హిజాబ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు: ‘ఇలాంటి ఆంక్షలతో ముస్లిం బాలికల జీవితాలను మనం మెరుగుపరుస్తున్నామా?' -జస్టిస్ సుధాంశు ధులియా

- రచయిత, సుచిత్ర కె మొహంతి
- హోదా, బీబీసీ కోసం
తరగతి గదుల్లో హిజాబ్ ధరించకూడదంటూ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గురువారం తన తీర్పు వెలువరించింది.
ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులూ వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో ఈ అంశం ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) వద్దకు వెళుతుంది. ఈ కేసు విచారణకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశంపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఎలాంటి స్పష్టతనూ ఇవ్వకపోవడంతో.. ఈ కేసుపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చే వరకూ తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, వీటిని సమర్థిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలులో ఉంటాయి.
ఈ కేసుపై విస్తృత ధర్మాసనం ఏర్పాటైన సుప్రీంకోర్టులో మరొకసారి వాదోపవాదాలు జరుగుతాయి.
''మాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశంపై నేను 11 ప్రశ్నలను తయారు చేశాను'' అని ద్విసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా తన తీర్పును వెలువరిస్తూ అన్నారు.
కర్నాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పలువురు స్టూడెంట్లు దాఖలు చేసిన పిటిషన్లను ఆయన కొట్టేశారు. హిజాబ్ నిషేధంపై కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థించారు. ''ఈ అంశాన్ని సీజేఐకి పంపిస్తున్నాం. ఈ కేసు విచారణకు విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆయనకు సిఫార్సు చేస్తున్నాం'' అని జస్టిస్ హేమంత్ గుప్తా చెప్పారు.
హిజాబ్ నిషేధంపై కర్నాటక హైకోర్టు తీర్పును ద్విసభ్య ధర్మాసనంలోని మరొక న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధులియా కొట్టేశారు.
''హిజాబ్ ధరించడం అనేది ఒక చాయిస్ (ఎంపిక). నా మనసులో బలంగా ఏమనిపించిందంటే.. ఒక బాలిక విద్యను తీసుకుంటే.. ఇలాంటి ఆంక్షలు పెట్టడం ద్వారా ఆమె జీవితాన్ని మనం మెరుగుపరుస్తున్నామా?''
సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువడిన తర్వాత పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన నిజాముద్దీన్ పాషా బీబీసీతో మాట్లాడుతూ.. ''ఇప్పుడు ఈ కేసు ఎలా వెళుతుందో చూడాలి. కేసును తేల్చేందుకు విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై సీజేఐ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మరొకసారి ఈ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతాయి'' అని అన్నారు.
ఈ అంశం సున్నితమైనది కాబట్టి దీనిపై ముగ్గురు న్యాయమూర్తులు లేదా ఐదుగురు న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనం ఏర్పాటు కావొచ్చునని పాషా తెలిపారు. అయితే, విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై ఈరోజు వెలువడిన తీర్పు ఎలాంటి గడువునూ విధించలేదని వివరించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
‘ఏది ధరించాలో ఎంచుకునే స్వేచ్ఛ, మత స్వేచ్ఛలు తరగతి గదిలో తరిగిపోవు’
ఐషత్ షిఫా సహా 23 మంది పిటిషనర్లు, వారి తరపు న్యాయవాదులు, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు వాదనలు విన్న న్యాయమూర్తులు ఈ కేసులో తీర్పును సెప్టెంబర్ 26వ తేదీన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వ్ చేశారు.
నిర్దేశించిన స్కూలు యూనిఫారమ్‌లు ధరించే క్రమశిక్షణను పాటించాలని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసే అధికారం తమకు ఉందని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
అయితే, ఏది ధరించాలో ఎంచుకునే స్వేచ్ఛ, మత స్వేచ్ఛలు తరగతి గదిలో తరిగిపోవని విద్యార్థులు, పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదించారు.
కొందరు విద్యార్థులు స్కూలు యూనిఫారమ్‌కు అదనంగా హిజాబ్ ధరిస్తూ ప్రజా జీవనానికి, ఆరోగ్యానికి, నైతికతకు విఘాతం కలిగించారన్న కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయిందని పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే, దేవదత్ కామత్, డాక్టర్ రాజీవ్ ధావన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
అలాగే, హిజాబ్ ధరించడం వల్ల ఇతర విద్యార్థుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందన్న వాదనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలూ చూపలేదని వాదించారు.
‘హిజాబ్ ధరించడం ఇస్లాం మతంలో తప్పనిసరి కాదు’
ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం మతంలో తప్పనిసరి కాదని మార్చి 15 తేదీన ఇచ్చిన తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన కర్నాటక హైకోర్టు ఫుల్ బెంచ్ పేర్కొంది.
హిజాబ్ ధరించినందుకు పీయూ ప్రభుత్వ కాలేజీలోకి అడుగుపెట్టనివ్వట్లేదంటూ ముస్లిం విద్యార్థినులు కొందరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.
హిజాబ్ ధరించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 పరిధిలోకి రాదని కర్నాటక హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
నిర్దిష్టమైన స్కూలు యూనిఫారమ్ అనేది రాజ్యాంగం అనుమతించదగిన ఒక హేతుబద్ధమైన పరిమితి అని, దీనిని విద్యార్థులు వ్యతిరేకించలేరు అని స్పష్టం చేసింది. ఇలాంటి ఆదేశాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, వీటికి వ్యతిరేకంగా ఎలాంటి కేసులూ ఎదురుకాలేదని గుర్తు చేసింది.

ఫొటో సోర్స్, Twitter.com/aimim_national
సముచితమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం' -ఒవైసీ
ముస్లిం బాలికలు పాటిస్తున్న హిజాబ్ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు రావాల్సిన అవసరముందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఖురాన్ లో చెప్పిన విధంగానే కర్ణాటక రాష్ట్ర బాలికలు హిజాబ్ పాటిస్తున్నారని ఆయన తెలియజేశారు.
దీనిపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తోందని ఒవైసీ విమర్శించారు. అర్థంలేని విధంగా హిజాబ్ బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు.
హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను పక్కనెట్టి జస్టిస్ సుధాంశు ధూలియా హిజాబ్ పై విచారణ చేపట్టడం సంతోషకర పరిణామం అని పేర్కొన్నారు. హిజాబ్ పై తీర్పును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై వదిలేయడం జరిగిందని, హిజాబ్ విషయంలో ఆమోదయోగ్యమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి:
- PMBJP-జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
- లేపాక్షిలో స్తంభం నిజంగా గాల్లో వేలాడుతోందా, దాని వెనకున్న వాస్తవాలేంటి ?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















