవంతంగా వివాహం చేసుకున్న అమ్మాయిది. ఈ విజయం నాది, కలలను కనకుండా నిలిపివేయబడిన వారందరిదీ'' అని అన్నారు.
గత సంవత్సరం, ఇల్హాన్ ఒమర్ అమెరికా కాంగ్రెస్‌లో ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు వైట్‌హౌస్ కూడా మద్దతు తెలిపింది.
అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి, జాత్యహంకారం, ఇస్లామోఫోబియా, గాజా, భారత్ ఆధీనంలోని కశ్మీర్‌లో నివసించే ప్రజల హక్కుల వరకు ఆమె తన స్వరాన్ని వినిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇల్హాన్ ఒమర్ ఈరోజు ముజఫరాబాద్‌లో ప్రెసిడెంట్ బారిస్టర్ సుల్తాన్ మహమూద్ చౌధరిని కలుస్తారని పాక్ పాలిత కశ్మీర్ అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ కమల్ హైదర్ షా బీబీసీకి ధ్రువీకరించారు.
కశ్మీర్‌లోని స్థానిక పాత్రికేయులు, అధికారులు చెప్పినదాని ప్రకారం.. ఈ పర్యటనలో ఆమె కశ్మీర్‌లోని శరణార్థి శిబిరాన్ని కూడా సందర్శిస్తారు. అయితే, ఆమె తన కార్యకలాపాల వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.
ఆగస్టు 2019లో, జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కమ్యూనికేషన్ మార్గాలను నిలిపివేయడం, కర్ఫ్యూలపై ఇల్హాన్ ఒమర్ స్పందించారు. కమ్యూనికేషన్‌ను వెంటనే పునరుద్ధరించాలని, కశ్మీర్ లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య సూత్రాలు, మత స్వేచ్ఛను గౌరవించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.
"అక్కడ ఏమి జరుగుతుందో వివరాలను సేకరించడానికి అంతర్జాతీయ సంస్థలను అనుమతించాలి" అని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించడానికి యుఎస్ ప్రయత్నించాలని అభ్యర్థిస్తూ భారతదేశంలోని యుఎస్ రాయబారికి, పాకిస్తాన్‌లోని యుఎస్ ఎంబసీ ఇన్‌ఛార్జ్ డి'అఫైర్స్ కు సెప్టెంబరు 2019లో ఇల్హాన్ ఒమర్, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులతో కలిసి ఒక లేఖ రాశారు. మానవ హక్కులకు జవాబుదారీగా ఉండేలా మీ దౌత్య సంబంధాలను ఉపయోగించాలని ఆమె కోరారు.
ఇలాంటి ప్రకటనలు, ట్వీట్ల కారణంగా, ఆమె ఇండియన్ యూజర్ల నుంచి తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొనేవారు.

ఫొటో సోర్స్, FO
కశ్మీర్ పర్యటన నిజ నిర్ధారణకేనా?
2019లో బాలాకోట్‌లో భారత సైన్యం జరిపిన వైమానిక దాడి తరువాత, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌ను సందర్శించడానికి సుమారు 15 మంది విదేశీ దౌత్యవేత్తల బృందానికి పాకిస్తాన్ నాయకత్వం వహించి, భారత సైన్యం కాల్పులు జరిపిన ప్రదేశాలను వారికి చూపించింది.
జమ్మూకశ్మీర్‌ను సందర్శించేందుకు దౌత్యవేత్తలను భారత్ తరచుగా ఆహ్వానిస్తుంది.
భారతదేశం లేదా పాకిస్తాన్ తమ పాలనలో ఉన్న కశ్మీర్‌కు దౌత్యవేత్తలను పిలవడం ఇదే మొదటిసారి కానప్పటికీ, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలిగా ఇల్హాన్ ఒమర్ తొలిసారి పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ను సందర్శిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్హాన్ ఒమర్ పాక్ పాలిత కశ్మీర్‌కు ఎందుకు వెళ్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఇల్హాన్ ఒమర్ పాకిస్తాన్ పర్యటన, ముఖ్యంగా పాక్ పాలిత కశ్మీర్ పర్యటన దౌత్యపరమైన ప్రాముఖ్యం గురించి పాకిస్తాన్ మాజీ విదేశాంగ కార్యదర్శి నజ్ముద్దీన్ షేక్‌తో బీబీసీ మాట్లాడింది. భవిష్యత్తులో దీని వల్ల పాకిస్తాన్‌కు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని బీబీసీ అడిగింది.
''ఆమెకు ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా ముఖ్యం. ఈ విషయంలో పాకిస్తాన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. కాబట్టి, ఆమె ఈ భావనను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు'' అని నజ్ముద్దీన్ షేక్ బీబీసీతో అన్నారు.
ఆమె పర్యటన పాక్ పాలిత కశ్మీర్ లో నిజ నిర్ధారణ ప్రయత్నం అని నజ్ముద్దీన్ షేక్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌కు సంబంధించి భారత్ పాకిస్తాన్ కలిసి పని చేయాలన్నది అమెరికా విధానమని షేక్ అన్నారు.
ఇల్హాన్ ఒమర్ తన పర్యటన తర్వాత కశ్మీర్‌లోని పరిస్థితుల గురించి, భారత పాలిత కశ్మీర్‌లో ముస్లింలపై జరుగుతున్న అకృత్యాల గురించి చెప్పినా, అమెరికా విధానంలో మార్పు ఉండదని ఆయన అన్నారు.
కానీ 'కశ్మీరీలపై జరుగుతున్న అకృత్యాలు చూసి ఇల్హాన్ పర్యటనకు వచ్చారు' అన్న ప్రచారం మాత్రం కశ్మీర్‌లో మానవ హక్కుల విషయంలో పాకిస్తాన్‌కు బలం చేకూరుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇల్హాన్ ఒమర్ కశ్మీర్ పర్యటనపై భారత్ లో ఎందుకు ఆందోళన ?
ఇల్హాన్ ఒమర్ తన పాకిస్తాన్ పర్యటన సందర్భంగా పాక్ ఆధీనంలోని కశ్మీర్‌ను కూడా సందర్శించనున్నారు. ఈ వార్త వచ్చినప్పటి నుండి, భారతీయ యూజర్లు సోషల్ మీడియాలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
'' ఇల్హాన్ ఒమర్ లాంటి వేర్పాటువాదులను కశ్మీర్ లాంటి సున్నితమైన ప్రాంతాలలోకి ప్రవేశించకుండా నిరోధించాలి. ఆమె భారత్ కు వ్యతిరేకంగా కుట్రచేస్తున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో కొనసాగే అర్హత ఆమెకు లేదు'' అని సీమా అనే యూజర్ అన్నారు.
చాలామంది ఇండియన్ యూజర్లు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను తనిఖీ చేయాలని కోరుతుండగా, కొంతమంది మాత్రం ఆమెను ఇండియాకు రాకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
''ఇల్హాన్ కశ్మీరీల మాటలు వింటారు. ఇక్కడి పరిస్థితులను చూస్తారు. అమెరికా వెళ్లి అక్కడ వివరిస్తారు. కశ్మీర్ లో జరుగుతున్నది ప్రపంచానికి తెలియాలని భారత్ కోరుకోదు. అందుకే ఆమె పర్యటనపై భారత్ లో అంత వ్యతిరేకత'' అన్నారు నజ్ముద్దీన్ షేక్
ఇల్హాన్ కశ్మీర్ పర్యటనపై ఇప్పటికే భారత్ నుంచి స్పందన వచ్చిందని, ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందిన నజ్ముద్దీన్ షేక్ అభిప్రాయపడ్డారు.
గత ఏడాది డిసెంబరులో ఇల్హాన్ ఒమర్ ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టారు. దీనిని కాంగ్రెస్ ఆమోదించింది. మతస్వేచ్ఛ ప్రాథమిక మానవ హక్కు అంటూ వైట్‌హౌస్ కూడా బిల్లుకు మద్దతు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ బిల్లుకు ''కంబాటింగ్ ఇంటర్నేషనల్ ఇస్లామోఫోబియా యాక్ట్'' అని పేరు పెట్టారు. ఈ బిల్లు లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా సంఘటనలను అమెరికా హోంశాఖకు నివేదించడానికి ఒక ప్రత్యేక ప్రతినిధిని నియమించడం.
ఈ బిల్లు గత కొన్ని నెలలుగా విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ వద్ద ఉన్నప్పటికీ, ఈ బిల్లును ప్రవేశపెట్టిన కొద్ది రోజుల తర్వాత జరిగిన సంఘటనలు దీనికి మద్దతు లభించేలా చేశాయి. దీంతో అది ఆమోదం పొందింది.
గత ఏడాది నవంబరు చివరలో, రిపబ్లికన్ ప్రతినిధి లోరైన్ బుబెర్ట్ ఇల్హాన్ ఒమర్‌ను "జిహాద్ స్క్వాడ్"లో భాగమని అభివర్ణించారు. ఆ వీడియోలో ఆయన ఆమెను ఉగ్రవాదిగా పేర్కొన్నారు. రిపబ్లికన్ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ కూడా ఇల్హాన్ ఒమర్‌ను "జిహాదీ"గా పేర్కొన్నారు.
ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఒక పెద్ద మైలురాయి అని, ఇస్లామోఫోబియాను ఎక్కడా సహించలేమనడానికి ఇది బలమైన సూచన ఇల్హాన్ ఒమర్ తర్వాత ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
"ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడటం వల్ల మీపై దాడులు జరగొచ్చు. కానీ, మీరు భయపడకూడదు. దృఢంగా ఉండండి" అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో ఎందుకు పోల్చారు? 'భారత రత్న' ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేశారు?
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












