BCCI: బీజేపీలో చేరనందుకే గంగూలీకి రెండోసారి ఛైర్మన్ పదవి దక్కలేదా, ఇండియన్ క్రికెట్ పై రోజర్ బిన్నీ ముద్ర ఏంటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, సీనియర్ క్రీడాపాత్రికేయుడు, బీబీసీ కోసం
ఇండియన్ టీమ్ లో మెంబర్‌గా ఉన్న కాలంలో అప్పటి అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరైన రోజర్ బిన్నీ 'ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా( భారత క్రికెట్ నియంత్రణ మండలి-బీసీసీఐ ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అక్టోబరు 18న జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం తర్వాత సౌరవ్ గంగూలీ నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 12. అక్టోబర్ 13న అధికారికంగా నామినేషన్ల పరిశీలన జరగనుంది.
అక్టోబరు 14లోగా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 15న పోటీదారుల జాబితాను విడుదల చేస్తామని, అవసరమైతే అక్టోబర్ 18న ఎన్నికలు నిర్వహిస్తామని బీసీసీఐ అధికారులు తెలిపారు.
అయితే ఈ పదవికి రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా భావిస్తున్నారు.
వార్షిక సర్వసభ్య సమావేశానికి ప్రతినిధిగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మీనన్ పేరును చేర్చలేదు. రోజర్ బిన్నీకి అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు.

ఫొటో సోర్స్, Getty Images
బీసీసీఐ ఎన్నికల్లో ఆఫీస్ బేరర్లుగా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై గతవారం రాజధాని దిల్లీలో ఒక రౌండ్ చర్చలు జరిగాయి. అందులో రోజర్ బిన్నీని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి అంగీకరించారు. బ్రిజేశ్ పటేల్ మద్దతు వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు.
సౌరవ్ గంగూలీ రెండోసారి అధ్యక్షుడిగా పని చేయాలని కోరుకున్నట్లు కూడా చర్చ జరుగుతోంది. అయితే గతంలో ఒక వ్యక్తి రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్న సంప్రదాయం లేదని, అందుకే ఆయనను అంగీకరించ లేదని చెబుతున్నారు.
అయితే, బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు వరుసగా రెండు పర్యాయాలు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించింది. ఇప్పుడు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ అనుమతుల ప్రయోజనాన్ని పొందనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గంగూలీ వ్యవహారానికి తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ రంగు అద్దే ప్రయత్నం చేసింది. బీజేపీలో చేరకపోవడంతోనే సౌరవ్ గంగూలీ మళ్లీ బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కలేదని టీఎంసీ ఆరోపించింది.
అయితే, ఆయన బీజేపీలో చేరకుండానే ఒకసారి అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తి చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
1983 ప్రపంచకప్ హీరో బిన్నీ
1983 ప్రపంచకప్‌లో భారత్‌కు విజయం సాధించిపెట్టిన ఆల్‌రౌండర్‌గా బిన్నీ గుర్తింపు పొందారు. కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియన్ టీమ్ ఆడిన ప్రపంచ కప్ ఎనిమిది మ్యాచ్‌లలో బిన్నీ 18 వికెట్లు పడగొట్టాడు.
1983 జూన్ 20న చెమ్స్‌ఫోర్డ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఆడిన తీరును క్రికెట్ అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. టోర్నీలో భారత్ ముందుకెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 247 పరుగులు చేసింది. ఇందులో బిన్నీ 21 పరుగులు చేశారు.
129 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను కూల్చివేసి, భారత్ 118 పరుగుల విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో బిన్నీ 29 పరుగులిచ్చి 4 వికెట్లు, మదన్‌లాల్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు.
ప్రపంచ కప్ మాత్రమే కాదు, 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ సిరీస్ చాంపియన్ షిప్‌లో కూడా రోజర్ బిన్నీ తన అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈ సిరీస్‌లో 17 వికెట్లు తీసి భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిభ ఉన్నా తక్కువ మ్యాచులే
రోజర్ బిన్నీ చాలా మంచి ఆల్ రౌండర్. అతనిలో ప్రతిభకు కొదవ లేదు. మంచి ప్లేయర్ అయినప్పటికీ బిన్నీ ఆడింది చాలా తక్కువ మ్యాచులు మాత్రమే. నాడు బంతికి మెరుగు అంటే షైన్ రావడానికి మాత్రమే పేస్ బౌలర్లను ఉపయోగించుకునే వారు. ఆ తరువాత బాల్‌ను స్పిన్నర్లకు ఇచ్చేవారు.
శక్తి సామర్థ్యాల ప్రకారం చూస్తే బిన్నీ వాస్తవానికి చాలా వన్డేలు, టెస్టు మ్యాచులు ఆడి ఉండాల్సింది. కానీ ఆయన ఆడింది 27 టెస్టులు, 72 వన్డేలు మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
బిన్నీ బౌలింగ్‌లో వేగం అంతగా ఉండదనేది వాస్తవమే. కానీ స్వింగ్‌ను బాగా ఉపయోగించుకుని బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవారు బిన్నీ. బౌలింగ్, బ్యాటింగ్ తీరును చూసినప్పుడు బిన్నీకి మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండాల్సింది.
అంతర్జాతీయ మ్యాచుల్లో అనేక సార్లు కష్టాల్లో ఉన్నప్పుడు టీం ఇండియాను ఆదుకోవడంలో బిన్నీ కీలక పాత్ర పోషించారు. టాప్ ఆర్డర్ పడి పోయి, భారత్ కష్టాల్లో చిక్కుకున్నప్పుడు సయ్యద్ కిర్మానీతో కలిసి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ను ఆడారు.
భారత్‌కు ఆడిన తొలి ఆంగ్లో ఇండియన్
1979లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుతో టెస్ట్ కెరియర్ ప్రారంభించారు బిన్నీ. ఆయనకు అది హోం గ్రౌండ్. అలా భారత్‌కు ఆడిన తొలి ఆంగ్లో ఇండియన్ టెస్ట్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన స్కాట్లాండ్ సంతతికి చెందిన వ్యక్తి.
ఆటల్లో 'నేచురల్ టాలెంట్' ప్లేయర్‌గా బిన్నీని భావిస్తారు. చదువుకునే రోజుల్లో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, హాకీ కూడా ఆడేవారు. అంతేకాదు 'జావెలిన్ త్రో'లో కూడా బిన్నీ మంచి ప్రతిభావంతుడు. జాతీయ స్థాయిలో రికార్డు కూడా నెలకొల్పారు. ఒకరకంగా చూస్తే అది కూడా ఆయన కెరియరై ఉండాల్సింది.
బిన్నీ బౌలింగ్ కూడా చాలా బాగా చేసేవారు. చివరకు క్రికెట్‌ను ఆయన తన కెరియర్‌గా ఎంచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సెలెక్టర్‌గాను తనదైన ముద్ర
బిన్నీ 2012లో బీసీసీఐ సెలెక్టర్ అయ్యారు. అదే సమయంలో ఆయన కుమారుడు స్టూవర్ట్ బిన్నీ కూడా క్రికెట్ ఆడుతున్నాడు. టీం ఇండియాలో స్థానం కోసం పోటీపడుతున్నాడు. అందువల్ల బిన్నీ పక్షపాతంతో వ్యవహరిస్తారనే ఆరోపణలు నాడు వచ్చాయి. కానీ ఆయన తన నిస్వార్థాన్ని నిజాయతీని నిరూపించుకున్నారు. అది అభినందించాల్సిన విషయం.
సెలెక్షన్ కమిటీలో స్టూవర్ట్ బిన్నీ గురించి చర్చ వచ్చే సమయానికి ముందే రోజర్ బిన్నీ మీటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయేవారు.
తాను క్రికెట్ ఆడే రోజుల్లో గుండప్ప విశ్వనాథ్‌తో చాలా సన్నిహితంగా ఉండేవారు బిన్నీ. వారి స్నేహం గురించిన కథలు నాడు చాలా ఫేమస్.
సెలెక్టర్‌గానే కాకుండా క్రికెట్ కోచ్‌గా కూడా బిన్నీ సేవలు అందించారు. 2000 సంవత్సరం అండర్-19 వరల్డ్‌కప్‌లో టీం ఇండియా కోచ్‌గా ఆయన వ్యవహరించారు. ఆ వరల్డ్‌కప్‌లో తొలిసారి భారత్ విజేతగా నిలిచింది. ఆ విజయం నుంచి వచ్చిన వారే మొహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్. వీరు క్రికెట్ ప్రపంచంలో భారత్ పేరును మరింత ముందుకు తీసుకెళ్లారు.
రిటైరైన తరువాత కూడా క్రికెట్‌కు సేవలందిస్తూ వచ్చారు బిన్నీ. అనేక దేశాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఏసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) పని చేస్తూ ఉంటుంది. ఏసీసీ డెవలప్‌మెంట్ ఆఫీసరుగా అనేక దేశాల్లో యువతకు క్రికెట్ నేర్చించారు బిన్నీ.
రోజర్ బిన్నీ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు మంచి మనిషి కూడా. ఆయనది మచ్చలేని వ్యక్తిత్వం. బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యునిగా ఉన్నప్పుడు, విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారంటూ లోధా కమిటీ ఆరోపించడంతో వెంటనే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.
ఇవి కూడా చదవండి:
- క్రైమియా బ్రిడ్జిని ఎవరు, ఎలా పేల్చారు?
- పంజాబ్: ఖైదీలు తమ భాగస్వాములతో జైలులోనే ఏకాంతంగా గడపొచ్చు, లైంగికంగానూ కలవొచ్చు
- కీయెవ్ పై మిసైల్ దాడి ఆరంభమే, అసలు ఎపిసోడ్ ముందు ఉందంటూ రష్యా హెచ్చరిక
- ఊర్వశి రౌతేలా: ఈ సినీ నటి టీమిండియా వికెట్ కీపర్ వెంటపడుతున్నారా? ఈమె ఆస్ట్రేలియా వెళ్లడంపై ఆన్లైన్లో ట్రోలింగ్ ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













